పురాణ కథా పారిజాతం

  • 151 Views
  • 0Likes
  • Like
  • Article Share

    స్రవంతి

‘‘మారన కథా విధానము జాఱలాడి/ కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి/ మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె/ నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు’’ అని వెంకట రామకృష్ణకవులు సరదాగానే అన్నా ‘మనుచరిత్ర’కు మూలం మారన రచనే. అదే ‘మార్కండేయ పురాణం.’ తొలి తెలుగు పురాణంగా ఇది సుప్రసిద్ధం.
తెలుగులో
నన్నయ్యతో ఇతిహాస కవిత మొగ్గతొడిగింది. నన్నెచోడుడి కవిత్వంతో ప్రబంధ సిరి వికసించింది. మారనతో పురాణ కథ మారాకు వేసింది. తొలి తెలుగు పురాణ కర్తగా మారనకీ, ఆయన కృతి మార్కండేయ పురాణానికీ విశేష గుర్తింపు ఉంది. అష్టాదశ పురాణాల్లో ఒకటిగా, విజ్ఞానకోశంగా పేరుపొందిన మార్కండేయ పురాణంలో పలు ధార్మిక విషయాలతో పాటూ రసవత్తరమైన కథలూ ఉంటాయి. మారన దీన్ని క్రీ.శ. 1295- 1326 మధ్య ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడి సేనానాయకుడైన నాగయగన్న మంత్రికి అంకితమిచ్చాడు. 
      ‘‘శ్రీమదుభయకవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీ పాత్ర తిక్కనామాత్యపుత్ర మారయ నామధేయ ప్రణీతంబైన మార్కండేయ పురాణము’’ అంటూ తాను ‘ఉభయకవి మిత్రుడు’ తిక్కన శిష్యుడినని చెప్పుకున్నాడు మారన. ఆయన తండ్రి పేరూ తిక్కనే. ఇంతకు మించి మారన జీవిత విశేషాలు తెలుసుకునేందుకు ఆధారాలు లేవు. నెల్లూరు ప్రాంతం వాడనీ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాడనీ, తెలంగాణలోని గోదావరి తీర నివాసి అని ఈయన స్వస్థలం పట్ల విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రతాపరుద్రుడి సేనానాయకుడికి తన కృతిని అంకితమివ్వడాన్ని బట్టి మారన కూడా కాకతీయ రాజుల పోషణలోనే ఉండి ఉండొచ్చు.
విజ్ఞాన వీచికలు
పురాణాలు మత ప్రచారం కోసమో, ధార్మిక ప్రబోధం కోసమో ఉద్దేశించి రాసినవి కావు. సర్వలోక శ్రేయస్సుకు ఆధారభూతమైన సద్ధర్మాన్ని అందించే విజ్ఞాన కోశాలవి. అందుకే వాటిని పూర్వచరిత్రలు అన్నారు. సృష్టి, ప్రతిసృష్టి, వంశ, మన్వంతర, వంశానుచరిత అనే పంచ లక్షణాలతో సమ్మిళితమైన పురాణాలు ప్రాచీన భారతీయ విజ్ఞాన భాండాగారాలు. 
      వ్యాస విరచిత సంస్కృత మార్కండేయ పురాణాన్ని మారన ఎనిమిది ఆశ్వాసాలుగా తెనిగించాడు. 2,547 గద్యపద్యాల్లో ధర్మపన్నాలు, వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధనియమాలు, పురాతన వంశావళీ లాంటి పురాణ సంబంధిత విషయాలతో పాటూ కొన్ని కథలనూ చేర్చాడు. అసలు ఈ మార్కండేయ పురాణ లక్ష్యం ధర్మ సందేహాల నివృత్తియే. వ్యాస పుత్రుడైన జైమినికి కొన్ని సందేహాలు కలిగాయి. నివృత్తి చేసుకునేందుకు మార్కండేయుడి దగ్గరికి వెళ్తాడు. ‘‘అనుష్టానానికి వేళయ్యింది. నిజంగా ఇప్పుడే తెలుసుకోవాలనే కోరికగా ఉంటే వింధ్య పర్వత సానువుల్లో ధర్మపక్షులున్నాయి వారినడుగు!’’ అని పంపిస్తాడాయన. సృష్టి, స్థితి, లయకారుడైన పురుషోత్తముడు మానవుడిగా పుట్టడానికి కారణమేంటి? బలరాముడు తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు బ్రహ్మహత్య ఎలా చుట్టుకుంది? పాండవులందరికీ ద్రౌపది భార్య ఎలా అయ్యింది? ఉపపాండవులు పెళ్లి చేసుకోకుండా అనాథలుగా చనిపోవడానికి కారణమేంటీ!.. ఇలా ధర్మపక్షుల ద్వారా గహనమైన విషయాలను తేటపరచుకున్న తర్వాత హరిశ్చంద్రుడి కథ అడిగి తెలుసుకుంటాడు జైమిని.
      హరిశ్చంద్రోపాఖ్యానాన్ని మారన 144 గద్యపద్యాల్లో చెప్పాడు. సత్యపాలనకు కట్టుబడి భార్యను విక్రయించే సందర్భంలో హరిశ్చంద్రుని మాటల్లో సంభాషణా చాతుర్యం చూడండి..
ఓ పురజనులారా! నా పత్ని నమ్మెద/ నే దాసిగా వెలయెఱిగి పెట్టి/ కొనుడు నన్నెవ్వడని యడిగెదరేని/ నే నృశం సుండను దానవుండ/ నతిపాపకర్ముడ నాలినమ్ముకొనంగ/ నరుగు దెంచిన కఠినాత్మకుండ
      నేను నరులును బాధపెట్టేవాణ్ని, దానవుణ్ని.. అంటూ తన పేరు వెల్లడించకుండా భార్యను నిర్దయగా అమ్మకానికి పెడతాడు హరిశ్చంద్రుడు. విధివంచిత అయిన ఆయన ఇల్లాలి పేరును ఈ పురాణంలో శ్యేబగా పేర్కొనడం విశేషం. ‘చిచ్చు చీరను కుట్టడం, సూదికి రెండు మొనలు కలవే, మిన్ను విరిగి కూలినట్టు’ లాంటి జాతీయాలు, నుడికారాలు మారన రచనలో కనిపిస్తాయి. ‘‘మారన కవిత్వము తిక్కనసోమయాజి కవిత్వమంత మధురముగా నుండదు గాని సలక్షణ మయినదిగాను మృదువుగాను ఉండును’’ అంటారు తన ‘ఆంధ్ర కవుల చరిత్రం’లో కందుకూరి వీరేశలింగం. 
ఇలగోల దట్టుచు ‘సం/ బళి సంబళి’ యనుచు గ్రందుపడు జనములకున్‌/ దొలగుచు నొదుగుచు నాభూ/ తలపతి కడ కరగుదెంచి తానిట్లనియెన్‌
      అస్పృశ్యులుగా వర్ణ వ్యవస్థకు ఆవల బతకాల్సి వచ్చిన వారు నాడు రాచవీధుల్లో ఎలా నడిచి వెళ్లేవారో చెబుతూ ఆ కాలపు సాంఘిక జీవితాన్ని ఇలా చిత్రించాడు మారన. నీతికి కట్టుబడి మసలిన హరిశ్చంద్రుడి దుస్థితినీ సహజసిద్ధంగా వర్ణించాడు. మహిషాసుర మర్దనం, శుంభనిశుంభుల వధ లాంటి ఘట్టాల్లో దేవి మాహాత్మ్యాన్ని రమ్యంగా చెప్పాడు. అంతేకాదు, ‘‘నారాయణీ దేవి మా మ్రొక్కు గైకొనుము’’ అంటూ పల్లవిగా సాగే దేవి దండకంలో అచ్చతెలుగు పదాలకు చోటు కల్పించాడు.
      ‘‘ఈ దివ్యపురాణ రత్నమును మార్కండేయమే జెప్పగాంచితి, పుణ్యాత్ముడనైతి, జన్మము ఫలించెన్‌ లోకసంభావ్యమై’’ అని సంతృప్తి చెందిన ఈ కవి, మార్కండేయ పురాణాన్ని అనువదించి అత్యంత ప్రమోదం చెందాడంటారు ఆర్రుద తన సమగ్రాంధ్ర సాహిత్యంలో. కథాగమనంలోనూ, వర్ణనా నైపుణ్యంలోనూ, ధార్మిక విషయాలప్రస్తావనలోనూ అసామాన్య ప్రతిభ చూపిన మారన ‘మనుచరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, కువలయాశ్వచరిత్ర’ లాంటి తర్వాతి కాలపు కావ్యాలకు మూలకథలను అందించాడు.


వెనక్కి ...

మీ అభిప్రాయం