నీదే ఆలస్యం... మిత్రమా!

  • 150 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యన్‌.కె.నాగేశ్వరరావు

  • పెనుగొండ, పశ్చిమగోదావరి
  • 9346720641

ప్రియ మిత్రుడు మధుకు...
      ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా ఉత్తరాలు రాసుకొని ఎన్నేళ్లయిందో కదా!
      సరిగ్గా పాతికేళ్ల కిందట మనం ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ప్రాంగణంలో బాదం చెట్టు కింద ఒకరికొకరం పరిచయమయ్యాం. ఆ వేళావిశేషమేంటో తెలీదుగానీ, తర్వాత శిక్షణా కాలంలో ఒకే గదిని పంచుకున్నాం. కొద్దిరోజుల్లోనే మన రుచులు, అభిరుచులూ బాగా కలిసిపోయాయి.
      నేను కథలు, కవితలూ రాస్తుంటే, నాకు పోటీగా నువ్వు చెణుకులు రాసేవాడివి. నా రచనలు పాఠకుల్ని ఏడిపిస్తుంటే, నీ రచనలు నవ్వించేవి. పత్రికల్లో నాది కథో, కవితో ఒకటే ప్రచురితమయ్యే అవకాశం ఉంటే, నీవి అదే పత్రికలో పది, పన్నెండు చెణుకులు  నీ పేరుతో ముద్రితమయ్యేవి. అది చూసుకొని నువ్వెంత మురిసిపోయేవాడివో, నేనూ అంతే!
      భానుగుడి సెంటర్లో కబుర్లతో కాలక్షేపం చేస్తూ, మంగీలాల్‌ మిఠాయి దుకాణంలో ప్రత్యేకంగా కాచే తేనీటిని సేవిస్తూ ఎన్ని గంటల్ని అలవోకగా గడిపేసే వాళ్లమో!
      శిక్షణా సంస్థలో తరగతులయ్యాక కాలినడకన సినిమా రోడ్డులోనూ, గుడి వీధిలోనూ గాలిపోసుకుంటూ తిరిగిన తిరుగుళ్లు ఎలా మరచిపోగలం.
      కల్పనా థియేటర్‌లో చూసిన ‘మయూరి’ సినిమా మనలో స్ఫూర్తిని నింపితే, శిక్షణానంతరం పరీక్షల కోసం దీక్షగా చదివిన చదువుకు ఫలితంగా ఇద్దరం ప్రథమశ్రేణిని సాధించి ‘రోజూ సినిమా చూసే వీళ్లేనా?’ అని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాం.
      నేను వండే పెసరపప్పూ- టమాటా కూరని బ్రహ్మాండం అంటూ నువ్వు మెచ్చుకుంటూ నాక్కూడా మిగల్చకుండా  తినేయడం వంటి చిలిపి చేష్టలు గుర్తుకొస్తుంటే అప్పుడప్పుడూ నవ్వొస్తుంది. 
      ఒక శుక్రవారం దుకాణాలవాళ్లు దిష్టితీసి రోడ్డుమీదకు గిరాటేసే నిమ్మకాయల్ని శ్రద్ధగా ఏరుకొచ్చి, గదిలో వాటిని కోసి నిమ్మనీళ్లుగా.. నాచేత, మన గదికొచ్చిన మిగతా మిత్రుల చేత తాగించావ్‌. తర్వాత అసలు సంగతిని అతి నెమ్మదిగా చెప్పి మాలో కొందర్ని నవ్వించి, కొందర్ని ఏడిపించిన ఆ సన్నివేశాన్ని ఎన్నిసార్లు తలచుకొన్నానో... ఎంతమందికి చెప్పుకున్నానో...
      ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ, జీవితంలో స్థిరపడ్డాక కాకినాడలోని అప్పటి శిక్షణాకేంద్రం ప్రాంగణంలోనే 150మంది పాతమిత్రులనూ నువ్వొక్కడివే కాలికి బలపం కట్టుకున్నట్లు తిరిగి ‘పాతమిత్రుల కలయిక ఉత్సవం’ అంటూ జరిపించావు. ఆ వేడుక ఇప్పటికీ పచ్చిగా నా హృదయంలో నిలిచి ఉంది.
      ఆ వేడుక ఆహ్వానపత్రంలో ముఖ్య అతిథిగా ‘కళాభినేత్రి వాణిశ్రీ’ వస్తున్నారని వేసి మమ్మల్నెంతో ఉత్సాహపరిచావు. అందరం చేరుకొని పాత జ్ఞాపకాలు తలచుకొని మురిసిపోయి, ఆ రెండ్రోజుల వేడుకను రెండు క్షణాలుగా గడిపేశాక... వీడ్కోలు చెప్పుకొనే ముందు ‘అనివార్య కారణాలవల్ల వాణిశ్రీగారు మన కార్యక్రమానికి రాలేకపోయారు. ఆమెకు ప్రతిగా నాగేశ్వరరావు గారిని పంపారు’ అంటూ నువ్వు వేదిక మీద పలికిన పలుకులకు, నీ సమయస్ఫూర్తికి.. ఆ పేరుగల నాతో సహా అందరూ కరతాళధ్వనులతో నిన్ను అభినందించడం. అంతచక్కటి కార్యక్రమాన్ని ఒంటిచేత్తో జరిపించినందుకు మేమంతా నీకు ‘బంగారు ఉంగరం’ తొడగడం వంటి జ్ఞాపకాలు గుర్తొచ్చి... ఇప్పుడు  ఆ నిశ్చల ఛాయాచిత్రాలను చూస్తుంటే మళ్లీ అలాంటి వేడుక కోసం మనసు ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా నీ విలక్షణమైన ప్రవర్తనని మళ్లీ మళ్లీ చూడాలని నా హృదయం ఆత్రపడుతోంది. ప్రేమంటే ఇదేనేమో?! నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఎప్పుడూ నిరంతర చైతన్య స్రవంతిలా అందర్నీ అలరిస్తూ, ఆకట్టుకుంటూ, ఆత్మీయతని నింపుతూ పరిసరాలను ప్రభావితం చేయడమే నీపై ప్రేమానురాగాలు కలగడానికి కారణమనుకుంటా. 
      మనవాళ్లు అప్పుడప్పుడూ కనిపిస్తూ.. ‘మన మధుగాణ్ని పాతికేళ్ల పాతమిత్రుల కలయిక వేడుక జరపడానికి మళ్లీ కాలికి బలపం కట్టుకొమ్మని చెప్పమంటూ’ నన్ను అడుగుతున్నారు. 
      నీదే ఆలస్యం ప్రియ మిత్రమా! ఉంటాను మరి.

ఇట్లు
నీ మిత్రుడు


వెనక్కి ...

మీ అభిప్రాయం