ముద్దుల మనుమరాలికి...

 

  • 195 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చెన్నూరి

  • హైదరాబాదు
  • 9440558748

నా ముద్దుల మనుమరాలికి, తనివితీరని ముద్దులతో నీ తాత రాయునది...
      మనుమరాలా... గీ ఉత్తరం రాసుడు మొదలు పెట్టంగనే  నా కండ్ల ముందర లబ్బరు సెండులెక్క ఎగురుతానట్లగుపిత్తానవ్‌. నీళ్లూరిన నాకండ్లు నీ ల్యాత పాదాలను తడుమాలని ఆరాటపడ్తానై. దేశంగాని దేశంల ఎట్లుంటానవో ఏందో.. నామన్సు కలికలైతాంది.
      బిడ్డ పెండ్లిసేత్తె మనుమలు, మనుమరాండ్లతో ఇల్లు కళ కళలాడ్తదని కలలుగన్న. నీనాయ్న నీకు మాటలచ్చినంక, ఈ తాతనిడ్సి యాడరానంటవోనని బుగులు తోటి నీకు పురంగ మాటలు రాకముందే గాలిమోటరు మీద ఎక్కుదామని నిన్నూరిచ్చి పరాయిదేశం తీస్కపోయిండు. అప్పటికే నువ్వు అత్తా, అత్తా...తాతా, తాతా అనేదానివి. గులాబీరేకుల పెదువులతోటి ఏదో సెప్పబోతాంటె.. నీనోటి తుప్పిర్లు నా మొకంమ్మీద పడ్తాంటె, ఎండల ఎండిన పెయ్యిమీద ఆన తుంపర పడ్తానట్టు సంబర పడెటోన్ని. ఆ సెనాలు నాకు యాదికచ్చినప్పుడల్లా పానమంత అవిసిపోతాంటది. ఆ దినం మల్ల మల్ల రమ్మంటే అత్తదా?
      నీ పుట్టిన రోజుకు మేము కొన్కచ్చిన గౌను సూసి ఎంత సంబరపడ్డవో. మాసిపోయినా అదే ఎప్పటికీ తొడ్గమనేదానివి. ఎంత సెప్పినా ఇనకుండా న్యాలకు సంగడ బింగడ కాల్లు కొట్టుకుంట ఏడ్సేదానివి. ఆడపిల్ల అట్ల ఏడ్తె ఇంటికి దరిద్రమని నీ అమ్మమ్మ గద్రిచ్చి పెట్టేది. అప్పుడు నువ్వు ఆమెవైపు ఏలు సూయించుకుంట నాతో చేసిన ఫిర్యాది రోజులు యాదికత్తాంటె నవ్వత్తది. నీదెంత మంచి గునంరా తల్లీ! ఇంటికచ్చే బిచ్చపోల్లకు ఏదైనా పెట్టుమని అమ్మమ్మ గద్మ పట్టుకొని బతిలాడే దానివి. నీ సిఫార్సు తోటి అమ్మమ్మ కరిగిపోయేది. బిచ్చగాండ్లు నిన్ను సూసి నాతల్లే ఎయ్యేండ్లు బత్కుమని దీవెనలిచ్చెటోల్లు.
      ఓపాలి పెద్దమ్మలోడత్తెసూసి భయపడి నా సంక నెక్కినౌ.. పిల్ల భయపడ్డదని సీకటిపడంగ మసీదు దగ్గర్కి పోయి అమ్మమ్మ నీకు సాయబు తోటి తాయతు కట్టిచ్చింది. అయినా ఆ రాత్రి నీకు జరమచ్చింది. మాకంటి మీద కునుకుపడ్తె ఒట్టు.. ఆ తెల్లారి ఇంటి ముందుకు గంగిరెద్దులాయనత్తె గంగిరెద్దు తోక తోటి నీ ఈపంత దువ్విచ్చినం. దాన్ని నీ చిన్ని చేతుల్తోటి తాక్కుంట మొక్కినౌ.. గంగిరెద్దు ఆట, సన్నాయి పాటిని మల్ల నాసంక దిగి ఆడుకున్నౌ... మా పానాలు గప్పుడు నిమ్మలమైనై...
      అమ్మమ్మ ఆకిట్ల ముగ్గేత్తాంటె నేను సుత ఏత్తనని నీ సిన్న సేతుల్తోటి ముగ్గు తీస్తివి.. కాని నీకేడెయ్యత్తది.. కుప్ప పెడ్తివి. నీకే సపోటు సేసెటోన్ని.. తాతా మనమరాలు కల్సిండంటె ‘ఈగిరం ఇల్లల్కినట్టే’ అని గులుక్కునేది.
      నీ పుట్టెంటుకలు తీయడాన్కి  తిరుపతికి పోతాంటె నా సెయ్యిడ్సి పెట్టి నువ్వు కప్పలెక్క సీడీలెక్కుతాంటె ఎంత సంబరపడ్డనో.. నీ రింగు, రింగులెంటుకలు న్యాల రాల్తాంటె, వాటిని సూసుకుంట.. ఎక్కెక్కిపడుకుంట ఏడ్సినౌ.. అమ్మమ్మ నవ్వుతాంటె నేను చిడాయించిన.. నాకూ ఏడ్పచ్చింది.
      మీరు గాలిమోటరెక్కేటప్పుడు నీకు తెలుగు నేర్పియ్యమని నీ నాయ్నకు మరీ, మరీ సెప్పిన.. సరేనన్నడు. నేను పంపిచ్చిన పెద్ద బాలసిచ్చ సదువుతాన వని నీ నాయ్న పంపిచ్చే సీన్మాలల్ల సూత్తాన. నీ అమ్మమ్మ సుత శాన సంబర పడ్తాంది. అందుకే గీ ఉత్తరం నీకు తెల్గుల్నే రాత్తాన. ఆడ ఎట్లైనా నీకు ఇంగిలిపీసత్తది గాని తెలుగు బాసను మర్వకురా మనుమరాలా.    
      మనుమరాలా ఒక సిన్న కోర్కె... అమెర్కా నుంచి ఏమైనా పంపించు మంటనని అడుగుతననుకుంటానవా?.. నాకసోంటి కోర్కెలేం లేవు.. నువ్వు ఆడ బల్లె నీసోపతోల్లందర్ని కూడేసి నువ్వు నేర్సుకున్న పాటలు, పద్యాలు నేర్పియ్యి. నీ కోకిల సరం తోటి వాళ్లిన్నరంటే.. వాళ్లు ఉబ్బిపోయి తేనెలూరే మన తెలుగు నేర్సుకుంటరని నా ఆశ. ఈ తాత కోర్కె తీర్తవని, ఈపాలి నువ్వచ్చే టప్పుడు నా ఆశలమూటను నీ నోట తెత్తవని గంపెడాశతో ఎదిరి సూసే తాత...

 


వెనక్కి ...

మీ అభిప్రాయం