తెలంగాణ జాతీయ గ్రంథాలయం

  • 1635 Views
  • 6Likes
  • Like
  • Article Share

    సన్నిధానం నరసింహశర్మ

  • హైదరాబాదు
  • 9292055531
సన్నిధానం నరసింహశర్మ

తెలుగు భాషా సంస్కృతుల ఉద్యమ స్ఫూర్తితో స్థాపించిన ఆ గ్రంథాలయం ఎంతోమంది గొప్పవాళ్లకు మార్గదర్శిగా నిలిచింది. నిజాం రాజుకు వ్యతిరేకంగా సాగిన హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్రోద్యమంలో దీని పాత్ర చిరస్మరణీయం. తెలుగుగడ్డ మీద ఇప్పటికీ కాంతులీనుతున్న ఆ తొలితరం గ్రంథాలయమే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం.తెలుగు కావ్యాలు, సంస్కృతం, ఉర్దూ గ్రంథాలకు నిలయమది. ఆ పొత్తపుగుడిది చరిత్రలో ప్రత్యేకస్థానం. శతాధిక వసంతాల ఆ సరస్వతీ నిలయం ఆవరణలో నిలబడితే చాలు నూతనోత్తేజం వెల్లివిరుస్తుంది. అది తెలుగు సామాజిక సాంస్కృతిక రేఖ. తెలుగు భాషా సంస్కృతుల ఉద్యమ స్ఫూర్తితో స్థాపించిన ఆ గ్రంథాలయం ఎంతోమంది గొప్పవాళ్లకు మార్గదర్శిగా నిలిచింది. నిజాం రాజుకు వ్యతిరేకంగా సాగిన హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్రోద్యమంలో దీని పాత్ర చిరస్మరణీయం. తెలుగుగడ్డ మీద ఇప్పటికీ కాంతులీనుతున్న ఆ తొలితరం గ్రంథాలయమే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం.
నాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంగళ్లలో రత్నరాశులు!
      నేడు హైదరాబాదు సుల్తానుబజారు లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో పాఠక పరిశోధకుల్ని ఆకర్షిస్తూ వివిధ గ్రంథ రత్నరాశులు- విభాగ విభాగాల అమరికల్లో.
      రాయల సభలో అష్టదిగ్గజ కవులు- కావ్యగానాల విందులు.
      రాయలపేరిట వెలసిన పొత్తపుగుడిలో బహుప్రాంతాల, వివిధ కాలాల దిగ్గజాలు గ్రంథాల రూపంలో.
      కృష్ణరాయలకు గ్రంథాలు అంకితాలు. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి, దాని వైభవ ప్రాభవాలకు ఎంతోమంది మహనీయుల జీవితాలే సేవాంకితాలు.
      కేవలం పత్రికలో, గ్రంథాలో చదివే పఠన మందిరం మాత్రమే కాదిది. తెలుగువారి భాషాత్మ గౌరవ సంకేతమైన సంతకం ఈ పొత్తాల నిలయం. గ్రంథ నిలయంబునందలి గ్రంథములకు/ గుణమెకాని ప్రధానము గణము కాదు/ ఎన్నియో చెత్తపొత్తములున్న కన్న/ ఉత్తమ గ్రంథములు కొన్ని ఉన్న చాలు అన్నారు మధురకవి నాళం కృష్ణారావు. ఉత్తమ గ్రంథాలు యాభైవేల పైచిలుకు ఉన్న ఉన్నత గ్రంథ సంస్థ ఇది. ఇందులో తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, హిందీ, తెలుగు లిపిలో తమిళం భాషల్లో గ్రంథ సంచయం ఉంది.
      కొన్ని గ్రంథాలయాల్లో ప్రాచీన గ్రంథాలుండి ఆధునిక గ్రంథాలు తగినంతగా ఉండవు. కొన్నిటిలో ఆధునిక గ్రంథాలుండి ప్రాచీన గ్రంథాలుండవు. కానీ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం మాత్రం ‘ప్రాతక్రొత్తల క్రొమ్మెరుంగులు చిమ్ము’తూంటుంది. సాధారణంగా గ్రంథాలయాలు రెండు రకాలు... కొన్ని గ్రంథాలు ఉండి భవనాలు లేనివి. మరికొన్ని భవనాలు ఉండి గ్రంథాలు లేనివి. కానీ ఈ భాగ్యనగర నిలయానికి నాలుగంతస్తుల భవనమూ ఉంది, నలుగురికీ ఉపయోగ పడే తగిన గ్రంథ సంచయమూ ఉంది.
      తెలుగునాట ఇతర ప్రాంతాల్లో ఒక స్థిమిత ప్రశాంత వాతావరణంలో గ్రంథాలయాలు స్థాపించడం, నిలబెట్టడం, నడపటం వేరు. ఒకనాటి తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు వేరు. ‘ఆంధ్రపత్రిక’ చదివితే దేశద్రోహం చేశారన్నంత అపోహతో రక్షకభట నిలయానికి తీసుకెళ్లిన దారుణ
సంఘటనలు ఇక్కడివి. తెలంగాణ సోదరులలో పరకాయ ప్రవేశం చేసి, పర‘గాయ’ ప్రవేశం చేస్తే లోతట్టు అంశాలు తెలుస్తాయి. ఉర్దూ, ఆంగ్లభాషలు గొప్పవే. కాని తల్లిబాస తీపి పాలను మరచిపోయి బతికే రోజులవి.
దోహదం ఆంగ్ల గ్రంథ పఠనమే...
అది 1901వ సంవత్సరం. స్థలం హైదరాబాదు సుల్తానుబజారులోని రావిచెట్టు రంగారావనే జాగీర్దారు ఇల్లు. అక్కడ సమావేశం అయింది మునగాల రాజా నాయని వెంకట రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులు. ముగ్గురూ రాబర్ట్‌ స్యూయల్‌ ‘ఏ ఫర్‌గాటెన్‌
ఎంపైర్‌’ గ్రంథాన్ని చదివినవారే. అది విజయనగర సామ్రాజ్య ఉత్థాన పతనాలకు సంబంధించింది. రాయలనాటి తెలుగు భాషా సాహిత్యాల సమున్నత పరిస్థితిని తలచుకొని ఆనందాన్ని పంచుకున్నారు. అక్కడితో ఆగకుండా, తమ కాలంనాటి తెలంగాణలో తెలుగు భాషా
సంస్కృతులకు పట్టిన దుర్గతికి బాధపడ్డారు. తెలుగుభాషకు పూర్వపు వైభవ ప్రాభవాలు తేవాలని భావించారు. ఫలితం      శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపన. దీనికి కందుకూరి ‘ఆంధ్రకవుల చరిత్ర’ స్ఫూర్తిగా నిలిచింది.
      పుస్తక అధ్యయనం చరిత్రనే సృష్టింపజేసింది. 1901 సెప్టెంబరు 1, ఆదివారం సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని రామకోటిలో రావిచెట్టు రంగారావు బంగళాలో గ్రంథాలయం ప్రారంభమైంది. దీని స్ఫూర్తితో నిజాం రాష్ట్రంలో ఒకటీ రెండూ కావు, ఎన్నో పేర్లతో పట్టణ,
గ్రామాల్లో 114 పొత్తపుగుళ్లు వెలశాయి. ఈ గ్రంథ నిలయం కాలగమనంలో అక్షర కల్పవృక్షమైంది. తెలుగుదేశమంతటికీ భాషా సాహిత్య సంస్కృతులకు తీర్థస్థలమైంది. 
      శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి మొట్టమొదటి గౌరవ కార్యదర్శి రావిచెట్టు రంగారావు. మాతృభాషను వెన్నెముకగా భావించారు. పండితద్వయం ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి ఉపన్యాస కవిత్వాల ద్వారా ఆంధ్రోద్యమాన్ని జనబాహుళ్యంలోకి
విస్తరింపజేశారు. తెలుగు మాధ్యమంగా రెండేళ్లపాటు తెలుగు పాఠశాలను ఆ రోజుల్లో నడపగలిగారంటే చేతులెత్తి మరీ మొక్కాలి. రావిచెట్టు ‘కూలిన’ దృశ్యం తరువాత ఆయన ధర్మపత్ని లక్ష్మీనరసమ్మ విరాళంతో ఒక పెంకుటిల్లు కొన్నారు. సరస్వతికి ఆవాసాన్ని కల్పించారు.
తరువాత దాతల విరాళాలతో నిర్మించిన నూతన భవనాన్ని 1921 సెప్టెంబరు 30న కట్టమంచి రామలింగారెడ్డి ప్రారంభించారు.
      ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు దీనిని తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కేంద్రంగా మలచారు. ఆదిరాజు వీరభద్రరావు వంటి నామవాచకా లెన్నో ఈ నిలయ సర్వనామానికి సేవా ప్రతిబింబాలయ్యాయి. ఉనికి, మనికి తెలంగాణలోనే అయినా ఈ నిలయం దేశవ్యాప్త తెలుగు పరిశోధకులకు ఆకర్షణ స్థానమైంది. అంతేకాదు రాయల జయంతి అంకురార్పణతోపాటు, నన్నయ, తిక్కన, పోతన, వేమనల జయంతులూ పండుగల్లా ప్రతియేటా జరిపేవారు. ప్రాంతాలకు అతీతంగా సాహిత్యవేత్తల్ని, పండితుల్నీ, కవుల్నీ పిలిచి అమూల్య ఉపన్యాసాలిప్పించి సముచితంగా గౌరవించి సంస్కారాన్ని చాటుకొనేవారు. తక్కిన వారికి ఆదర్శంగా నిలిచేవారు. గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి వారి జయంతులు జరిపిస్తూ స్ఫూర్తిమూర్తుల్ని వర్తమాన తరానికి ఆత్మదర్శనాలు చేయిస్తున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన సందర్శకులు, ఉపన్యాసకులు, సన్మానితులు, పురస్కార గ్రహీతలు ఎవరిని పేర్కొనాలన్నా పట్టికలుగా ఇవ్వాల్సినంత మంది ఉండటం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ కార్యకలాపాల విస్తృతికి దాఖలాలు.
పాత పత్రికా సంపుటాలూ 
ఎన్నో పెద్ద గ్రంథాలయాల్లో సైతం ఉన్న గ్రంథనిధుల్ని పాఠక సభ్య పరిశోధకులకు అందించడంలో సిబ్బంది కొరత వంటి ఇబ్బందులు లేకపోలేదు. కానీ ఈ గ్రంథనిలయంలో అడిగిన వెంటనే ఉన్న గ్రంథాల్ని ఉన్న ఫళంగా ఇచ్చే సొంత అమరికల విధానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ‘విద్యార్థిగా నేను హైదరాబాదుకి వచ్చిన తొలినాళ్లలో అనర్ఘ రత్నాల్లాంటి తెలుగు గ్రంథాలను నా కళ్లలో నిలిపింది, ఈ భాషా నిలయమే’ అంటారు సినారె. 1900కు పూర్వం అచ్చయిన పుస్తకాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. యామిజాల ఆనంద్‌ అనే రచయిత సేవాభావంతో పట్టికను తయారు చేస్తూండటం అభినందనీయం. సాధారణంగా పెద్ద గ్రంథాలయాల్లో ఉండే వేదపురాణ శాస్త్రకృతులకు తోడు ఆధునిక ప్రక్రియల గ్రంథాలూ అనేకం ఇక్కడ ఉన్నాయి. ఆయా కవుల గ్రంథాలు, సంపుటాలూ ప్రత్యేకంగా ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రత్యేక సంచికలెన్నింటినో దాచడం ఓ ప్రత్యేకత.
      ఇలాంటివి ఇంకా ఉన్నాయి. వివిధ జ్ఞానశాఖల్లో సుందరయ్య విజ్ఞానకేంద్రం అభిలేఖ పత్ర రక్షణ కార్యక్రమంలో భాగంగా, ఇందులోని కొన్ని ముఖ్య ప్రాచీన గ్రంథాల్ని 2005- 2006 సంవత్సరాల్లో మైక్రోఫిల్ము చేశారు. కోస్తాప్రాంతంలో ప్రకటితమై ఇప్పుడు అక్కడ లభించని పత్రికా సంపుటాలు కొన్ని ఇక్కడ లభ్యమవుతాయి. విశ్వశ్రీ అలాంటి పత్రికే. 
      ఇంకా... కృష్ణా పత్రిక, భారతి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు, నవ్య సాహిత్య పరిషత్తు ‘ప్రతిభ’ సంపుటాలు, అరుదైన గోల్కొండ సంపుటాలు, త్రిలింగ, కిన్నెర, ఆంధ్రభారతి, ప్రబుద్ధాంధ్ర, నవ్వులతోట, శారద వంటి పత్రికల సంపుటాలు అన్ని ప్రాంతాల
పరిశోధకులకు నిధి నిక్షేపాలుగా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు, బ్రాహ్మణేతర ప్రజాహిత పత్రిక ‘సమదర్శి’ కొన్ని సంచికలుండటం గమనార్హం.
ఉత్సవాలు
ఉత్సాహాన్ని ప్రేరేపించేవి, ముందుకు నడిపించేవి ఉత్సవాలు. 1927లో వజ్రోత్సవం, 1952లో స్వర్ణోత్సవం, 1962లో వజ్రోత్సవం, 1990లో నవశతాబ్ద ఉత్సవం, 2002లో శతాబ్ది ఉత్సవం వైభవోపేతంగా జరిగాయి. ప్రత్యేక సంచికలు విశేషాలతో చరిత్రాంశాలతో వచ్చాయి.
నాలుగంతస్తుల సర్వాంగ సుందర భవన నిర్మాణానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.వి.రమణాచారి, ఎనభై అయిదేళ్ల స్వాతంత్య్ర సమరయోధులైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూతి శంకరరావు, డాక్టర్‌ ఎంఎల్‌ నరసింహారావు సేవలు అమూల్యం. ముఖ్యంగా 113 ఏళ్ల శ్రీకృష్ణ
దేవరాయాంధ్ర భాషా నిలయానికి యాభై ఏళ్లకు పైబడి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఎం.ఎల్‌.నరసింహా రావు కృషి గణనీయం. దీనికి ప్రస్తుతం ఇంఛార్జి గ్రంథపాలకుడు శంకరరావు.
      తెలంగాణ జాతీయ గ్రంథాలయంగా మరింతగా వృద్ధి చేసుకోవాల్సిన గొప్ప పొత్తపు గుడి ఇది. దాశరథి రంగాచార్య అన్నట్లు ‘వెయ్యేళ్లు ఈ సంస్థ కాంతి మంతంగా జీవించాలి’.

*  *  *  

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు