స్వతంత్రోద్యమ భారతం

 

  • 143 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యామనూరు శ్రీకాంత్‌

  • తెలుగు పండితుడు
  • కడప
  • 9440825890
యామనూరు శ్రీకాంత్‌

పారతంత్య్రాన్ని నిరసించి తెలుగువారిలో స్వాతంత్య్రేచ్ఛను రగుల్కొల్పిన మహాకావ్యం ‘శ్రీశివభారతము’. దాని సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.  వసంత వనాల్లో మామిడి చెట్ల కొమ్మల నుంచి పంచమ స్వరంలో ఆయన చేసిన కావ్య కవితాగానం తెలుగునేలను అలరించింది. అందుకే ‘మహాకావ్యాలు రచించే కాలం అంతరించిపోయిందనుకున్న కాలంలో మహాకావ్యానికి నిలువుటద్దంలా వచ్చిన గ్రంథం ఈ శివభారతం’ అని ప్రశంసించారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
జాతీయోద్యమ కాలంలో తెలుగువారిని ఉత్తేజ పరిచేందుకు శివాజీ సౌశీల్యం ఆధారంగా గడియారం రచించిన ప్రబంధం ఇది. శివాజీ జననం నుంచి పట్టాభిషేకం వరకూ వివిధ ఘట్టాల వర్ణన దీని ప్రధానాంశం.
      గడియారం వేంకటశేషశాస్త్రి 1894 ఏప్రిల్‌ 7న కడపజిల్లా నెమళ్లదిన్నెలో జన్మించారు. చదువుకునేందుకు ప్రొద్దుటూరు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. యజుర్వేదం, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. అవధాన విద్యలో ఆరితేరారు. సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యం సంపాదించిన గడియారం సొంతంగా జ్యోతిష, వాస్తుశాస్త్రాలను అభ్యసించారు. ప్రొద్దుటూరులోని అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూలులో తెలుగు పండితుడిగా జీవితం ఆరంభించారు. దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి అవధానాలు చేశారు. ‘బ్రహ్మనందిని’ సాహితీ సాంస్కృతిక మాసపత్రిక సంపాదకులుగా పనిచేశారు. మురారికవి ‘అనర్ఘ రాఘవా’న్ని, గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణాలను తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసము, వాస్తుజంత్రి, మల్లికా మారుతము, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, రఘునాథీయము, వాల్మీకి హృదయా విష్కరణము తదితర గ్రంథాల్ని రచించారు. ఎన్నో పురస్కారాలు, సత్కారాలను అందుకున్న గడియారం... రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసనమండలి సభ్యులుగానూ సేవలు అందించారు. 1980 సెప్టెంబరు 20న  పరమపదించారు.
      సకలకళా కల్పవల్లిగా, విజ్ఞానామృత భాండంగా వర్ధిల్లిన భారతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంలా వెల్లివిరిసింది శ్రీ శివభారతము. ఈ కావ్యం ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. దీనిని 1943లో రచించారు గడియారం. ధర్మసంస్థాపనకు  వీరసంతతి మహా భారతంతోనే అంతరించలేదు... అవిచ్ఛిన్నంగా అలాంటి వీరులు పుడుతూనే ఉన్నారని ఈ కావ్య రచనతో గుర్తుచేశారాయన. తిక్కన కవితాశైలిని అందిపుచ్చుకుని భారత కథకు కొనసాగింపుగా తన రచనకు ‘శ్రీ శివభారతము’ అని పేరు పెట్టారు. ఇది పదిహేడో శతాబ్దంలో మొగలులు, దక్కన్‌ సుల్తానుల పాలననుంచి మహారాష్ట్ర సీమను విముక్తి చేసి ప్రజారంజకంగా పాలించిన మరాఠా వీరుడు శివాజీ కథ.
శివాజీ ఆత్మాభిమానం
ఇందులో శివాజీ బాల్యాన్ని వర్ణిస్తూ... ‘ధీరహృదయంబు, హృదయముల్‌ దెఱుచు చూపు/ పలుకు పొందిక, పొందిక పఱుచు తెలివి...’ అంటూ పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, శివాజీ పుట్టుకతోనే ధీర సంస్కారబలం కలవాడని వర్ణించారు. తండ్రి షాజీభోన్సలే బీజాపూరు రాజ్యపు జాగీర్దారు. అయినా అప్పటి పరిపాలన నచ్చని శివాజీ ‘ఇలాంటి పాపపు కూడు తినన’ని తండ్రితో పలికిన ఆత్మాభిమాని. ఇందులో గోరక్షణ, తుకారాం, రామదాసులను శివాజీ దర్శించడం, భవానీ మాత అనుగ్రహం, జిజియాబాయి పెంపకం, శివాజీ దండయాత్రలు, సాధించిన విజయాలు, పట్టాభిషేకం... ఇలా ప్రతీ సన్నివేశం పఠితకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తాయి. నూనూగు మీసాల వయసులోనే శివాజీ మావళి వీరులను కలుసుకున్న సందర్భాన్ని వర్ణించే ‘మతమున కోర్వరాని యవమానము, జాతికి శిక్ష, దేశ సు/ స్థితికిఁ దుపాను, నీతి కవధరీణ...’ పద్యం అప్పటి స్థితిగతులను సాక్షాత్కరింపజేస్తుంది.
      గాఢాంధకారంలో అలమటించే జనానికి ఏదైనా చేయాలని ఆరాటపడుతున్న సందర్భంలో సమర్థ రామదాసు శివాజీకి కర్తవ్య బోధచేశారు. ఈ ప్రపంచంలో తాను ఎలా మేలుబంతిలా ఉండాలో ఉద్బోధించి కర్తవ్యోన్ముఖుని చేసిన ఈ పద్యం శివాజీనే కాదు ప్రతి భారతీయుణ్నీ ప్రేరేపిస్తుంది.
      శివాజీ బాల్యంలో ఓసారి తన తండ్రితో రాజదర్బారుకు బయలుదేరతాడు. బీజాపురం రాచవీధుల్లో వెళ్తూ ఆవును చంపే అకృత్యాన్ని చూస్తాడు. అప్పుడు ఆ కసాయివాళ్లతో శివాజీ...
ఇదియే ధర్మపథమ్ము? మానవులు గారే?
జాలి లేదయ్యెనే?
మది- మీ కొండొక ముల్లు గ్రుచ్చుకొన
నమ్మాయంచు వా పోదురే
కద! మీ బిడ్డల నెవ్వడైన చెనకంగా
వెదుకుం బోదురే
కద!  యే దిక్కును లేని జంతువనియేగా?
 కత్తులన్‌ దూయుటల్‌

      అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. రాజుకొలువులో షాజీ ముఖ్యమైన వ్యక్తి కావడంతో వాళ్లు ఆవును విడిచిపెడతారు. ఈ వార్త తెలుసుకున్న సుల్తాను ఉదార హృదయంతో శివాజీ చర్యను సమర్థిస్తాడు. ఇక నుంచి తమ రాజ్యంలో గోహత్య చేయరాదనీ, గోమాంసాన్ని అమ్మరాదనీ, అతిక్రమించినవారు శిక్షార్హులని ప్రకటిస్తాడు. ఇది శివాజీ తొలి విజయం.
      శివాజీకి అమ్మ జిజియాబాయిపట్ల ఉన్న భక్తిప్రపత్తులు అపారం. శివాజీ దృష్టిలో స్త్రీ అత్యంత పూజనీయురాలు. శివభారతంలో ఈ విషయాన్నే ప్రస్ఫుటం చేశారు గడియారం. కల్యాణి దుర్గ విజయవార్తను విన్నవిస్తూ ఆ రాణిని పట్టి తెచ్చామంటాడు అబ్బాజీ సోన్‌దేవుడనే సర్దారు. దానికి శివాజీ ‘ఔద్ధత్యమోర్వంజుమీ’ అని గద్దిస్తాడు. ఆమెను చూసి ‘తల్లీ! స్త్రీలను అగౌరవపరిచిన వాళ్లు తమ సంపదలను కోల్పోతారు. వారి జీవితం అస్తవ్యస్తమై పోతుంది. వాళ్ల ధనం నిలుస్తుందా? సీతను చెరపట్టి వంశ నాశనం కొని తెచ్చుకున్న రావణాదుల గురించి తెలిసిందే కదా!...’ అంటూ మా సర్దారు తొందరపడ్డాడు. ఈ దోషానికి నొచ్చుకోవద్దమ్మా అని నమస్కరించి కానుకలిచ్చి ఆమెను సగౌరవంగా సాగనంపుతాడు.
      ఇరవై రెండేళ్ల కృషి ఫలితంగా శివాజీ పట్టాభిషిక్తుడు అయ్యాడు. అతని రాజ్యపాలనా విధానాన్ని వర్ణిస్తూ ‘చిననాడు తొడన్‌ జేర్చుకొని జిజియామాత వినిపించు రాజనీతిని గ్రహించి, తన వెంట నడిపించుకొనుచు దాదాజీ నేర్పిన రాజ్యపాలన విలువ దెలిసి, విజ్ఞాన దృష్టి వివేకించి రామదాస స్వామి యిడు ధర్మసరణి దలచి, ... నాడు నేడును రాబోవునాడు గూడ ఖిలముగాకెట్టి నిపుణుల్‌ఁ గొలువఁ దగిన నవ్య రాజ్యాంగ పరిపాలనా క్రమంబు శివ మహీపతి చతురుడై సిద్ధపఱచె’ అని భారతమాతకు బంగారు కాలం వచ్చిందని వివరిస్తారు.
లలితపద్యాల పోహళింపు
తిక్కనామాత్యుడు తెలుగువారికి సంతోషం కలిగేలా భారతాన్ని కూర్చాడు. శాస్త్రి ‘జగములున్నంత వరకెల్ల జనులు చదివి తనియుదురు గాక’ అన్నారు. ఇతివృత్తం భారత హృదయమే. ధర్మాధర్మ సంఘర్షణం. ‘...నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్‌ పారగుడన్‌...’ అని కవిబ్రహ్మ చెప్పుకున్న లక్షణం శాస్త్రికి సరిగ్గా వర్తిస్తుంది. అలతి అలతి పదాలతో, తెలుగు పలుకుబడులతో లలితంగా పద్యనిర్మాణం సాగించారు. కానీ అవసరమైన పలుచోట్ల ధార సుడులు తిరుగుతుంది. ‘ఉన్నది చేత శస్త్రమదియున్‌ పదనైనది...’ పద్యంలో, శివాజీ ఖానుని చంపేసిన సందర్భంలో ఆయన రచన అనర్ఘం. ‘అదను దప్పిన వీడుపోవునంచు నొకడు, అనువు దప్పిన చెడిపోవునంచు నొకడు, నమ్మికలు లేక బాహుబంధములు దవిలి, నడిచిరి, ఎవడు ముందెట్లు పైబడునొ యంచు’ పద్యమంతటా నాటకీయత దర్శనమిస్తుంది.
      మరాఠాల విముక్తికి భవానీదేవిని ప్రార్థించి ఖడ్గాన్నిపొంది, ఖానుతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు. ఈ సందర్భంలో అతని తల్లి జిజియాబాయి దీవించి కర్తవ్యోన్ముఖుని చేసే ఘట్టానికి సంబంధించిన పద్యాలు కావ్యానికే మకుటాయమానం. జయసింహతో సంధి, ఔరంగజేబు ఆహ్వానం మేరకు ఆగ్రా వెళ్లడం, అక్కడ తనను బంధించగా చాకచక్యంగా తప్పించుకొని రావడం, పట్టాభిషేకం చేసుకుని ప్రజారంజకంగా పాలన సాగించాడని చెప్పిన పద్యాల్లో కవి తన రచనా చతురతని ప్రదర్శించాడు. మొత్తంగా శివభారతం శాంతరసం స్థాయి గంభీర సముద్రంలా ప్రశాంత స్వరూపాన్ని ప్రదర్శించింది. ‘విశ్వశ్రేయః కావ్యం’ సూక్తిని ఈ కావ్యంలో సాక్షాత్కరింపజేశారు కవి.
పదప్రయోగాలు
బహమనీ రాజ్య పరిస్థితులను వివరిస్తూ ‘నిత్యనడుపు లేని నీతి, పెంచని కోతి- మావటీడు లేని మత్తగజము- గరడి లేని సాము, దొరకని రాజ్యంబు- చెడునుగాదె! యొరుల జెఱచుఁ గాదె’ అని పండిత పామర బోధకంగా వివరిస్తారు. రాజు పసివయసులో ఉండి, మంత్రాంగం చేయాల్సిన మంత్రి గతించినప్పుడు సర్దారులు రెచ్చిపోయి చేసే దమనకాండను చెప్పేందుకు ‘రాజ్యము నడివీధిలోని కాపురముగ జేసినాడు’ అన్న ప్రయోగం సందర్భోచితం. లుకజీ మొగలుల పరాక్రమాన్ని గుర్తించి, వాళ్లతో సంధి చేసుకోకపోతే ముప్పు వస్తుందని షాజీతో వివరించే సందర్భంలో ‘పిల్లకాకి యెఱుంగునే వింటి దెబ్బ’ అంటాడు. కానీ మొగలులను నమ్మటం ‘పాము పడగనీడ పడుకొన్నట్లే’ అని షాజీ లుకజీతో చెబుతాడు. ‘తల్లికి నోఁచకున్నఁ చిన తల్లికి నోఁతరి’, ‘ముండ్ల పొదల లేదొ మొగలి పువ్వు’, ‘కన్నది మ్రింగు వర్తనమది సర్పజాతికిఁ గదా! యొక మానవుడిట్లు సేయునే’... ఇలా కావ్యమంతటా జాతీయాలు, లోకోక్తులు ప్రయోగించారు గడియారం వేంకటశేషశాస్త్రి.
  శివభారతం సమకాలీన తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది. తెలుగు సారస్వత సీమలో శాస్త్రిని చిరస్మరణీయుణ్ని చేసింది.                                                                                                                     

 


వెనక్కి ...

మీ అభిప్రాయం