ఉగాది విజయం

  • 1115 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డా।। అనంతలక్ష్మి

  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌
  • రైల్వే డిగ్రీ కళాశాల, హైదరాబాద్‌
  • 9949198141
డా।। అనంతలక్ష్మి

సూర్యుడికి సప్తాశ్వాలతో రథం కట్టినా... చంద్రుడికి పక్షధరుడని బిరుదిచ్చినా... మన పూర్వీకుల లక్ష్యమొక్కటే. కాలగణనం. కరిగిపోయే కాలాన్ని ‘లెక్క’లతో అర్థం చేసుకోవడం భారతీయులకు కరతలామలకం. క్షణాల నుంచి కల్పాల వరకూ కాలపురుషుడి వయసును కచ్చితంగా కొలవగల ప్రతిభ మన సొంతం. వసుధపై వసంతం వికసించిన తొలిరోజును స్మరించుకుంటూ మనం చేసుకునే ఉగాది పండుగ... ప్రకృతితో మమేకమైన మన సంస్కృతికి మచ్చుతునక.
వరాహం నుంచి వృషభం వరకూ సృష్టిలోని సమస్త ప్రాణుల్లోనూ భగవంతుణ్నే దర్శించి ఆరాధించే భారతీయులకు కాలమూ భగవత్స్వరూపమే. సవితృమండల మధ్యవర్తి అయిన సూర్యభగవానుణ్ని నిత్యం సంధ్యావందన సమయంలో స్మరించుకోవడం మన అలవాటు. కాలారాధనే ఇందులోని ఆంతర్యం. సంకల్పంలో మాస, తిథి, వార, నక్షత్రాలు చెప్పుకోవడం... అనంత కాలంలో మనం ఎక్కడ ఉన్నామన్నది గుర్తు చేసుకోవడమే. తద్వారా మన అల్పత్వాన్ని అర్థం చేసుకుని, తగిన రీతిలో ప్రవర్తించాలని మనల్ని మనం హెచ్చరించుకోవటమే!
      కాలం అనంతమే కాదు... అనాది కూడా. అలాంటి దాన్ని లెక్కించటం ఎలా? దానికి ప్రమాణం ఏమిటి? కొలతలు ఎలా ఉండాలి? ప్రపంచంలోని అన్ని మతాలు, సంప్రదాయాల వారు తమకి తోచినట్టు లెక్కలు వేశారు. 
      రుతువులను అనుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులని బట్టి - ఒక రుతువుతో లెక్కకట్టటం ప్రారంభిస్తే... తిరిగి అదే రుతువు వచ్చేసరికి ఒక ఆవృతం పూర్తవుతుంది. మళ్లీ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రుతువు నుంచి లెక్కించటం ప్రారంభించారు. అందుకే సంవత్సరానికి అన్ని రుతువుల పేర్లూ పర్యాయపదాలే. నూరు వసంతాలు, వంద శరత్తులు. వేయి వర్షాలు లాంటి వాటిల్లోని ‘వసంతం’, ‘శరత్తు’, ‘వర్షం’... సంవత్సరానికి మారుపదాలే. 
      మొదట్లో పాశ్చాత్యులు విషువత్కాలానికి (మార్చి నెల 23) నూతన సంవత్సర ప్రారంభంగా పరిగణించే వారు. వారిది సౌర మానం కదా! కొద్దికాలం తర్వాత... నెల చివరలో ఎందుకని, ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి కొత్తేడాదిని ప్రారంభించుకున్నారు.. అది సుమారుగా మన ఉగాది సమయమే. ప్రకృతి అంతా పచ్చగా కొత్త చిగుళ్లతో కళకళలాడే కాలమది. ఆ తరువాత సంవత్సర ప్రారంభాన్ని జనవరి ఒకటో తేదీకి మార్చుకుని... వర్షాలను గణించటం మొదలు పెట్టారు. పాత అలవాటుతో ఏప్రిల్‌ ఒకటో తేదీని కొత్త సంవత్సర ఆరంభంగా అనుకునే వారిని తెలివి తక్కువ వారిగా పరిగణించి వేళాకోళం చేసేవారు. ‘ఏప్రిల్‌ ఫూల్‌’ అని. ఆట పట్టించడం అప్పటి నుంచే వచ్చిందంటారు.
      కాల గణనలో రెండు పద్ధతులున్నాయి. చాంద్రమానం. సౌరమానం. భారతీయులు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇచ్చారు. అధిక మాసాలతో రెండింటినీ సమన్వయ పరుస్తారు. సౌరమానాన్ని బట్టి సంక్రాంతి తదితర పండుగలను చేసుకుంటూ... నిత్య వ్యవహారానికి చాంద్రమానాన్ని ఉపయోగిం చడం తెలిసిందే కదా. దీనికీ ఒక కారణం ఉంది. రాతిరేల ఆకాశంలోని చంద్రుని కళలను చూసి తిథులను గుర్తించవచ్చు. నక్షత్రాలను బట్టి మాసాలను తెలుసుకోవచ్చు. ఇది సులువైన పద్ధతి. సూర్యుణ్ణి చూసి ఇలా గుర్తించటం కష్టం. అంతే కాదు, సూర్యుడున్నప్పుడు నక్షత్రాలు కనిపించవు. నక్షత్ర గమనంతో కాల గణనం దోష రహితంగా ఉంటుంది. మన ఉగాదిలోని ‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్రాల గమనాన్ని లెక్కించటం మొదలు పెట్టిన రోజన్నది కొందరి అభిప్రాయం.
      చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరాదిని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకోవడం భారతీయుల అలవాటు. తెలుగువారితో పాటు కన్నడిగులు, మహారాష్ట్రులు దీనిని యుగాది (ఇదే తర్వాత ఉగాది అయిందన్నది ఓ వాదన) అని కూడా అంటారు. ఇది కృతయుగం ప్రారంభమైన రోజుగా చెబుతారు. బ్రహ్మ చరాచర సృష్టిని ప్రారంభించింది ఈ రోజేనని ధర్మ సింధువు, చతుర్వర్గ చింతామణి తదితర గ్రంథాలు చెబుతున్నాయి.
      ఉగాదిని సృష్ట్యాదితో ముడిపెట్టి ఉదాహరణ పూర్వకమైన సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు వరాహమిహిరుడు, హేమాద్రి పండితుడు, నిర్ణయ సింధు కారుడు.
      భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ‘సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు లంకా నగరం (శ్రీలంక కాదు - భూమధ్యరేఖపై సూర్యుడు ఉదయించే ప్రదేశం) నుంచి ఉదయించటం వల్ల ఆనాడే ఉగాది. దిన, మాస, సంవత్సర ప్రారంభం ఒకేసారి సంభవిస్తుంది’ అని ప్రతిపాదించాడు.
      కాలమానానికి అధినేత ఇంద్రుడు. విష్ణువునే ఇంద్రుడుగా చెప్పారట. అగ్ని అతడికి సహాయకుడు. వేద కాలానికి ముందు ఇంద్రుడు సృష్టి బాధ్యతను బ్రహ్మకు ఇచ్చాడు. మహాభారతంలో ఉగాది నాడు ఇంద్రోత్సవం జరపాలని చెప్పడానికి ఇదే కారణం కావచ్చు. 
      మండలాకారంలో తిరిగే కాలచక్రం గురించి భారతంలోని ఉదంకోపాఖ్యానంలో కనిపిస్తుంది. గురుపత్ని ఆదేశానుసారం ఉదంకుడు పౌష్య మహారాజు భార్య నుంచి కుండలాలు తెస్తుంటాడు. ఇంతలో వాటిని తక్షకుడు అపహరిస్తాడు. అతన్ని వెదుకుతూ పాతాళ లోకానికి వెళ్తాడు ఉదంకుడు. అక్కడ ఒక దృశ్యం కంటపడుతుంది. ఇద్దరు స్త్రీలు (ధాత, విధాత) తెల్లని నల్లని దారాలతో (పగలు, రాత్రి) ఒక వస్త్రం నేస్తూ ఉంటారు. పన్నెండు ఆకులున్న (నెలలు) చక్రాన్ని ఆరుగురు (రుతువులు) యువకులు తిప్పుతూ ఉంటారు. వారిని అజమాయిషి చేస్తూ ఉంటాడు చాలా ఎత్తైన దివ్యపురుషుడు (పర్జన్యుడు). ఆయన గుర్రం అగ్ని.
మన గణన
సన్నని రంధ్రం నుంచి సూర్యకిరణం లోపలికి పడుతున్నప్పుడు చూస్తే అందులో చిన్న నలకలు కదులుతూ కనిపిస్తాయి. ఒక నలకలో ఆరో వంతు అన్నింటి కంటే చిన్నదని రుషులు గుర్తించారు. దానిని పరమాణువన్నారు. సూర్యరశ్మి దానిలో దూరి ఇటు నుంచి అటు ప్రయాణం చేయటానికి పట్టే కాలాన్ని సూక్ష్మకాలంగా పరిగణించారు. సూర్యుడు పన్నెండు రాశుల్లో ఒక్కసారి తిరిగి రావటానికి పట్టే కాలం సంవత్సరం. దానిని మహత్కాలం అన్నారు. ఈ రెండింటి మధ్యనే కాల విభాగాలుంటాయి.
      ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగపు కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5114 సంవత్సరాలైంది. ఈ కల్పంలో సృష్టి ప్రారంభమై 197,29,49,114 ఏళ్లు జరిగిపోయాయి. ఇప్పుడు మనం ప్రవేశించ నున్న విజయ నామ సంవత్సరం ప్రభవాది షష్ట్యబ్దుల్లో 27వది. ఇది విజయ ఉగాది. అన్నింటిలోనూ విజయాన్ని కలిగిస్తుంది.
      సంవత్సరాల పేర్ల వెనక ఓ ఐతిహ్యముంది. శ్రీకృష్ణుడి భార్యలు 16,100 మంది. వారిలో సందీపని అనే రాజ కుమారి ఉంది. ఆమె పుత్రులు 60 మంది. వారి పేర్లే సంవత్సరాలకి పెట్టారంటారు. సంవత్స రాలకున్న పేర్లు నారదుడి సంతానమని మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
      స్థూల దృష్టికి కాల గణనకి అతి చిన్న ప్రమాణం నిమేషం. కనురెప్ప కిందికి వాలేప్పుడు కదలటానికి చేసే ప్రయత్నానికి పట్టే సమయం అది. దానిని కొలవటానికి మరొక మార్గం కూడా చెప్పారు. అప్పుడే వచ్చిన తామర పూవు రేకులని ఒక దానిపై మరొకటి చొప్పున వంద పేర్చాలి. ఈ దొంతరను వాడి అయిన సూదితో గట్టిగా గుచ్చితే పై నుంచి కింది రేకు వరకు దిగటానికి పట్టే సమయం నిమేషం.
      కాలాన్ని లెక్క వేయటానికి విష్ణు పురాణం మరొక కాలమానాన్ని చెబుతోంది. దీన్ననుసరించి 15 నిమేషాలు ఒక కాష్ఠ. 30 కాష్ఠలు ఒక కల. 30 కలలు ఒక ముహుర్తం. 30 ముహూర్తాలు ఒక దినం.
      ఇలా అనంతంగా సాగే కాలానికి ఆద్యంతాలెక్కడ! ఎక్కడి నుంచి ప్రారంభిస్తే అదే మొదలు. అంతకు ముందుది చివర. కాలపు కొలతలు అన్నీ వర్తులముగా ఉంటాయి. ఆదివారంతో మొదలైన వార గణనం శనివారంతో పూర్తవుతుంది. మళ్లీ ఆదివారంతో కొత్త వారం మొదలవుతుంది. నెలలు, సంవత్సరాలు, యుగాలు... ఏవైనా అంతే.
      ఇంత శాస్త్రీయంగా కాలాన్ని, దాని గమనాన్ని, దాని తత్త్వాన్ని దర్శించిన రుషులు ఆయా సమయాల్లో పాటించాల్సిన విధులను కూడా నిర్దేశించారు. ఉగాది నాడు ఆచరించాల్సిన విధులను తెలియజేశారు. వాటిలో ప్రధానమైనవి.
      తైలాభ్యంగనం, నూతన వస్త్రధారణం, సంకల్పం చెప్పుకుని కొత్త సంవత్సర నామాన్ని చెప్పుకోవటం. ఉగాది పచ్చడిని తీసుకోవడం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం. ఇంకా పిండి వంటలు, బంధు మిత్రాదులతో కలిసి వేడుకలు, దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం మొదలైనవి యథాశక్తి.
      అభ్యంగన స్నానం, కొత్త బట్టలు, పిండి వంటలు అన్ని పండుగలకీ చేసుకునేవే. ఉగాది ప్రత్యేకం ఉగాది పచ్చడి, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం. అయితే, ఎందుకోగానీ ఇంటిపైన పతాకాన్ని ఎగురవేసే ఆచారం చాలా వరకూ కాలగర్భంలో కలిసిపోయింది. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ఇది అన్ని రసాలు నిండిన జీవితానికి ప్రతీక. 
      ‘ఋతు సంధిషు వ్యాధిర్జాయతే’... అన్ని రుతు సంధులు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వసంత, శరదృతువులు యమ దంష్ట్రాలని దేవీ భాగవతం వంటి పురాణాల్లో చెప్పారు. కాబట్టే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాల కోసం ఆహార, విహార నియమాలు, దీక్షలు ఏర్పాటు చేశారు. అవే వసంత నవరాత్రి దీక్షలు. శిశిరం వెళ్లి వసంత రుతువు వచ్చే సమయంలో, ప్రకృతిలో చాలా మార్పు వస్తుంది. దానిని తట్టుకునే శక్తిని శరీరానికి ఇచ్చే పదార్థాలతో ఉగాది పచ్చడి తయారవుతుంది.
పంచాంగ శ్రవణం
      ‘‘పంచాంగ శ్రవణం శుభ గుణాల నిస్తుంది. శత్రువులని నశింప చేస్తుంది. దుస్స్వప్న ఫలితాలని పోగొడుతుంది. గంగా స్నాన, గోదాన ఫలితాల్నిస్తుంది. ఆయువుని పెంపొంది స్తుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది. వివిధ పనులను తేలికగా సాధిస్తుంది’’. కనుక పంచాంగాన్ని వినాలి అంటారు. ఈ పంచాంగ శ్రవణంలో మొదటిది ఫలశ్రుతి. అంటే, వినటం వల్ల వచ్చే ఫలితం. సంవత్సర ఫలితాంశం చెప్పటం రెండో అంశం. నవ నాయకుల గురించి చెప్పటం మూడో అంశం. ఆ సంవత్సరంలో ఏ గ్రహానికి ఏ అధికారం ఉందో తెలుసుకుంటే సంవత్సర ఫలితాలు తెలుస్తాయి.

ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఆరు రుచులకు ఆరు పదార్థాలు చేరుస్తారు.
వేప పువ్వు (చేదు): 
ఉగాది ఒక్క రోజే కాకుండా కనీసం నెల రోజులు తింటే తరుణ వ్యాధులు రావని ఆయుర్వేదం చెబుతోంది.
బెల్లం (తీపి): ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కొత్త బెల్లం వాడకం ఇప్పటి నుంచే ఆరంభమవుతుంది.
లవణం (ఉప్పు): వాతాన్ని పోగొడుతుంది. చింతపండు (పులుపు): ఇది వేయి రోగాలను నయం చేస్తుందట. (అలా అని ఎక్కువగా తింటే అనారోగ్య కారకం). 
సహకార (మామిడి): పిందెల రుచి వగరు.
మిరియాలు (కారం): శరీరానికి సమ శీతోష్ణస్థితిని కలిగిస్తాయి. 
ఇవి కాక ‘జీరక’ అంటే జీలకర్రనీ వేస్తారు. అన్నాన్ని జీర్ణం చేస్తుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఇంకా అరటి పళ్ల, చెరకు ముక్కలు, ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదంపప్పు లాంటి వాటిని కూడా వేస్తుంటారు. ఆహార ధాన్యాలన్నీ అప్పుడే కొత్తగా వచ్చి ఉంటాయి. ఉగాది పచ్చడిలో వేసిన తర్వాతనే వాటిని వాడుకోవడం తెలుగు వారి ఆచారం.

నవ నాయకులు
1. చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు.
2. సౌరమాన సంవత్సరం ప్రారంభమైన రోజు ఏ వారం ఉందో ఆ వారాధిపతి మంత్రి.
3. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారాధిపతి ఆ సంవత్సరానికి సేవా నాయకుడు.
4. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడున్న వారానికి అధిపతి సస్యాధిపతి.
5. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి.
6. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే నాటి వారాధిపతి అర్ఘాధిపతి. (ధరలకు, వాణిజ్యానికి అధిపతి)
7. సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించే నాటి వారానికి అధిపతి మేఘాధిపతి.
8. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజుకి వారాధిపతి రసాధిపతి.
9. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున ఉన్న వారానికి అధిపతి నీరసాధిపతి.
నాయకులతో పాటు ఉప నాయకులు 21 మంది ఉన్నారు. వారు పురోహితుడు. పరీక్షకుడు, గణకుడు, గ్రామపాలకుడు, దైవజ్ఞుడు, రాష్ట్రాధిపతి, సర్వదేశోద్యోగపతి, ఆశ్వాధిపతి, గణాధిపతి, పశువులకధిపతి, నరాధిపతి, గ్రామాధీశుడు, వస్త్రాధిపతి, రత్నాధిపతి, వృక్షాధిపతి, జంగమాధిపతి, సర్వాధిపతి, మృగాధిపతి, శుభాధిపతి, స్త్రీలకధిపతి, దేవాధిపతి. వీటికి అధిపతులు కూడా గ్రహాలే.
      పంచాంగ శ్రవణంలో తర్వాతి అంశం మూఢమి, కర్తరి, పుష్కరాల నిర్ణయం. ఆదాయ కందాయ ఫలాలు, రాజపూజ్య, అవమానాల గురించి చెప్పడం.  ఆ సంవత్సరమంతా ఏ రాశి వారికి ఎలా ఉందో వివరిస్తారు. వీటితో పాటు సంక్రాంతి పురుషుని పేరు, అతడి ఆయుధాలు, వాహనం మొదలైన విషయాలు కూడా చెబుతారు. వీటిని తెలుసుకోవటం ద్వారా..   ఒక సంవత్సరానికి తగిన ప్రణాళిక వేసుకోవచ్చు.
      పంచాంగ శ్రవణ సమయంలో గ్రహాల పేర్లు ఎన్నో సార్లు పలుకుతారు. దానికి అవి సంతోషిస్తాయి. ఫలితంగా పంచాంగ శ్రవణం చేసే వారికి, విన్న వారికి శౌర్యం, తేజస్సు, వైభవం, సర్వ మంగళాలు, బుద్ధి వికాసం, గురు కృప, జ్ఞానం, సుఖం, దుఃఖ రాహిత్యం, ప్రాబల్యం, ప్రాధాన్యం కలుగుతాయన్నది నమ్మకం.
      ఒక పండుగను జరుపుకోవటంలో ఎన్ని విశేషాలున్నాయో చూశారా! ప్రాచీనులు తాము సముపార్జించిన విజ్ఞానాన్ని సంప్రదాయాలు, ఆచారాల రూపంలో మనకు అందించారు. ఒక్కొక్క దానిలోనూ ఖగోళ విజ్ఞానం, ఆరోగ్యం, కుటుంబ, సామాజిక శ్రేయస్సు, వ్యక్తి వికాసం, ఆధ్యాత్మిక పురోగతి మొదలైన అంశాలెన్నో ఇమిడి ఉంటాయి. తెలియకుండా ఆచరించినా మేలు కలుగుతుంది. తెలిస్తే ఆనందమూ సొంతమవుతోంది.

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం