కాల దోషం పట్టని ‘కీలుబొమ్మలు’

  • 188 Views
  • 0Likes
  • Like
  • Article Share

    విహారి

  • విశ్రాంత అధికారి, జీవిత బీమా సంస్థ
  • హైదరాబాదు.
  • 9848025600
విహారి

బహుముఖీన సాహితీ సృజన చేసిన జి.వి.కృష్ణారావుకు ‘కీలుబొమ్మలు’ నవల బాగా పేరు తెచ్చింది. సాధారణ పాఠకులతోపాటు విమర్శకుల ప్రశంసలనూ అందించింది. 
      ‘కీలు బొమ్మలు’ నవల కథాకాలం 1951. అరవై రెండేళ్ల కిందటి తెలుగు గ్రామీణ జన జీవనం తీరు తెన్నుల్ని వాస్తవికతతో చిత్రించిందీ నవల. అలాగే, మనుషుల్లోని మనస్తత్వ వైరుధ్యాల్ని శిల్పభరితంగా ఆవిష్కరించింది. స్వాతంత్య్రం వచ్చి నిండా మూడు నాలుగేళ్లు గడవకముందే పల్లె ప్రజల మౌలిక ఆలోచనా ధోరణిలో వస్తున్న అవాంఛనీయత ఈ నవలలో ప్రతిబింబించింది. ఈ నవలా రచనకు ‘బోజర్‌’ రాసిన ‘దిపవర్‌ ఆఫ్‌ ఎ లై’ పుస్తకం ప్రేరణగా చెప్పుకున్నారు రచయిత. అబద్ధం ఎంత శక్తిమంతమైందో చూపుతూ, ఒక సంకీర్ణ కథావస్తువుని ఉత్కంఠభరితంగా నిర్వహించారు కృష్ణారావు.
      స్థూలంగా ఇదీ కథ... ఊళ్లో పుల్లయ్య మోతుబరి. వడ్డీ వ్యాపారమూ చేస్తుంటాడు. భార్య లక్ష్మమ్మ. ఆమె అంటే పుల్లయ్యకు జంకూ, గొంకూ. కారణం ఆమె నోరు పెద్దది. పుల్లయ్య కూతురు సీత. ఈమెకు తండ్రి ధర్మాత్ముడనే నమ్మకం. పుల్లయ్య దగ్గర లెక్కలు రాసే మనిషి సత్యనారా యణ. పుల్లయ్యకి బాగా తెలిసినవాడు. పేపరుమిల్లు నడుపుతున్న చంద్రశేఖరం మార్వాడీ దగ్గర ఐదువేలు అప్పు చేస్తే, పుల్లయ్య ఆ అప్పుకు పూచీకత్తునిస్తాడు. శేఖరం భార్య లలిత ఉత్తమ ఇల్లాలు. శేఖరం వ్యాపారం దెబ్బతింది. మిల్లు పోయింది. అప్పు తన నెత్తిన పడుతుందన్న ఆందోళన మొదలవుతుంది పుల్లయ్యకు.
      తాను శేఖరానికి పూచీగా లేననే అభిప్రాయాన్ని అయినవాళ్లల్లో వ్యాపింపజేస్తాడు పుల్లయ్య. అయినా అప్పు బాధ్యత పుల్లయ్య మీది కొచ్చింది. పుల్లయ్య భార్య లక్ష్మమ్మకు ఇది తెలిసి, శేఖరం దొంగ దస్తావేజులు సృష్టించాడని, అందుకని తన మేనల్లుడు వకీలు శేషగిరి చేత శేఖరానికి నోటీసు ఇప్పిస్తుంది. దీనితో పుల్లయ్య అబద్ధపు మాట మీద ఇరుక్కుపోయాడు. కోర్టులో తన మాట నిరూపించుకోవటానికి సాక్షుల్ని తయారు చేసుకుంటాడు. శేఖరం నిజాన్ని చెప్పమని పుల్లయ్య గుమాస్తాని ప్రాధేయపడతాడు. అతను తన నిస్సహాయతని తెలుపుకుంటాడు.
      పుల్లయ్య కొడుకు రామారావు పట్నంలో సంఘసేవకుడు. పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉంటాడు. అభ్యుదయ భావాలున్నవాడు. ఇతనికి సత్యనారాయణ తెలుసు. పుల్లయ్యకి తాను దోషి, నేరస్థుడు కావటం ఇష్టం లేదు. పరువు సమస్య. కొడుకు తనకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాడనే అనుమానంతో రామారావు కమ్యూనిస్టు, విప్లవకారుడు అని చెప్పి తానే అతన్ని అరెస్ట్‌ చేయిస్తాడు.
      వాసుదేవశాస్త్రి ఆ ఊళ్లో చిన్న డాక్టరు. ఈ కేసుని రాజీమార్గంలో పరిష్కరించాలని ప్రయత్నాలు చేస్తే ఫలించవు. సత్యనారా యణ ఇల్లు తగలబడుతుంది. అది ఎవరి పనో తేలదు, ఊళ్లో కమ్యూనిస్టుల బెడద ఎక్కువగా ఉందని పోలీసులకి ఫిర్యాదులు వెళ్తాయి. దీనికి ముఖ్య కారకురాలు అమ్మాయమ్మ అనే సంఘ సేవిక. ఊళ్లోకి మలబారు పోలీసులు దిగుతారు. కోర్టులో పుల్లయ్య వాదన గెలుస్తుంది. రామారావు జైలు నుంచీ విడుదల అయి వస్తాడు. పుల్లయ్యకు సన్మానం, ‘సర్దార్‌’ బిరుదూ...! ఈ అన్యాయాన్ని చూడలేక రామారావూ, శాస్త్రీ ఊరు వదిలి వెళ్లిపోతారు.
      పుల్లయ్య అంతరంగ సంఘర్షణని దృష్టిలో ఉంచుకుని సుప్రసిద్ధ రచయిత హితశ్రీ ఇలా అంటారు. ‘‘వ్యక్తికి అంతఃకరణ ఉంటుంది. అది వివేక చోదితం. పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ప్రతి వ్యక్తి స్వతంత్రాలోచనతో తన అంతఃకరణ సాక్షిగా తన ధర్మాల్ని తాను నిర్వర్తించాలి. లేనినాడు అధర్మం ప్రవర్తిల్లి సమాజం సంక్షోభం చెందుతుంది. ఇదే ‘కీలు బొమ్మలు’ సందేశం. అంతేగాని, వ్యక్తులు పరిస్థితుల కీలు బొమ్మలని కాదు’’


డాక్టర్‌ జి.వి.కృష్ణారావు (1914-1978)
గుంటూరు జిల్లా కూచిపూడిలో జన్మించిన డా।। గవిని వెంకట కృష్ణారావు హేతువాదిగా, ప్రముఖ రచయితగా, తత్వవేత్తగా, సంస్కృతాంధ్రపండితునిగా పేరు పొందారు. ఆయన ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించారు. మార్క్స్‌ సిద్ధాంతాల ప్రభావంతో ‘కావ్య జగత్తు’ సాహిత్య గ్రంథాన్ని రాశారు. జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య వంటి రచనలు ప్రసిద్ధాలు. ఈయన రచనల్లో కీలుబొమ్మలు ఖ్యాతి చెందింది. ‘కళాపూర్ణోదయం’ గ్రంథానికి సిద్ధాంత వ్యాసం రాసి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. పొన్నూరు సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్‌గా, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యుడిగా సేవలందించారు. 


      ‘కీలు బొమ్మలు’ నవల ఒక ఆదర్శాన్ని ప్రతిపాదిస్తూ సాగింది. ఆ ఆదర్శం ధర్మవర్తనం, ధర్మపరిరక్షణ. ముఖ్య పాత్రలన్నీ ఈ అంశం చుట్టూ తిరుగుతాయి. కొన్ని పాత్రలు లోపల, కొన్ని పాత్రలు నవలా పరిధికి ఈవల! ధర్మాధర్మాల్ని గురించిన విచికిత్సని ధ్వనిమంతంగా నిర్వహించారు కృష్ణారావు.
      వాసుదేవశాస్త్రి ఒకచోట అంటాడు. ‘ప్రజలు- వివేకం ఉంది, విచారించుకుందామని మరచిపోయి శరభదశ్శరభలు కొడుతున్నారు. ఈ పరిస్థితిలో మనవంటి అల్పసంఖ్యాకులకు రెండే మార్గాలు ఉన్నాయి. మన వ్యక్తిత్వం పూర్తిగా విడిచిపెట్టి అధిక సంఖ్యాకులలో లీనమై పోవాలి. వీళ్లు చెప్పిందే వేదమని ఒప్పుకోవాలి. లేదా సంకుచితమైన స్వార్థాన్ని అధిగమించి సర్వమానవకోటికి అంటే ప్రతి ఒక్క మానవునికి శ్రేయస్కరమైన ధర్మమార్గాన్ని చూపించగలగాలి. అలాంటి గురుతర బాధ్యతే వివేకవంతుల మీద ఉంది. ఈ రెండూ జరగకపోతే మనం నామరూపాలు లేకుండా నాశనమై పోతాము’! ఇదీ రచయిత సంవేదన, సందేశం!
      ‘కీలు బొమ్మలు’ నవలలో చిత్రించిన పరిస్థితి ఈనాడు వ్యక్తిస్థాయిని దాటిపోయి సమూహాలకి పాకిపోయింది. అవినీతి అనే పదం అర్థం మార్చుకుంటున్నదా అనేంత దుస్థితికి మనిషి స్వార్థం దిగజారి పోయింది. ధర్మవర్తనం అనేమాటే బూతుగా పరిణమించే దారుణ దృశ్యం కళ్లముందు కదలాడుతోంది. ఇదిగో ఈ దుస్థితినీ, దారుణాన్నీ అరవై ఏళ్లక్రితమే దర్శించి, అంచనావేసి, హెచ్చరిక చేసిన అసామాన్య నవల ‘కీలు బొమ్మలు’. ఈ పరిస్థితిని మలుపు తిప్పటానికి ఒక మార్గనిర్దేశాన్ని చూపింది ‘కీలు బొమ్మలు’. రచయిత తన సామాజిక బాధ్యతని నెరవేర్చే దీక్షతో ఒక సందేశాన్నిచ్చారు. మనిషి తన అలసత్వాన్నీ, ఉపేక్షాతత్వాన్నీ, ఉదాసీనతనీ వదిలించుకుని తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. అధర్మపరులైన అధిక సంఖ్యాకుల అరాచకత్వాన్ని ప్రతిఘటించాలి.
      ‘కీలు బొమ్మలు’ నవల గొప్పదనమంతా అది అందిస్తున్న ఆలోచనాత్మకమైన, ఆచరణాత్మకమైన ఆదర్శంలో ఉంది! దాని సంభావ్యతలో ఉంది!! నవలా రచయిత దార్శనికతలో ఉంది!!!


వెనక్కి ...

మీ అభిప్రాయం