హైదరాబాద్ నుంచి 4143 కిలోమీటర్ల దూరంలోని మౌల్మీన్ నగరంలో వినిపించే ‘మూన్’ భాషకూ తెలుగుకు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. తెలుగువారు మర్చిపోయిన ప్రాచీన తెలుగు పదాలెన్నో ఆ భాషీయుల నాలుకలపై నాట్యమాడుతుంటాయి. అలా అని, ఆ ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల వల్ల మన భాష ప్రభావం వారి పలుకుపై పడిందనుకుంటే పొరపాటు. ఎందుకంటే, తెలిసినంతలో ‘మూన్’కు అలాంటి మచ్చల్లేవు.
మరి తెలుగుకు, దానికి ఉన్న అనుబంధానికి కారణమేంటి? ఒకే ఒక్కటి... ఆ భాషీయులు మరెవరో కారు తెలుగువారే! తెలంగాణ నుంచి వలసెళ్లిన తలైంగులే ఆ మౌల్మీన్ నగరవాసులు. నేటి మయన్మార్(బర్మా) సమాజంలో ‘మూన్ జాతీయులు’గా వాసికెక్కిన ఆ తలైంగులు... తెలుగు నేలను విడిచిపెట్టి పదిహేను వందల సంవత్సరాలయింది! పుట్టినగడ్డను వదిలి సుదూరతీరాలకు చేసిన పయనంలో ప్రాకృతిక పరిస్థితులకు అనుగుణంగా ‘మూన్’ పేరిట తమకంటూ ఓ మాతృభాషను ప్రత్యేకించుకున్నా... వారి మాటలో తెలుగుదనం పోలేదు. తెలంగాణను, గోదావరీ నదీమతల్లినీ తలచుకుంటూ వారు పాడుకునే జోలపాటలూ కనుమరుగు కాలేదు.
బాబూ...! మన ప్రియ రాజ్యం తెలంగాణ. రాజు యోగ్యుడు కాకపోవడంతో మనం యుద్ధంలో ఓడిపోయాం. తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు ప్రాంతాలకు వేగంగా తరలిపోయాం. కల్లాకపటం తెలియని ఓ గిరిజన పిల్లవాడు దారిచూపడంతో మనం ఇక్కడకు... ఈ ఎర్రనేలకు... ప్రాచీనమైన ఈ అద్భుత పట్టణానికి వచ్చాం.
బాబూ...! కోరమండల్ సముద్రతీరం మన ప్రాంతం. గోదావరి నది పక్కనే మన స్వస్థలం. అదే మూన్ దేశం. రాజు లేకపోవడం వల్ల మనం విడిపోయాం. ముదోన్ దేశానికి పక్కగా ఉన్న ఈ బిలుగ్యున్ దీవిలో అడుగుపెట్టాం. ఇదంతా మన ఖర్మ ఫలితం.
జాన్ అలగ్జాండర్ స్టివార్ట్ అనే బ్రిటీష్ ఇండియా సివిల్ సర్వీసు అధికారికి... బర్మాలోని థటోను జిల్లా జింగ్యేక్లోని ఖాలక్-ఇన్ మఠానికి చెందిన ఓ వృద్ధ మూన్ పురోహితుడు 1926లో ఇచ్చిన రాతప్రతిలోని జోలపాటల సారాంశమిది. ఆ పాటలను విశ్లేషిస్తూ, అందులోని ‘తెలంగాణ, గోదావరి’ తదితర పేర్లను వివరిస్తూ, మూన్ జాతీయులు భారతదేశ తూర్పుతీరం నుంచి వలసవచ్చిన వారేనంటూ... ‘ది సాంగ్ ఆఫ్ త్రీ మూన్స్’ అనే పరిశోధన పత్రాన్ని వెలువరించారు స్టివార్ట్. ఆయన వాదన ప్రకారం మూన్ జాతీయుల్లో ‘మూన్ తాంగ్, మూన్ తే, మూన్ న్యా’ అనే మూడు వర్గాల వారున్నారు. వాళ్లు బర్మాలోని పెగూ, మౌల్మీన్, బస్సేన్లలో స్థిరపడ్డారు. వీరు పాడుకునే పాటల్లో కనిపించే కథనాల్లో స్వల్ప భేదాలున్నా... గోదావరి నదీతీరంలోని తెలంగాణ ప్రాంతం నుంచి బర్మాకు రావడం మాత్రం నిజమని స్టివార్ట్ తేల్చారు. అందుకే వారు ‘తలైంగులు’ అయ్యారు.
సరే, ఎలాగూ ఈ పాటలను బట్టి మూన్ ప్రజలు తెలుగువారని తేలిపోయింది. వెంటనే మౌల్మీన్కు వెళ్లి, ‘తెలుగు సోదర సోదరీమణుల్లారా’ అని పలకరించి వద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే, తాము భారతదేశం నుంచి వచ్చిన వాళ్లమని వారు చెప్పుకోరు. స్పష్టంగా చెప్పాలంటే, ‘తెలుగు’ ప్రస్తావన తెస్తే వారు అగ్గి మీద గుగ్గిలమవుతారు. తాము చైనా నుంచి బర్మాకు వలస వచ్చామని చెబుతారు. అదే నిజమని వాదిస్తారు. దీనికి కారణం... ‘తలైంగు’. ‘ఆటవికులు, అనాథలు’ అనే అర్థాల్లో ఆ పదాన్ని వాడుతూ గతంలో మూన్ జాతీయులను చాలా వేధింపులకు గురిచేశారు బర్మీయులు. దాంతో తలైంగు లని పిలిపించుకోవడానికి వారు ఇష్టపడరు.
స్థానిక సమాజాల నుంచి ఎదురయ్యే అవహేళనను తప్పించుకోవడానికి వలస జాతి ప్రజలు తమ సొంత అస్తిత్వానికి దూరమవడం మనకు తెలిసిన విషయమే. నేపాల్లోని కుశుందులు కూడా ఇలాగే ‘తమను తాము’ ఉద్దేశపూర్వకంగా మర్చిపోయి ఆధిపత్య వర్గాల్లో కలిసిపోయారు. ఫలితంగా వారి భాష ఇప్పుడు అంతర్ధానపు అంచులపై ఉంది. కానీ, ఇక్కడ మూన్ జాతీయులు తమను తాము చైనీయులుగా చెప్పుకుంటూ (అలా అయితే ‘తలైంగు’ ప్రస్తావన రాదు కదా) భాషను మాత్రం కాపాడుకుంటున్నారు.
పూలమ్మిన చోటే...
క్రీ.శ.3, 4 శతాబ్దాల కాలంలో మూన్ జాతీయులు దిగువ బర్మాకు చేరుకున్నారు. నదీతీర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి ఖాళీస్థలాలను సాగుభూములుగా మార్చారు. వరి పండించారు. సువన్నభూమి (సువర్ణభూమి) రాజ్యాన్ని స్థాపించారు. దాని రాజధాని థటోను. తొమ్మిదో శతాబ్దం వరకూ ఉనికిలో ఉన్న సువన్నభూమిని 59 మంది రాజులు పాలించారు. ఈ రాజ్యం దక్షిణ భారతం, శ్రీలంకలతో చురుగ్గా వర్తక వాణిజ్యాలను నడిపింది. మొదట్లో హిందూ మతాన్ని అవలంబించిన ఈ రాజ్యవాసులు తర్వాత బౌద్ధంలోకి మారారు. సువన్న భూమికి ఉత్తరంగా, మధ్య బర్మాలో ప్యూ ప్రజలు ఉండేవారు. టిబెటో- బర్మన్ జాతికి చెందిన వారు బర్మా ఆదివాసులు. తొమ్మిదో శతాబ్దంలో వారిపై చైనా రాజు దండెత్తి వచ్చాడు. దొరికిన ప్యూ జాతీయులందరినీ యుద్ధ ఖైదీలుగా పట్టుకుపోయాడు. మిగిలిన కొద్దిమంది దక్షిణ బర్మాకు వెళ్లిపోయారు. యుద్ధంలో ఓడిపోయి ప్యూ జాతి బలహీనపడటంతో చైనా - టిబెట్ సరిహద్దుల నుంచి కొత్త జాతి ఒకటి వచ్చి బర్మాను ఆక్రమించుకుంది. అదే ప్రస్తుత బర్మీయుల జాతి. మొదట ప్యూ జాతీయులు ఖాళీ చేసిన ప్రాంతాల్లోకి అడుగుపెట్టిన వాళ్లు రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆర్థిక, సైనిక బలాలను కూడగట్టుకున్న తర్వాత సువన్నభూమిపై దాడులు చేయడం ప్రారంభించారు. అలా మూన్లకూ, బర్మీయులకు వైరం మొదలైంది.
ఈ మధ్యకాలంలో, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ‘హంసావతి’, ‘హరిపుంజయ’ రాజ్యాలను స్థాపించారు మూన్ రాజపుత్రులు. 17వ శతాబ్దం వరకూ బర్మీయులతో వీరికి గొడవలు జరిగేవి. మూన్ రాజ్యాలను నేలమట్టం చేసి బర్మీయులు ఆధిపత్యం సాధించడం, తర్వాత మూన్ రాజులు తిరిగి బలం పుంజుకుని స్వాతంత్య్రం ప్రకటించుకోవడం... ఇలా నిత్యం రణభేరీ నాదాలే! దీనికి ముగింపు పలుకుతూ 3 శతాబ్దాల కిందట మూన్లపై శాశ్వత ఆధిపత్యం సాధించారు బర్మీయులు. ఆ సమయంలో మూన్ ప్రజలను ఊచకోత కోశారని అంటారు.
క్రీ.శ. 600-700 నాటి రాతి శాసనాల లో మూన్ ప్రజలను ‘రమే, రామన’ అని సంబోధించారు. క్రీ.శ. 900-1000 నాటి శాసనాల్లో ‘రామణ్య’ అని పేర్కొన్నారు. ర్మెన్, రెమెన్, ర్నేమ్న్, రమన్, ర్మన్... ఇలా రకరకాల పేర్లతోనూ వారు చరిత్రకెక్కారు. వాస్తవానికి ఇవన్నీ మూన్ జాతీయులు తమకు తాము పెట్టుకున్న పేర్లు. వీటిలోంచే ‘మూన్’ పుట్టింది. ఆఖరికి అదే ఖాయమైంది. ఇక ‘తలైంగు’ అన్నదేమో... ‘తెలంగాణ నుంచి వచ్చిన మూన్ జాతీయులకు’ బర్మా ఆదివాసీలు చేసిన నామకరణం. 17వ శతాబ్దంలోని కల్లోల కాలం నుంచి బర్మీయులు ఈ పదాన్ని ప్రతికూల అర్థంలో వాడటం ప్రారంభించారు. వెక్కిరింతలు, వేళాకోళాలకు పర్యాయపదంగా మారిన ‘తలైంగు’పై అప్పటి నుంచే మూన్ జాతీయులు అయిష్టత పెంచుకున్నారు.
నాగరాజు... నూకరాజు
శ్రీత్రిభువనాదిత్య దమ్మరాజు, ‘కటకమ్మ’ నాగరాజు, మనూహా రాజు, వారీషు రాజు, రాజాధిరాజ్, అసుమ్మనగోపాల, కుమంజరాజు, నూకరాజు, దశరాజు, గుట్ట, సేర, జగపతిరాజు, వాసుదేవ, యెయ్యల, పుంతల, దిట్ట, చెట్టిరాజు, జయకరాజు, కథ కుమ్మరాజు, చామాదేవి, నంగలాదేవి... వీళ్లందరూ మూన్ చరిత్రలో కనిపించే మహారాజులు, రాణులు. వీళ్లందరూ తెలుగువారే అన్న విషయాన్ని వారి పేర్లే నిరూపిస్తున్నాయి. ఇక్కడ రాణి రుద్రమ మాదిరిగా అక్కడ రాణి చామాదేవి సుప్రసిద్ధురాలు. నడుముకు వడ్డాణం, చేతిలో కత్తితో చీరకట్టులో ఉండే ఆమె విగ్రహం థాయిలాండ్ ఉత్తర ప్రాంతంలోని లాంఫూన్ ప్రావిన్సు(ఒకప్పటి హరిపుంజయ రాజ్యం)లో ఉంది. దాన్ని చూడటానికి పర్యాటకులూ ఎక్కువగానే వస్తారు.
మూన్ జాతీయుడొకరు ‘ఊ ష్వేనో’ ‘కొదికప్ప (ప్య) కబా ఊచాం’ అనే పుస్తకం రాశాడు. ఆ పేరుకి అర్థం ‘ప్రపంచ భవిష్య దర్శనం’. దీన్ని ‘ఏకాదశ’, ‘యామ’ సంవత్స రం (1263), ‘గీమంత’ రుతువు, ‘నాయూన్’ మాస, శుక్లపక్షం నాడు పూర్తి చేసినట్లు చెప్పుకున్నాడు. ఈ కాల నిర్ణయం కూడా మూన్ ప్రజలు తెలుగువారేనని నిర్ధరిస్తోంది. ఇక సంగీతంలోని ఏడు స్వరాలకూ మనం వాడుతున్న పేర్లనే కాస్త అటుఇటుగా వారూ వినియోగిస్తున్నారు. అవి... మజ్జిమ, గద్దార (గాంధార), ఉషబ (వృషబ), పంచమ, చజ్య, దేవత, ఖనిషాద. ‘‘గ్రోంగ్రోం సగ్రోం గ్రొం (జొంజోం సజొంజొం) సుదిరి సొందిరి ్ ఠగ్రంఠగ్రం (ఠజం ఠజం) అలన్బి అలన్బి! తొన్సఠ తొన్సఠ! అవది అరది ్! సుదిరి సుదిరి’’ అనే స్వరరచన వారిది. ఇదీ మనకు దగ్గరగానే ఉంది.
డాక్టర్ మీన్ న్వేసో అనే మూన్ ఆచార్యుడు ‘మూన్ పరిశోధన అంశాలు’ పేరిట ఓ గ్రంథాన్ని వెలువరించారు. దాంట్లో ‘మూన్ (తలైం) నాట్యం’ గురించి వివరించారాయన. మూన్ పక్కన బ్రాకెట్టులో ‘తలైం’ అని పెట్టారంటే ఏంటి అర్థం? వారు తలైంగులనే కదా! తలైంగులంటే తెలుగువారే. దీనికి నిదర్శనం... ఉత్తర భారతదేశంలో కనిపించే ‘తెలంగ్’ అనే ఇంటిపేరు. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు కాశీనాథ్ త్రయంబక్ తెలంగ్తో సహా ఆ ఇంటిపేరిట ఉన్నవాళ్లందరూ ఒకప్పడు తెలుగు నేల నుంచి వలసవెళ్లిన వారి వారసులే. మన దగ్గర గ్రామ నామాలు ఇంటిపేర్లయితే, అక్కడకు వెళ్లిన మనవాళ్లకు మన ప్రాంతం, భాషల వ్యావహారిక నామమే ఇంటిపేరైంది. అలాగే, తమిళులు కూడా ఇప్పటికీ ‘తెలుంగు’ అనే పిలుస్తారు. బర్మీయుల పలుకుకు అనుగుణంగా అది ‘తలైంగు’ అయింది.
చరిత్రకారుల మాట
తలైంగులు తెలుగువారేనని చెప్పే చారిత్రక రచనలెన్నో ఉన్నాయి. ప్రముఖ భారతీయ చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్ తన ‘ప్రాచీన భారతదేశం’ గ్రంథం 483వ పుటలో ఈ విషయాన్ని వివరించారు. ‘మూన్ జాతీయులకే తలైంగులని పేరు. దీన్ని బట్టి చూస్తే వీళ్లు భారత తూర్పుతీరంలోని తెలుగు భాష మాట్లాడే ప్రాంతం తెలంగాణ నుంచి వలస వచ్చినవారుగా కనిపిస్తున్నారు. ఆ ప్రాంతం పేరునే జాతికి అన్వయించారు’ అని చెప్పారాయన. ‘బ్రిటీష్ రూల్ ఇన్ బర్మా, హిస్టరీ ఆఫ్ బర్మా’ పుస్తకాలు రాసిన జి.ఇ.హార్వేది కూడా ఇదే మాట. ‘దిగువ బర్మాలోని థటోను, పెగూ ప్రాంతాలకు మద్రాస్ తీరం నుంచి చాలామంది వలసవచ్చారు. వారి పేరు తలైంగ్... మద్రాసు సముద్రతీరంలోని తెలంగాణ నుంచి వచ్చింది. వలసప్రజల్లో చాలామంది ఆ ప్రాంతం వారే’ అని చెప్పారు హార్వే. కొన్నేళ్ల కిందటి వరకూ తెలుగువారిని కూడా ‘మద్రాసీ’లుగానే పిలిచే వారు కదా.
‘హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ బర్మా’ను ప్రచురించిన డోనాల్డ్ ఎం.సికిన్స్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మూన్ జాతీయులకు బర్మీస్ పేరు తలైంగ్. ఇది దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు సంబంధించింది. అయితే, అమర్యాదగా భావించి ఆ పేరుతో పిలిపించుకోవడానికి మూన్ జాతీయులు ఇష్టపడరు’ అని రాశారు. ‘ఏ కాన్సైజ్ హిస్టరీ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇన్ సయాం’ రచయిత ఆర్.ఎల్.మే, ‘ది తలైంగ్స్’ గ్రంథకర్త రాబర్ట్ హాలీడే, ‘హిస్టరీ ఆఫ్ బర్మా’ను కూర్చిన ఆర్థర్ పర్వ్స్ ఫెయిరీ తదితరులందరూ ‘మూన్ జాతీయులే తలైంగులు. తలైంగులు తెలంగాణ వారు’ అనే చెప్పారు. ఈ రచయితల్లో కొంతమంది బ్రిటీష్ పరిపాలనా కాలంలో సుదీర్ఘ కాలం బర్మాలో పనిచేసిన ఆంగ్లేయ అధికారులు. స్థానిక చరిత్రలపై పరిశోధనలు చేసి మరీ వారు సేకరించిన సమాచారం విశ్వసనీయమైనదే.
మూన్ సొంత గొంతు
మూన్ జాతికి చెందని చరిత్రకారుల మాటలను కొందరు విశ్వసించకపోవచ్చు. కానీ, తమ జాతి అస్తిత్వాన్ని కాపాడు కోవడానికి పోరాడుతున్న ఉద్యమసంస్థలు కూడా ‘మూన్ జాతీయులే తలైంగులు. వారు తెలంగాణ నుంచి వచ్చారు’ అని చెబితే నమ్మకతప్పదు కదా. అలాంటి ఉద్యమసంస్థే ‘మూన్లాండ్ రిస్టోరేషన్ కౌన్సిల్’. హక్కుల విషయంలో బర్మీయులతో సమానత్వాన్ని డిమాండ్ చేస్తూ అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మూన్ విద్యార్థులు, బౌద్ధ సన్యాసులు, ఉద్యమకారుల వేదిక ఇది. దీని అధికారిక వెబ్సైట్లో చెప్పుకున్న విషయమిది... ‘మూన్ రాజ్యాన్ని రమన్నదేశం అంటారు. ఇది ప్రాచీన మూన్ పదం ర్మేన్ నుంచి వచ్చింది. ర్మేన్కి అర్థం మూన్ జాతీయుడు. అయితే, బర్మీయులు మూన్లను తలైంగు లని పిలిచేవాళ్లు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ నుంచి ఆ పేరు వచ్చింది’.
‘డిస్కవరీ ఆఫ్ రమణ్య’ పేరిట మూన్ యూనిటీ లీగ్ (మూన్ ప్రజల వేదిక - సమానత్వం కోసం పోరాడుతోంది) ఓ గ్రంథాన్ని ప్రచురించింది. అందులో ‘ప్రాచీన మూన్ రాజ్యం భారతదేశంతో వర్తక వాణిజ్య సంబంధాలు స్థిరంగా కొనసాగించింది. భారతీయ వర్తకులు, జాలర్లు థటోనుకు పెద్దఎత్తున వచ్చారు. అయితే వాళ్లు ఆక్రమణదారుల మాదిరిగానో, వలస వచ్చే వారిగానో రాలేదు. స్నేహితులుగా వచ్చారు. భారతీయ సంస్కృతిని మూన్ జాతి అంగీకరించింది. ఆ నాగరికతను ఇక్కడ అభివృద్ధి చేసింది’ అని చెప్పారు. స్నేహితులుగా వచ్చిన వారి సంస్కృతిని స్వీకరించడానికి ఏ జాతీ తన సొంత సంస్కృతిని వదులుకోదు. పైపెచ్చు జోలపాటలతో సహా ‘కొత్తవారి సాంస్కృతిక సంపద’లను స్వీకరించదు. అంటే, మూన్ జాతీయులు భారత్ నుంచి వచ్చారన్న విషయం తెలిసి కూడా... సమకాలీన పరిస్థితుల వల్ల ఆ విషయాన్ని చెప్పుకోలేక ఇలా రాసుకున్నారన్న మాట.
‘మయన్మార్డాట్కాం’ (www.myanmardotcom.com)... 1990 నుంచి అంతర్జాలంలో బర్మా విశేషాలను సాధికారికంగా అందిస్తున్న వెబ్సైట్. ఇది మరింత ఆసక్తికర సమాచారాన్ని పొందుపరిచింది. అదేంటంటే... ‘ప్రాచీన కాలంలో భారతదేశ తూర్పు తీరాన్ని ‘‘తెలింగ’’ తీరం అనేవారు. అక్కడి ప్రజలను ‘‘తెలింగులు’’ అని పిలిచేవారు. క్రీ.శ.500 ప్రాంతంలో ఆ తెలింగులు బర్మాలోని ప్యూలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తెలింగు వర్తకులు దిగువ బర్మా తీరప్రాంతాలకు వలసరావడం ప్రారంభించారు. ఎనిమిదో శతాబ్దం నాటికి ఇక్కడ వారు థటోను రాజ్యాన్ని స్థాపించారు. వారు వస్తూ వస్తూ తమతో భారతీయ సంస్కృతిని, మతాన్ని తెచ్చారు. వారు బలపడి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించారు. స్థానిక మంగోలు జాతులతో సంపర్కం పెట్టుకున్నారు. క్రమంగా ‘‘తలైంగులు’’ అనే కొత్త జాతి ఉద్భవించింది’. ఇలా చూసినా తలైంగులు తెలుగువారే.
‘తెలంగాణ’ అనే పదం ప్రాచీన కాలం నుంచే వాడుకలో ఉందన్న విషయాన్ని ఈ కథనాలు నిరూపిస్తున్నాయి. అయితే, అప్పట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి తెలంగాణ అనేవారా? అసలు అప్పటి తెలంగాణ భౌగోళిక స్వరూపం ఎలా ఉండేదన్నది తేల్చాల్సింది చరిత్రకారులే.
పోరుబాటలో...
ప్రస్తుతం బర్మాలో పది లక్షల మంది మూన్ జాతీయులు ఉన్నారు. ఎక్కువ మంది ‘మూన్ రాష్ట్రం’ (రాజధాని మౌల్మీన్)లో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రైతులే. బర్మీయుల ఆధిపత్యంలో సామాజిక అణచివేతకు గురవుతున్నామన్న భావన వారిలో ఉంది. అందుకే, తమకు ఆదివాసీలుగా ప్రత్యేక గుర్తింపునివ్వాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర పరిపాలనలో కూడా తమకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. కానీ, బర్మా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవట్లేదు. దాన్ని నిరసిస్తూ మూన్ జాతీయులు రాజకీయ, పౌర ఉద్యమాలు (కొన్ని సందర్భాల్లో సైనికంగానూ) నిర్వహిస్తున్నారు.
మానవ పరిణామక్రమంలో వలసలు సహజం. అలా ఆ కాలంలో తెలుగు నేలపై నుంచి ఎంతమంది ఏయే ప్రాంతాలకు వలసెళ్లిపోయారో! బర్మాలో మూన్ జాతిలాగా ఏయే దేశాల్లో ఏయే జాతుల పేరిట జీవిస్తున్నారో! సాధ్యమైనంత వరకూ వారందరి గురించి ఆరాతీయడాన్ని తెలుగు చరిత్రకారులు బాధ్యతగా స్వీకరించాలి.
ఆ కర్తవ్య నిర్వహణలో వారు విజయవంతమైతే... తెలుగు ప్రపంచ పరిధులు విస్తరిస్తాయి. తెలుగు జాతి ప్రాచీన సాంస్కృతిక వైభవాలు వెలుగులోకి వస్తాయి.
******
అద్భుత పదసంపద
‘మూన్’ లిపి పల్లవ లిపి నుంచి వచ్చిందని స్థానికుల నమ్మకం. అక్షరమాలను పరిశీలిస్తే, తెలుగు వర్ణమాల మాదిరిగానే ‘అ, ఆ’ల నుంచి మొదలై ‘అం, ఆః’ వరకు ఉన్నాయి. ఏడో శతాబ్దానికి ముందు నుంచే మూన్ లిపి వాడుకలో ఉంది. ఎన్నో పురాతనమైన, మనం ఎప్పుడో ఎక్కడో గాని వాడని తెలుగు మాటలు ‘మూన్’ భాషలో కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని...
మూన్ మాట తెలుగు మాట
దు (మందం) దుక్కగా ఉంది
కలత్కేతు (దొంగ) కేటుగాడు
సరోమ్ సరమగొను
ఈ (నవ్వు) పళ్లు ఈకరించు
ద్దెక్కె దాకా
పున్ (కపాలం) పునుక
ముత్త ముత్యం
మోల మూల
బర గడ్డిపరక
తరఃతరః తరతరాలు
సంకా శంక
పస(వాసన) పసిగను
మద్తావర(శాశ్వతం) తావరము