విస్మృత వర్గాల ప్రతినిధి

  • 636 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆమె అణగారిన బతుకుల కడగండ్లను చరిత్ర పుటల్లోకి ఎక్కించారు... సంప్రదాయాల ముసుగులో, దేవుడి పేరిట స్త్రీల మీద సాగుతున్న లైంగిక దోపిడీని వెలుగులోకి తెచ్చారు... నేరస్థజాతుల వారితో దయగా ప్రవర్తించటం ఎలాగో పోలీసులకు నేర్పారు. బహుముఖప్రజ్ఞాశాలి, నిరంతర అధ్యయనశీలి, ప్రముఖ రచయిత్రి, సంఘసంస్కరణవాది... అన్నిటికంటే ముందు మానవతామూర్తి... వకుళాభరణం లలిత. 1937లో ప్రకాశంజిల్లా వెంకంపేటలో జన్మించారావిడ, నెల్లూరు, మద్రాసు, కావలిలలో విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ చరిత్ర పరిశోధనాకారులు వకుళాభరణం రామకృష్ణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను వహిస్తూనే అధ్యాపకురాలిగా పనిచేశారు.
నేరస్థజాతులుగా రాజ్యం ముద్రవేసిన వర్గాల మీద లలిత చేసిన పరిశోధన... ఆయా ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చింది. దీనికోసం ఆవిడ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. అలాగే... ఆచారాలు, సంప్రదాయాల రూపంలో స్త్రీల మీద వ్యవస్థీకృతంగా సాగుతున్న లైంగిక దోపిడీపై సరైన పరిశోధనలను ఎవరూ చేయలేదని లలిత గుర్తించారు. జోగినీ వ్యవస్థ మీద ఓ పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. తెలుగు నాట పడుపు వృత్తిలో మగ్గిపోయే ఎందరో మహిళలను కలిసి వారి స్థితిగతులను అధ్యయనం చేశారు. పెత్తందారులకు బలైన ఆడబాపల మీదా లలిత పరిశోధన చేశారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం నృత్యవిభాగంలో ఏడేళ్లపాటు సందర్శక ఆచార్యులుగా పనిచేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల జానపదకళలు, గిరిజన నృత్యాల మీద విద్యార్థులతో 68 వ్యాసాలను రాయించారు. ఆయా నృత్యాలను స్వయంగా పరిశోధించారు. స్త్రీల సమస్యలపై ‘­ంబ్‌ టు టూంబ్‌’ అనే గ్రంథాన్ని ఆమె రాయాలను కున్నారు. కానీ పూర్తిచేయలేదు. మార్చి 14న ఆవిడ కీర్తిశేషులయ్యారు. 16 పరిశోధనా పత్రాలు, 100కు పైగా వ్యాసాలు రాసి అట్టడుగు వర్గాల వారి కష్టాలను వెలుగులోకి తెచ్చిన లలిత కృషి మాత్రం అజరామరం.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం