ముఖపురాణం

  • 395 Views
  • 14Likes
  • Like
  • Article Share

    టి.చంద్రశేఖరరెడ్డి

  • తపాలాశాఖ, సీనియర్‌ సూపరింటెండెంట్
  • హైదరాబాదు.
  • 9866302404
టి.చంద్రశేఖరరెడ్డి

ముఖం మనసుకు అద్దం లాంటిది. వివిధ సందర్భాల్లో మనుషుల మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. ఎవరి ముఖాన్నైనా కాసేపు తేరిపార చూస్తే వాళ్ల మనఃస్థితిని పసిగట్టొచ్చు. అందుకే చాలామంది మాటవరసకి ‘ముఖం చూస్తేనే జాతకం చెప్పేయొచ్చు’ అంటారు. మనిషి మనసులో భావాల్ని వ్యక్తీకరించేది ముఖమేనంటారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు. ముఖం మనిషి బేలతనాన్నీ, సోమరితనాన్నీ, లోభత్వాన్నీ, జాణతనాన్నీ, ద్వేషగుణాన్నీ, కలుపుగోలుదనాన్నీ విశదపరుస్తుంది. ముఖం ఎంత అందంగా ఉన్నా మనసులో భావం మంచిగా లేకపోతే ఆ ముఖంలో తేజస్సు కొరవడుతుంది. ముఖానికి వక్త్రము, ఆస్యము, వదనము, ఆననము, లపనము, మొగము, మోర, మోము పర్యాయ పదాలు.
ముఖం అనటానికి బదులు మొఖం అనటం మనకి అలవాటు. బాగా పరిశీలించి కనుక్కున్నది ఏంటంటే ముఖం గురించి మంచిగా చెప్పాలనిపించినప్పుడు ముఖం అనీ, అదే చెడుగా చెప్పాలనిపించినప్పుడు మొఖం (మొహం) అంటామని. అది అలవాటులో పొరపాటైనా, పొరపాటుగా అలవాటైనా ఆ వాడకాన్ని అర్థ సౌలభ్యం కోసం ఈ ఒక్కసారికీ అలాగే కొనసాగించాలని నా అభిమతం- అనుమతించండి.
ముఖ కవళికలెన్నో...
ప్రపంచంలో కొన్ని కోట్ల ముఖాలున్నా విశాల స్థాయిలో వర్గీకరణ చేస్తే కోలముఖం, గుండ్రటి ముఖం అని ముఖాలు రెండే రకాలు. నవ్వు, ఏడుపు గొట్టు, దేబె, సిరిగల, దరిద్రపు, అందమైన, ముచ్చు, పాపిష్ఠి, చిలిపి, వెర్రి, పిచ్చి... ఇలా విభిన్న ముఖ కవళికలకి విభిన్న విశేషణాలు. 
      కొంచెం లోతుగా పరిశీలిస్తే ముఖం అన్న పదం మన భావ వ్యక్తీకరణలో మరికొన్ని భిన్నరూపాల్లో కూడా ఉపయోగపడుతుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ చూడాలంటారు. మనకు ఏ మాత్రం పరిచయం లేని వాళ్ల అబ్బాయికిచ్చి అమ్మాయి పెళ్లి చేయాలని ఎవరన్నా సలహా ఇస్తే ‘వాళ్ల ముక్కూ మొహం తెలియనిదే పిల్లనెలా ఇస్తాం?’ అంటారు. ఇక్కడ మొహం అంటే నిజంగా ముఖం కాదు- వాళ్ల చరిత్ర.
      ఎవరన్నా అమాయకుడు తారసపడితే, ‘ఆయనా... ఆయన ఒట్ఠి అమాయకుడు ఏమీ తెలియదు’ అని మామూలుగా చెప్పొచ్చు. కానీ అలా చెప్తే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందుకనే కొందరు ‘ఆయన మొహం- ఆయనకేం తెలుసు’ అని కొట్టి పడేస్తారు. ఏదన్నా తెలియటానికీ, ముఖానికి ఏం సంబంధమో తెలియక విన్నవాళ్లు తెల్లమొఖం వేస్తారు. ఈ మాటలు తన గురించే అని పొరపాటున తెలిస్తే ఆ మొఖం ఓనరుడి మొఖం కోపంతో జేవురిస్తుంది. అతగాడు కనుక తనని అంత గొప్పగా అంచనా వేసినవాళ్లని ఒక దులుపుడు దులిపితే వాళ్ల మొఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క ఉండదు. 
ముఖబిర్రు
నలుగురు తోబుట్టువులకు ఆస్తి పంపకాల దగ్గర మాట పట్టింపులు వచ్చాయి. అన్న తనకు ఎక్కువభాగం కావాలని పట్టుపట్టాడు. తమ్ముళ్లకు అది ఇష్టంలేదు. దాంతో అన్నగారు మొఖాన గంటు పెట్టుకున్నారు. వాద ప్రతివాదాలు జరిగాయి. అయినా రెండు వర్గాలూ పట్టుదలలు వీడలేదు. దరిమిలా ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోవడం మానేశారు. చివరికి ముఖం ముఖం చూసుకోని పరిస్థితి వచ్చింది. ‘ముఖబిర్రు’ కావటమంటే ఇదే.
      చాలా మందికి వాళ్ల జ్ఞానం లేదా అజ్ఞానం గురించి వాళ్లకే కచ్చితమైన అంచనా ఉండదు. ఇలాంటివాళ్లు తమకంతా తెలుసనే భ్రమలోనే తమ చుట్టూ ఉన్న వాళ్లకి ఏమీ తెలియదన్న గుడ్డి నమ్మకంతో జీవిస్తుంటారు. నాకెంత తెలుసో నాకే తెలియనప్పుడు, నా గురించి నాకే తెలియనప్పుడు, నేనే తెలుసుకోలేనప్పుడు మిగిలిన వాళ్లకి ఎంత తెలుసో అన్న విషయం గురించి తనకెలా తెలుస్తుంది అన్న ఇంగితం వాళ్లకుండదు.
      కానీ అదృష్టవశాత్తు అందరూ అలా ఉండరు. ‘నా మొఖం నాకేం తెలుసు’ అనే వాళ్లు కూడా తారసపడుతుంటారు. ఇలాంటి వాళ్లు ఎంతోకొంత తెలిసిన వాళ్లు. అంతేకాదు వాళ్లకు ఎంత తెలుసు అన్న విషయం కూడా తెలిసిన వాళ్లు. అయినా అది వాళ్లంతట వాళ్లు చెప్పుకోరు. కారణం వాళ్లు ‘నా మొఖం! నాకేం తెలుసు’ అని అంటే, మీకు తెలియకపోవటం ఏంటి? మా కన్నా మీకే బాగా తెలుసు! అని మనం అనాలనీ, అనిపించుకోవాలనీ వాళ్ల ఆశ. అలా అనిపించుకోవటంవల్ల వాళ్ల అహం సంతృప్తి చెందుతుంది. ఇక రెండో కారణం- వాళ్లకు తెలిసిందాన్ని గురించి వాళ్లే ఒప్పుకుంటే వాళ్లకి తెలిసింది మనకు ఉపయోగించాల్సి వస్తుందేమోన్న అనుమానం. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వాళ్లు అలా ఓ రాయి విసురుతారన్నది అసలు విషయం.
      ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు మన పరిమితిలో మనం ఉండాలి. అందుకని కొన్ని మాటలు మొఖం మొఖం చూసుకుంటూ అనలేం. కానీ మనం ఊరుకున్నా పక్కవాడు ఊరుకోడు. ఆ మాట అతడి మొఖం మీద అనెయ్యక పోయావా? అని అతగాడు మనని రెచ్చగొడతాడు. ఇక్కడ మొఖంమీద అనటం అంటే సూటిగా చెప్పడం. పొరపాటున ఆ ఉచ్చులోపడి పొరుగువాడితో ‘మీరెందుకు అలా అంటున్నారో తెలుసు’ అని ఉన్న మాట అన్నామనుకోండి, నన్ను ‘మొఖాన పట్టుకుని అంత మాటంటావా’ అని అతడు మన మొఖం పట్టుకుని కడిగేస్తాడు. దాంతో మనం మొఖం చాటేయాల్సి వస్తుంది.
      అతగాడు పెద్ద నస. అతడు చెప్పే విషయం మీకసలు ఏ మాత్రం రుచించ లేదనుకోండి. మీరు ఆముదం తాగినట్లు మొఖం పెడతారు. పొద్దున్నే లేచి అద్దం చూసుకోవడం కొందరికి అలవాటు. ఏదన్నా జరగకూడనిది జరిగితే చూసుకున్నది తన మొహమే అని మరచిపోయి పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో అని వాళ్లకి వాళ్లే అనుకోవడం అలవాటులో పొరపాటు.
ముఖస్తుతి...
ఈ ప్రపంచంలో దేనికైనా లొంగని వాడుంటాడేమో కానీ పొగడ్తకి లొంగని వాళ్లు ఉండరు. అలాంటి వాళ్ల దగ్గరికి ఏదన్నా పనిమీద వెళ్లినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నవీ లేనివీ కల్పించి అతడి గురించి సాధ్యమైనంత ఎక్కువగా పొగడాలి. ఇక్కడ స్వార్థం కోసం లేని గొప్పదనం ఎదుటివాడికి ఆపాదిస్తున్నట్లునిపిస్తుంది పనికోసం వెళ్లినవారికి. పొగిడి పని చేయించుకోవటానికి ఎదుటివాళ్లు ప్రయత్నిస్తున్నారని అతడికీ తెలుసు. ఇది పరస్పర వంచన లేదా ఆత్మవంచన కార్యక్రమం. అది తెలిసి ఎక్కడ పని కుదరదంటాడో అని ‘మీరు ముఖస్తుతి అనుకోకపోతే ఓ మాట’ అని లౌక్యంగా మొదలుపెట్టి ఒక్క మాటతో ఆగకుండా అనేక మాటలు మాట్లాడతారు.
      ఇంతా చేసి ఆయనవల్ల మన పని కాలేదనుకోండి! మొఖం వేళ్లాడేసుకుని బయటపడతాం. మళ్లీ ఆయన దగ్గరికి ఇంకోసారి వెళ్లటానికి మనకు మొహం చెల్లదు. వెళ్లకపోతే ఎలా? మన అవసరం కదా! అని అలవాటు ప్రకారం ఇంట్లో వాళ్లు అనుచితమని మనకనిపించే ఉచిత సలహా ఇచ్చారనుకోండి. ‘ఒకసారి కాదన్న తర్వాత ఏ మొఖం పెట్టుకుని వెళ్లను?’ అని చికాకు పడతాం. దాంతో మనకి సలహా ఇచ్చిన వాళ్ల మొఖం ఇంతవుతుంది.
      ఒక పనిమీద ఎవరి దగ్గరకన్నా వెళ్లినప్పుడు అతని గురించి ఉన్న మాట అంటే అతడికి ఉలుకు. అలాగని ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంటే మన పని కాదు. అందుకని నిజం కాదని తెలిసినా మనికిష్టం ఉన్నా లేకపోయినా అతడి గురించి ఉన్నవీ లేనివీ కల్పించి మరీ మాట్లాడతాం. ముఖప్రీతి కోసం మాట్లాడటం అంటే ఇదే. నీ మొహం నాకు మళ్లీ చూపించకు అని కొందర్ని విసుక్కుంటాం. వాడి మొహం చూస్తే పాపం అని కొందరు తరచుగా అంటుంటే వింటుంటాం. ఎవరు ఏ పాపం చేశారో తెలియదు. కానీ అలా ఎవరైనా ఎవర్నన్నా అంటుంటే మనకి అయ్యో పాపం       అనిపిస్తుంది. 
      చేసిన తప్పు ఎవరన్నా గ్రహిస్తే వాళ్ల ముందుకు వెళ్లటానికి మనకు మనసు ఒప్పదు. పైగా తప్పించుకు తిరుగుతాం. అప్పిచ్చిన వ్యక్తి ఎదురైనపుడు మనం చేపట్టే మహత్తర కార్యక్రమం ఇదే. దీనినే మొహం చాటెయ్యడం అంటారు.
మొహం మొత్తడం
      ‘అతి సర్వత్ర వర్జయేత్‌’... అదే పనిగా దేన్నైనా అనుభవిస్తూపోతే వెగటు పుడుతుంది. ఇంతకుముందు ఎంతో ఇష్టం అనిపించింది అయిష్టంగా తోస్తుంది. పెళ్లికి ముందున్న ప్రేమ తరువాత లేకపోవటం, పెళ్లయిన కొత్తలో ఉన్న ప్రేమ తరువాత క్రమంగా తగ్గడం అలాంటివే. దీన్నే మొహం మొత్తటం అని మెత్తగా అంటారు. కానీ కొన్ని ఎప్పటికీ, ఎంతకీ మొహం మొత్తవు. డబ్బు సంపాదన, పదవీ కాంక్ష ఈ కోవలోవే.
      కొందరు ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. ప్రవర్తనకి తగ్గట్లు వాళ్ల మొహం కూడా ఎప్పుడూ చిటపటలాడుతుంటుంది. దీన్నే ‘వాడి మొహంలో ఎప్పుడూ అడ్డెడు పేలాలు వేగుతుంటాయి’, ‘వాడి మొహం ఎప్పుడూ తుమ్మల్లో పొద్దుగూకినట్లుంటుంది’ అని వర్ణిస్తారు. . 
      ఒకామె తన తమ్ముడి పెళ్లికి వచ్చిన ఆడపడచుకి చీర పెట్టింది. ఆమె ఆ చీర మడతలు విప్పదీసి ఒకసారి చూసుకుని ముఖం ముడుచుకుంది. మర్యాద కోసం తీసుకుని వాళ్లమ్మకి చూపెట్టింది. ఆమె కూడా అది చూసి మొహమదోలా పెట్టింది. తల్లి అభిప్రాయం తన అభిప్రాయంతో ఏకీభవించడంతో ఆడపడుచు చెలరేగి పోయింది. ‘నేనేమన్నా చీరల కోసం మొఖం వాచి ఉన్నానా- ఇలాంటి చీర పెడితే ఎంత పెట్టకపోతే ఎంత’ అని అగ్గిమీద గుగ్గిలం అయింది. అంత నచ్చకపోతే అక్కడే మీ వదిన మొఖాన కొట్టిరాకపోయావా అని వాళ్లమ్మ తన కూతుర్ని రెచ్చగొట్టింది. తన భార్య పెట్టిన చీర గురించి తమ ఇంట్లో వాళ్లు ఇలా అనుకుంటున్నారని భర్త భార్యతో అన్నాడనుకోండి. ఆవిడ తనలో తాను ‘అలాంటి చీరలు ఎప్పుడన్నా చూసిన ముఖాలైతే కదా’ అనో, ‘ఆ మొఖానికి అదే ఎక్కువనో’ లోలోపల ఈసడించుకుంటుంది.
      పెళ్లైన తర్వాత మొదటిసారిగా మీ అత్తవారింటికి వెళ్లారనుకోండి. మీ పెళ్లికి రాని వాళ్లు, దారినపోయే వాళ్లు ‘ఎవరీ కొత్తమొఖం’ అని మీ వంకే తేరిపార చూస్తారు. పెళ్లికి వచ్చి మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేని వాళ్లు ‘తెలిసిన ముఖంలా ఉందే’ అనుకుంటారు. గుచ్చుకుంటున్న ఆ చూపుల్ని తట్టుకోలేక మీరు ‘నా మొఖాన ఏమన్నా బొమ్మలాడుతున్నాయా! అలా మొఖంలో మొఖం పెట్టి చూస్తారేంటి?’ అని అనుకుంటారు. అలా చూసిన వాళ్లు ముఖం చిన్నబుచ్చుకుంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం