కలికి గాంధారి వేళ...

  • 313 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వెలగా వెంకటప్పయ్య

  • విశ్రాంత గ్రంథాలయాధికారి,
  • ఐతానగరం, తెనాలి.
  • 9490449555
వెలగా వెంకటప్పయ్య

ఇంట్లో బియ్యం అయిపోతాయి. ఇంటావిడ ఇంట్లో బియ్యం నిండుకున్నాయండీ అంటూ బియ్యం లేవనే విషయాన్ని నర్మగర్భంగా చెబుతుంది. ఇలా నిత్య జీవితంలో జాతీయాల వాడుక లేకుండా మాట్లాడలేం. అది జాతీయమని తెలియకపోవచ్చు. అయినా ప్రయోగిస్తాం. భావ వ్యక్తీకరణను అందంగా, సొగసుగా మార్చేవి మన జాతీయాలు. 
భాష
బాగా ప్రచారంలోకి వచ్చాక, భాషను సొంపుగా వినియోగించడంలో కొందరు చేసే ప్రయత్నం వల్ల అలవోకగా జాతీయాల సృష్టి జరుగుతుంది. తరువాత ఇవి చిలవలు పలవలుగా అభివృద్ధి చెందుతాయి. నిఘంటుకర్తలు వీటిని పలుకుబడులనీ, పదబంధాలనీ, నానుడులనీ, నుడికారాలనీ, నుడికట్లనీ, చమత్కారాలనీ, దేశీయాలనీ, భాషీయాలనీ పేర్కొన్నారు. వీటిలో సాధారణ అర్థం కాక ప్రయోగ రూఢితో మరో అర్థం స్ఫురిస్తుంది. సామాజిక జీవనంలో వచ్చే మార్పులు జాతీయాల ఆవిర్భావానికి మూలకారణం. భాషలో లభించే జాతీయాలు ఎన్ని ఉంటాయంటే- లెక్కకు సాధ్యం కానన్ని. వాటిలో వైవిధ్యభరితమైన కొన్నింటి గురించి తెలుసుకుందాం.
కలికి గాంధారివేళ
కలికి అంటే స్త్రీ. గాంధారి ధృతరాష్ట్రుని భార్య. గాంధారి వేళ అంటే సముచిత సమయం. పుట్టుగుడ్డి వాడైన ధృతరాష్ట్రుణ్ని గాంధారి పెళ్లాడింది. తన భర్త అంధుడు. కనుక భర్త చూడలేని లోకాన్ని తాను చూడటం ఎందుకు అనుకుంది. అందుకని తనంతట తానే కళ్లకు గంతలు కట్టుకుంది. గాంధారి తన భర్తతో పాటు రాజ దర్బారులో కూర్చొనేది. రాచకార్యాలు ముగించుకుని అర్ధరాత్రి 2- 3 గంటలప్పుడు స్నానానికి వెళ్లేది. ఈ సమయానికే కలికి గాంధారి వేళ అని పేరు. గాంధారి స్నానం చేసే వేళ కూడా ఒక జాతీయంగా మారిందంటే అది తెలుగువాళ్ల గొప్పతనమే.  
అంగడాన ఆనపకాయ
అంగడి, అంగడివాడ, సంత, మండి అంటే మార్కెట్‌. ఈ పదాలు నేడు ఎక్కువగా వినపడట్లేదు. మార్కెట్, బజార్, షాపు, సూపరు బజారు, మాల్‌ తదితర పదాలు నిలిచిపోయాయి. అంగడి పదం మీద పలు జాతీయాలు వెలిశాయి. అంగడికెక్కడం అంటే బహిరంగం చేయడం. అంగట్లో పెట్టడం దీనికి పర్యాయపదం. అంగడాన ఆనపకాయ అంటే - ఆనపకాయ (సొరకాయ) వలే తేలికగా చూడటం. చివరిగా అంగ డంగడి అంటే అస్తవ్యస్తం కావడం, చిందర వందర అయిపోవడం.
అత్త సొమ్ము అల్లుడి దానం
మన బంధుగణంలో అత్త, మేనత్తల ప్రాధాన్యం ఎంతో ఉంది. మేనమామ భార్య అత్త మాత్రమే. మేనత్త కాదు. తండ్రి సోదరి మాత్రమే మేనత్త. అలాగే తల్లి సోదరుడు మేనమామ అవుతారు. పిల్లనిచ్చినవారు మామ. ఇదో విచిత్రమైన తెలుగు సంప్రదాయం. అత్త సొమ్ము అల్లుడి దానం అంటే విచక్షణ లేకుండా ఇతరుల సొమ్ము ఉదారంగా దానం చేసేవాడని అర్థం. ఎవరింటికైనా పిల్లనిచ్చేప్పుడు ఎవరి పోరూ లేకుంటే మన బిడ్డ సురక్షితంగా ఉంటుంద[ని కన్నవారి ఆరాటం. దీనిని చెప్పడానికి అత్తాలేదు ఆడబిడ్డా లేదని చెబుతారు. అత్తగారి సాధింపు ఒక జాతీయం. కోడలు ఎంత పనిమంతురాలైనా ఏదో ఒక వంకతో సాధిస్తూ ఉండే కొందరు అత్తగార్ల తత్వాన్ని ఇలా చెబుతారు.  
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా...
భారతీయ కుటుంబ జీవనంలో ఇంటికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎంత చిన్నదైనా సొంత ఇల్లు అనేది తప్పని సరి. కనుకనే ఇల్లు కేంద్రంగా పలు జాతీయాలు- పదప్రయోగాలు వాడుకలోకి వచ్చాయి. ఇంటాయన, ఇంటావిడ అనేవి కమ్మని తేట తెలుగు పదాలు. ఎవరైనా ఇల్లూ వాకిలీ పట్టించుకోకుండా ఉంటే ఇంటి గొడవ పట్టక తిరుగుతాడని అంటారు. ఇంటివద్దే కుదురుగా కూర్చొనే వానిని ఇంటిపట్టున ఉండే మనిషి అంటాం. ఇంట్లో చిన్నా పెద్దా- ముసలిముతకా అందరినీ కలిపి ఇంటిల్లిపాదీ అంటారు. ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అనేది వేమనశతకంలో పద్యపాదం. ఇంట్లో గొడవలు భరింపశక్యం కానపుడు ఇంటిపోరు అనే జాతీయం వాడతారు. ఎవరైనా అత్యంత సన్నిహితంగా మెలిగితే ‘ఓ ఆయనా! ఆయన మా ఇంటిమనిషేలే’ అంటాం. ఆ ఊరి పెద్దాయన మా ఇంట్లో దీపం పెట్టాడు- అంటే ఆదరించాడు, సాయపడ్డాడు అని భావం. ఇంటి బల్లి బేకసేయు - అంటే ఇంట్లో చిన్నా పెద్దా అందరికీ లోకువ అయినట్లు, చులకన అయినట్లు.
కాకి దాపరికం
‘పియ్యి దినెడి కాకి పితరుడెట్లాయెరా’ అని వేమన విమర్శించినా... కాకి పదం మన జీవితంతో పెనవేసుకుపోయింది. కాకి దాపరికం అనే విచిత్రమైన ప్రయోగం ఒకటుంది. కాకి తినే వస్తువును తెచ్చి, అవసరమైనపుడు తినొచ్చులే అనుకొని పెంకుటింట్లో పెంకుల మధ్య దాస్తుంది. దాచిన స్థలం మరిచిపోయి అవసరం వచ్చినప్పుడు ప్రతి పెంకూ కదిలిస్తూ దాచిన వస్తువు దొరక్క నిరాశపడి పెంకులు చిందర వందర చేస్తుంది. ఎవరైనా వస్తువు పెట్టిన చోటు మరచిపోయి ఎక్కడో వెతుకుతుంటే ‘నువ్వూ నీ కాకి దాపరికమూ’ అంటారు. కాకి కాకః పికపికః అంటే కాకి కాకే - కోయిల కోయిలే. రూపంలో రెండింటికీ పోలికలున్నా అవి చేసే ధ్వనిలో అంతరం చాలా ఎక్కువ. కాకి ధ్వని కర్ణకఠోరం, కోకిల స్వరం సుమధురం. కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడుతుంది. కాకి వాటిని పొదిగి పిల్లలను చేసి కోకిల పిల్లలను బయటకు వెళ్లగొడుతుంది. ‘కాకదంత పరీక్ష’ అనేది మరో విచిత్రమైన ప్రయోగం. కాకులకు దంతాలుండవు. కనుక వాటి దంతాల పరీక్షకు పూనుకోవడం హాస్యాస్పదం. అనవసర శ్రమ కదా! 
      ఏదైనా అడిగినప్పుడు ఉన్నవీ లేనివీ కల్పించుకొని చెప్పేవి కాకమ్మ కథలు. పరమలోభిని గురించి చెప్పాల్సి వస్తే... ఓ ఆయనా! ‘‘ఆయన కాకికి ఎంగిలి విదల్చడు’’ అని ఎగతాళి చేస్తారు. రణగొణ ధ్వనులను కాకిగోల అంటారు. కాకి ఎంత కలకాలం జీవిస్తుందన్నా అది జీవించేది పాతికేళ్లే. కాకి బతికినంత కాలం బతికి, ఏ గాలివానకో, ఏ కారణం చేతో నేల రాలుతుంది. ఈ దిక్కులేని చావును కాకిచావు అంటారు.  ఇక పొంతనలేని సంబంధాన్ని చెప్పాలంటే ‘కాకి ముక్కుకు దొండపండు’ అంటాం.  నకిలీ బంగారాన్ని ‘కాకి బంగారం’ అంటారు. ఇంటిముందో బజారులోనో తినే వస్తువు ఏదైనా ఒక కాకికి కనిపిస్తే - అది మిగతా కాకులను పిలుచుకొని వస్తుంది. అందరం కలసి తిందాం అని. దీన్ని ‘కాకి బలగం’ అంటారు. దట్టమైన అడవిని కాకులు దూరని కారడవి అనీ, ఒక దాన్ని చంపి మరొక దాన్ని పోషించడం- కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటారు. 
కళ్లుకాయలుగాయడం
కంటిపై ఎన్ని జాతీయాలున్నాయో చెప్పలేం. కంట్లో దుమ్ముకొట్టు, కంట బిడుకలు గట్టి జాతీయాల అర్థం మోసగించడం. చూస్తూండగానే మోసం చేయడాన్ని ‘కంటబడక పాము’ అనే జాతీయం తెలియచేస్తుంది. ‘కంటికి కడువెడు’గా అంటే కంట బొటబొటా నీరు కారేంత ఏడవడం. చూడముచ్చటయిన చిత్రాన్ని ‘కంటికి ఇంపు’గా ఉందంటాం. కంటిలోకి దుమ్మూ ధూళీ చేరకుండా అన్ని వేళలా కనురెప్పలు కాపాడతాయి. ఎవరినైనా అపురూపంగా, భద్రంగా చూసుకుంటున్నారనడాన్ని ‘కంటికి రెప్ప’లా చూసుకుంటాడు అంటారు. అసూయా ద్వేషాలతో ఉడికిపోతున్నపుడు కంటికి భారమగు- అనే జాతీయం మనసులో మెదలుతుంది. కంటితుడుపు చర్య అనేది కృత్రిమ చర్య. కన్నులో కన్ను పెట్టుకుచూడు అనేది మంచి ప్రయోగం. అంటే శ్రద్ధగా కళ్లు పెద్దవి చేసికొని చూడు అని అర్థం. కళ్లు మండుతున్నపుడు కండ్లలో కలికెం వేయడం ఒకప్పటి ఆచారం. కంటగించు, కంటితుడుపు, కళ్లకు కట్టినట్లు, కళ్లకద్దుకొను, కళ్లు కాయలుకాచు, కళ్ల నీళ్ల పర్యంతం, కళ్లప్పగించు, కళ్లలో దీపం పెట్టుకొను లాంటివి ఎన్నో.
కొంగు బంగారం 
కొంగు పసిడి లేదా కొంగు బంగారం అంటే అందుబాటులో, కొంగుకు కట్టి ఉన్నంత దగ్గరగా ఉండి ఉపయోగపడేది అని అర్థం. కొంగుముడి వేయడం అంటే నూతన వధూవరులకు చీరకొంగు, వరుని పైపంచెకు ముడి వేస్తారు, ఇది భార్యాభర్తల అనుబంధానికి గుర్తు. భర్త భార్య కనుసన్నల్లో ఉంటే భార్య కొంగు పట్టుకు తిరుగుతున్నాడంటారు. (ఆమె గురించి అయితే భర్తను కొంగున కట్టుకుందంటారు)  ‘కొంగున అగ్గి దాచినట్లు’ అంటే ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పడం. స్త్రీ బయట చేరినపుడు మరింత సున్నితంగా, సంస్కారవంతంగా చేసే ప్రయోగం కొంగుమాయడం. 
      ఇలా తెలుగు జాతీయాలు సంస్కృతి సంపుటీకరించుకొన్న తరగని నిధులు. ‘చేటప్పు’ ఒక అందమైన పదబంధం. చేట తీసుకొని తిండిగింజల కోసం పొరుగింటికివెళ్లి, చేటలో పట్టేటన్ని గింజలు అప్పుగా తెచ్చుకోవడం. ‘బతుకు లెక్క భారం’ అంటే జీవితంలో సమాజం నుంచి మనం ఏం అందుకున్నాం. తరువాత మనం రుణం తీర్చుకున్నామో, లేదో ఒకసారి సరిచూసుకోవడం. 
      ఎన్నో పదాలను ప్రయోగించి విషయాన్ని చెప్పేకంటే జాతీయాలను  వాడటం ద్వారా క్లుప్తంగా, అందంగా, సూటిగా చెప్పొచ్చు. ఇంతటి విలువైన భాషా సంపదను నవతరానికి తప్పకుండా తెలియజేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ బాధ్యత తీసుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం