పాపాము చేయమురా నరుడా!

  • 95 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

మనిషి పుట్టినప్పటి నుంచీ చచ్చేంత వరకు ఒకటే కోరిక ‘నిండు నూరేళ్లు బతకాలని’! ఇంకా అవకాశం ఉంటే ‘సెంచరీ-నాటౌట్‌’ అనిపించుకోవాలని! ఇందుకోసం మనిషి ఏం చేయడానికైనా వెనకాడడు. అయితే ఇందుకు తిరుగులేని మార్గం ఉంది. అది అందరికీ తెలిసిందే. పాపం చెయ్యడానికి మించిన మా చెడ్డ మార్గం ఇంకొకటి లేదు. ‘పాపీ చిరాయువు’ అన్నారు గానీ పుణ్యవంతుడు చిరంజీవి అని ఎవడూ చెప్పిన ‘పాపాన’ పోలేదు.
పాపి కలకాలం బతుకుతాడని తెలిసినా పాపాలు చేయకుండా ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్టు చేతులు ముడుచుకుంటే జీవితానికి నూరేళ్ల బీమా ఎవరు ఇవ్వగలరు? ధీమా ఇవ్వగలరు? ‘సాధన చేయుమురా నరుడా! సాధ్యము కానిది లేదురా!’ అని ఎలాగూ ఏ లాగు వేసుకున్నవాడో ఎప్పుడో అన్నాడు కదా! అందువల్ల ‘‘పాపము చేయుమురా నరుడా! నూరేళ్లు బతుకుట సాధ్యము రా’’ అనుకుంటూ ఎడాపెడా పాపాలు చేయడమే పని! పాపం చేస్తే తర్వాత పశ్చాత్తాప పడవచ్చు.. పాపం చేయకపోతే ఆ తర్వాత పశ్చాత్తాప పడీ ప్రయోజనం లేదని ఒక కవిపుంగవుడు ఎప్పుడో సెలవిచ్చాడు. పాపాలకు ‘సెలవు’ ఇవ్వవద్దనే ఇందులోని సారాంశం. పుణ్యకార్యాలు చేసిన ఆ కాలంలో చచ్చిన వాళ్లు ఉన్నారు గానీ పాపపు పనులు చేసి తొందరగా చచ్చినవాళ్లు ఎవరూ లేరు. పాపం కూడా మన పంటల్లో ఒకటి. వాడి పాపం ‘పండింది’ అంటారు గానీ, పుణ్యం పండిందని ఎవరూ అనరు.
      మనిషి ఎక్కువకాలం బతకడానికి పాపానికి ప్రత్యామ్నాయం లేదు. పైగా పాపం చేయడమంటే మనమేమీ కొత్తగా చేస్తున్నాం.. ఇంతకు ముందు ఎవరూ చెయ్యలేదు.. ముందు ముందు ఎలా ఉంటుందో ఏమోనని భయమే అక్కర్లేదు. మన మతాలు మనిషికీ పాపాలకు ఉన్న అనుబంధం గురించి ఎప్పుడో చెప్పాయి. ‘మనిషి పుట్టుకతో పాపి’ (మ్యాన్‌ ఈజ్‌ ఏ బోర్న్‌ సిన్నర్‌) అని క్రైస్తవం అంటే, ‘పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవా’ (నేను పాపిని, పాపకర్మలు చేస్తున్నాను. పాపాత్ముణ్ని. పాపం వల్ల పుట్టిన వాణ్ని) అని హిందూమతం చెబుతోంది. అలాంటప్పుడు ఎన్ని పుణ్యాలు చేస్తే మాత్రం పాపాలు పోతాయి? పోవుగాక పోవు. మనిషికి పాపాలకు మించిన స్థిరాస్తులు లేవు. చరాస్తులు లేవు. అందుకేగా అయినదానికీ కానిదానికీ ‘అయ్యో పాపం’ అనుకుంటూ రోజూ పాప నామ స్మరణం చేస్తుంటాం! 
      పుణ్యకార్యాలు చేయడం కష్టమని, పాపాలు చేయడం తేలికని అనుకోవడానికి వీల్లేదు. వాటి ఇబ్బందులు వాటివి.
వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకితగోకులా గ్రజన్మ సంరక్షణ మందు
బొంకవచ్చు అఘము పొందదధిప!

      అబద్ధాలాడితే తేలికగా పాపం పొందవచ్చు. దీనివల్ల ఎక్కువకాలం బతకొచ్చు అని ఆశపడతాం. కానీ ఆడవాళ్ల దగ్గర, పెళ్లిళ్లు, ప్రాణ, విత్త మానభంగం (పరువు నష్టం) లాంటి విషయాల్లో అబద్ధాలు ఆడినా పాపం రాదని చెబితే మనందరం ఏమైపోవాలి? ఈ లెక్కన ఎక్కడెక్కడ పాపం చేయడానికి అవకాశం ఉంటుందో గూగుల్‌లో సెర్చించుకోవాలంటే ఎంత కష్టం! ఏం పాపం ఎంతకాలం చేస్తుందో తెలీదు గానీ కాకి ఎక్కువకాలం బతుకుతుందట! ‘‘కాకి చిరకాలమున్న ఏ కార్యమగును?’’ అని ఎగతాళి చేస్తారుగాని కలకాలం బతకడం కన్నా గొప్ప కార్యం ఏముంటుంది? కార్యక్రమం ఏముంటుంది?
      లోకులు పలుగాకులు అంటారు. కాకుల్లా ఎక్కువకాలం బతికితే అంతకన్నా కావలిసిందేముంది? అంతెందుకు? తద్దినాలప్పుడు పితృదేవతలు కాకుల రూపంలో వస్తారనే కదా నమ్మకం! కాకులకు నమస్కారం కూడా చేస్తారు. ఇది ఆచారాల్లో భాగం. కాకి వాలకపోతే ఏం అపచారం జరిగిందోనని కలవరపడే వాళ్లూ ఉంటారు. ‘పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయెరా?’ అని వేమన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా సంప్రదాయవాదులు లెక్కపెట్టరు. ‘అడుగుజాడ కాకిది’ అనే జనం నమ్ముతారు. కాకి కలలోకి వచ్చి ఆయుర్ధాయ రహస్యం చెప్పినా మనుషులు తుచ తప్పకుండా ఆచరిస్తారు. ఒక పురాణం ఎక్కువైనా కాక పురాణం ఉంటే ఎంత బాగుండేది!
      తాను చేసిన సర్వపాపాలను ప్రక్షాళనం చేసుకోవాలని మనిషి తెగ తాపత్రయ పడిపోతుంటాడు. అంతకన్నా చచ్చు పుచ్చు ఆలోచన ఏమైనా ఉందా? ‘కావాల్సినన్ని పాపాలు చేసి’ గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోకుండా ఇదేంపని? తత్వం ఎవరు చెప్పినా తప్పకుండా వినాలి. ఆచరించాలి. ఉదాహరణకి ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త షేక్‌స్పియర్‌ తన ప్రసిద్ధ రచనల్లో ఒకటైన ‘మేక్‌బెత్‌’ నాటకంలో మెక్‌బెత్‌తో ఏమనిపిస్తాడు? ‘‘ప్రపంచంలోని సముద్రాల్లో నీళ్లన్నీ తెచ్చినా నా చేతులకు అంటిన నెత్తుటి మరకల్ని కడిగేస్తాయా?’’ అని కాదూ! నెత్తుటి మరక అంటడానికి మించిన పాపం ఏముంటుంది? ప్రపంచంలోని నీళ్లన్నీ పాపాల్ని ప్రక్షాళనం చేయలేనప్పుడు పాప ప్రక్షాళనం చేయడానికి జనం ఇంకా ఏం చేస్తేం ఏం ప్రయోజనం! ఇది తెలివిగల వారు చేయాల్సిన ఆలోచనేనా!
      పాపం చేస్తే బోలెడంత సుఖం. పుణ్యం కోసం పాకులాడితే బతికి ఉన్నంత కాలం దుఃఖం తప్ప ఒరిగేదేమీ ఉండదు. తిండి తిప్పలు లేక ఒంటిని శుష్కింపజేసుకుని తపస్సులు చేస్తే దేవుడు కనబడ్డాడా? లేదే! మధ్యలో రంభా ఊర్వశి లాంటి వాళ్లు ప్రత్యక్షమై ‘బావా! గోవా వెళ్దాం రావా’ అన్నట్టు ఓరగంటి చూపులు చూడగానే, డ్యాన్సులు చేయగానే రుషులు కమండలాల్ని పక్కన పారేసి వాళ్ల వెంట వెళ్లి పాపాలు చేశారు. సుఖసంతోషాల్లో మునిగితేలారు. పైగా పాపాత్ములైన వైరభక్తులకు మూడు జన్మల్లోనే మోక్షమిస్తానని, అదే వీరభక్తులకు మరో నాలుగు జన్మలు లేటుగా మోక్షమిస్తానని భగవంతుడే అఫిడవిట్‌ ఇచ్చినప్పుడు పాపాలు చేయడానికి సంకోచించడం ఎందుకు? ‘‘పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను/ నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు’’ అని పాడాడు కదా అన్నమయ్య. చేసిన పాపాలన్నీ పుణ్యాలుగా మారతాయని అంతటి పుణ్యాత్ముడే చెబుతున్నాడు. ఇక పనిగట్టుకుని పుణ్యాలు చేయాల్సిన అవసరమేముంది!   
      అందరూ పాపాలే చేస్తున్నప్పుడు పాపాలు చేయకుండా మడికట్టుకు కూర్చుంటే.. ఏ పాపం చేయని వాడే ముందుగ రాయి విసరాలని సవాల్‌ చేస్తున్నప్పుడు రాయి విసిరిన వాడు ఎక్కడున్నాడు? దేవుడు మోక్షాన్ని ‘పుణ్యానికి’ ఇవ్వడు పాపానికే ఇస్తాడని తేలిన తర్వాత భయం ఎందుకు? పోనీ, పుణ్యానికి పోయిన హరిశ్చంద్రుడికి ఏం మిగిలింది... కాటికాపరి ఉద్యోగం తప్ప! అబద్ధమాడటం పాపమనే కదా ఆయన పంతం పట్టుకుని కూర్చుంది! మరి ఆలిని అమ్మడం అంతకు మించిన పెద్ద పాపం కాదా! ‘‘మునిజన గరిష్ఠా, వశిష్ఠా! ఈ నీ శిష్యుని పాపకర్మంబుల గన్నార జూచుచుండియు..’’ అంటూ చివర్లో ఏడ్చే బదులు ఈ పాపమేదో ముందే చేసుంటే (అబద్ధమాడి ఉంటే) ఆలుబిడ్డలతో హాయిగా ఉండేవాడే కదా!  
      పుణ్యం ఎప్పుడు వస్తుందో? ఎంత వస్తుందో? ఎప్పుడొస్తుందో తెలీదు. కానీ పాపం అలా కాదే తక్షణం ఫలితం ఇస్తుంది. అది సుఖరూపంలో ఉంటుంది. ‘‘పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితం’’ పూర్వజన్మలో చేసిన పాపం జబ్బురూపంలో పీడిస్తుంది? అని మన పెద్దలు పీడిస్తుంటారు. ఈ లెక్కన చూసినా ఈ జన్మలో పాపం చేయడం వల్ల నష్టమేమీ లేదు. గతజన్మలో పాపం చేసి ఉంటే ఈ జన్మలో జబ్బుల నుంచి తప్పించుకోలేం. ఈ జన్మలో చేసే పాపాలకు జబ్బులు గబ్బులు ఉంటే వచ్చే జన్మలోనే కదా వచ్చేది. పైగా వచ్చే జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఉన్నా మానవజన్మ ఎత్తుతామో లేదో. జబ్బులు వస్తే అప్పుడు చూసుకోవచ్చు. అంతోటి దానికి తప్పులేమీ చేయకుండా గప్‌చుప్‌గా ఉండడమంటే ఎంత తప్పు! పాపాలు కూడా అన్నీ మనం తెలిసి చేసినవే కాకపోవచ్చు. ‘తిలా పాపం తలా పిడికెడు’ అంటారు. కాలి కింద చీమ పడి చచ్చినా పాపం వస్తుందని భయపడి చచ్చి కాళ్లు నెత్తిన పెట్టుకుని తిరిగినా ఇలాంటి పాపపు వాటాలు వేటాడకుండా వదులుతాయా? చచ్చి వెళ్లి తిరిగి వచ్చి చెప్పి చచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? ‘నో వన్‌ హాజ్‌ రిటర్న్‌డ్‌ సోఫార్‌’ అనే ప్రసిద్ధ ఇంగ్లీష్‌ ఉక్తి ఎలాగూ ఉంది. అంతెందుకు పాపభీతి అంటారు గానీ పుణ్యభీతి అని ఎవ్వరూ అనరేం. ‘మంచి చెడ్డలంటూ ఏమీ లేవు. అంతా ఆలోచించుకోవడంలోనే ఉంది’ (దేర్‌ ఈజ్‌ నథింగ్‌ గుడ్‌ అండ్‌ బ్యాడ్‌) అని అన్నాడు షేక్‌స్పియర్‌. పాపమనుకుంటే పాపం! తాపం అనుకుంటే తాపం! ‘స్కిన్‌ టూ స్కిన్‌ దేర్‌ ఈజ్‌ నో సిన్‌’ అంటూ విశృంఖల కామానికి మద్దతు పలికేవాళ్లు కూడా మన మధ్యనే ఉంటారు. 
      అర్థం విషయంలోనూ ఎప్పుడూ పాపం చేయలేదనడంలో అర్థం లేదు. అలా అనుకుంటే ఆత్మవంచన. పదవంచన. ఎవరి పంచన ఏం జరుగుతోందో ఎవడు చూశాడు. ధర్మ మార్గాన్ని అనుసరించక పోవడం వల్లే పాపాలు జరుగుతున్నాయనీ అనవచ్చు. ఏది ధర్మం? ఏది అధర్మం? అని చెప్పగలిగిన వాడు ఇప్పటికి పుట్టలేదు. అలాగే ఒక చోట ధర్మమైంది ఇంకొక చోట కాకపోవచ్చు. ఒకప్పుడు ధర్మమైంది ఇంకొకప్పుడు అధర్మం కావచ్చు. అది తేల్చడం కష్టం. కానీ పాపాల దగ్గరికొస్తే అవి కృతయుగం మొదలుకుని ఇప్పటి వికృత యగమైన కలియుగం వరకు ఏమాత్రం మార్పు లేదు. తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలు (నోన్‌ డెవిల్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ అన్‌నోన్‌ గాడెస్‌) అని తెల్లవాడు ఎప్పుడో అన్నాడు. మనమూ ఆ మాటలకు తెల్ల బోకుండా పాప మార్గాన్ని అనుసరిస్తే మేలు. శతాబ్దాలు దాటిపోతూ బతకడం మంచిది.


వెనక్కి ...

మీ అభిప్రాయం