ములుకోల ఆడితే...

  • 395 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। కపిలవాయి లింగమూర్తి

  • నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లా.
డా।। కపిలవాయి లింగమూర్తి

కాడెద్దులు కదలాలంటే... బండి ముందుకు నడవాలంటే ఒకప్పుడు ములుకోల ఆడాల్సిందే. సాగులోనైనా, ప్రయాణంలోనైనా మట్టిమనుషులకు నేస్తంగా నిలిచిన ఆ కోల ఇప్పుడు కనపడట్లేదు. 
ఇప్పటి
తరానికి ములుకోల (ములుగర్ర) అంటే తెలియకపోవచ్చు కానీ.... ఒకప్పుడు రైతులు పొలం దున్నేటప్పుడు, బండ్లు తోలేటప్పుడు ఎద్దులను, దున్నలను అదిలించేందుకు దాన్నే ఉపయోగించే వారు. ఇప్పుడైతే పొలాలను దున్నేందుకు ట్రాక్టర్లు, ప్రయాణాలకు బస్సులూ, కార్ల్లూ వచ్చాయి. ఎద్దులు, దున్నల అవసరమూ తీరిపోయింది. ములుగర్ర మూలపడింది. తెలుగు సాహిత్యంలో 14వ శతాబ్దిలో వచ్చిన కృష్ణ శతకంలో ములుకోల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ శతకాన్ని రచించింది నరసింహకవి. 
జయమును విజయునకీయగ
హయముల ములుకోలమోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపుసేన విరిగి పారగ కృష్ణా

      ఓ శ్రీకృష్ణా! కురుక్షేత్రంలో అర్జునుడికి విజయం కలిగేట్లు ములుకోలతో గుర్రాలను అదిలించి రథాన్ని వేగంగా నడుపు  (రొప్పడం అంటే తరమడం). అది చూసి భయపడి శత్రుసేన భయంతో కకావికలై పారిపోవాలని ఈ పద్యం అర్థం. 
      తెలుగు రైతు చేతికి ములుకోల అరు శతాబ్దాల కిందట వచ్చింది. దున్నకు ములుకోల, గుర్రానికి చెర్లకోల అని వెనకటికి అనేవారు. చెర్లకోలను ఇప్పుడు ‘చెర్నాకోల’ అంటున్నారు. చేరులు అంటే సన్నని పురులు గల తాళ్లు. అవి కట్టిన కర్ర కనుక దానికి ‘చేరుల కోల’ అని పేరు. కాలక్రమంలో అది చెర్లకోల అయింది. ములుగర్రను సంస్కృతంలో ‘తోత్రం’ అంటారు. వ్యాసుడు కూడా మహాభారతంలో కృష్ణుడి చేతిలో వేత్రం, తోత్రం పెట్టాడు.
      వేత్రం అంటే బెత్తం. ఈ బెత్తాలు వేత్రవతీ నదీతీరంలో తుంగలా మృదువుగా నిటారుగా పెరిగే గడ్డి జాతి మొక్కలు. ఇప్పుడు ఈ బెత్తం కర్రలను చీరి వాటితో సోఫాలు, టీపాయిలు వంటివి అల్లుతున్నారు. ఇది ‘బరుగు’గా ఉన్నప్పుడు చేత పట్టుకొని ఊపితే జవజవలాడుతూ ఊగుతుంది. అప్పుడు ‘జపజప’ శబ్దం వస్తుంది. పూర్వం గుర్రపు రౌతుల దగ్గర ఈ బెత్తాలుండేవి. వేగం మందగించినపుడు బెత్తాన్ని ఊపితే చాలు ఆ శబ్దానికే గుర్రం భయపడి పరుగులు పెట్టేది.
      తోత్రం విషయానికి వస్తే, ఏనుగును పొడిచేది- అంకుశం అని అర్థం. దీనితో మావటివాడు గజాన్ని పొడుస్తాడు. మావటి అంకుశంతో చేసే పనిని రైతు ములుగర్రతో చేస్తాడు. మావటి ఏనుగు కుంభస్థలాన్ని పొడిస్తే, రైతు ఎద్దు లేదా దున్న పిరుదును పొడుస్తాడు.
      ఈ ములుగర్రలు వెదురు కర్రలు. అయితే ‘చెట్టు చెట్టునం గలుగగ నేర్చునే గొడుగు కాడలు’ అన్నట్లుగా ఈ కర్రలు అన్ని వెదురు గుమ్ములలో పుట్టవు. ఇవి పుట్టే గుమ్ములు వావిలి పొదల్లా వేరుగా ఉండి మొదటి నుంచే బరుగులుగా పెరుగుతాయి. పూర్వం ఈ ములుగర్రలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బూదపురం (భూత్పూర్‌) మండలంలోని ‘మొలుగర’ ప్రసిద్ధి. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’లో మార్గమధ్యంలో ఈ గ్రామాన్ని సందర్శించినట్లు రాశారు. దీనిని మూలుకర్ర అని పేర్కొన్నాడు. ఆ మూలుకర్రనే ‘మొలుగర’ అయింది. పూర్వం వ్యవసాయం చేసే రైతులందరి చేతిలో ఈ ములుగర్రలే ఉండేవి. వాటితో పొడిచి పొడిచి గడెంపోయే పశువుల పిరుదులకు తెల్లగా పెద్దపెద్ద దండెలు (మచ్చలు) పడేవి. ఈ మచ్చలను బట్టి పశువులు వలపలివా, దాపలివా, పనిపోయేవా, పోనివా పసిగట్టేవారు రైతులు.
      కృష్ణ శతకకర్త నరసింహకవి తెలుగువాడు. కనుక తెలుగు జాతీయాభిమానంతో సంస్కృతంలో వ్యాసుడు చెప్పిన వేత్ర తోత్రాల్లో, తోత్రాన్ని తీసుకుని ‘ములుకోలు’ అని అనువదించాడు. కానీ ‘హయముల బెత్తమ్ముతోడ నదలించి మహారయమున రొప్పవె తేరును’ అని ఉంటే అది శత్రుసేనకు ఇంకా భయంకరంగా ఉండేదేమో.‌


వెనక్కి ...

మీ అభిప్రాయం