స్వరాజ్య పోరాటంలో తెలుగు వెలుగులు

 

  • 181 Views
  • 8Likes
  • Like
  • Article Share

    ఇడమకంటి లక్ష్మీరెడ్డి

  • బెంగళూరు
  • 9342540479
ఇడమకంటి లక్ష్మీరెడ్డి

జాతీయోద్యమ సమరంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో బ్రిటిష్‌ వ్యతిరేకత ప్రధానం కాగా, తెలంగాణలో నిజాం నవాబుపై తెలంగాణ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలవారు చేసిన పోరాటం ప్రధానంగా నిలిచాయి. రెండు ప్రాంతాలనుంచీ ప్రజల్ని జాగృతం చేసేందుకు ఎందరో కవులు తమ కలాలతో పుంఖానుపుంఖాలుగా కవితలు, గేయాలు, పద్యాలు రాశారు.

నదేశానికి వర్తకానికి వచ్చిన ఆంగ్లేయులు 1857కల్లా దేశమంతటినీ, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారి పాలనలో దేశమంతటా ప్రజానీకం అనేక కష్టనష్టాలకు గురయ్యారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కవులు, రచయితలు స్పందించటం పరిపాటి. పారతంత్య్రాన్ని పారదోలేందుకు కవుల కలాలు కాహళాలై జనంలో చైతన్యాన్ని పాదుకొల్పాయి. 1900ల నుంచి మొదలుకొని దాదాపు యాభై ఏళ్లు ఆ చైతన్యం ఉప్పెనలా కొనసాగింది. ఆంగ్లేయుల సామ్రాజ్యవాదాన్ని నిరసించిన తెలుగుకవి వారిని సామ్రాజ్య క్షుధాబాధితుల్‌ అని ఈసడించాడు. ఇదే జాతీయోద్యమ కవిత్వం.
      ఆంగ్లేయుల దాష్టీకానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృష్ణాపత్రిక, జమీన్‌రైతు, ఆంధ్రభాషా సంజీవని, వివేకవర్ధిని, గోల్కొండ, విశాలాంధ్ర మొదలైన పత్రికలు దోహదమయ్యాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఎన్నో సంస్థలు వెలిశాయి.
వీరగంధము దెచ్చినారము...
జాతీయోద్యమంలో భాగంగా వెలువడిన తొలి పద్యాల్లో ఒకటిగా భావించే, భరత ఖండంబు చక్కని పాడియావు... పద్యం భారతదేశాన్ని పాడియావుతో పోల్చింది. ఇంత చిన్నపద్యంలో బ్రిటిష్‌వారి పీడన వర్ణించాడు కవి. ఈ దేశ ప్రజలు లేగదూడలై ఏడుస్తుంటే, తెల్లదొరలు వారి మూతులు బిగించి మరీ పాలు పితుకుతున్నారన్న చమత్కారం ఇందులో ఉంది. 1907లో లాలా లజపతిరాయ్‌ అరెస్టయినప్పుడు చెరసాలల్‌ పృథు చంద్రశాలలెయగున్‌... అన్నాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. లోకమాన్య తిలక్, గోఖలే, గాంధీజీ మొదలైన నాయకుల పిలుపు మేరకు ఎందరో దేశభక్తులు స్వాతంత్య్రోద్యమ యవనికపై ఉదయించారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు, పొట్టి శ్రీరాములు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితర నాయకుల నేతృత్వంలో తెలుగువారు స్వరాజ్య శంఖం పూరించారు. దువ్వూరి సుబ్బమ్మ, గుమ్మడిదల దుర్గాబాయి తదితర మహిళలూ స్వాతంత్య్రోద్యమంలో తమదైన పాత్ర పోషించారు. ఉద్యమంలో పాల్గొనే పురుషులకు స్త్రీలు వీరతిలకం దిద్ది స్వరాజ్య సమరంలో పాల్గొనమనేవారు. త్రిపురనేని రామస్వామి రాసిన వీరగంధము దెచ్చినారము/ వీరుడెవ్వరో తెల్పుడీ/ పూసిపోదుము మెడనువైతుము/ పూలదండలు భక్తితో... పాట ఆ దృశ్యాల్నే కళ్లకుకడుతుంది.
      సహాయ నిరాకరణోద్యమ నేపథ్యంలో 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన ప్రత్యేక కాంగ్రెసు సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు. ఈ సభలోనే పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీజీకి అందించారు. మాగంటి అన్నపూర్ణమ్మ తన ఒంటిమీది బంగారు ఆభరణాల్ని తిలక్‌ స్వరాజ్యనిధికి గాంధీజీకి అందజేశారు. వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో తెలుగువారు ఎందరో పాల్గొన్నారు. జైళ్లపాలయ్యారు. లాఠీ దెబ్బలు రుచిచూశారు. ఆ రోజుల్లో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో మహాత్ముడిది విశిష్ట స్థానం. బాపూజీని అవతార పురుషుడిగా కీర్తించారు తెలుగు కవులు.
కత్తులులేవు, శూలమును గాండివమున్‌
మొదలే హుళక్కి నో
రెత్తి ప్రచండ వాక్పటిమనేనియు జాటడు,
వైరిమీద దం
డెత్తగ సేనలేదు, బలహీనపుకాయము,
కోపతాపముల్‌
బొత్తిగసున్న అట్టి వరమూర్తి మనోబలశాలి,
గాంధి జే
యెత్తి నమస్కరించి స్మరియించుద మెప్డు
స్వరాజ్య సిద్ధికిన్‌.

అని దామరాజు పుండరీకాక్షుడు గాంధీని కీర్తించారు.
కత్తికదల్పలేదు! విశిఖాల విదల్పనులేదు!
గాండివం
బెత్తనులేదు! ఏ క్రియ జయించితివో!
 నరమాంస పారణో
న్మత్తుల? మీ ప్రభావములమానుషముల్‌!
భవదీయ శాంతి సం
పత్తికి దోసిలొగ్గెను ప్రపంచము!! భారత
భాగ్యదేవతా!

      అని జంధ్యాల పాపయ్య గాంధీజీ అహింసా మార్గానికి ప్రపంచమంతా దోసిలొగ్గిందంటారు. ఇక మా కొద్దీ తెల్లదొర తనము అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రచించిన పాట తెలుగునాట ప్రజానీకాన్ని ఉర్రూతలూగించింది. తెల్లదొరల 160ఏళ్ల దౌర్జన్యాల్ని కళ్లకు కడుతూ 160పాదాలుగా సాగే ఈ పాట ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద పాటగా చరిత్రకెక్కింది.
      పలనాడులో దురహంకారంతో ప్రవర్తిస్తున్న ఆంగ్లేయ విధేయులైన ఉద్యోగులపైన ప్రజలు సాంఘిక బహిష్కరణను విధించారు. పుల్లరి కట్టనందువల్ల రైతుల పశువులను పోలీసులు తోలుకుపోతుండగా వారు కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో తిరగబడ్డారు. పోలీసుల కాల్పుల్లో హనుమంతు వీరమరణం పొందాడు.
      తెలుగువారి గుండెలను మండించి పౌరుషాగ్ని జ్వాలలు రగిలించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా మన్నెవిప్లవం లేవనెత్తాడు. రాజు పోరాటాన్ని రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయక ప్రజన్‌/ దోచు పర ప్రభుత్వమ్మును దోచిన రాజుల చిన్నవాడ! అని ప్రశంసిస్తారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య. మద్రాసులో సైమన్‌ కమిషన్‌ను బహిష్కరిస్తూ సాగించిన నిరసన ఉద్యమంలో పోలీసులు గుళ్లవర్షం కురిపించారు. కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అతణ్ని చూసేందుకు వెళ్తున్న టంగుటూరిపై పోలీసులు తుపాకులు ఎత్తారు. అప్పుడు ప్రకాశం ‘దమ్ముంటే కాల్చండి’ అంటూ రొమ్ము చూపించాడు. ఈ ధైర్య సాహసాలే ఆయన్ని ఆంధ్రకేసరిగా నిలిపాయి.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా యెవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా
నీ జాతి నిండు గౌరవము!
అంటూ రాయప్రోలు సుబ్బారావు నినదించారు.
      స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజుల్లో ఎక్కడ మూడు రంగుల జెండా కనిపించినా ఆంగ్లేయులకు యుద్ధరంగంలో శత్రు కేతనంలా కనిపించేది. తలపై ఖద్దరు టోపీ ఎవరు ధరించినా, అది తమ అధికారాన్ని ధిక్కరిస్తున్నట్లుగా బ్రిటిష్‌ ప్రభుత్వం భావించేది. అలాంటివారిపై ఆంగ్లేయులు కఠిన చర్యలు తీసుకొనేవారు. ఒంగోలులో గుడిమెట్ల తిరువెంగళాచార్యులు అనే 14 ఏళ్ల బాలుడు నిషేధిత కరపత్రాలు పంచుతున్నాడన్న నెపంతో పోలీసులు ఆ బాలుణ్ని నడిరోడ్డులో పట్టుకొని తీవ్రంగా కొట్టారు. బందరులో తోట నరసయ్యనాయుడు జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు నరసయ్యను స్పృహ తప్పేటట్లు కొట్టారు. దెబ్బలకు తాళలేక నాయుడు మరణించాడు.
ప్రాణమంటె, అభిమానముంటె మన
ప్రాణములైనన్‌ - బలియొసంగి
జెండా ఎత్తర, జాతికి ముక్తిర
నిండగు శక్తిర, నిల్పర కీర్తి

అంటూ గురజాడ రాఘవశర్మ రచించిన గేయం జాతీయ పతాకం మీద ఆనాటి ప్రజలకు వున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. దేశభక్తి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేలా చేసింది.
కోటి రతనాల వీణ...
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటి ఆగస్టు 15 ప్రవేశించగానే భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ హైదరాబాద్‌ రాజ్యం మాత్రం నిజాం నవాబు ఇనుప సంకెళ్లనుంచి విముక్తి పొందలేదు. ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనం కావాలని ప్రజలు కాంక్షించారు. మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ, పండిట్‌ నరేంద్రజీ, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు మొదలైన నాయకులు నిజాంరాజుకు వ్యతిరేకంగా ఉద్యమించారు. యల్లాప్రగడ సీతాదేవి, సంగెం లక్ష్మీబాయమ్మలాంటి మహిళలు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ప్రజల వ్యతిరేకతను అణచివేయడానికి నిజాం ప్రోద్బలంతో ఖాసీం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు బయలుదేరారు. వీరు తెలంగాణలో ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులు సాయుధపోరాటాన్ని ప్రారంభించారు. పీడనకు వ్యతిరేకంగా ఎందరో కవులు తమ కలాలతో గళాలు వినిపించారు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలోకి దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
అని దాశరథి అంటే...
మన కొంపలార్చిన - మన స్త్రీలను చెరచిన
మన పిల్లలను చంపి - మనల బంధించిన
మానవాథములను- మండలాధీశులను
కండకండగా కోసి కాకులకు వేయాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలే!
అని ప్రజాకవి కాళోజీ గర్జించారు.
      వరంగల్లులో మొగిలయ్య, రామస్వామి సోదరులు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా, వరంగల్లు కోటపై జాతీయ జెండాను ఎగురవేస్తుండగా వెనుకనుంచి రజాకార్లు వెళ్లి మొగిలయ్యను బల్లెంతో పొడిచి, దారుణంగా హత్యచేశారు. ‘భారతమాతకు జై’ అంటూ మొగిలయ్య ప్రాణాలు విడిచాడు. తెలంగాణలో జాతీయజెండా వీరుడుగా మొగిలయ్య ప్రసిద్ధి చెందాడు. దానికి స్పందిస్తూ చందాల రామకవి...
నవాబులకు స్థానంలేదు- యిమ్మంచు అడిగెడిదికలేదు
గానమ్ముగాదిది బాణమ్ము- సంగ్రామమునకు పయనమ్ము
రానిమ్ము దేవుడె కానిమ్ము... బారు ఫిరంగులు మ్రోగినా
బాంబుల వర్షం కురిసినా... ఎత్తిన జెండా దించబోం

అని రాశారు. అలాగే తెలంగాణలో జాతీయాభిమాని షోయబుల్లాఖాన్‌ ‘ఇమ్రోజ్‌’ పత్రికలో రజాకార్ల ఆగడాలను తెగడుతూ వ్యాసాలు రాసేవాడు. ఇది రజ్వీకి కోపకారణమైంది. తన అనుచరులతో కలిసి 1948 ఆగస్టు 21న షోయబుల్లా చేతులు నరికి, కాల్చి చంపేశారు.
      జనగాం తాలూకాలోని కడివెండి గ్రామ నివాసి కొమురయ్య ప్రజాహక్కులు కాపాడటానికి కంకణం కట్టుకున్నాడు. స్థానిక దేశ్‌ముఖ్‌పై తిరగబడ్డాడు. దాంతో దేశముఖ్‌ గూండాలు జరిపిన హత్యాకాండలో కొమరయ్య ప్రాణాలు వదిలాడు. నిజాం సంస్థానంలో శాంతి భద్రతల సంరక్షణకు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ సైనికచర్యకు ఆదేశించాడు. 1948 సెప్టెంబరు 17న నిజాంనవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సుద్దాల హనుమంతు, యాదగిరి, సుంకర మొదలైన కవులు ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించే రచనలు చేశారు.  
      ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలం... స్వాతంత్య్రం. అందుకే...
మాతృదేవి బలిమంటపమందు
యజ్ఞ పశువుగ నిల్చునంతటి భాగ్య
మెవనికి సిద్ధించు నిందరిలోన
నా మహాపురుషుని అరి కాలుదుమ్ము
ప్రజల శిరంబెక్కి భవ్యంబు సేయు!

అంటూ దేశమాత బానిస గొలుసులు తెంచడానికి ముందుకొచ్చిన ప్రతీ వీరుణ్ని స్మరిస్తాడు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి.
      జాతీయోద్యమ కాలంలో తెలుగునేలపై భారతమాత, జాతీయ నాయకులు, మువ్వన్నెల జెండా, ఖద్దరు- రాట్నం, సంఘ సంస్కరణలపై కవిత్వం కోకొల్లలుగా వచ్చింది. స్వతంత్రం వచ్చి డెబ్భై ఏళ్లు కావస్తోంది. అప్పటి తరంలో ప్రతి ఒక్కరినీ కదిలించి, ఉద్యమంలోకి ఉరకలెత్తించింది జాతీయోద్యమ కవిత్వం. అప్పటి సమస్యలు వేరు. ఇప్పుడున్నవి వేరు. అయినా దేశభక్తి మాత్రం ఎప్పటికీ ఉండాల్సిందే. భారతదేశం ఉన్నన్నాళ్లూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది జాతీయోద్యమ కవిత్వం.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం