పీడను వదిలించుకుందాం

  • 251 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పరవస్తు నాగసాయిసూరి

  • హైదరాబాదు.
  • 9700074846
పరవస్తు నాగసాయిసూరి

కొండలను, అడవులను దిగమింగిన అనకొండలు...  భూములతో పాటు బడుగుల బతుకులనూ తన్నుకుపోయిన గద్దలు... పుడమి తల్లి కడుపు చీల్చి ఖనిజాలను కరకరలాడించిన హైనాలు కొన్ని ఖద్దరేసుకుని కాశీమజిలీ కథలు చెబుతున్నాయి. మాటలతో మభ్యపెట్టి వెన్నులో కత్తి దించే కుట్ర చేస్తున్నాయి.  సోదరా... జర జాగ్రత్త! వాటి దెబ్బకు ఇప్పటికే దేశం సర్వనాశనమైంది. సినారె కవితాస్త్రం ‘వందేమాతర గీతం వరుస మారుతున్నది’లోని ప్రతి అక్షరమూ దుర్రాజకీయాల దౌర్భాగ్య పాలనలో దయనీయంగా మారిన తల్లి భారతి కంటతడికి ప్రతిరూపం.
దేశాన్ని
దోచుకుపోతున్నారని తెల్లదొరలను తరిమికొట్టాం. భారతావనికి కావలి కాస్తారనుకుని నల్లదొరలను తలకెక్కించుకున్నాం. ఏమైంది? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు తెల్లోళ్లను మించిన మహామేతలయ్యారు మనవాళ్లు. చెట్టూ పుట్టా, ఆకూ అలమూ, నింగీ నీరూ, ఇనుమూ ఇసుకా... కాదేదీ భోజ్యానికనర్హం అంటూ చెలరేగిపోయారు. వారి ధాటికి రుద్రభూమిగా మారిపోతున్న రత్నగర్భను చూసి మూడు దశాబ్దాల కింద సినారె కలం కార్చిన కన్నీళ్లలోంచి కదలివచ్చిన ఆ పాట... ఇప్పటి పరిస్థితులకూ ప్రతిబింబమే.  
      పల్లెటూరిలోని ఆ బడికి ఉపాధ్యాయుడుగా వస్తాడు కథానాయకుడు. పొద్దున్నే ప్రార్థన సమయంలో ‘వందేమాతరం’ పాడమని పిల్లలను అడుగుతాడు. చిన్నారులు తెల్లమొహం వేస్తారు. మీరు పాడండి మాస్టారూ అంటూ సాటి ఉపాధ్యాయుణ్ని కోరతాడు కథానాయకుడు. ఆయన గొంతూ పెగలదు. జాతి నరాల్లో చైతన్యాన్ని నింపి ఆంగ్లేయులకు గుండెల్లో మందుగుండై పేలిన గీతాన్ని ఈతరం మర్చిపోతోందంటూ కథానాయకుడు కలత చెందుతాడు. అయినా... దేశమే అస్తవ్యస్తంగా తయారవుతున్నప్పుడు వీళ్లను అనుకుని ఏం లాభమనుకుంటాడు. ఆ ఆవేదనలో ‘వందేమాతర గీతం వరుస మారుతున్నది’ అంటూ పాడతాడు. 1985లో వచ్చిన ‘వందేమాతరం’ చిత్రంలోని సన్నివేశమిది. 
      వాస్తవానికి ఈ పాట సినిమా కోసం రాసింది కాదు. సినారె ఎప్పుడో రాసుకున్న ఆ కవిత. ఆయన అనుమతితో దర్శకుడు టి.కృష్ణ తన చిత్రంలో పెట్టారు. చక్రవర్తి సంగీతమందించిన ఆ గీత సాహిత్యం ఇప్పటికీ సమకాలీనమే.  
వందేమాతరం... వందేమాతరం
వందేమాతర గీతం వరుస మారుతున్నది
తరం మారుతున్నది... ఆ స్వరం మారుతున్నది ।।
సుజల విమల కీర్తనలో... సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా...
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది... మంట రగులుతున్నది... ।।తరం।। 
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో...
పైరు నోచుకోని బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి.
శుభ్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా... 
రంగురంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది... గిరాకి పెరుగుతున్నది...           ।।తరం।।
ఫుల్ల కుసుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ...
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది
సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమీ... ఈ...
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది...
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా...
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది... అక్కడనే ఉన్నది...  ।।తరం।। 

      స్వాతంత్య్ర సమరంలో ప్రతీ దేశభక్తుడి మదిలో మారుమోగిన విప్లవగీతమే వందేమాతరం. మంచి నీరు, మంచి గాలి, మంచి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పుకునే సంకల్పమే వందేమాతరం. అందుకే అది భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే, కాలం మారింది. కాలంతోపాటే ఈ గీతం వరుస కూడా మారింది. అందరూ బాగుండాలనే తత్వం పోయింది. ‘నేను మాత్రమే’ బాగుండాలన్న అత్యాశ పెరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల స్వార్థబుద్ధి వల్ల దేశ స్వరూపమే మారిపోయింది. ప్రతి పని వెనుకా స్వలాభమే. దాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రతి వ్యవస్థనూ కలుషితం చేశారు. ఆ కలుషిత వాతావరణంలో పుట్టుకొచ్చిన కలుపు మొక్కలు విషవృక్షాలుగా ఎదిగాయి. ఎదిగి ఎదిగి దేశానికి ఎసరుపెట్టాయి. సినారె సాహిత్యంలో ఆ ఆవేదనే కనపడుతుంది. 
వందేమాతరం... సుజలాం... సుఫలాం... పాడుకోవడానికి బాగున్నా... నిజానికి జనానికి జలం లేదు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడి పోతున్నారు. గొంతు తడుపుకోవడానికి మైళ్ల దూరం నడిచి వాళ్ల మోకాళ్లు అరిగిపోతున్నాయి. మరి నాయకులేం చేస్తున్నారు? శీతల పానీయాలు, రక్షిత మంచినీటి వ్యాపారుల దాహార్తిని తీర్చేందుకు తెగ పోరాడుతున్నారు!
      ఇక మలయజ శీతలాం అంటూ మృదుమధురమైన కోమల పదాలతో అల్లిన ఈ పదాల భావన అందంగానే ఉంది. కానీ, పచ్చని పైర్లే లేనప్పుడు పైరగాలి ఎక్కడి నుంచి వీస్తుంది? దేహానికి సాంత్వన ఎన్నడు కలుగుతుంది? ఎండిన బీళ్లపై నుంచి వచ్చే వేడిగాలులు బడుగులకు వడగాడ్పుల్లా తగులుతున్నాయి. వారి కళ్లలో మంటలు రేపుతున్నాయి. 
      పచ్చని పొలాలతో దేశం సుభిక్షంగా ఉండాలని (సస్యశ్యామలాం...) వందేమాతర గీతం ఆకాంక్షిస్తోంది. వాస్తవం దాన్ని వెక్కిరిస్తోంది. సాగునీటి కాలువల్లో సొమ్ముల సేద్యం చేసిన నేతల ఘనకార్యాలకు ఆనవాళ్లుగా బీళ్లు నోళ్లు తెరుస్తున్నాయి. జలయజ్ఞం చేసి అస్మదీయుల లోగిళ్లకు కాసుల వరద పారించిన అపర భగీరథులను గుర్తుచేస్తూ అవి విషాదగీతాలు ఆలపిస్తున్నాయి. 
      శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ అంటూ తెల్లని వెన్నెలతో పులకించిన రాత్రులు ఉండాలని ‘వందేమాతరం’ చెబుతోంది. కానీ, నేడు వెన్నెలకు విలువలేదు. రంగురంగు చీకట్లకు తప్ప. కారణం ఏంటి? జాతి సంపదలను జామాతలకు రాసిచ్చే వాళ్లు, లంచాలిచ్చే వారికి మాత్రమే ‘పనులు’  చేసిపెట్టే వారి ఏలుబడి! అది లక్ష్మీపతులను అపర కుబేరుల్లా మార్చుతుంది. కుచేలుల కొళ్లాయిలు ఊడగొడుతుంది. ఇలా దోచుకునే వాడికే దోచిపెట్టే దొరలున్నప్పుడు ఎవరు మాత్రం గాంధీ బాటలో నడుస్తారు? 
      ఫుల్ల కుసుమిత ధ్రుమదళ శోభినీం... వికసించిన పూలు, లతలున్న వృక్షాలతో శోభించాలని భారతమాత కోరుకుంటోంది. కానీ, ఆ తల్లి కలకు చిదిమేసినా వదలని చీడ పట్టుకుంది. నాయకుల అత్యాశకు అడవులు, కొండలు... ఒకటనేమిటి జాతికి, భావితరాలకు చెందాల్సిన సహజ వనరులన్నీ హరించుకుపోతున్నాయి. ఎండిన మోడులు, క్వారీ దెబ్బలకు మిగిలిన రాళ్ల గుట్టలు తప్ప పచ్చదనమే కనిపించట్లేదు.
      మంచి నవ్వులు వెల్లివిరియాలి, మంచి మాటలు వెలువడాలని (సుహాసిని, సుమధుర భాషిణి... ) ‘వందేమాతరం’ నినదిస్తోంది. కానీ, విషపు నవ్వుల మాయగాళ్ల ప్రతిభకు అది అపహాస్యం పాలవుతోంది. మెత్తని మాటలతో కుత్తుకలను ఉత్తరించే వాళ్లు నాయకులై... తరతరాల పీడకులై... జాతి జవసత్వాలను పీల్చేస్తున్నారు.           
      సుఖదాం, వరదాం... ప్రజలంతా సుఖంగా ఉండాలి, వారికి ఎన్నో వరాలు అందాలంటూ కోరుకున్నారు వందేమాతరం రచయిత బంకించంద్రుడు. నాయకులు దాన్నే ఆచరణలో పెట్టాలని ప్రజల సుఖం కోసం ఎన్నో వరదానాలు ఇస్తున్నారు! ప్రాజెక్టులు కట్టిస్తామని చెప్పి శిలాఫల కాలేస్తున్నారు. ఉచిత పథకాలంటూ హంగూ ఆర్భాటాలు చేస్తున్నారు. అంతే.. వారి ‘పని’ పూర్తయిన తర్వాత మళ్లీ వాటి గురించి ఆలోచించట్లేదు. అందుకే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు జనం బతుకులూ అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 
      ఎన్నికలు వచ్చేశాయి. ప్రతి నాయకుడూ మాటల మంత్రదండంతో ప్రజల ముందుకు వచ్చేశాడు. వారి మాటలను నమ్ముతూ మూడు తరాలుగా పడుతున్న అవస్థను ఈ సారి వదిలించుకుందాం. పేదల నెత్తురు రుచిమరిగిన పిశాచాలకు ఓటు రూపంలో పొగబెడదాం. తరతరాల దోపిడీని చూస్తూ మరుగుతున్న నెత్తురు మీద ఆనపెట్టుకుందాం. మంచి నాయకులనే ఎన్నుకుందాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం