సురాజ్యమా... నీవెక్కడ?

  • 60 Views
  • 2Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

రాజకీయానికి రౌడీయిజం పెట్టే నెత్తుటి నైవేద్యం... అధికారం! రౌడీయిజానికి రాజకీయం ఇచ్చే బహుమానం... అమాయక జనం! అవిభక్త కవలలు ఆడే ఈ కత్తుల కోలాటంలో ప్రజాస్వామ్యం పగటికలవుతుంది. స్వతంత్ర భారతి దివ్య చరిత్రలో చాలాసార్లు అయింది కూడా! నేతల్లో పదవీ కాంక్ష బుసలు కొట్టినప్పుడల్లా తెలుగు నేల రక్తంతో తడిసింది. ఒకచోట ముఠాకక్షలు, మరోచోట మతఘర్షణలు, ఇంకోచోట కులాల కొట్లాటలు... అన్నింటినీ ఎగదోసింది మాత్రం నాయకులే. ఇలాంటి వారి చేతలను దునుమాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి సంధించిన అక్షర శరం ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ’. ఇరవై ఏళ్ల కిందటి ‘గాయం’ చిత్రంలోని ఈ గీతం ఇప్పటికీ సమకాలీనమే.
సర్వసత్తాక,
సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం... అదే స్వతంత్ర భారతదేశం. ఆరు దశాబ్దాలైంది మనం ఈ మాటలు చెప్పుకుని! రాజ్యాంగంలో రాసుకుని! మరి వాటిలో ఎన్ని ఆచరణలో కనిపిస్తున్నాయి? సామ్యవాదం సంగతి దేవుడెరుగు... పేదలకు పూట తిండి కరవైంది. ప్రజాస్వామ్యమేమో పెద్దలకు పరమాన్నమయింది. మిగిలినవీ అంతే! రాజ్యాంగ పుటల్లో తప్ప  రాజ్య సరిహద్దుల్లోపల కనిపించని ఈ మాటలతో నిజాలకు ఎన్నాళ్లు ముసుగేస్తారు? ఎన్నేళ్లు మాయ చేస్తారు? మనిషి మనిషిగా బతికే స్వేచ్ఛలేనప్పుడు, ఒక మనిషి వికృత కోరికకు మరో మనిషి ఆటబొమ్మ అవుతున్నప్పుడు, మానవత్వపు విలువలకు తిలోదకాలిచ్చి... సంకుచితత్వం, స్వార్థాలనే వలువలు ధరించి నాయకత్వం స్వైరవిహారం చేస్తున్నప్పుడు స్వరాజ్యానికి అర్థమేంటి? పంద్రాగస్టుకు పరమార్థమేంటి? కవి హృదయాన్ని కల్లోల పరచిన ఈ ప్రశ్నల్లోంచే ఆ పాట పురుడుపోసుకుంది. సమాజంలో విషం చిమ్ముతున్న ఖద్దరు పాముల కోరలపై గురిచూసి కొట్టింది. అందుకే, నంది బహుమతితో పాటు అశేష ప్రజానీకం మన్ననలనూ అందుకుంది. 
ఎనభై, తొంభై దశకాల్లో తెలుగు నేలపై రౌడీయిజం రాజ్యం చేసింది. రావణకాష్టాలను ఎగదోసింది. ఆ మంటల్లో రాజకీయం చలి కాచుకుంది. పొద్దున్నే పత్రికలు తిరిగేస్తే చాలు హత్యలు, మానభంగాలు, ముఠాతగాదాలు, నడిరోడ్డుపై కుమ్ములాటల వార్తలే! ఒకరిని చూసి మరొకరు... ఒకరి ఆధిపత్యాన్ని పడగొట్టడానికి మరొకరు కత్తిపట్టిన కాలమది. రౌడీమూకలకు మద్దతుగా నిలుస్తూ, మళ్లీ ఆ మూకల భుజబలంతోనే ప్రజాస్వామ్యం పీకపై కాలుపెట్టిన ధూర్త నాయకులు చెలరేగిపోయిన సమయమది. ఆనాటి  హింసాత్మక రాజకీయాలకు 1993లో వెండితెర రూపమిచ్చారు రాంగోపాల్‌వర్మ. అదే ‘గాయం’. దుర్గ, గురునారాయణల మధ్య ఆ చిత్రంలో సాగే పోరాటం సమకాలీన సమాజ స్థితిగతులను కళ్లకు కడుతుంది. 
      చిత్ర కథ ముదురు పాకానపడిన వేళ, తప్పుడు కేసులో ఇరుక్కుని జైలు పాలవుతాడు దుర్గ. అదే అదనుగా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపడానికి గురునారాయణ కుయుక్తులకు దిగుతాడు. అప్పుడు అనుచరుడితో అతను పలికిన సంభాషణ... ఆనాడు అధికారం కోసం వెంపర్లాడిన కొందరు మహానేతల మనస్తత్వానికి ప్రతిబింబం. ఆ మాటలేంటంటే...
      గురునారాయణ: ఊళ్లో ఏం గొడవలవుతున్నయ్‌ రా?
      అనుచరుడు: ఏముంది! బాబ్రీ మసీదు, మండల్‌ కమిషన్‌
      గురునారాయణ: ఛల్‌... అవైతే పాతవే అన్నట్టు! కొత్తగా ఏదైనా షురూ జేయాల. ఆ...! అన్ని గొడవల్ల బత్తిపెడదం. ఏది ఫైర్‌ అయితే దాన్ని డెవలప్‌ చేద్దాం.
      అన్నట్లుగానే, మతకల్లోలాల నుంచి వీధి గొడవల వరకూ అన్నీ రాజేస్తారు. వీళ్ల రాజకీయం అర్థం చేసుకోలేని జనం కొట్టుకు చస్తారు. వారిని అదుపు చేయడానికి పోలీసు కాల్పులు... వెరసి నడిరోడ్డుపై శవాల గుట్టలు! తుపాను వెలసిన తర్వాత, అది మిగిల్చిన బీభత్సాన్ని చూడటానికి వస్తుంది పత్రికా విలేకరి అయిన కథనాయిక. కారులోంచి అడుగు బయటపెట్టగానే కాలికి తగులుతున్న కళేబరాలను చూసి ఆమె మనసు విరిగిపోతుంది. ఒక కంటిలో కట్టలు తెంచుకున్న ఆవేశం, మరో కంటిలో ఏమీ చేయలేని నిస్సహాయత కనబడతుండగా ఆమె ఆ మృతదేహాల మధ్య తిరుగుతుంటుంది. ఆ నేపథ్యంలోనే పాట (బ్యాక్‌గ్రౌండ్‌లో) మొదలవుతుంది. 
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వవిజయాల విభవం
కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువున ఈ వికృత గాయం

      మంచి, మానవత్వాలకు నెలవుగా ఎదగలేనప్పుడు దేశానికి స్వాత్రంత్య్రం వచ్చినా ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు సీతారామశాస్త్రి. అంతేకదా! తెల్లవాడి అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తి గెలిచింది... నల్లవాడి దౌర్జన్యానికి బలవడానికా? విషాదం ఏంటంటే, రెండు దశాబ్దాల కిందట సీతారామశాస్త్రి అడిగిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ‘సురాజ్యం కోసం పోరాడదాం’ అని మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ పిలుపునివ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణమదే. మరోవైపు... సమాజంలో శాంతి కరవైనప్పుడు ఎంత అభివృద్ధి సాధించినా ఫలితం ఉండదు. సీతారామశాస్త్రి ఇక్కడ ‘సుఖం’ అని చెప్పింది ఆ ‘శాంతి’ గురించే. సమాజం అశాంతికి పర్యాయపదమైనప్పుడు సగటు మనిషి బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఆ వాతావరణంలో సత్యానికి స్థానముండదు. సత్యం లేని సమాజం మనుగడ గాలిలో దీపమవుతుంది. ఈ పరిస్థితి చూసి మువ్వన్నెల పతాకం  (భరత మాత) విచలిత అవుతోందని అంటున్నారు కవి.
స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి రాజకీయ నాయకులు ఏ మాటలైనా చెబుతారు. ఎన్ని అబద్ధాలనైనా ప్రచారంలోకి తెస్తారు. కల్లబొల్లి ఏడుపులతో జనాన్ని రెచ్చగొడతారు. వారి మాటల మాయలో పడి ఆవేశానికి లోనయ్యామో పరిస్థితి చేజారిపోతుంది. మనసు ఆవేశపడితే మెదడు మొద్దుబారుతుంది. బస్సుల అద్దాలు పగలగొట్టడం, పెట్రోలు పోసి తగలబెట్టడం లాంటివన్నీ ఆ క్షణికావేశం ఫలితమే. ఇలా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే జనమున్నంత కాలం... సమాజం కత్తి కొనల మీద    కాలం వెళ్లదీస్తున్నట్లే. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితుల్లో శాంతివచనాలు చెవికెక్కవు. దేశ భవిష్యత్తుకు ఆసరాగా నిలబడాల్సిన యువత... స్వార్థ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తితే అభివృద్ధికి ఆరడుగుల నేలే మిగులుతుంది. ‘భస్మాసుర హస్తం’ అని ప్రయోగించడంలో అర్థం... తమను తామే నాశనం చేసుకోవడం. అల్లరిమూకల ఆవేశాల వల్ల దేశానికి అప్రతిష్ఠ వస్తోంది. దాన్ని చూసి జాతి యావత్తూ సిగ్గుపడుతోంది. జెండా తలదించిందంటే అర్థమిదే. 
      కులమతాల పేరిట కొట్టుకుచావడం వల్ల దేశ గౌరవం మంటగలుస్తోంది. జాతి ఔన్నత్యాన్ని హిమాలయాలతో పోల్చు కోవడం మనకు అలవాటు కదా. ఈ కొట్లాటల వల్ల ఆ ఔన్నత్యం వల్లకాడుపాలవుతోందన్నది కవి ఆవేదన. మనసును సముద్రంతో సరిపోల్చుకోవడమూ మన పద్ధతే. మనలో మనం ఇలా గొడవలు పడటంవల్ల ఆ మనసులు విరిగిపోతున్నాయని తర్వాత వాక్యంలో చెప్పారు. ఇక్కడ శ్లేష కూడా ఉంది. సమాజంలోని అల్లకల్లోల పరిస్థితులు... మంచుశిఖరాలను కరిగించేంత, హిందూ మహాసముద్రాన్ని మరిగించేంత తీవ్రస్థాయిలో ఉన్నాయని!
      దేశమంటే మనుషులు. కానీ, రాక్షస రాజకీయాల వల్ల మట్టి మాత్రమే మిగులుతోంది. ఆ నెత్తుటి మట్టిపై అధికారం కోసం నేతలు సాగిస్తున్న మంత్రాంగం... భారతమాతను బలిపీఠంపై నిల బెడుతోంది. వేటు పడేలోపు కాచుకోకపోతే కలల భారతం కన్నీటి సంద్రమవుతుంది. అవధుల్లేని అధికారదాహంతో జాతి నరనరాల్లో విషాన్ని ఎక్కిస్తూ వినోదం చూస్తున్న దుర్రాజకీయాలకు సమాధి కట్టకపోతే సగటు భారతీయుడి జీవితంలో వసంతం దుర్లభమే. 
      ‘ధర్మాన్ని రక్షించడమంటే గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం మాత్రమే కాదు. మసీదులో, చర్చిలో, గురుద్వారాలో ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు. మనం ధర్మం వైపు నిలబడాలి. కబ్జాదారులకి, రౌడీలకి, అవినీతిపరులకు ఓటు వేసి గెలిపించడం ధర్మం అవుతుందా? అవినీతి నాయకులను ఆరాధించడం ధర్మం అవుతుందా? జనం చెడిపోయారు... మంచికి రోజులు కావు అని తిట్టుకుంటూ కూర్చోవడం ధర్మం అవుతుందా? కానేకాదు’.... గతంలో ఓ సందర్భంలో సీతారామశాస్త్రి చెప్పిన మాటలివి. ఎవరికి వారు ధర్మాన్ని పరిరక్షించడానికి నిజమైన ప్రయత్నం చేయాలన్నదే ఆయన తపన. అలా ప్రయత్నం చేసే దిశగా సమూహంలో చైతన్యం రగిల్చే గీతమే ‘సురాజ్యమవలేని’. సురాజ్యం నెలకొనేవరకూ ఈ పాట ప్రజల నోట్లో మార్మోగుతూనే ఉంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం