వందే వందన్న గరిడి గుండన్న..!

  • 184 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.ఎల్‌.వి.ప్రసాద్‌

  • యాడికి, అనంతపురం జిల్లా
  • 9493559074
వై.ఎల్‌.వి.ప్రసాద్‌

‘‘విజయనగర సైన్యములో భటులకు కుస్తీలు, ఆయుధ ప్రయోగమును, సవారీ మున్నగునవి బాగా నేర్పెడివారు. శ్రీకృష్ణదేవరాయలు మంచి సాములో సవారీలో ఆరితేరిన జెట్టీలలో మేటిజట్టి. ప్రతిదినము కుసుమ నూనెను చిన్న గిన్నెడు త్రాగి అదే నూనెతో అంగమర్దనము చేయించుకొని సాముచేసి, సవారిచేసి, కుస్తీలు పట్టెడువాడని పీస్‌ అను విదేశీ వ్రాసెను. ఆ కాలంలో జనులకు సాముచేయుటలో ఆసక్తి యుండెను. వాడవాడలలో సాము గరిడీలు (తాలీంఖానాలు, అఖాడాలు) ఉండెను. సాము సాలెలతో భూమిని లోతుగా త్రవ్వి మన్ను తీసివేసి అందిసుక సగము వరకు నింపి పై భాగమును ఎర్రమట్టితో నింపెడివారు. అట్టిరంగమందు సాము నేర్చుటకు కావలసిన గదలు (ముద్గరములు- వీటినే వర్ణ వ్యత్యయముతో ఉర్దూలో ముగ్దర్‌ అందురు), సంగడములు (వీటి నుర్దూలో సింగ్‌ తోలా అనిరి. అవి మధ్య ఇరుసు, ఇరుప్రక్కల చిన్న రాతి చక్రములు కలవి) ఉండెడివి. సాములోను, కుస్తీలోను బాగా గడితేరిన వారిని జెట్టీలనియు హొంతకారులనియు పిలిచిరి’’

- ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సురవరం ప్రతాపరెడ్డి


సురవరం చెప్పిన విజయనగరం సాము గరిడీలను ఇప్పుడు చూడవచ్చా? ఆ గదలు, సంగడాలు ఎక్కడైనా కనపడతాయా? కచ్చితంగా! అలా అని ఏ పురాతత్త్వ ప్రదర్శనశాలకో వెళ్లనక్కర్లేదు. అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి వెళ్తే, అచ్చంగా ఆనాటి గరడీనే చూసి రావచ్చు. విజయనగర రాజుల కాలంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న ఈ వ్యాయామశాల.. అచ్చంగా తెలుగువారి వారసత్వ సంపద!
      యాడికి గ్రామస్థులు దీన్ని ‘పెద్దగరిడి’ అంటారు. గరిడి అంటే ‘సాము’ (వ్యాయామం) నేర్చుకునే చోటు. దీని నిర్మాణం కాస్త చిత్రమైంది. బయటికి చూడటానికి చిన్న గదిలా కనిపిస్తుంది. సొరంగానికి తలుపు ఉన్నట్టుగా ద్వారం ఉంటుంది. లోపలికి చూస్తే సుమారు ఏడడుగుల లోతులో గది కనపడుతుంది. ద్వారానికి ఎదురుగా ఉన్న గూడులో హస్తం ఆకారంలో ఉన్న మౌలాలీ స్వామి విగ్రహం ఉంటుంది. సాము చేసే యువకులు ఆయనను గురువుగా భావిస్తారు. బయట ఉన్న తొట్టెలో స్నానం చేసి మౌలాలీ స్వామికి ధూపదీపాలతో పూజచేసి, నైవేద్యంగా చక్కెర పెట్టి, వ్యాయామాలు ప్రారంభిస్తారు. గరిడి గోడమీద హిందూ ముస్లిం సమైక్యతకు గుర్తుగా ఓం కారంతో పాటు అర్ధచంద్రాకారపు గుర్తులు ఉంటాయి. ఈ గదిలోకి దిగటానికి మెట్లు ఉండవు. లోపలికి వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా ద్వారం దగ్గర వేలాడే గొలుసునే సాయం తీసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో గరిడిలో కేవలం దీపపు వెలుగు మాత్రమే ఉంటుంది. ఇందులో కుర్రాళ్లు దండీలూ చేస్తూ గ్యారాలు పాడతారు. ‘‘సాదా బస్కీ కొట్టార పైల్‌మాన్‌/ కొట్రా జట్కీ కొట్రా జట్కా/ జట్కా మార్నా/ హెల్‌బెన్‌ హెల్‌బూన్‌ హెమ్‌బెల్‌  హేరియా..’’, ‘‘అనుమంతుని బంటు లంకిని జుట్టు/ రట్టా బంతాయి లంకిని జుట్టు/ రుస్తుం బంతాయి లంకిని జుట్టు..’’, ‘‘నడిగడ్డ తాళిమ్‌కే షేక్తా హనుమాన్‌ కట్టె/ దే ఆఫర్‌ సా కర్నా సలాం/ మన్నరే జట్కా/ మన్నరే జట్టీ../ ...కేనరే గౌరు/ కుమార రామ/ పోలిక రామ/ జోడు కుస్తీ..’’, ‘‘వందే వందన్న గరిడి గుండన్న..’’- ఇలా తెలుగు, పార్శీ, ఉర్దూ, మరాఠీ పదాల మేళవింపుతో సాగే గ్యారాలు జట్జీలకు మంచి ఉత్సాహాన్నిస్తాయి. 
నాటి నుంచే..
యాడికి ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. పెమ్మసాని నాయకులు విజయనగర సామంతులుగా యాడికి, తాడిపత్రి ప్రాంతాలను పాలించారు. అప్పట్లో గ్రామాల్లో స్థిరమైన సైన్యాన్ని ఉంచి పోషించడం కన్నా ఊరి ప్రజలనే దృఢకాయులుగా మలిచి, గ్రామ రక్షణ బాధ్యతలను వారికి అప్పగించాలని పాలకులు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టు సాముగరిడిలను ఏర్పాటు చేయించారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ముస్లింలు వీటిలో భాగస్వాములయ్యారు. కుస్కీలు, గుండ్లు ఎత్తడం, ఇరుసు నిలబెట్టడంతో పాటు కర్రసాము లాంటి విన్యాసాల్లో గరిడీ యువత మేటిగా ఉంటారు. ఈ గరిడీల ఆనవాళ్లు నాటి విజయనగర సామ్రాజ్యం పరిధిలోని చాలా గ్రామాల్లో నేటికీ కనిపిస్తాయి. మైసూరు, బెంగళూరు, హొసపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని గరిడీలు నడుస్తున్నాయి. అయితే వాటిలో గ్యారాలు వినపడవు. యాడికి చుట్టుపక్కల గ్రామాల్లో గరిడీలు ఉన్నప్పటికీ ఇప్పుడు వినియోగంలో లేవు. అవన్నీ గోదాముల్లా మారిపోయాయి. బహుమని సుల్తానుల విలుకాళ్లను ఎదుర్కోవడానికి రెండో దేవరాయలు తన సైనికులకు ముస్లిం విలుకాళ్లతో శిక్షణ ఇప్పించాడని హంపి కన్నడ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు ఎస్‌.వై.సోమేశ్వరరావు తన ‘మిలటరీ సిస్టం అండ్‌ పాలసీస్‌ ఆఫ్‌ విజయనగర’ పుస్తకంలో పేర్కొన్నారు. అళియ రామరాయల తర్వాత గండికోట ప్రాంతం సుల్తానుల ఏలుబడిలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గరిడీలు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. 
      దక్షిణ భారతదేశంలోని కులాలు, తెగల మీద సర్వే చేయడానికి వచ్చిన టుస్టన్‌ ఎడ్గర్‌ తన ‘క్యాస్ట్స్‌ అండ్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ పుస్తకంలో (1906) ఈ గరిడీల సంస్కృతి గురించి పేర్కొన్నాడు. ‘హొసపేట గ్రామంలో నడిచే గ్రామ వ్యాయామశాలను చూశాను. అది భూమికి అడుగుభాగంలో ఎలాంటి కిటికీలు లేకుండా ఉంటుంది’’ అని చెప్పాడు. నాటి గరిడీ యువత వేషధారణ, శరీర దారుఢ్యంతో పాటు వారు ఆడే ఆటల గురించీ ప్రస్తావించాడు. యాడికి గరిడీ కూడా టుస్టన్‌ చెప్పిన ఆకృతిలోనే ఉంటుంది.  
పుల్లయ్య వస్తాదు సాయం
యాడికి పెద్ద గరిడికి ప్రస్తుతం అరవై ఏళ్ల శివన్న గురువు. ఏడేళ్ల వయసు నుంచే ఆయన ఈ గరిడిలో వ్యాయామం చేస్తున్నారు. తన కుమారుడు కూడా ఇప్పుడు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. శివన్న కథనం మేరకు గతంలో ఊళ్లో మొత్తం అయిదు గరిడీలు ఉండేవి. విద్య, ఉద్యోగాల కోసం యువత పట్టణాలకు వెళ్తుండటం, ప్రజల జీవనవిధానం, అలవాట్లలో వచ్చిన మార్పులతో నాలుగు గరిడీలు మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న పెద్దగరిడీ ఎప్పుడు నిర్మితమైందో కచ్చితమైన ఆధారాల్లేవు.  రాయల కాలం నుంచి నడుస్తున్న గరిడీని 160 ఏళ్ల కిందట పునరుద్ధరించారని మాత్రం తెలుస్తోంది. వడ్డె పెద్ద పెద్దన్న అనే గ్రామస్థుడికి ఆయన తండ్రి చెప్పిన దాని ప్రకారం వారి తాతగారు ఈ గరిడీ నిర్మాణంలో పనిచేశారు. పెద్దన్న ముప్పయి ఏళ్లకు పైనే గరిడిలో గురువుగా వ్యవహరించారు. నూట అయిదు సంవత్సరాలు జీవించి ఇటీవలే దివంగతులయ్యారు. ఈ గరిడి నిర్మాణానికి పుల్లయ్య అనే పూజారి (వస్తాదు) ఆర్థిక సాయం చేశారని అంటారు. గరిడీలో పాడుకునే గ్యారాల్లోని ‘‘పుల్లయ్య వస్తాదు’’ అనే మాట ద్వారా ఆయన వస్తాదనే విషయం రూఢీ అవుతోంది. సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్న గదలు, సంగడాలతో ఇక్కడి యువత నిత్యం వ్యాయామం చేస్తారు. ఇందులో ఎన్నో ఏళ్లనాటి రాతి గుండ్లు, డంబెళ్లు, బరువైన చెక్కతో చేసిన వ్యాయామ సామాగ్రి ఉన్నాయి. సాంబ్రాణి పొగ, బంగారు కాంతిని పంచే దీపపు వెలుగులో సాధకులు చేసే కసరత్తుల్లో హుందాతనం ఉంటుంది.      
వారం వారం ప్రదర్శనలు
‘‘ఉజాల పారా తార నిఖలే తాళిమ్‌ కానా గమ్మస్తే’’- తెల్లవారు జామున వేగుచుక్క ఉండగానే నిద్రలేచి గరిడిలో కసరత్తులు చెయ్యి- అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నది ఈ గ్యారాకి అర్థం. అప్పట్లో వస్తాదులు, యువకులు రాత్రిళ్లు గరిడిలో వ్యాయామం చేసి రాత్రి భోజనం తర్వాత అక్కడే నిద్రపోయేవారట. ఉదయాన్నే లేచి ఊళ్లో భైరవకొండ చూట్టూ రెండు చుట్లు పరిగెత్తి, గరిడీలో మళ్లీ వ్యాయామాలు చేసుకుని, బలభద్రవారి తోటలోని బావిలో స్నానం చేసి తమ పనులకు వెళ్లేవారు. గరిడీలో గురువుకు చాలా ప్రాధాన్యముంటుంది. కుస్తీ పట్లు, చక్రదండీలు, పల్టీలు లాంటివి ఆయనే నేర్పుతారు. మద్యపానం, ధూమపానం చేసినవారిని లోనికి అనుమతించరు. గరిడి సభ్యులు ఈ ప్రాంతాన్ని పవిత్రమైందిగా భావిస్తారు. గదిని శుభ్రంచేసుకోవడం, కుస్తీలు పట్టే బయళ్లో మట్టిని ఎప్పటికప్పుడు మెత్తగా ఉంచుకోవడం లాంటి పనులను విధిగా నిర్వహిస్తారు. 
      ప్రతి గురువారం తాము ఆ వారంలో నేర్చుకున్న విద్యలన్నింటిని శిక్షకుడి ముందు ప్రదర్శిస్తారు. కర్రసాము, కుస్కీ, రాతి గుండు ఎత్తడం, ఇరుసు నిలబెట్టడం, పల్టీలు కొట్టడం లాంటివి ఈ ప్రదర్శనల్లో ఎక్కువగా కనిపిస్తాయి.  
గరిడీలో వ్యాయామం చేసే యువకులు తాము తయారు చేసుకునే ఒక ఆయుర్వేద తైలాన్ని శరీరానికి పూసుకుంటారు. నువ్వుల నూనెలో గంధ కచూరాలు, బావంచాలు లాంటి మూలికలతో దీన్ని తయారుచేస్తారు. ఈ మిశ్రమాన్ని శరీరానికి అద్దుకుంటే చర్మవ్యాధులు రావంటారు. సెలవు రోజుల్లో గరిడి యువకులందరూ కలిసి గ్రామానికి దగ్గర్లో ఉండే ఉప్పపాడుకోనలోని కొండల్లో ఈ మూలికల్ని సేకరిస్తారు.  
సూఫీల ప్రభావం
గరిడీలోని మౌలాలీ స్వామి సూఫీ గురువు. క్రీ.శ. తొమ్మిదో శతాబ్దానికి ముందు నుంచే రాయలసీమలో సూఫీల ప్రభావం ఉంది. ఇరాన్, ఇరాక్‌ల నుంచి సీమకు సూఫీలుగా వచ్చిన వారిలో రాజవంశీయులు కూడా ఉన్నారు. ఇరాన్‌లో తన రాజ్యాన్ని వదిలి భారతదేశానికి వచ్చిన బాబా ఫకృద్ధిన్‌ పెనుగొండలో ఎన్నో ఏళ్లు జీవించి అక్కడే కాలం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాబయ్య దర్గా ఉంది. ప్రతి సంవత్సరం బాబయ్య ఉరుసు కూడా జరుగుతుంది.
      కడప, కర్నూలు ప్రాంతాల్లో చాలా మంది సూఫీలు స్థిరపడి బోధనలు చేశారు. వారికి గుర్తులుగా ఆయా ప్రదేశాల్లో ప్రసిద్ధ దర్గాలున్నాయి. ఈ సూఫీలలో పహిల్వాన్లు కూడా ఉన్నారు. గ్రామాల్లో వారు శరీరదారుఢ్య శిక్షకులుగా కూడా ఉండి ఉండవచ్చు. గరడీ గ్యారాల్లో పార్శీ, ఉర్దూ మాటలు దీనికి నిదర్శనాలుగా నిలుస్తాయి. 
      యాడికిలో ఏటా నాగులచవితి మరుసటి రోజు సాయంత్రం గ్రామస్థులు భైరవకొండ మీది కాలభైరవుడికి పూజలు నిర్వహిస్తారు. కొండ మీద ఉన్న బయలులో గరిడీ యువకులు తమ విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఇది ఊళ్లో ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారం. ఈ భైరవకొండ మీదే శివాలయంతో పాటు దర్గా కూడా ఉంటుంది. సీమలో ఇలా చాలా చోట్ల కనిపిస్తాయి. ఇవి ఈ ప్రాంతంలోని హిందూ ముస్లింల సాన్నిహిత్యాన్ని చాటుతాయి. దాతల నుంచి విరాళాలు అందిన రోజున గరిడిలో ‘జెండా ఎగిరించే పండగ’ను జరుపుతారు. ఆ రోజు ఊరందరికీ భోజనాలు పెడతారు.
      ‘‘ఈసురోమని మనుషులుంటే/ దేశమే గతి బాగుపడునోయ్‌’’ అన్నారు గురజాడ. ‘‘కండ కలవాడేను మనిషోయ్‌’’ అని తేల్చిచెప్పారు. 
      మనిషికి కండ పట్టాలంటే క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలి. మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాయామ విద్యకు ఆటపట్టుగా విలసిల్లిన ఆనాటి గరడీలకు గుర్తుగా.. తరాల వంతెన మీద నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న యాడికి పెద్దగరడీ నిజంగా మన సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంపదే. కులమతాలకు అతీతంగా మనుషులందరూ ఒక్కటేనని చాటిచెప్పే వసుధైక కుటుంబ పతాక కూడా!


వెనక్కి ...

మీ అభిప్రాయం