ప్రేమించినాక తెలిసే...

  • 161 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కలకుంట్ల శ్రీలతరావు

  • కరీంనగర్.
  • 9491480386

ప్రియమైన శ్రీవారికి
నీలాకాశాన్ని తెల్ల కాగితంలా మార్చి,
సూర్యచంద్రుల దీపాల వెలుగులో
నక్షత్రాల అక్షరాలు చేసి, నా మనసు కలంలో నీ తలపుల సిరాపోసి నీకీ ప్రేమలేఖ రాస్తున్నాను.
      ప్రేమానురాగాలతో బంధం వేసి ఆ అనుబంధపు బంధనాలతో నీ వలపుల సంకెళ్లతో నన్ను నీ తలపులకు బందీని చేశావు. నా నిశ్శబ్దంలోకి అలవోకగా అడుగు పెట్టి సందేహంలో బతుకుతున్న నన్ను వివాహబంధం అనే సందిట బిగించి జీవితాంతం బాసటగా నిలుస్తున్న నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?
      గాలి గాలిగానే ఉంటుంది వేణువునుంచి రాగమై రవళించే దాకా! నీరు నీరుగానే ఉంటుంది. ఇంధ్రధనుస్సు చివరి వర్ణం విరిసేదాకా!
      కొన్ని వద్దనుకున్నా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటివే నీ జ్ఞాపకాలు వాటినుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి లాభంలేక ఊరుకున్నాను. అపుడనిపించింది నువ్వు నన్ను నిజంగా ఇంతగా ప్రేమిస్తున్నావా అని. సంక్రాంతి పండుగకని మిమ్మల్ని వదిలి పుట్టింటికి వచ్చినా నీ జ్ఞాపకాల దొంతరలే దర్శనమిస్తున్నాయి.
      ఎపుడైనా గాలిబ్‌ గేయాలు చదివావా? ‘నిదురించే ప్రియురాలి ఎర్రని పెదవుల్ని ముద్దుపెట్టుకున్నాను. ఎంత అందమైన దొంగతనం అది’ అంటాడు. ఆ వాక్యం గుర్తొచ్చిన వెంటనే పండుగను, పుట్టింటిని వదిలేసి నీ చెంత వాలిపోవాలనిపిస్తుంది.
      ఏయ్‌! నానుంచి నేను వేరై నీలో ఒక్కసారి విలీనమవనియ్యి. నీ అనుభూతులు నావిగా చేసుకొని నీ ఆనందం నాదవ్వాలి. నిజం చెప్పాలంటే నువ్వుత్త అల్లరి పిల్లాడివి. అంతకన్నా గొప్ప భావుకుడివి. కాకపోతే ఆ భావుకత్వాన్ని చిలిపి సరదా పరదాల మాటున దాచేస్తావు. నువ్వు అల్లరిగా నవ్వుకుంటుంటే మెరిసే నీ కళ్లకైనా ఇవ్వొచ్చు కోటి వరహాలు అనుకుంటాను. ఆటపట్టించను అంటే నీకు ఓ నిజం చెప్తాను. నీ నుదుటిని ఆక్రమించటానికి గాలి సాయంతో కుట్రపన్ని ప్రయత్నం చేస్తున్న నీ జుట్టుని వెనక్కితోసి నీ నొసటన చటుక్కున ముద్దు పెట్టాలనిపిస్తుంది. ‘మనిషి ప్రేమలో పడినపుడు కాలంకన్నా ముందు పరుగెడతాడు విరహంలో వేగిపోతున్నపుడు వెనక్కి పయనిస్తాడు. ఆస్వాదనలో ఉన్నపుడు ఆగిపోతాడని’ ఎక్కడో చదివాను. వింతేమిటంటే ఈ మూడింటిని నేనొకేసారి అనుభవించడం. జీవితమంటే సెకన్లు, గంటలు రోజులను నెట్టుకు పోవడం కాదేమో. నీ స్మృతుల తోడుగా కాలాన్ని అనుభవిస్తూ నీ తోడుగా జీవించడమే నా దృష్టిలో ప్రేమంటే. 
      మంచి అబ్బాయి ఎలా ఉండాలో అలా ఉంటావు నువ్వు. భర్తల్లో పదిశాతమైనా భార్యలకి అనుకూలంగా ఉంటున్నారో లేదో అనుమానమే నాకు. అలా ఉంటే వాళ్లను ఇతరులు భార్యా విధేయులు అంటారని వాళ్ల భయం. ఇంత సంకుచితంగా ఆలోచించే వాళ్లను ఏం చేయగలం. అయినా ఒకర్నొకరు అర్థం చేసుకుని అనుకూలంగా మసలు కోవడం విధేయత ఎందుకవుతుంది. మనిద్దరం ఒకరికోసం ఒకరుగా ఉంటున్నాం. ఇది ఇలా కొనసాగితే చాలు.
      నీకు నేనీ ఉత్తరం రాస్తుంటే పక్కింటి వాళ్ల్ల చరవాణినుంచి ‘సౌసాల్‌ పహలే ముఝే తుమ్‌సె ప్యార్‌ థా... ఆజ్‌ భీహై అవుర్‌ కల్‌ భీరహేగా’ పాట వినిపిస్తోంది. నేను దాంతో గొంతు కలిపి సౌసాల్‌ కాదు ఏక్‌సాల్‌ అనుకున్నాను. ఇంత చిన్న మనసులో ఇంతటి మహా ప్రణయాన్ని ఎలా నింపావు ప్రియతమా!
      మన పెళ్లైన కొత్తలో ఓసారి దూరదర్శన్‌లో ప్రేమపావురాలు సినిమా వస్తుంటే పావురాలు అంటే తెలుసు కాని ప్రేమంటే ఏంటోయ్‌ అని చిలిపిగా అడిగావు గుర్తుందా? ప్రేమంటే ఏంటి అన్న ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవేమోగాని నేను మాత్రం చెప్పలేను. ఎందుకంటే నాకు ప్రేమని ఆఘ్రాణించడం, అందించడం మాత్రమే తెలుసు కాని దానిని నిర్వచించడం తెలియదు. అయితే నాకు కలిగే భావాలన్నీ ప్రేమకు సంబంధించినవే. వీటిని అర్ధం చేసుకుని ఎలా భాష్యం చెప్పుకుంటావో నీ ఇష్టం.
      ఇపుడు టైమెంతయిందో తెల్సా! అర్ధరాత్రి దాటింది. లోకమంతా గాఢనిద్రలో ఉంది. నేను మాత్రం రాస్తూనే ఉన్నాను. ఇలా రాస్తూపోతే నా భావాలకి నా దగ్గరున్న కలం, కాగితాలు ఏవీ సరిపోవు. అందుకే సెలవా మరి.

నీ శ్రీమతి


వెనక్కి ...

మీ అభిప్రాయం