తెలుగు సాహిత్య చరిత్ర - 8

  • 142 Views
  • 1Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

నందగిరి వెంకటరావు:
జీవితకాలం 1909-1985. తెలంగాణ ఆంధ్ర మహాసభ నాయకులలో ఒకరు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని చెరసాల పాలయ్యారు. న్యాయమూర్తిగా సేవలందించారు. గ్రంథాలయోద్యమం, మహిళల అభ్యున్నతికి తనవంతు సహకారం అందించారు. ఇన్ని రంగాల్లో తలమునకలైనప్పటికీ వెంకటరావు సాహితీ సృజన చేయడం విశేషం. ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో కథా రచన చేశారు. ఆయన కథల్లో ప్రముఖంగా కనిపించేది హైదరాబాద్‌ నగర ప్రజా జీవిత చిత్రణ. మొత్తం మీద 50కి పైగానే కథలు రాసినట్లు తెలుస్తోంది. వీటిని భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సుజాత, గోలకొండ, సమదర్శిని పత్రికలు అచ్చువేశాయి. వెంకటరావు భార్య ఇందిరాదేవి కూడా కథలు రాశారు. 
నందగిరి ఇందిరాదేవి:
తొలి తరం తెలుగు కథా రచయిత్రుల్లో ఒకరు నందగిరి ఇందిరాదేవి. 1930-1976 మధ్యకాలంలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఇందిరాదేవి సాహితీ రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ తనదైన ముద్రవేశారు. తెలంగాణలో మహిళా ఉద్యమానికి నాయకత్వం వహించారు. తెలంగాణ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. ఆంధ్ర (తెలంగాణ) యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇందిరాదేవి తండ్రి వడ్లకొండ నరసింహారావు దళితుల అభ్యున్నతికి కృషిచేశారు. భర్త నందగిరి వెంకటరావు కూడా ప్రముఖ కథా రచయిత కావడం విశేషం. పందెం, గంగన్న, ప్రాప్తం, పిచ్చి, ఏకాకి, రూల్సు ప్రకారం మా యిల్లు, మా వారి పెళ్లి, మా వారితో బజారుకు తదితర కథలు ఇందిరాదేవి కలం నుంచి వెలువడ్డాయి. వీటిలో అప్పటి హైదరాబాద్‌ రాజ్య స్థితిగతులను కళ్లకు కట్టారామె. ఇందిరాదేవి ఆరో (తెలంగాణ) ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించారు. 1935లో మొదటి అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
పైడిమర్రి వేంకట సుబ్బారావు:
స్వస్థలం నల్లగొండ జిల్లా. 1916లో జన్మించారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాలంనాటి, నిజాం పాలన అనంతరం కాలపు తెలంగాణ సామాజిక పరిస్థితులను కళ్లకు కడుతూ సుబ్బారావు రచనలు సాగాయి. ఈయన కలం నుంచి జాలువారిన కథల్లో ’భూమిపట్టా’, ’నౌకరి’, ’పిల్లిపోరు’, ’రాజులు’, ’బడిగంటలు’ మొదలైన కథలు ఈయన కలం నుంచి జాలువారాయి. వీటిని గోల్కొండ, భారతి, ఆంధ్రపత్రిక లాంటి అప్పటి ప్రముఖ పత్రికలు అచ్చువేశాయి. ఈయన రాసిన నవలల్లో ముఖ్యమైంది ‘కాలభైరవుడు’. ఇక మనం బళ్లలో రోజూ చేసే ‘ప్రతిజ్ఞ’ రాసింది కుడా సుబ్బారావే కావడం గమనార్హం. 
ఆవుల పిచ్చయ్య:
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడమే కాదు, పోరాటాన్ని కళ్లకు కడుతూ కథలు రాసిన రచయిత ఆవుల పిచ్చయ్య. 1919-20 ప్రాంతంలో జన్మించిన పిచ్చయ్య సొంతూరు సూర్యపేట. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ ఆయన కథలు రాయడం విశేషం. ఆయన కలం నుంచి వెలువడిన దౌరా, ఊరేగింపులు, చపరాసీ, వెట్టిచాకలి దినచర్య, ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమిందారు కథలు ‘మీజాన్‌’ పత్రికలో అచ్చయ్యాయి. పిచ్చయ్య కథా రచనను మీజాన్‌ పత్రిక సంపాదకులుగా ఉన్న అడవి బాపిరాజు, అదే పత్రికలో ఉద్యోగులుగా ఉన్న రాంభట్ల కృష్ణమూర్తి, తిరుమల రామచంద్ర ప్రోత్సహించారు. 
ధరణికోట శ్రీనివాసులు:
జీవితకాలం 1961-1967. జన్మస్థలం నల్లగొండ జిల్లా నార్కెట్‌ పల్లి సమీపంలోని అమ్మనబోలు. వృత్తిరీత్యా నల్లగొండ జిల్లా పరిషత్‌ లో మేనేజర్‌. తెలంగాణ తొలితరం కథకులలో ఒకరైన శ్రీనివాసులు తన కథల్లో హాస్యం, వ్యంగ్యానికి పెద్దపీట వేశారు. మునిమాణిక్యం నరసింహారావు ‘కాంతం కథలు’ రాస్తే, ఈయన ‘కనకం’ ప్రధాన పాత్రగా కథా రచన సాగించారు. శ్రీనివాసులు కథలు ‘అన్నంలోకి’, ‘మా యింట్లో’ సంకలనాలుగా వెలువడ్డాయి. కథలే కాకుండా రసాభాసం, తేలుమంత్రం, దివ్వెల పండుగ, మాలతి మొదలైన నాటకాలు ఈయన కలం నుంచి జాలువారాయి. నాటకాలు ఆకాశవాణిలో ప్రసారం కాగా, కథలు గోలకొండ, స్రవంతి, ఆంధ్ర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. శ్రీనివాసులు తనయుడు సమీర్‌ కుమార్‌ కూడా కథకులే. 
శ్రీవాసుదేవ రావు:
జీవిత వివరాలు అంతగా తెలియవు. చనిపోయింది 1993లో అని ఆంధ్ర పత్రిక ద్వారా తెలుస్తోంది. ఈయన కథల్లో హైదరాబాద్‌ నగర జీవితాలను అక్షరబద్ధం చేశారు. దీన్ని బట్టి ఈయన స్వస్థలం హైదరాబాద్‌ అనుకోవచ్చు.
సామల సదాశివ:
జీవితకాలం 1928-2012. స్వస్థలం ఆదిలాబాదు. సదాశివ మాస్టారుగా ప్రసిద్ధిచెందారు. సదాశివ 1950లో తన 22వ ఏట రాసిన ‘సాంబశివ’ శతకం ప్రముఖ సంస్కృత విద్వాంసులు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి మెప్పు పొందింది. మంచిమాటలు, నిరీక్షణము, ప్రభాతము, విశ్వామిత్రము, నారదు గర్వభంగము (గేయకావ్యం), ధర్మవ్యాధుడు (లఘుకావ్యం) మొదలైనవి మాస్టారి కలం నుంచి జాలువారిన కావ్యాలు. ఇంకా ‘గీటురాయి’ పత్రికకు ఉర్దూ సాహిత్య చరిత్రను పరిచయం చేస్తూ తెలుగులో రాసిన వ్యాసాలు ‘ఉర్దూ సాహిత్య చరిత్ర’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. హిందూస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ రాసిన వ్యాసాల సంకలనం ‘స్వరలయలు’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. సదాశివ ఆత్మకథ ‘యాది’. 
నెల్లూరు కేశవస్వామి:
జీవిత కాలం 1920 - 1984, జన్మస్థలం హైదరాబాద్‌ నగరం. వృత్తి నీటిపారుదల విభాగంలో ఇంజనీరు. ప్రవృత్తి తెలుగు, ఉర్దూ భాషల్లో రచనా వ్యాసంగం. ఇక కేశవస్వామి పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్‌ కథల సంపుటి. హైదరాబాద్‌ జీవన శైలిని, సామాజికతను ప్రతిబింబించే ఈ కథా సంకలనానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘పసిడి బొమ్మ’ ఈయన రాసిన మరో కథల సంపుటి. వెలుతురులో చీకటి అనే నవల కూడా కేశవస్వామికి పేరుతెచ్చిపెట్టింది. ఇవి కాకుండా తెలుగు, ఉర్దూ భాషల్లో ఈయన రచించిన ఎన్నో కథలు, నాటికలు అముద్రితంగా ఉన్నాయి.
దాశరథి రంగాచార్య:
జీవిత కాలం 1928 - 2015. రంగాచార్య దాశరథి కృష్ణమాచార్యుల తమ్ముడు. వట్టికోట ఆళ్వారుస్వామి రచనలకు కొనసాగింపుగా 7వ నిజాం పరిపాలన కాలపు తెలంగాణ జన జీవితాన్ని చిల్లరదేవుళ్లు, మోదుగు పూలు, మాయ జలతారు, జనపదం లాంటి నవలల ద్వారా కళ్లకు కట్టారు రంగాచార్య. చిల్లర దేవుళ్లు నవలకు 1970లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీటిలో కొన్ని ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. చలన చిత్రాలుగా కూడా తెరమీదకెక్కాయి. జీవన యానం (ఆత్మకథ) అమృతంగమయ, యాత్రాజీవనం, నాలుగు వేదాలకు తేటతెలుగు అనువాదం మొదలైనవి రంగాచార్య రచనలు. తెలంగాణ స్వాతంత్య్ర, సాయుధ పోరాటం నుంచి 4 వేదాల అనువాదం వరకు సాగిన రచనలు ‘సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి రంగాచార్య సాహిత్యం’ అన్న ప్రసంశలు దక్కించుకున్నాయి. 
బండారు అచ్చమాంబ:
జీవిత కాలం 1874-1905. తొలి తెలుగు కథకుల్లో ఒకరుగా ప్రసిద్ధిచెందిన అచ్చమాంబ జన్మస్థలం కృష్ణాజిల్లా నందిగామ. అయితే భర్త ఉద్యోగం రీత్యా ఎక్కువ కాలం తెలంగాణలో గడిపారు. స్త్రీలు అన్ని రంగాల్లో సాధికారిత సాధించాలని కాంక్షించిన అచ్చమాంబ రచనలు హిందూ సుందరి పత్రికలో అచ్చయ్యాయి. లలితా శారదలు, ధనత్రయోదశి, బీద కుటుంబం కథలు లభిస్తున్నాయి. ఇంకా వివిధ కాలాల్లో చరిత్ర ప్రసిద్ధికెక్కిన స్త్రీల జీవిత విశేషాలతో అబలా సచ్చరిత్ర రత్నమాల అనే పుస్తకం కూడా రచించారు. అలా తెలుగులో మొదటిగా స్త్రీల చరిత్ర రాసినవారిగా అచ్చమాంబ నిలిచిపోయారు. మచిలీపట్నంలో బృందావన స్త్రీ సమాజం పేరుతో మొదటి మహిళా సంఘాన్ని స్థాపించారు. అచ్చమాంబ తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన కొమర్రాజు లక్ష్మణరావుకు స్వయాన అక్క. 
రావెళ్ల వెంకట రామారావు: 
జీవితకాలం 1924 - 2013, జన్మస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఆయన రాసిన ‘కదనాన శత్రువుల కుత్తుకన నవలీల’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో స్ఫూర్తినిచ్చింది. 
అలిశెట్టి ప్రభాకర్‌: 
(జీవిత కాలం 1954-1993)
జన్మస్థలం జగిత్యాల పట్టణం. చిత్రకారుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన ప్రభాకర్‌ కవిగా కూడా ప్రసిద్ధి చెందారు. అచ్చయిన తొలి కవిత ‘పరిష్కారం’. ఇది 1974లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చింది. తర్వాతి కాలంలో జీవిక కోసం ఫొటోగ్రాఫర్‌ వృత్తిలో స్థిరపడ్డారు. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త రేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్‌ (ఆంధ్రజ్యోతి పత్రికలో 6 ఏళ్లపాటు ధారావాహికగా వచ్చింది) మొదలైనవి ఆయన కవితా సంపుటాలు.
కొన్ని నవలలు: 
శేషభట్టరు వేంకట రామానుజాచార్యులు:
ప్రాకృత దాంపత్యము (1922)
కమలహరి: జగ్గనియిద్దె (కిందివర్గం వాళ్లు విద్య కోసం పడే పాట్లు ప్రధానంగా సాగింది), సంగం (మహారాష్ట్రలోని భీవండికి వలస వెళ్లిన నేత కార్మికుల సమస్యల ప్రధానంగా సాగింది)
భాస్కరభట్ల కృష్ణారావు: యుగసంధి, వెల్లువలో పూచికపుల్లలు.
సయ్యద్‌ అలీ అజ్మతుల్లా సోదరులు: సుశీల, సుజాత, మణి, జాహ్నవి, రంపరాకాసి
దాశరథి రంగాచార్యులు: చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు
బి.ఎన్‌.శాస్త్రి: విప్లవజ్వాల, రాధ, సంధ్యారాగం, వాకాటక మహాదేవి
కందిమళ్ల ప్రతాప్‌ రెడ్డి: బందూక్‌ (సాయుధ పోరాటం మీద)
బి.ఎన్‌. రెడ్డి: ఆయువుపట్టు (సాయుధ పోరాటానికి సంబంధించింది)
ప్రాణ్‌ రావు: రుద్రమదేవి, మాదన్న మంత్రి, మలగని బత్తి (సాయుధ పోరాట నేపథ్యం)
అల్లం రాజయ్య: కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం, భూమి, వసంతగీతం. సాహు (శనిగరం వెంకటేశ్వర్లు)తో కలిసి ‘కొమురం భీము’ నవల రాశారు.
వసంతరావు దేశ్‌ పాండే: అడవి ఊరు, రాగో
పులుగు శ్రీనివాస్‌: అన్నలు, అడవితల్లి
తుమ్మేటి రఘోత్తమరెడ్డి: సింగరేణి కార్మికుల జీవిత నేపథ్యంతో ‘నల్లవజ్రం’.
శాంతి ప్రబోధ: జోగినుల జీవిత చిత్రణతో ‘జోగిని’.
బి.ఎస్‌.రాములు: బీడీ కార్మికుల జీవిత చిత్రణతో ‘బతుకుపోరు’.
నేరెళ్ల శ్రీనివాస్‌: కల్లుగీత వృత్తి నేపథ్యంతో ‘బతుకుతాడు’.
దిలావర్‌: సమిధలు (క్యాంపస్‌ విద్యార్థుల నేపథ్యం)
వేముల ఎల్లయ్య: కక్క, సిద్ధి (దళిత చైతన్యంతో)
జాజుల గౌరి: మన్నుబిడ్డ, వొయినం.
గీతాంజలి: ఆమె అడవిని జయించింది.
కాలువ మల్లయ్య: భూమి పుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం
పరవస్తు లోకేశ్వర్‌: సలాం హైదరాబాద్‌

 

ఇవీ చ‌దవండి...

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2

 

తెలుగు సాహిత్య చ‌రిత్ర - 3

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం