పడిశం పదిరోగాలపెట్టు!

  • 498 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఎ.సుబ్రహ్మణ్యం

  • హైదరాబాదు
  • 9394743591
ఎ.సుబ్రహ్మణ్యం

తినకపోతే నీరసం, తింటే ఆయాసం... ఒడలు వడలిపోకూడదంటే తినకతప్పదు. అలా అని మోతాదు మించితే భుక్తాయాసంతో ఒళ్లు వంగదు. ఈ రెండు విషయాలనూ కలిపి నాలుగు పదాల్లో చెప్పేశారు మన పెద్దలు.  ఇదే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన లోతైన విషయాలెన్నింటికో సామెతల రూపమిచ్చి, ప్రజల నోళ్లలో నానేలా చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేశారు.  తెలుగువారి వైద్య పరిజ్ఞానానికి ఆనవాళ్లయిన ఆ సామెతలన్నీ అపూర్వమైనవే.  
ఆనందం,
ఆవేశం, సుఖం, దుఃఖం, భయం, భక్తి, అనురాగం, ప్రేమ, కోపం, వాత్సల్యం, ఆశ్చర్యం... ఇలాంటి వాటిని ప్రభావవంతంగా వ్యక్తీకరించాలంటే సామెతలతోనే సాధ్యం. మనసులోని మాటను సూటిగా, స్పష్టంగా, ఎదుటివాడికి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే సామెతలను ఆశ్రయించకతప్పదు. మానవ జీవన వికాసం ప్రారంభమైన దగ్గరినుంచి అనుభవంలోకి వచ్చిన అనేక అంశాలను తార్కికంగా విశ్లేషించుకుని, అర్థం చేసుకున్న విషయాలపై భావితరాలకు అవగాహన కల్పించడానికే మన పూర్వీకులు సామెతలను సృష్టించారు. ప్రసార మాధ్యమాలేవీ అందుబాటులో లేని ఆ కాలంలో... వ్యక్తిత్వ వికాసం నుంచి వైద్యారోగ్యాల వరకూ సమాజానికి అవసరమైన సమాచారాన్ని అందించే ‘నిపుణుల’ పాత్రను ఈ సామెతలే పోషించాయి. మన మాటల్లో దొర్లుతూ, మనకు తెలియకుండానే మన ఆలోచనలను సానుకూల దృక్పథం వైపు మళ్లించే ఆ మాటల ముత్యాల్లో ఆరోగ్య ప్రధానమైనవి ప్రత్యేకం. వివిధ అనారోగ్యాల నుంచి బయటపడటానికి అవలంబించాల్సిన పద్ధతులంటూ ఆధునిక వైద్యులు సూచించే అంశాలెన్నో ఆ సామెతల్లో దర్శనమిస్తాయి. 
      రోగాలు రొష్టులతో మనుషులంతా ఈసురోమంటూ బతుకుతుంటే సమాజ పురోగతి కుంటుపడుతుంది. అందుకే, మనవాళ్లు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని ఉద్బోధించారు. ఒంట్లో ఓపిక లేనివాళ్లు ఏ పనీ చేయలేరు. ఆ చేతకానితనంలోంచి నిరాశా నిస్పృహలు మోరలాడిస్తాయి. నిరాశావాదం విజృంభించినప్పుడు అభివృద్ధి అటకెక్కుతుంది. ఆ ప్రమాదాన్ని తప్పించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఉన్నంతలో సంతోషంగా ఉంటే చాలు, ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ‘సంతోషం సగం బలం’ అనడంలో అర్థమిదే. తలపుల్లో ఆనందం తాండవమాడుతుంటే తనువుకు అనారోగ్యాలంటవు. 
అక్కడ గుట్టు... ఇక్కడ రట్టు
వైద్యుల దగ్గర, న్యాయవాదుల దగ్గర అబద్ధాలాడకూడదంటారు. ఎందుకంటే, వారికి నిజాలు చెప్పకుంటే తర్వాత మనకే ప్రాణం మీదకొస్తుంది. ఉన్న రోగాన్ని బయటకు చెప్పుకోకపోతే ప్రమాదం. అలా అని సంసార బాధలను బహిరంగపరిస్తే ఇంకా ప్రమాదం. ఇంటి గుట్టు రచ్చకెక్కితే కాపురం కాకుల పాలవుతుంది. ఈ రెండు విషయాలనూ సూటిగా చెప్పే పెద్దల మాట... ‘సంసారం గుట్టు - రోగం రట్టు’.
      చిన్న నలత చేస్తే చాలు అరచి గగ్గోలు పెట్టేస్తారు కొంతమంది. బాధతో కొంత, భయంతో మరికొంత... సమస్యను జటిలం చేసుకుంటారు. జలుబు     పెరిగి జ్వరం వస్తుందేమో... జ్వరం ముదిరితే ఇంకేమవుతుందో... ఇలా ప్రతికూల ఆలోచనలతో చేజేతులా అనారోగ్యాన్ని పెంచేసుకుంటారు. అలాంటి వాళ్లను చూసే అన్నట్లున్నారు, ‘ఆయుష్షు తీరినవాడు ఆరు నెలలకే చస్తే - అనుమానపడిన వాడు అప్పుడే చస్తాడ’ని! మరోవైపు, జబ్బు పడి ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యుడిపై నమ్మకం ఉంచాలి. ఆయన వైద్యాన్ని విశ్వసించాలి. ‘ఆ ఆయనేదో మందులిస్తున్నాడు కానీ, నాకు నమ్మకం లేదు’ అనే వాళ్లను అనారోగ్యం అంత తొందరగా వదిలిపోదు. ఈ విషయాన్నే ‘దిగులుకు మించిన వ్యాధి - విశ్వాసాన్ని మించిన ఔషధం లేద’ంటూ చెప్పుకొచ్చారు అనుభవజ్ఞులు.
      జన్యుపరమైన వ్యాధులు కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులకు అవి ఉంటే, పిల్లలకూ వచ్చే అవకాశాలెక్కువ. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో ఇలాంటివి గమనించాలని చెప్పే సామెత... ‘తల్లికి బొల్లి ఉంటే పిల్లకు చుక్కయినా ఉంటుంది’. వెనకటి తరానికి ఎంత ముందుచూపో చూడండి!
పచ్చగా కనపడితే రోగమే!
పడిశం పట్టినప్పుడే చూడాలి పడుచుదాని అందం అని సరదాగా అన్నారేమో కానీ, జలుబు చేస్తే మాత్రం మహా ఇబ్బందే. తలనొప్పి, ముక్కు సంబంధ సమస్యలు, కఫరోగాలు, ఊపిరితిత్తుల సమస్యలు... ఇలా అనేక సమస్యలను మోసుకొస్తుంది జలుబు. మరోవైపు, ముక్కు దిబ్బడ వల్ల శరీరానికి సరిపడినంత ప్రాణవాయువు అందదు. అందుకే అన్నారు ‘పడిశం పది రోగాలపెట్టు’ అని! మరోవైపు, ‘పడిశం ముక్కోడికి పారిజాతం పూలెందుకు?’ అని ప్రశ్నించారు కొందరు. జలుబు చేస్తే వాసన తెలియకుండా పోతుందన్న అంతరార్థముంది ఇందులో. అలాగే, ‘ఆస్వాదించే హృదయం లేనివాడికి దాన్ని ఇవ్వడమెందుకు’ అన్నది మరో అర్థం. ఇలా నానారకాలుగా వేధించే ‘జలుబుకు మందు తింటే వారంలో తగ్గుతుంది - తినకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది’. 
      కామెర్ల వ్యాధి వస్తే కళ్లు పచ్చగా ఉంటాయి. దీన్నే ‘పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంద’ని చెప్పారు. మరి ఆ రోగం తగ్గాలంటే... ‘పచ్చ కామెర్ల రోగికి పల్చని మజ్జిగే పథ్యం’. కారం, పులుపుల జోలికిపోతే సమస్య తీరదన్నది మనవాళ్ల అనుభవం. జబ్బు పడ్డప్పుడు తినకూడనివి తినకుండా ఉంటే చాలు, సమస్య దానంతటదే తీరిపోతుందని చెబుతారు. ‘లంఖణం పరమౌషధం’ అన్నా, ‘చప్పిడి తింటే రోగం కుదురుతుంద’న్నా వారి ఉద్దేశమిదే. అయినా సరే, రోగి రుచులు కోరుకున్నాడనుకోండి... ‘జ్వరమున్న జిహ్వకు పంచదార చేదు’ నాయనా అని వారించాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు చేసే పథ్యం ఎంత ప్రధానమైందో... రోజువారీ జీవితంలో సత్యనిష్ఠ అంత ముఖ్యమైంది. ఈ రెండింటినీ కలిపి చెప్పే మాట... ‘పథ్యం చెడరాదు - సత్యం తప్పరాదు’. ధర్మాన్ని దారితప్పించేసి, ఇష్టారీతిగా బతుకుతామంటే రోగాలు తప్పవు. ముఖ్యంగా అక్రమ సంబంధాల జోలికి పోతే ప్రాణం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే, ‘సోకులోడికి అరఘడియ భోగం - ఆరునెలల సెగ రోగం’.
అతిగా తింటే...
‘ఆవు పాలు అరవై ఆరు పిండివంటలతో సమాన’మన్నది నానుడి. ఏం తాగితే ఒంటికి మంచిదో చెప్పడమే కాదు, ఏం తినాలి... ఎంత తినాలన్న విషయాలపై కూడా సామెతలను కూర్చారు పెద్దలు. ‘ఒకపూట తింటే యోగి, రెండు పూటలు తింటే భోగి, మూడు పూటలు తింటే రోగి’ అన్నారు. ‘బహుతిండి బహునాశన’మని హెచ్చరించారు. 
      ఇక మూలికల నుంచి చిట్కా వైద్యాల వరకూ అన్నింటినీ వివరించే సామెతలకైతే కొదవే లేదు. ‘ఔషధం కానిది అవనిలో లేదు, ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు, కరక్కాయ కన్నతల్లి, మున్నూట ఇరవై నాలుగు రోగాలకు మూడు గుప్పిళ్లు కరక్కాయ పొడి, ఆకలి లేదంటే ఆముదం పుచ్చుకోవాల్సిందే’ తదితరాలన్నీ ఈ కోవలోనివే. రోగమేంటో తెలియకుండా బాధపడేవారికి ఏ ఔషధం పనిచేస్తుందో అర్థం కాదు. ఇలాంటి వారికి పెన్నేరుగడ్డతో చేసిన మందు తాగిస్తే గుణం కనపడుతుందన్నది (పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డే మందు) పెద్దల సలహా. శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలు ప్రకోపిస్తే అనేక సమస్యలు వస్తాయి. అవి తీరాలంటే తిప్పతీగను నమ్ముకోవాలంటుంది ఆయుర్వేదం. అయినా, ‘త్రిదోషాపహరం తిప్పతీగ’/ ‘త్రిదోష హరం తిప్పసత్తు’ అన్న సంగతి తెలిసిందే కదా. 
నారుపోసిన వాడే...
బాలింతలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా తేడా చేస్తే, అనేక సమస్యలు దండుకడతాయి. అందుకే ముందుజాగ్రత్తగా... కాయకల్ప లేహ్యాన్ని తయారుచేసి వారితో తినిపించే వారు పూర్వం. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, చవ్యం, మోడి, కటుక, లోహిణి, తెల్లజీలకర్ర, వాము, ఛామపసువు దుంపరాష్ట్రం లాంటి మూలికలను శుద్ధి చేసి దోరగా వేయించి దీన్ని తయారు చేస్తారు. బాలింత శరీరంలో అదనంగా ఉన్న నీటిని ఇది కరిగిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. ప్రసవానంతర నొప్పులను తగ్గిస్తుంది. తల్లిపాలను వృద్ధి చేస్తుంది. ఈ ఔషధాన్ని గ్రామీణ పరిభాషలో ‘కాయం’ అంటారు. కొన్ని ప్రాంతాల్లో ‘సౌభాగ్యశొంఠి’ అని కూడా పిలుస్తారు. పిప్పలికట్టె, పిప్పలి వేర్లను కూడా దీని తయారీలో వాడతారు. ఈ మొత్తం క్రతువు గురించి అయిదు పదాల్లో చెప్పే పెద్దల మాట... ‘కడుపు చేసినవాడే కాయమూ, పిప్పళ్లు తెస్తాడు’. భార్య బాగోగులు పట్టించుకోవాల్సింది భర్తే కదా మరి. 
      అలాగే, నవజాత శిశువులకు జాజికాయ, మాచికాయలు చేసే మేలు అంతా ఇంతా కాదు. పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉంటే నిద్రపోకుండా ఏడుస్తారు. వారికి ఆ బాధను తప్పించే మార్గాన్నీ సామెత రూపంలో చెప్పారు పెద్దలు. ‘జాజికాయ పోస్తే జోకొట్టినట్టు నిద్రపోతారు - మాచికాయ పోస్తే మతిపోయినట్లు నిద్రపోతార’న్నదే వారి సూచన.
      ఇప్పుడైతే పేస్టులు, బ్రష్షుల గోల ఎక్కువైంది కానీ, ఒకప్పుడు దంతధావనమంటే వేపపుల్లలతోనే. వేపే కాదు ఉత్తరేణి, కానుగ, సండ్ర, మారేడు లాంటి మొక్కలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పళ్లుతోము కుంటే ఆరోగ్యకరమని పూర్వీకులు ఎంత బాగా చెప్పారో చూడండి... ‘ఉత్తమం ఉత్తరేణి, మధ్యమం మారేడు’. ‘కనీసం కంది పుల్లతోనైనా తోముకుని’ దంత సమస్యల్నుంచి బయటపడమని సలహా ఇచ్చారు వారు.
      ఇలా ప్రతి ఆరోగ్య సమస్యకూ పరిష్కారం చూపించే సామెతలెన్నో ఉన్నాయి. వాటిని విన్న వారందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా పదాలకు మెరుపులద్దారు పెద్దలు. సంప్రదాయ వైద్య విజ్ఞానం, అనారోగ్యం బారినపడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలన్నింటినీ మేళవించి మరీ వీటిని రూపొందించారు వారు. కానీ, ఆధునిక చదువుల పుణ్యమాని నవతరానికి ఈ విజ్ఞానం అందకుండా పోతోంది. పాఠ్యపుస్తకాల నుంచి తల్లిదండ్రుల మాటల వరకూ ఎక్కడా ఇలాంటి సామెతలు కనిపించట్లేదు. వినిపించట్లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, తెలుగువారి వైద్య వారసత్వ సంపద అంతా అదృశ్యమైపోతుంది. అదే జరిగితే, కంట్లో నలక పడ్డా ఖరీదైన కంగాళీ వైద్యం వైపు బేలచూపులు చూసే దుస్థితి దాపురిస్తుంది. అది ఆరోగ్యానికే కాదు, జేబుకూ, జాతికీ మంచిది కాదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం