తెలుగు సాహిత్య చరిత్ర - 4

  • 307 Views
  • 11Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

సురవరం ప్రతాపరెడ్డి:
స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేలపాడు. గోలకొండ కవుల సంచికను వెలువరించి తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం కాదు పూజనీయులు అని ‘‘గోలకొండ’’ కవుల సంచిక ద్వారా చాటిచెప్పారు. జానపద కథను అనుసరిస్తూ ‘ఆరెవీరులు’ అనే వీరి నవల అసమగ్రంగా ఉంది. మరో నవల శుద్ధాంతకాంత అముద్రితం. హిందువుల పండగలు, రామాయణ వ్యాసాలు వంటి పరిశోధనాత్మక రచనలు. ఉచ్చల విషాదం, భక్త తుకారాం నాటకాలు, మొగలాయీ కథలు, హైందవ ధర్మవీరులు కథల సంపుటాలు, ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రజాధికారములు అనేవి ప్రతాపరెడ్డి, ఇతర రచనలు.
మొగలాయీ కథలు, హుసేన్‌ బీ, అపరాధం, వింతవిడాకులు వంటి స్త్రీల సమస్యల చిత్రణతో సాగిన కథలు, సంఘాల పంతులు, వకీలు వెంకయ్య వంటి కథల్లో తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. 
తరతరాల తెలుగు వారి సామాజిక చరిత్రను పరిశోధించి ప్రతాపరెడ్డి రాసిన వ్యాస సంకలనం ।ఆంధ్రుల సాంఘిక చరిత్ర। కు 1952లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలా తెలుగులో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలివ్యక్తిగా సురవరం నిలిచిపోయారు.   గోలకొండ పత్రిక అంటే సురవరం ప్రతాపరెడ్డికి మారుపేరు. ఆంధ్ర సారస్వత పరిషత్తు (ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు) స్థాపనలోనూ సురవరం కీలక పాత్ర పోషించారు. 1930న జోగిపేటలో జరిగిన (తెలంగాణ) ఆంధ్ర మహాసభల తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. హైదరాబాదు రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా సేవలందించారు.
చెర్విరాల భాగయ్య:
కాలం 20వ శతాబ్దం. స్వస్థలం హైదరాబాదు. ఆధునిక యుగంలో అత్యధిక యక్షగానాలు రాసిన రచయితగా ప్రసిద్ధులు. మొత్తం 34 యక్షగానాలు రాసినట్లు తెలుస్తోంది. యక్షగానాల మీద విశేష పరిశోధన చేసిన ఆచార్య ఎస్వీ జోగారావు... ‘‘ఆంధ్రమున నిన్ని యక్షగానాలను రచించిన కవి మరియొకడింతకు బుట్టలేదు’’ అని ప్రశంసిం చడంలోనే భాగయ్య విశిష్టత తెలుస్తుంది. బభ్రువాహన చరిత్ర, కృష్ణగారడి, మాయాసుభద్ర, ఆరెమరాటీలు, కాంభోజరాజు కథ, బాలనాగమ్మ కథ, బొబ్బిలి యుద్ధము అనేవి వీరి రచనలు. వీరి యక్షగానాల్లో తెలంగాణ తెలుగు నుడికారం, హిందీ ప్రభావం విశేషంగా కనిపిస్తాయి. ఇక భాగయ్య శిష్యుడైన మహమ్మదు అబ్దుల్లా అనే కవి ‘‘హనుమద్రామ సంగ్రామము’’ రాయడం విశేషం.
ఆచార్య బిరుదురాజు రామరాజు:
తెలుగులో జానపద గేయ సాహిత్యం మీద పరిశోధన చేసిన మొదటి పరిశోధకుడు బిరుదురాజు రామరాజు. వీరికి మార్గదర్శకులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం. ‘‘ఆంధ్రయోగులు’’ పేరుతో తెలుగు రాష్ట్రాలలోని యోగుల పరిచయ విశేషాలతో నాలుగు సంపుటాల సంకలనాన్ని వెలువరించారు.
సి.నారాయణ రెడ్డి:
జన్మస్థలం వేములవాడకి సమీపంలో హనుమాజీపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా). మాత్రా ఛందస్సు గమన రీతులు తెలిసిన సినారె... నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, భూమిక, మట్టీ మనిషీ ఆకాశం, విశ్వంభర, ప్రపంచ పదులు, రామప్ప తదితర కావ్యాలు రాశారు. గులేబకావళి కథ మొదలుకుని అరుంధతి వరకు చలనచిత్రాలకు పాటలు రాశారు. విశ్వంభరకు 1988లో భారతీయ జ్ఞానపీఠం పురస్కారం దక్కింది.
తడకమళ్ల కృష్ణారావు: 
కంబుకంధర చరిత్ర(1860), బహుశా తెలుగులో ఇదే తొలి నవల. ఈయన దీనిని వచన ప్రబంధము అని పేర్కొన్నారు. కందుకూరి వీరేశలింగం తన ‘‘రాజశేఖర చరిత్రము’’ను వచన ప్రబంధము అనే పేర్కొన్నారు.
దాశరథి కృష్ణమాచార్యులు:
‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని నినదించి, నిజాం పాలన మీద పోరాటం చేసిన కృష్ణమాచార్యులు 1925 జులై 24న పూర్వపు వరంగల్లు జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషల్లో పండితుడు. నిజాం వ్యతిరేక పోరాటం చేస్తూ, నిజామాబాద్‌ జైలులో శిక్షకు గురయ్యాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, గాలిబ్‌ గీతాలు, పునర్నవం, కవితాపుష్పకం అనేవి వీరి  రచనలు. 
‘యాత్రాస్మృతి’ దాశరథి కృష్ణమాచార్యుల ఆత్మకథ. ఇందులో చివరి నిజాం పాలనాకాలపు సామాజిక పరిస్థితుల చిత్రణ ఉంది. ‘‘అమరశిల్పి జక్కన’’ దాశరథి కృష్ణమాచార్య రాసిన ఏకైక నవల. ఇంకా 600 పైగా తెలుగు సినిమా పాటలు కూడా రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో గౌరవించింది. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు. 

 

ఇవీ చ‌ద‌వండి

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1 

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2 

 

తెలుగు సాహిత్య చరిత్ర - 3 

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం