తెలుగు త‌ల్లికి తేట‌గీతి

  • 44 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మందలపు నటరాజ్‌

  • తెలుగుశాఖ అధ్యక్షులు, డి. జి. వైష్ణవ్ కళాశాల
  • చెన్నై
  • 9840282282
మందలపు నటరాజ్‌

శంకరంబాడి సుందరాచారికి పర్యాయపదంగా నిలిచేది ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతం. అయితే ఇదొక్కటే ఆయన రచన కాదు. ఆయన పదులకొద్దీ పుస్తకాలు రాశారు. ఎన్నో సన్మానాలు అందుకున్నారు. ఆయన జీవిత విశేషాలు...
సుందరాచారి
వాళ్లది వైష్ణవ సంప్రదాయ కుటుంబం. ఆయన తాతగారైన శంకరంబాడి కృష్ణమాచారి తిరుపతి ఉన్నత పాఠశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. దివంగత రాష్ట్రపతి, ప్రముఖ తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు కృష్ణమాచారి శిష్యులే. కృష్ణమాచారి కుమారుడు రాజగోపాలాచారి. ఆయన షోళింగర్, తిరుత్తణి, తిరుపతి, మదనపల్లెల్లో పనిచేస్తూ కోర్టులో డిప్యూటీ నాజంగా పదవీ విరమణ పొందారు. రాజగోపాలాచారి, కమలమ్మ దంపతులకు 1914 ఆగస్టు 10న సుందరాచారి జన్మించారు. రాజగోపాలాచారి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో తిరుగుతుండటంతో సుందరాచారిని అమ్మమ్మ ఇంట్లో ఉంచి చదివించారు. వాళ్లు ఆయనను ఎంతో గారాబంగా చూసుకున్నారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నత పాఠశాలలో సుందరాచారి ప్రాథమిక విద్య కొనసాగింది. మదనపల్లి థియోసాఫికల్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. విద్యార్థి దశలోనేే సంప్రదాయాల్లో హేతుబద్ధంగా లేనివాటిని తిరస్కరించిన వ్యక్తిత్వం ఆయనది. ఈ హేతువాదమే జంధ్యాన్ని తీసి కుక్కమెడలో వేసి ఇంటినుంచి బయటకు వచ్చేలా చేసింది.
ఆత్మాభిమాని 
ఇంటినుంచి బయటకు వచ్చాక ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, చిన్న చిన్న పనులు చేశారు. రైల్వేస్టేషన్‌లో కూలీగా సామాన్లు మోశారు. హోటల్‌ సర్వరుగా వృత్తులు చేపట్టారేగానీ ఇంటికి వెళ్లలేదు. కొన్నాళ్లకు మద్రాసు ఆంధ్రపత్రిక కార్యాలయానికి వెళ్లి, తన పేరు శంకరంబాడి సుందరాచారి, స్వస్థలం తిరుపతి, ఏదైనా ఉద్యోగం ఇప్పించమని సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులును అడిగారు. దానికి ఆయన నీకు తెలుగు వచ్చా అని ప్రశ్నిస్తే,  ‘ఏం మీకు రాదా’ అని ఎదురు ప్రశ్నించిన ధీశాలి శంకరంబాడి. ఇంతవరకూ నేను తెలుగులోనే కదా మాట్లాడింది అని సుందరాచారి నవ్వుతూ అన్నారు. అవాక్కయిన కాశీనాథుని ఆయనకు ఆంధ్రపత్రికలో ప్రూఫ్‌రీడర్‌గా ఉద్యోగం ఇచ్చారు. తర్వాత అదే పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేశారు. ఆంధ్రపత్రికలో ‘కళావని’ శీర్షిక నిర్వహించి పాఠకుల మన్ననలు పొందారు.
      అయితే శంకరంబాడి ఆంధ్రపత్రికలో ఎక్కువ కాలం పనిచేయలేక పోయారు. అనంతరం చిత్తూరులో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా 1939లో నియమితులయ్యారు. తనను ప్రభావితం చేసిన గురువులు పాతాళభేది సుబ్రహ్మణ్యశర్మ, అల్లసాని రామనాథశర్మలను సుందరాచారి భక్తితో నిత్యం స్మరించుకునేవారు. ఉద్యోగంలో కొనసాగుతూ బియ్యే పూర్తి చేసిన తర్వాత పాఠశాల జూనియర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా 1951లో పదోన్నతి పొంది మూడేళ్లు పనిచేశారు. పాఠశాల ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ రోజు హైదరాబాద్‌ నుంచి పాఠశాల డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ టూర్‌ మీద తిరుపతికి వచ్చిన అధికారి సుందరాచారిని ప్యూన్‌గా పొరబడ్డారు. దాంతో మరో పద్దెనిమిదేళ్ల ఉద్యోగ జీవితం మిగిలి ఉండగానే అక్కడికక్కడే ఉద్యోగానికి రాజీనామా చేశారు. లోక్‌సభ తొలి సభాపతి మాడభూషి అనంతశయనం అయ్యంగారు సుందరాచారికి బంధువు. అయినా స్వార్థప్రయోజనాలకు బంధుత్వాన్ని వాడుకోలేదు.
      పాఠశాల ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన ప్రతీవారం కాంచీపురం వెళ్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకునేవారు. శని, ఆదివారాలు రాత్రులు అక్కడే ఏ ఇంటి అరుగుమీదో పడుకుని సోమవారం తిరిగి వెళ్లేవారు. ఓమారు అలానే ఓ ఇంటి అరుగుపై పడుకున్నారు. నిద్రపట్టలేదు. అప్పుడు ఆ ఇంట్లోంచి భార్యాభర్తల వివాదం వినిపించింది. మంచినీళ్ల కోసం తలుపు తట్టి, విషయం కనుక్కున్నారు. వాళ్లు తమ కుమార్తె పెళ్లి విషయమై తర్జనభర్జన పడుతున్నారని తెలుసుకున్నారు. తాను వాళ్లమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, తన తల్లిదండ్రులతో మాట్లాడమన్నారు. తల్లిదండ్రుల ఇష్టంమేరకు వేదమ్మాళ్‌తో 1939లో సుందరాచారి వివాహం జరిగింది. కాని కొంతకాలానికే వేదమ్మాళ్‌కి మతిభ్రమణం కలగడంతో సుందరాచారి విరాగిగా మారారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి దేశాటనం చేస్తూ ఎన్నో గేయాలు, కావ్యాలు రాశారు.
సాహితీ సౌరభాలు
సుందరాచారి చిన్నతనం నుంచే ప్రాచీన, ఆధునిక, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే సాహితీ సృజనకు ఉపక్రమించారు. సుందరభారతం (ఏడు పర్వాలు), సుందరరామాయణం, బుద్ధగీత, ఏకలవ్యుడు, అగ్నిపరీక్ష, అపవాదు (ఇందులో సీతాదేవిపై వచ్చిన అపవాదును చిత్రించారు), బలిదానం, కెరటాలు, శ్రీనివాస శతకం, జపమాల(గేయసంపుటి), సుందర సుధా బిందువులు (భావగీతాలు), పేదకవి (ఫిరదౌసి జీవిత ఇతివృత్తం), శాంతిదూతలు (గాంధీజీ, గౌతమబుద్ధుల జీవితాల్ని బుర్రకథ రూపంలో దృశ్యమానం చేసినవి), నా స్వామి (శ్రీనివాస మకుటంతో రాసిన శతకం) మొదలైన రచనలు చేశారు. ఆయన ఇంకా స్థలపురాణ రచనలు, నాటక సమాజాలకు నాటకాలు కూడా రాశారు. 
      భాగవత కథను తీసుకొని 600 పద్యాలతో ‘సుందర నంద నందనము’ రచించారు. ఆ గ్రంథం వెలుగు చూడలేదు. పోతన భాగవతంలో ఉన్న తత్త్వం తన కావ్యంలో కనిపించలేదన్న అసంతృప్తితో, పోతన మీద ఉన్న అచంచలమైన భక్తి శ్రద్ధలతో తన కావ్యాన్ని తానే చించివేసిన సంఘటన ఆయన నిబద్ధతకు మచ్చుతునక. గాంధీజీ హత్య జరిగినప్పుడు ఆవేదన చెంది ‘బలిదానం’ కావ్యం రాశారు. రవీంద్రుని గీతాంజలిలోని 103 పద్యాలను తెలుగులోకి అనువదించారు. గీతాంజలి అనువాదంలో సుందరాచారి నేర్పుకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ మెచ్చి దాన్ని ప్రచురించే బాధ్యతను తానే తీసుకున్నారు. మూలంలోని భావం చెడకుండా, తెలుగు నుడికారం మేళవించి చేసిన రచన ‘గీతాంజలి’.
తెలుగు తల్లికి మల్లెమాల 
ఏదో సాధించాలనే తపన గల శంకరంబాడి బెంగళూరులోని హిస్‌మాస్టర్స్‌ కంపెనీలో చేరారు. తర్వాత ప్రముఖ నటులు చిత్తూరు ఉప్పలధడియం నాగయ్య ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. 1941లో గాంధీ జీవితం ఆధారంగా ‘మహాత్మాగాంధీ’ డాక్యుమెంటరీ తీసినపుడు ‘పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి/ ఏడు దీవులలోనూ ఏ పారు నీ ఖ్యాతి’ అంటూ రాట్నాన్ని ప్రస్తుతిస్తూ పాటను రాశారు. 1942లో ‘దీనబంధు’ చిత్రంలో పడవ షికారు దృశ్యం కోసం సుందరాచారిని పాట రాయమన్నారు. అప్పుడు రాసిందే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ...’. కారణాంతరాల వల్ల ఈ చిత్రంలోకి ఈ పాటను తీసుకోలేదు. ఇందులో సుందరాచారి నటించారు కూడా. 1940-1950 మధ్య కాలంలో సుందరాచారి సినిమా రంగంలో కొనసాగుతూ ‘బిల్వమంగళ’ వంటి కొన్ని సినిమాలకు మాటలు రాశారు. ఆ సమయంలోనే ఆయన గేయ, సంభాషణల రచయితగా, నటుడిగా, గాయకుడిగా పాత్రలు పోషించారు.
      పద్యకవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. అందులోనూ తేటగీతి అంటే మరీ ఇష్టం. నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలోని ఇమిడిందని చెప్పుకునేవారు. అందుకే సుందరాచారి చాలా రచనలు తేటగీతిలోనే సాగాయి. ఆయన కవితలు విశ్వనాథ, రాయప్రోలు, రాళ్లపల్లి వంటివారి ప్రశంసలు పొందాయి. ‘మా తెలుగు తల్లికి...’ కూడా తేటగీతిలో రాసిందే. ఈ గేయం ఆయన రచనల్లో తలమానికమైంది. తెలుగునేల చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రసరమ్యంగా వర్ణించిన నాలుగు తేటగీతి పద్యాల గేయం. దీనబంధు కోసం రాసిన ఆ పాటను ఆ చిత్రంలో చేర్చకపోవడంతో టంగుటూరి సూర్యకుమారి గ్రామ్‌ఫోను రికార్డు కోసం పాడారు. అప్పటి నుంచి ఈ పాట ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి గ్రామ్‌ఫోన్‌ రికార్డు కంపెనీ గౌరవ పారితోషికంగా 116 రూపాయలు సుందరాచారికి చెల్లించింది.
      1975 ఏప్రిల్‌లో హైదరాబాదులో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభల ప్రారంభోత్సవంలో ఈ గేయం పాడేందుకు లండన్‌ నుంచి సూర్యకుమారిని పిలిపించారు. పాటను శ్రావ్యంగా పాడి ప్రశంసలందుకున్న ఆమె, ‘‘నా పాటకు ఇంతగా ప్రశంసల వర్షం కురిపించినందుకు చాలా సంతోషం. కానీ ఇంతటి గొప్ప పాట రాసిన అచ్చ తెలుగు కవి, అదిగో... జనం మధ్యలో ఇరుక్కుని నలిగిపోతున్నారు. ముందు ఆ మహాకవి గొప్పతనాన్ని గుర్తించి గౌరవిస్తే ఇంకా సంతోషిస్తాను’’ అనగానే జనమంతా ఆయన వైపు తిరిగారు. ఆయనే ఆహార్యంలో సాదాసీదాగా కనిపించే సుందరాచారి. ఈ సభల్లోనే ప్రభుత్వం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ను రాష్ట్రగీతంగా ఎంపిక చేసింది. అంతకుముందు 1953 అక్టోబరులో కర్నూలులో ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవంలోనూ, 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభోత్సవంలోనూ సూర్యకుమారి ఈ గేయాన్ని ప్రార్థనా గీతంగా గానం చేశారు.
      అయితే శంకరంబాడి 60 ఏళ్లు వచ్చే వరకూ, అంటే ‘‘మా తెలుగు తల్లికి...’’ రాష్ట్ర గీతం అయ్యేవరకు ఆయనెవరో చాలా మందికి తెలియదు. ఇక ‘మూడు దిక్కుల మున్నీరులతో, మంచుకొండల మకుట భూషణంతో, కోటి భాగ్యముల కాటపట్టుగా పెట్టని కోటలకు పేరు గాంచినది మా దేశం’ అంటూ భరత మాతకూ వందనం సమర్పించారాయన. 
సత్కారాలు
సుందరాచారిని సుమారు 40 విద్యాలయాలు నగదు పురస్కారాలతో సత్కరించాయి. 1970లో చిత్తూరు రావిలాస సభ జిల్లా కవిగా గుర్తించి సన్మానించింది. ఠాగూర్‌ శతజయంతి ఉత్సవకమిటీ ఆయన రాసిన గీతాంజలి కావ్యాన్ని ప్రచురించి బంగారు ఉంగరం ప్రదానం చేసింది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు గోవిందరాజులు నాయుడు, మానవల్లి రామకృష్ణకవి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మొదలైనవారు ‘ప్రసన్నకవి’ బిరుదుతో శంకరంబాడిని గౌరవించారు. ఆయనకు ‘భావకవి’, ‘అహంభావకవి’, ‘సుందరకవి’ అనే బిరుదులూ ఉన్నాయి. తొలి తెలుగు మహాసభల్లో (1975) అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెలకు రూ.250 గౌరవ వేతనం మంజూరు చేసింది. 
      ఆయన తన సాహిత్యాన్ని ఐదు సంపుటాలుగా వేశారు. అందులో మూడో సంపుటాన్ని తీసుకుని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. మూడో సంపుటంలోని బుద్ధుని జీవితానికి సంబంధించిన అంశాలను, భాషకు సంబంధించిన విశేషాలనూ విని మీ కృషి అనన్య సామాన్యమని మీలాంటివారు నెహ్రూగారిని కలవాలన్నారు సర్వేపల్లి. ‘‘వారికి మన తెలుగు తెలుస్తుందా?’’ అన్న సుందరాచారి ప్రశ్నకు రాధాకృష్ణ ‘‘ఈ సంపుటిని ఇంగ్లిషులోకి అనువదించగలిగితే పుస్తకంగా ముద్రిద్దాం. మీరు ఆ పని చేయగలరా?’’ అన్నారు. చేయగలనన్న సుందరాచారి ఆ రాత్రంతా కూర్చుని దానిని ఇంగ్లిషులోకి అనువదించారు. మర్నాడు రాధాకృష్ణకు ఇవ్వగానే ముద్రణాలయానికి పంపించారు. 48 గంటల్లో పుస్తకాలు సిద్ధమయ్యాయి. నెహ్రూకూడా సుందరాచారి పాండిత్యానికి ముగ్ధులై తన సంతకంతో 500 రూపాయల చెక్కు ఇచ్చారు. చెక్కును నగదు చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్తే, నెహ్రూ సంతకం చూసి ఆశ్చర్యపోయిన బ్యాంకు మేనేజర్‌ ఆయనను అనుమానంగా చూశారు. ప్రధాని కార్యాలయానికి ఫోన్‌చేసి నిర్ధరించుకున్నాక సుందరాచారికి మర్యాదలు చేసి, డబ్బు ఇచ్చి పంపుతూ జ్ఞాపికగా దాచుకోమని చెక్కును కూడా ఇచ్చి పంపారు.
      ఎవరో ఒకరి ధనసహాయంతో పుస్తకాలు వేయించుకొని, చిత్తూరు జిల్లాలోని పాఠశాలలను సందర్శిస్తూ ఆ పద్యాలు చదివి అక్కడి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తన పుస్తకాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించారు. భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదనతో నిర్లిప్త జీవితాన్ని గడిపారు. తిరుపతిలో అధ్యాపకులు మన్నవ భాస్కర నాయుడు ఇంట్లో కొంతకాలం గడిపారు. 63వ ఏట 1977 ఏప్రిల్‌ 8న సుందరాచారి సురలోక సౌందర్యాలను అక్షర శిల్పాలుగా మలిచేందుకు తరలిపోయారు. తమిళనాడు లోని ‘జనని’ సంస్థ శంకరంబాడి సుందరాచారి శతజయంతి ఉత్సవాలను ఈ ఆగస్టు 10న ఢిల్లీలోనూ, తర్వాత చెన్నైలోనూ నిర్వహించనుంది. మరి తెలుగువాళ్లలో ఆ పనిచేసేదెవరు?


వెనక్కి ...

మీ అభిప్రాయం