కంపే ఇంపు

  • 112 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

మాట్లాడే శక్తి ఉండటమే ప్రాణికోటిలో మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టింది. భాష ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియజేయడానికి ఉపకరించే పనిముట్టు. భాష సజీవ స్రవంతి. కాలంతోపాటే భాష కూడా అనేక మార్పులు చెందుతుంది. ఎన్నో ఇతర పలుకుల ప్రభావాలకు లోనవుతుంది. ఈ మార్పులు రెండు రకాలుగా జరుగుతాయి. అవేంటంటే...
ధ్వని విపరిణామం (phonetical change): 
పదంలోని అక్షరాల ఉచ్చారణలో కలిగే మార్పు. ఉదాహరణకు, వ్రాత పదంలో ‘వ్రా’ స్థానంలో ‘రా’ అని పలకడం. ఇక్కడ అర్థంలో మార్పు లేదు. కానీ ధ్వనుల్లో మార్పు వచ్చింది. 
అర్థ విపరిణామం (semantic change):  ఒక పదానికి ఒకప్పుడు వ్యవహారంలో ఉన్న అర్థం, ఇప్పుడు వ్యవహారంలో ఉన్న అర్థం వేరుకావడం. అంటే కాలక్రమంలో ఆ పదానికి గౌరవం పెరగొచ్చు. తగ్గొచ్చు. లేదా ఇంకో అర్థంలో స్థిరపడొచ్చు. 
      ఆచార్య జి.ఎన్‌.రెడ్డి తెలుగులో అర్థవిపరిణామంపై పరిశోధన చేశారు. అర్థ విపరిణామం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు కానీ, ఎందుకు జరిగిందో మాత్రం చెప్పలేం. తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన ఆయా పరీక్షల్లో అర్థవిపరిణామం గురించి ప్రశ్నలు అడుగుతారు. అర్థవిపరిణామం ఎన్నిరకాలుగా జరుగుతుందంటే...
అర్థ వ్యాకోచం: ఒకప్పుడు పరిమితమైన వ్యవహారంలో ఉండి కాలక్రమంలో వ్యవహార విస్తృతి పొందడం. 
      ఉదాహరణకు... చెంబు. కెమ్‌ అనే మూల ద్రావిడ ధాతువు దీనికి మూలం. కెంపు అంటే ఎర్రని జాతి రాయి కదా! కెందామర, కెమ్మోవి పదాల్లో ఈ ధాతువు కనిపిస్తుంది. కెమ్‌ చెమ్‌ కావడం తాలవ్యీకరణం. చెంబు అంటే ఎర్రని లోహంతో తయారైంది... రాగిపాత్ర అని అర్థం. రాగి పాత్రే చెంబు. ఇప్పుడు ఈ పదం స్టీలు, ఇత్తడి, వెండి ఇలా ఏ లోహపు పాత్రకైనా వాడుతున్నాం. అంటే పరిమితం నుంచి విస్తృతార్థంలో ప్రయోగిస్తున్నాం. ఇలాంటిదే అష్టకష్టాలు పదంకూడా. 
      దేశాంతర గమనం, భార్యా వియోగం, ఆపత్కాల బంధు దర్శనం, ఉచ్చిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ఠ, దారిద్య్రం... అష్టకష్టాలు. అయితే ఇప్పుడు ఎవరినైనా బయటపడలేనంతటి సమస్యలు చుట్టిముట్టినప్పుడు ఆయన అష్టకష్టాల్లో ఉన్నాడంటాం. తైలం అంటే తిలల (నువ్వుల) నుంచి తీసింది. అంటే నువ్వుల నూనె. ఇప్పుడు ఏ చమురు పదార్థాన్నైనా తైలం అనే అంటున్నాం. తాటి ఆకుతో చేసిన ఆభరణం కమ్మ. ఇది కాలక్రమంలో బంగారు కమ్మలు, వెండి కమ్మలు ఇలా ఏదైనా సరే చెవులకు పెట్టుకునే ఆభరణాలకు సమానార్థకంగా స్థిరపడింది.
అర్థసంకోచం: ఒకప్పుడు ఎక్కువ పరిధిలో వినియోగంలో ఉండి కాలక్రమంలో అర్థం కుంచించుకుపోవడం.
      కోక అంటే వాస్తవానికి ఏదైనా వస్త్ర విశేషం. అందుకే శ్రీనాథుడు ‘కుల్లాయించితి కోకచుట్టితి...’ అనీ, అన్నమయ్య ‘కుడిచేదన్నము కోకచుట్టెడిది’ అని కోక శబ్దాన్ని ప్రయోగించారు. ఇప్పుడేమో కోక మహిళలకు మాత్రమే సొంతం! సంస్కృత ‘చీర’ కూడా ఇలాగే అర్థ సంకోచాన్ని పొంది కోకకు సమానార్థకమైంది. సంభావన అంటే గౌరవించడం. ఇప్పుడది వాడుకలో పూజాది కార్యక్రమాలు చేసినందుకు బ్రాహ్మణులకు గౌరవంగా ఇచ్చే దక్షిణయ్యింది. ఇక ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. పాండవోద్యోగం అంటే పాండవులు కౌరవులతో సంధికోసం చేసిన ప్రయత్నమే. అయితే ఇది ఏదైనా ఒక చోట జీతానికి పనిచేయడం అన్న అర్థంలో స్థిరపడింది.
      ఉస్తాద్‌/ వస్తాదు అనే పర్షియా ‘ఉపాధ్యాయుడు’, పాపం తెలుగులోకి వచ్చేసరికి ‘కుస్తీ పట్టే వ్యక్తి’ అయ్యాడు!  గోరీ అంటే సమాధి. కానీ ఇది తెలుగులో ముస్లింల సమాధి అన్న అర్థంలో స్థిరపడింది. ఎందుకంటే? ఈ పదం మహమ్మదీయుల వ్యవహారంలో ఉండటంవల్ల. ఇక అవస్థ అనే సంస్కృత పదానికి స్థితి అని అర్థం. అది తెలుగులో నా అవస్థ ఏదో నేను పడతాను అనే ప్రయోగంలో బాధ, కష్టం, పాట్లు, తిప్పలు అనే అర్థాల్లో సంకోచమైంది.
అర్థగౌరవం: ఒకప్పుడు తక్కువగా చూసిన పదాలు కాలాంతరంలో గౌరవాన్ని పొందడం. ఈనాటి ‘సభికులు’ వేదకాలంలో ‘జూదరులు’. ఇప్పుడు సభికులు అంటే సమావేశానికి వచ్చిన వాళ్లు అనే అర్థంలో గౌరవప్రదంగా మారింది. ఇలాంటిదే ముహూర్తం. దీని అసలు అర్థం... చాలా తక్కువ సమయం. అలాంటిది ఇప్పుడు శుభసమయాన్ని ముహూర్తంగా పరిగణిస్తున్నాం. అందుకే ఎవరైనా పెళ్లికి పిలిస్తే, ముహూర్తం ఎప్పుడు అని అడుగుతాం. 
అర్థగ్రామ్యత: ఒకప్పుడు గౌరవంగా పిలిచిన పదాన్ని ఇప్పుడు నిందార్థం (తక్కువ)లో ఉపయోగించడం. ఉదాహరణకు ఛాందసుడు అంటే ఛందస్సు తెలిసినవాడు, పండితుడు, నియమం తప్పని వాడు అని. ఇప్పుడు ఛాందసుడు అంటే పాతకాలపు భావాల్ని పట్టుకు వేలాడేవాడు. ఇలాంటిదే కైంకర్యం. కింకరుడు అంటే సేవకుడు. అతను చేసేది కైంకర్యం. అంటే భగవంతుడికి చేసే సేవ. ఇప్పుడు కైంకర్యం అంటే దిగమింగడం అన్న అర్థంలో వాడుతున్నాం. ఇలాంటిదే స్వాహా. కంపు అంటే ప్రాచీన తెలుగు సాహిత్యంలో సువాసన/ వాసన అయితే, ఇప్పుడు దుర్వాసనగా మారిపోయింది! తడపడం అంటే పొలానికి నీళ్లు పట్టడం. దీన్ని చేతులు తడపడం అంటూ లంచం ఇవ్వడానికి సమానంగా వాడుతున్నాం.  
సభ్యోక్తులు: ఏదైనా పదాన్ని వాడితే సభల్లో గానీ, ఎదుటివారు కానీ అమర్యాదగా భావిస్తారేమోనన్న సందేహంతో వేరే పదాన్ని వాడటం సభ్యోక్తి. ఉదాహరణకు ఉచ్చ అనే తెలుగు పదానికి మారుగా మూత్రం, లఘుశంక అన్న సంస్కృత పదాలు వాడటం. ఎవరైనా పెద్దలు చనిపోతే కాలధర్మం చెందాడనటం సభ్యోక్తే.
సంకేతార్థాలు: జనం వాడుకలో ఒకలా, ఒక ప్రత్యేకమైన వ్యవహారంలో ఒకలా అర్థాన్నిచ్చే పదాలు. ద్రవ్యం అంటే సామాన్య వ్యవహారంలో డబ్బు. అదే భౌతిక శాస్త్రంలో అయితే పదార్థం (ద్రవ్యరాశి). 
వస్తుపరిణామం: లక్కపిడతలు దీనికి ఉదాహరణ. పూర్వం బొమ్మలను లక్కతో తయారుచేసేవారు. ఇప్పుడు కొయ్యబొమ్మలు కూడా లక్కపిడతలే.
లోకనిరుక్తులు: ఇవి లోకులు కల్పించుకునే పదాలు. నారద సింహాచలంగా వాడుకలో ఉన్నది నిజానికి నార్త్‌ సింహాచలం. ప్రజల నోట్లో పడి నారద సింహాచలం అయింది. నారదుడు నారాయణ స్మరణ చేస్తూ ఆకాశంలో వెళ్తూ ఇక్కడి ఆలయాన్ని చూసి దిగి స్వామిని అర్చించి వెళ్లాడు. అందుకే నారద సింహాచలం అయిందనే కథ కూడా సృష్టించారు మనవాళ్లు.
లక్ష్యార్థాలు: ఇవి ఆధార ఆధేయ, కార్య కారణ, ఉపమాన ఉపమేయ, అంగి అంగ సంబంధాలవల్ల ఏర్పడతాయి. వాస్తవానికి ముష్టి అంటే పిడికిలి. ఇప్పుడది భిక్ష వేయటం అన్న అర్థంలో స్థిరపడింది. ఇది ఆధార ఆధేయానికి ఉదాహరణ.
      ఇవే కాకుండా దీపం కొండెక్కింది, సూత్రం పెరిగిపోయింది లాంటి వాటిలో కూడా అర్థ విపరిణామం కనిపిస్తుంది. వీటిని మృదూక్తులు అంటారు. సూత్రం పెరిగిపోవడమంటే అంటే మంగళసూత్రం తెగిపోవడం. ఇలా చెప్పడాన్ని అశుభంగా పరిగణిస్తారు. అందుకే మృదువుగా సూత్రం పెరిగిపోయిందంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం