ఏనుగు ముఖం... ఎన్నో కథలు

  • 59 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

తన రచనా సామర్థ్యానికి పదును పెట్టుకోవాలనుకునే ప్రతి రచయితా, రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టాలనుకునే నవతరం... అందరూ మన పురాణాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కథలను నడపడంలో పురాణకర్తల ప్రజ్ఞను పరిశీలించాలి. ఆ పాటవాన్ని ఒడిసిపట్టుకోవాలి. వాస్తవానికి చాలా మంది భారతీయ రచయితలకు పురాణాలు, ఇతిహాసాలూ ఆలంబనగా నిలిచాయి. నిలుస్తూనే ఉంటాయి. 
సృజనాత్మక
సాహిత్యానికి పెట్టుబడి... రచయిత ఊహ. కథ కానివ్వండి, కవిత కానివ్వండి... తీసుకున్న అంశాన్ని ఎంత అందంగా, ఆలోచనాత్మకంగా, కొత్తగా, ప్రభావవంతంగా చెప్పామన్నదే ముఖ్యం. అలాంటి లక్షణాలను పుణికిపుచ్చుకున్న రచనలే కాలపరీక్షకు నిలబడతాయి. తరాలు గడిచినా తరగని సాహితీ విలువలతో చదువరుల మనసులను దోచుకుంటాయి. భారతీయ పురాణాలు ఆ కోవలోనివే. అందుకే వేల సంవత్సరాలు గడిచినా సజీవంగా ఉన్నాయి. ఇంకా ఉంటాయి. వాటి సృష్టికర్తల ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న దేవదేవుల జన్మ వృత్తాంతాలను పరిశీలిస్తే, మానవ ఊహకు ఆకాశమే హద్దని అర్థమవుతుంది. ఆ వృత్తాంతాలే కాదు పురాణ కథలన్నింటిలోనూ సృజనాత్మకత పరవళ్లు తొక్కుతుంటుంది. కావాలంటే, పురాణాల్లో వినాయకుడి జనన వృత్తాంతం విషయాన్నే తీసుకుంటే... ఒకే రూపాన్ని అనేక కోణాల్లో చూపిస్తాడు పురాణ కర్త. అదే మట్టి రూపం... అదే పార్వతి... అదే శివుడు... కథల అల్లికలోనే ఒక్కో కథది ఒక్కో తీరు. వాటి దారులు ఏవైనా అన్నింటికీ గమ్యం మాత్రం గణపయ్యనే.
తండ్రిని ఎదిరించినందుకే...
తాను తయారు చేసిన బొమ్మకు పార్వతి ప్రాణ ప్రతిష్ఠ చేయగా వినాయకుడు జన్మించాడు. ఆయనకు ఏనుగు తల వచ్చేందుకు కారణమైన వివిధ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో మనందరికీ తెలిసిందీ, వినాయక వ్రతంలో చదివేదీ గౌరీపుత్రుడని పురాణంలో చెప్పిన గణపతి కథ. ఇతని విశ్వరూపం రకరకాల పురాణాల్లో దర్శించవచ్చు. గజాసురుడనే రాక్షసుడు గొప్ప శివభక్తుడు. శివుడు ఎంతటి బోళాశంకరుడంటే గజాసురుడు కోరగానే అతడి కడుపులో చేరిపోయాడు. కడుపులో శివుడున్నంత కాలం గజాసురుడికి చావు లేదన్న మాట. అప్పుడు పార్వతీమాత మహావిష్ణువును పిలిచి శివుణ్ని చెర నుంచి తప్పించమని కోరుతుంది. విష్ణువు సహచరులతో గంగిరెద్దుల వాని వేషంలో వెళ్లి గజాసురుని ఆటపాటలతో మెప్పిస్తాడు. ఆనందించిన గజాసురుడు ఏం కావాలో కోరుకొమ్మంటాడు. విష్ణువు సాంబశివుని కోరుకుంటాడు. గజాసురునికి తన మరణం సమీపించిందని అర్థమైపోతుంది. చివరి కోరికగా తన శిరస్సు లోకపూజ్యం కావాలంటాడు.
      కైలాసంలో పార్వతి స్నానం చేయబోతూ తాను వంటికి పెట్టుకున్న నలుగు పిండితో శిశువును చేసి, ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలా పెడుతుంది. అప్పుడు శివుడు త్రిశూలానికి గజాసురుని తలను తగిలించుకొని ఇంటికి వస్తాడు. గుమ్మంలో బాలుడు అడ్డుకుంటాడు. కోపం వచ్చి బాలుని తల నరికి లోపలికి వెడతాడు. ఆ విషయం తెలిసిన పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అప్పుడు శివుడు తన శూలానికి గుచ్చి తెచ్చిన గజాసురుని తలను బాలుని మొండేనికి అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. ఆ బాలుని గణపతిగా నియమించి మహావిష్ణువు ఇచ్చిన వరాన్ని నిజం చేస్తాడు. ఈ కథ సామాన్యంగా మన ఇళ్లలో జరిగే కథలా కనిపించి బహుళ ప్రచారం పొందింది. 
పార్వతి విసిరేస్తే...
పద్మపురాణం ప్రకారం పార్వతి ఒక మారు కాలక్షేపానికి బొమ్మలాటలు ఆడుకొంటోంది. అప్పుడు సున్నిపిండితో ఏనుగు ముఖం గల పురుషాకృతి నొకదాన్ని చేసింది. కాసేపు ఆడుకొన్న తరువాత దానిని గంగలో విసిరివేసింది. అక్కడది అద్భుతాకా రంతో పెరగసాగింది. పార్వతి, గంగ అతన్ని తమ కుమారుడిగా పెంచుకున్నారు. 
వివాహానికి ముందే...
శివరహస్యంలో మరో రకంగా ఉంది. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం పార్వతి తపస్సు చేసింది. చివరికి అతని సమ్మతిని పొందింది. ఇంటికి వచ్చి వివాహానికి సిద్ధపడుతుంది. అక్కడ పర్వత స్త్రీలు పార్వతికి అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. పార్వతి తపస్సు చేసేటప్పుడు దేహానికి అంటుకున్న మురికిని తీసి ఉండగా చేశారు. పార్వతి వారిని చూసి చిన్నగా నవ్వుతూ ఆ ముద్దను గజముఖాకారంగా మార్చింది. దానిని వివిధ రకాల ఆభరణాలతో అలంకరించింది. జలధారతో ప్రోక్షించి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. చూస్తుండగానే ఆకారం ప్రాణాలతో బాలుడి రూపంలో నిలబడింది. గిరిజ ఆ బాలుని చూచి ‘గజముఖా! నీవు నా పుత్రుడవై, సకల విఘ్న నివారకుడవై, సర్వ పూజ్యుడివి అవుతావు’ అని దీవించింది. అలా పార్వతికి వివాహ పూర్వమే గణపతి జన్మించినట్లు ఉంది. 
కిట్టయ్య వరం
బ్రహ్మవైవర్త పురాణం గణపతి ఖండంలో గణపయ్య కృష్ణుని అంశతో జన్మించినట్లుంది. పార్వతి సంతానప్రాప్తి కోసం పుణ్యకవ్రతం చేస్తుంది. శ్రీకృష్ణుడు గోపకిశోరుని రూపంలో కనిపిస్తాడు. పార్వతి అటువంటి కుమారుడే కావాలని కోరుకొంటుంది. ఆమె శివుడితో ఉండగా విష్ణువు మాయారూపంలో వచ్చి ద్వారం దగ్గర నిలబడి భిక్ష అడిగాడు. శివుడు మధ్యలో లేచి, వచ్చిన వానికి అతిథి సత్కారాలు చేసి పంపాడు. తరువాత లోపలికి వెళ్లి చూస్తే... కృష్ణపరమాత్మే శిశువు రూపంలో కనిపించాడు. బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆ బాలుణ్ని ఆశీర్వదించారు. తన దృష్టి సోకితే ఆ బాలునికి హాని జరుగుతుందన్న సంకోచంతో, శనీశ్వరుడు మాత్రం బాలునివైపు కూడా చూడలేదు. పార్వతీమాత బలవంతం మీద చివరికి ఆ బాలుని చూశాడు శని. అంతే, ఆ బిడ్డ తల పగిలిపోయిందట. జరిగిందానికి దేవతలు చాలా బాధపడ్డారు. అప్పుడు విష్ణువు పుష్పభద్రానదీ తీరాన ఒక గున్న ఏనుగు తల తెచ్చి అతికించి బతికించాడు.
దేవేంద్రుని కోసం...
ఇదీ స్కాంద పురాణంలోని నాగర ఖండంలోని ఓ విచిత్ర కథ. పూర్వం మానవులు తీవ్ర తపస్సులు చేసి స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్లేవారట. దేవేంద్రుడు భయకంపితుడై కైలాసానికి వెళ్లి మహాశివునికి విన్నవించుకున్నాడు. శివుడు పార్వతి ముఖం చూశాడు. ఆమె తన శరీరాన్ని అప్రయత్నంగా నలిపి మురికిని తీసింది. ఆ ముద్దతో ఏనుగు తల, నాలుగు చేతులు, పెద్ద బొజ్జ గల ఆకారాన్ని సృష్టించింది. అలా జన్మించిన గజాననుని చూసి ‘నువ్వు భూలోకానికి వెళ్లి, మానవుల శుభకర్మలకు విఘ్నం కలిగించు’ అని ఆదేశించింది. అంతే! అతడు నంది, మహాకాలుడు, మిగిలిన ప్రమథగణాలతో బయలుదేరాడు. శివుడు గండ్ర గొడ్డలి, పార్వతి మోదక పాత్ర ఇచ్చారు. కార్తికేయుడు ఎలుకను వాహనంగా ఇచ్చాడు. బ్రహ్మ త్రికాల జ్ఞానశక్తిని, విష్ణువు బుద్ధిని, ఇంద్రుడు సౌభాగ్యాన్ని, కుబేరుడు ఐశ్వర్యాన్ని, సూర్యుడు ప్రతాపాన్ని, చంద్రుడు కాంతిని ఇచ్చారు. అలా వరాలు పొందిన గణపతి స్వర్గ మోక్షాల్ని ఆశించే మానవులకు విఘ్నాలు కలిగించడం మొదలుపెట్టాడు. అందుకనే సత్ఫలాపేక్షగల వారు శుభకార్యాలకు ముందు విఘ్నరాజును అర్చించడం మొదలుపెట్టారు.
రాక్షస సంహారమే లక్ష్యం!
లింగపురాణంలో గణేశుని జననం రాక్షసుల కోసమని ఉంది. వాళ్లు యజ్ఞయాగాదులతో, తపస్సుతో త్రిమూర్తులను మెప్పించి వరాలు పొందుతున్నారు. ఆ వరాలతో దేవతలను పీడిస్తున్నారు. దేవతలంతా శివుణ్ని ప్రార్థించారు. శివుని కోరిక మేరకు పార్వతీదేవి త్రిశూల పాశాలను ధరించిన గజవదనుడైన కుమారునికి జన్మనిచ్చింది.
శివుడికీ అసూయ!!
వరాహ పురాణంలో మరో కథ చెబుతారు. శివుడు పార్వతీదేవి ముఖం చూశాడు. అప్పుడు శివుడికి భూమి, నీరు, గాలి, తేజస్సులకు ఆకారాలుండగా ఆకాశం ఒక్కటే రూపరహితంగా ఉండటం విచిత్రంగా అనిపించింది. పృథివ్యాపస్తేజోవాయువుల సమ్మేళనంతో గణపతి అవతరిస్తాడని బ్రహ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు. ఆ నవ్వులో నుంచి అమిత తేజోవంతుడు, రెండో రుద్రునిలా వెలిగి పోతున్న కొడుకు రూపం దాల్చాడు. దేవతలను మోహింపజేసే ఆ బాలుని అందాన్ని రెప్పవాల్చకుండా చూసింది పార్వతి. తనను కూడా మరిచి జగన్మాత బిడ్డవంకే చూస్తుండటంతో శివుడికి కోపం వచ్చింది. దాంతో ఆ రూపాన్ని ఏనుగు తల, బాన కడుపుతో ఉండమని శపించాడు. తన దేహాన్ని విదిలించే సరికి ఆ స్వేద బిందువుల నుంచి ఎన్నో వినాయక రూపాలు వివిధ రంగుల్లో పుట్టాయి. బ్రహ్మదేవుడు వచ్చి తొలి వినాయకుడిని మిగతా వారికి నాయకుణ్ని చేసి, అగ్ర పూజా గౌరవాన్ని అనుగ్రహించాడు.
      ఇవన్నీ గణపతి పుట్టుకకు కారణాలైన వివిధ పౌరాణిక గాథలు. అన్నింటిలో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. అది మట్టి. అందులోనూ మురికి మట్టి. అది కూడా మనిషి వంటి నుంచి పుట్టిన మురికి. ఆ మురికి నుంచి పుట్టిన ప్రాణుల్ని స్వేదజాలంటారు. వాటిని నీటిలో నిమజ్జనం చేయాలి. అది అభ్యంగన స్నానానికి ప్రతీక. ప్రతి శుభకార్యానికీ ముందు తలంటు పోసుకోవాలని రహస్యార్థం. దాంతోపాటు ఓషధులు కూడా వాడాలని దాని తాత్పర్యం. చెమటలో పుట్టే జీవుల ఆకారం గణపతికీ, ఎలుక ఆ ఆకారపు సూక్ష్మతకూ చిహ్నాలు. దేహ మలినాల వల్ల ఏర్పడే చిరాకులకు విఘ్నాలు ప్రతిరూపాలు. ఈ చిన్న అంశాన్ని తెలియజెప్పడానికి పురాణాలు ఇన్ని కథలు అల్లాయి!! ఆ అల్లికలో ఎన్ని చిత్రాలో!


వెనక్కి ...

మీ అభిప్రాయం