తెలుగు కోయిల శతవసంత గానం

  • 995 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ

  • ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం,
  • హైదరాబాదు
  • 949018982
డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ

నిజాం పరిపాలనా కాలంలో తెలుగుభాషను చిన్నచూపు చూసిన మాట నిజం. అయితే, ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పిన ఏడాది తిరగకుండానే ఇందులో తెలుగుశాఖనూ ఏర్పాటుచేశారు. ఈ విభాగం అనతి కాలంలోనే శాఖోపశాఖలుగా విస్తరించింది. మహావృక్షమై ఎదిగింది. ప్రాచీన సాహిత్య పరిమళాలు వెదజల్లి, ఆధునిక సాహిత్య చైతన్య వీచికలకు నెలవై, జానపద పవనాలను పరిచయం చేసింది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఓ ప్రధాన పాయ అయిన భావకవిత్వోద్యమానికి మార్గం వేసిన రాయప్రోలు సుబ్బారావు తొలి అధిపతిగా ఉస్మానియా తెలుగుశాఖ ఆరంభమైంది. ఆయన తర్వాత ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వేంకటావధాని, బిరుదురాజు రామరాజు, కోవూరు గోపాలకృష్ణారావు, నాయని కృష్ణకుమారి, మడుపు కులశేఖరరావు, అమరేశం రాజేశ్వరశర్మ, వేటూరి ఆనందమూర్తి,  ఎస్వీ రామారావు, వి.సీతాకల్యాణి, ఎన్‌.గోపి, ఎల్లూరి శివారెడ్డి, ఎల్దండ రఘుమన్న, కసిరెడ్డి వెంకటరెడ్డి,  పి.సుమతీ నరేంద్ర, కె.కుసుమారెడ్డి, టి.కిషన్‌రెడ్డి, ననుమాసస్వామి,     మసన చెన్నప్ప, వెలిదండ నిత్యానందరావు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. వీళ్లతో పాటు నాకూ ఈ గౌరవం దక్కింది.
      ఆరంభంలో ఇంటర్మీడియట్‌, పట్టభద్ర స్థాయిలో మాత్రమే తెలుగు ద్వితీయ భాషగానూ, ఐచ్ఛికాంశంగానూ బోధించేవారు. స్నాతకోత్తర స్థాయిలో తెలుగు బోధన 1939లో ప్రారంభమైంది. తొలిదశలో భాషా, సాహిత్యాల బోధనకు మాత్రమే పరిమితమైన తెలుగు విభాగంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గదర్శకత్వంలో 1952-53 నుంచి పరిశోధనకు శ్రీకారం చుట్టారు. 
      ఆచార్య ఖండవల్లి ‘తెలుగు శాఖ ద్వితీయాధ్యక్షులైనా అద్వితీయాధ్యక్షులు’గా ప్రశంసలు పొందారు. ఆయన హయాంలో తెలుగు విభాగం అనూహ్య స్థాయిలో విస్తరించింది. తెలుగు ద్వితీయ భాషగా డిగ్రీ స్థాయిలో ఆదరణ పొందింది. ‘మహాభారత సంశోధిత ప్రచురణ’ అనే భారీ పథకం ఆయన ఆధ్వర్యంలోనే ఎనిమిది సంపుటాలుగా వెలుగు చూసింది.
ప్రణాళికాబద్ధమైన పరిశోధన
తెలుగు విభాగంలో పరిశోధన నిర్దిష్ట ప్రణాళికతో సాగింది. తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణానికి అనువుగా భాష, చారిత్రక, సాంస్కృతికాంశాల మీద పరిశోధన జరగాలనే అవసరాన్ని ఇక్కడివారు గుర్తించారు. పరిశోధనాంశాల ఎంపికలో సాహిత్య ప్రక్రియలతోపాటు యుగాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాఙ్నన్నయ యుగం, కవిత్రయ యుగం, శ్రీనాథ యుగం మొదలైన యుగ విభజన ఆధారంగా పరిశోధనలు జరిగాయి. అదే సమయంలో జానపద సాహిత్యం మీద పరిశోధనలూ ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మొదటి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద సాహిత్యంలోనే పరిశోధన చేశారు. ఆ తర్వాత నిర్దిష్ట అంశాలపై పరిశోధనలు చేసిన వారున్నారు. విద్యార్థుల్లో పరిశీలనా దృష్టి పెంపొందించడంలో ఆచార్య లక్ష్మీరంజనం మేలు బాటలు నిర్మించారు. 
      ఆ తర్వాత ఆచార్య దివాకర్ల వేంకటావధాని అధ్యాపకులలో నిరంతర పరిశోధనా దీపం వెలిగించడానికి ‘మెన్‌ ఆఫ్‌ లెటర్స్‌ సిరీస్‌’ ప్రణాళికను ప్రారంభించారు. ఇందులో భాగంగా వేంకటావధాని ‘నన్నయ భట్టారకుడు’, ఆచార్య పి.యశోదారెడ్డి ‘ఎర్రాప్రెగడ’, పల్లా దుర్గయ్య ‘అల్లసాని పెద్దన’ గ్రంథాలు వెలువరించారు. సాధారణంగా విశ్వవిద్యాలయాల పరిశోధనలు ఆ ప్రాంగణ పరిధిలోనే ఉండిపోతాయి. అవి ప్రచురణకు నోచుకోకపోతే పదుగురికి తెలిసే అవకాశం ఉండదనే దృష్టితో రామరాజు విభాగాధిపతిగా ఉన్నప్పుడు ‘విమర్శిని’ పేరుతో పరిశోధనా పత్రిక ప్రారంభించారు. ఆయన హయాంలోనే ‘విశ్వనాథ వాఙ్మయ జీవిత పరిశోధనా కార్యక్రమం’ చేపట్టి 1974లో ‘విశ్వనాథ వాఙ్మయ సూచీ’ గ్రంథం ప్రచురించారు.
ప్రయాణంలో తీపిగుర్తులు
ఉస్మానియా తెలుగు విభాగం పరిధిలో వివిధ కళాశాలల్లో వెయ్యి మంది తెలుగు అధ్యాపకులు ఉన్నారు. ప్రతి ఏటా లక్షకుపైగా విద్యార్థులు తెలుగుభాషా సాహిత్యం అధ్యయనం చేస్తున్నారు. ఉస్మానియా తెలుగు శాఖ కృషిని గుర్తించి ఇండస్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ 2012లో సెప్టెంబరులో అంతర్జాతీయ ఉత్తమ విద్యా పురస్కారం బహూకరించింది. ఉస్మానియా తెలుగు విభాగం ఆచార్యులు విశ్వవిద్యాలయ ఉపకులపతి స్థాయికి ఎదిగారు. ఈ వరసలో తొలి ఆచార్యులు సి.నారాయణరెడ్డి. ఆయన మొదట ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు. నాయని కృష్ణకుమారి, ఎన్‌.గోపి, జీవీ సుబ్రహ్మణ్యం, ఆవుల మంజులత, అనుమాండ్ల భూమయ్య, ఎల్లూరి శివారెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతులుగా పనిచేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నాకూ ఈ అవకాశమిచ్చింది. ఉస్మానియా తెలుగు విభాగంలో చదివిన ఆచార్య రవ్వా శ్రీహరి కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించారు. 
      సి.నారాయణరెడ్డి, పి.యశోదారెడ్డి అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. చలనచిత్ర సంభాషణల రచయిత డా।। పరుచూరి గోపాలకృష్ణ కూడా ఈ సంఘానికి నేతృత్వం వహించారు. ఆయన ఉస్మానియా తెలుగు విభాగం పూర్వ పరిశోధక విద్యార్థి. ప్రస్తుత తెలంగాణ భాషాసంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావుకూ ఈ విభాగంతో అనుబంధం ఉంది.
ఆధునిక సాహితీసేవ
1980ల తర్వాత ఉస్మానియా తెలుగు విభాగం ఆధునిక సాహిత్యం మీద దృష్టి కేంద్రీకరించింది. ఆధునిక కవిత్వం, దృక్పథాలు, వాదాలు, ఉద్యమాలు, ధోరణులు, పత్రికా రంగం, పేరడీలు లాంటి అంశాల మీద విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. సాహిత్య జగత్తులో ప్రముఖ వ్యక్తుల మీద పరిశోధనలను తెలుగు విభాగం మొదటి నుంచీ ప్రోత్సహిస్తూనే వచ్చింది. అక్కిరాజు రమాపతిరావు- మంజుశ్రీ ‘కందుకూరి వీరేశలింగం- సమగ్ర పరిశీలన’, ఎన్‌.గోపి ‘ప్రజాకవి వేమన’ ఇందుకు మంచి ఉదాహ రణలు. సి.నారాయణరెడ్డి పరిశోధన గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదా యములు’... ఆధునిక సాహిత్యం మీద పరిశోధనాసక్తి ఉన్న వారికి మంచి వనరు.
      అయితే వ్యావహారిక భాష కోసం గత శతాబ్ది ఆరంభంలోనే మహోద్యమం నిర్వహించి గిడుగు రామమూర్తి విజయం సాధించినప్పటికీ విశ్వవిద్యాలయం వ్యావహారిక భాషలో సిద్ధాంత గ్రంథాలను ఆమోదించడానికి దాదాపు అర శతాబ్దంపాటు మొరాయించింది. అరసం లాంటి సంస్థల పోరాటం కారణంగా 1977లో వాడుక భాషలో రాసిన సిద్ధాంత గ్రంథాలు కూడా ఆమోదయోగ్యమయ్యాయి. పోరంకి దక్షిణామూర్తి ‘తెలుగు కథానిక -స్వరూప స్వభావాలు’ అనే పరిశోధనతో మొదలైన వ్యావహారిక భాషా ప్రస్థానం ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనా గ్రంథాల రచనలకు ప్రధాన వాహికగా ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం