చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు...

  • 276 Views
  • 0Likes
  • Like
  • Article Share

చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయెతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరి కొలుతు 

అంటూ తెలుగిళ్లలో తాతయ్యలు, బామ్మలు తమ మనుమలకు, మనుమరాళ్లకు పద్య పఠనాన్ని మొదలుపెడతారు. అంతేకాదు ఇప్పటికీ ఒక్కసారన్నా తమ పిల్లలకు ... ఓ గోచీ పెట్టి, చేతులకు, కాళ్లకు గజ్జెలు పెట్టి చేతిలో  వేణువును ఉంచి, నెమలిపింఛంతో తలను అలంకరించి తమ పిల్లలు ఆడైనా, మగైనా వారిలో ఆ వేణుగానలోలుణ్ని  చూసుకొని మురిసిపోతారు. అంతగా తెలుగు తల్లుల్ని ప్రభావితం చేశాడు కొంటె కృష్ణుడు. 
హిందువులు అతి వేడుకగా జరుపుకునే పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి. శ్రావణ బహుళ అష్టమినాడు వస్తుందీ పండుగ. ఆ రోజు ఇళ్లలో కృష్ణుడి పూజ ప్రత్యేకంగా చేస్తారు. ఇంటిముందు ముగ్గులుగా చిన్ని చిన్ని పాదాలు వేసి మరీ చిన్ని కృష్ణుణ్ని ఆహ్వానిస్తారు. బాల కృష్ణుడి బొమ్మను ఊయల్లో వేసి ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ అంటూ జోలలు పాడతారు. ఇక గుళ్లలో అయితే ఆ రోజు రాత్రంతా పూజలు జరుగుతాయి. 
      కృష్ణాష్టమినాడు ఉట్లు కొట్టడం తెలుగు ప్రాంతాలన్నింటా ఉన్న ఆచారం. ఆ రోజు పల్లెలు ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా చూసేవారికి కనువిందు చేస్తాయి. గ్రామంలోని దేవాలయం ముందు రెండు పొడవైన స్తంభాలు పాతి వాటిని కలుపుతూ గిలకతో ఉన్న మరో కర్రను బిగిస్తారు. ఈ గిలకకు తాడును అమర్చి తాడుకు ఒకచివర ఉట్టిని కడతారు. అందులో ఒక కుండలో పెరుగు, అటుకులు కలిపి ఉంచుతారు. స్తంభాల మధ్య చవుడును నీళ్లతో కలిపి బురదను తయారుచేస్తారు. ఇది జారుడు గుణం కలిగి ఉంటుంది. 
      గ్రామంలోని ఉత్సాహవంతులు ఉట్టికొట్టేందుకు తగిన వేషధారణతో వస్తారు. ఓ వ్యక్తి తాడును కిందికి, మీదికి లాగుతుంటే ఉట్టికొట్టేవారు కోలలతో ఎగురుతూ ఉట్టిని అందుకునే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా ఉట్టి అందే సమయానికి తాడును పైకి లాగుతారు. కింద బురద ఉంటుంది కనుక దాన్ని అందుకోవడం అంత సులువేమీ కాదు. ఒక్కోసారి జారి కిందపడతారు కూడా! ఇలా ఒకరి తరువాత ఒకరు ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తారు. తాడు లాగే వ్యక్తి ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఉట్టి కొడతారు. ఈ ప్రయత్నంలో కుండ పగులుతుంది. తర్వాత మట్టికుండలో పెరుగు, అటుకులు మిగిలితే... వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. కుండ పెంకులను ఇంటికి తీసుకు వెళ్తారు. వీటిని శుభం కలిగించేవిగా భావిస్తారు. సంబరం జరుగుతున్నంత సేపూ ఊళ్లో జనమంతా అక్కడే గుమిగూడతారు. ఉట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉట్టి కొట్టేవారిని ఉత్సాహపరుస్తూ, ఎవరైనా బురద వల్ల జారిపడితే సరదాగా నవ్వుకుంటారు. ఇలా సందడి సందడిగా ఉంటుంది అక్కడి వాతావరణం. మహారాష్ట్రలో ఈ పండుగను దహీహండీగా జరుపుకుంటారు. ఇక్కడ మనలా కాకుండా, ఉట్టి కొట్టడానికి ఒకరి భుజాలపై ఒకరు ఎక్కి, అంతెత్తున కట్టిన పెరుగు చట్టిని పగులగొడతారు. దీనిని గోవింద ఉత్సవం అని కూడా అంటారు. 
పలుమరు ఉట్ల పండుగను...
ఉట్ల పండుగ నేపథ్యంతో వేంకటేశ్వరుడిపై పాటలల్లాడు పదకవితా పితామహుడు. నల్లనయ్యని పుట్టగానే దేవకి వసుదేవుడి చేతులో పెట్టిందట. అప్పుడు వసుదేవుడు ఎంతో సంతోషించాడట. కృష్ణ జననం సందర్భంగా ఆనందంతో ఉట్లు కొడుతున్నారు రేపల్లె వాసులు. పైకొని చూడరె వుట్ల పండుగ నేడు/ ఆకడ గొల్లెతకు నానందము నేడు అంటూ... పైకొని- అంటే ప్రయత్నించి చూడండి ఉట్ల పండుగను... అదిగో ఆ చివరన గొల్లెత ఆనందిస్తోందంటూ ఉట్ల పండుగ కోలాహలాన్ని పదంగా మలచాడు పదకవితా పితామహుడు. అసలు తిరుమలలో ఉట్ల పండుగను ప్రారంభించింది అన్నమయ్యేనట! తిరుమల గర్భాలయంలో నిలుచొని చేతిలో వెన్నముద్ద పట్టుకొని ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటుందట!
పలుమరు ఉట్ల పండుగను 
చిలుకు చిడుక్కని చిందగను       ।।
ఊళ్ల వీధుల ఉట్లు కృష్ణుడు
తాళ్లు తెగిపడ తన్నగను
పెళ్లు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని
పెళ్లుగ మ్రోసే పెనురవము          ।।
బంగరు బిందెల పాలు పెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగు మీరు పెనురవములై         ।।
నిగ్గుగ వేంకట నిలయుడుట్టి పా
లగ్గలిక పగుల నడువగను
బగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ గురియగను       ।।

      కృష్ణాష్టమినాడు ఏ ఊళ్లో చూసినా వీధి వీధిలో ఉట్లు కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తారు. అలాంటి ఓ రోజు గోకులంలో గోపాల కృష్ణుడు ఉట్లు కొట్టేందుకు వెళ్లాడు. ప్రతి వీధిలోనూ పరమాత్ముడే. ‘పలుమరు’ అంటే మాటిమాటికి. ఊళ్లో అన్ని వీధుల్లోని ఉట్లు కొట్టేందుకు వెళ్లాడన్న అర్థంలో ‘పలుమరు ఉట్ల పండుగను’ అని ప్రయోగించాడు అన్నమయ్య. ‘చిలుకు చిడుక్కని చిందగను’ అంటే... ఏదైనా ద్రవరూపంలో ఉన్న పాత్రను బలంగా కొడితే లోపలున్న ద్రవంనుంచి చిలుక్, చిడుక్‌ అనే శబ్దం వెలువడుతుంది. ఉట్టిని కోలతో కొట్టినప్పుడు కుండలోని పాలు చిలుక్, చిడుక్‌ శబ్దంతో చిందాయట. గొల్లపల్లెలోని వీధుల్లో ఉట్లన్నీ తాళ్లు తెగిపడేలా తన్నాడు చిలిపి కృష్ణుడు. అప్పుడు పెళ్లు, పెఠిల్లు, కఠిల్లుమంటూ పెళపెళా పెద్ద శబ్దం చేస్తూ మోగాయట ఉట్లన్నీ. 
      కిట్టయ్య అల్లరికి తాళలేక వ్రజభామలు పాలు పెరుగు బంగరు బిందెల్లో ఉట్టిమీద పెట్టారు. ఉట్టిని అందుకోలేక పోవడంతో ఆ బిందెల ముంగిట్లో- ఎదురుగా నిలబడి ఎగిరెగిరి మోదాడట అల్లరి కృష్ణుడు. ఎగయడం అంటే ఎగరడం. రంగు అంటే వర్ణము, సొంపు అని అర్థాలు. ‘రంగుమీరు పెనురవములు’ అంటే సొంపుగా వినిపించే పెద్ద శబ్దాలు. అలా వినసొంపుగా పెద్ద శబ్దంతో కంగు, కళింగు, కఠింగు, ఖణింగని మోగాయట. వీటిని అందుకునేందుకే తన స్నేహితులను ఒకరి భుజంపై ఒకరిని నిలబెట్టి తాను ఒక్కొక్కరి భుజాలపైకి అధిరోహించి పాలు, పెరుగు తాను తాగి, వచ్చిన వారికి కూడా పంచి ఉంటాడు. ఉట్ల పండుగకు ఆలంబన ఈ దృశ్యమే.
నిగ్గుగా- నికరంగా (మొత్తానికి) ఆ వేంకట నిలయుడే వెన్నదొంగ రూపంలో ఉత్సాహంగా ఉట్టిని పగులకొట్టాడు. అగ్గలిక అంటే ఉత్సాహంగా. అడువడం- అడువు, అడుచు పదాలకు అర్థం కొట్టడం. అప్పుడు ఆ ఉట్టిమీది మట్టికుండ పగిలి పాలు కురిశాయి. దాన్నే బగ్గు భగిల్లని అంటూ చెవులకు వినిపిస్తున్నాడు సంకీర్తనా చార్యుడు. ఆ పాలు ఆ బాల వేంకట కృష్ణుడికి గుగ్గిలి, అంటే గుక్కిలి, గుటక పదనయ్యేంతగా కురిశాయట! అయితే అవి తానొక్కడే తాగలేదు. తనతోపాటు వచ్చిన బాలలకూ పంచాడు. అందుకే ఆ పాలకు ‘పరమామృతములు’ ప్రయోగం. ఆయన అందరివాడు. అన్నమయ్య కృష్ణావతారం పై వేంకట ముద్రతో ఎన్నో పాటలు రాశాడు. ఈ పాట పోతన భాగవతంలోని
పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక ఱోలు బీటలు నొక్కప్రోవిడి యెక్కిచే
వెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ 
పట్టి మీగడ పాలు చేరల బట్టి త్రావె దలోదరీ!

      పద్యానికి సమానంగా ఉంటుంది. కృష్ణుడి అల్లరి భరించలేక గోపకాంతలు యశోదతో మొరపెట్టుకుంటున్న సందర్భంలోది ఈ పద్యం. గోపకాంతల ఇళ్లలోకి ప్రవేశించిన కృష్ణుడికి ఉట్టి మీదున్న పాలందలేదట. అక్కడే ఓ రోలు ఉన్నట్లుంది. అంతే కన్నయ్య రోలుపైకెక్కి ప్రయత్నించాడు. అయినా ఉట్టి అందలేదు. దాంతో రోలుపై పీటలు వేసుకొన్నాడు. అయినా ఉట్టి మీదున్న కుండలోకి¨ చేయి పోలేదట. అందుకని అందిన కింది భాగానికి పెద్ద రంధ్రాన్ని చేసి కురుస్తున్న మీగడ పాలను దోసిలిపట్టి తాగాడని ఫిర్యాదు చేస్తున్నారు. పోతన పద్యానికి అన్నమయ్య పాట రాసినట్లుంది కదా! 


వెనక్కి ...

మీ అభిప్రాయం