శమంతకమణి రహస్యం

  • 297 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। ఎస్‌.ఎల్‌.వి. ఉమామహేశ్వరరావు

  • త్రిపురాంతకం
  • 7089603604
డా।। ఎస్‌.ఎల్‌.వి. ఉమామహేశ్వరరావు

శమంతకమణి అంటే నిజంగా రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ప్రసాదించేదేనా? అయినట్టయితే ఆ బంగారం భౌతిక రూపంలోని కనకమా? లేదా ఆ మాట వెనక అంతరార్థం ఏమైనా ఉందా? అసలు ‘శం అంతకం’ అంటే ఏంటి? శమంతకమణి కథలోని నిగూఢార్థాలేంటి?
‘తోచీ
తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లింద’ని సామెత. మన చిన్నారి గణపతి కూడా బొజ్జనిండా ఉండ్రాళ్లు తిని చంద్రుడి ఇంటికి వెళ్లాడట! తను అందగాడిననే రూపగర్వం ఉన్న చంద్రుడు గుజ్జురూపంలో పెద్ద బొజ్జతో ఉన్న బుజ్జి గణపతి చూసి వేళాకోళం చేశాడు. మనిషిలోని అంతస్సౌందర్యాన్ని కాకుండా కేవలం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూచి తను మిడిసిపడటమే కాకుండా ఎదుటి వాళ్లను వేళాకోళం కూడా చేస్తున్న చంద్రుణ్ని చూసి గణపతి ‘నీ ముఖాన్ని చూసినవాళ్లకు నీలాపనిందలు వస్తా’యని శపించాడట! సరే, కొన్ని కథల్లో గణపతిని చూసి పరిహసించినందుకు తల్లి పార్వతీదేవి చంద్రుణ్ని శపించినట్లు కనిపిస్తుంది.
      అంతా బాగానే ఉంది కానీ, వేళాకోళం చేసింది చంద్రుడు, వేళాకోళానికి గురైంది గణపతి, వేళాకోళం చెయ్యడం చూసి నొచ్చుకుంది పార్వతి. కానీ శాపం మాత్రం ప్రజలకి. చాలా శాపాలు ఇలానే కనిపిస్తాయి. సనకసనందనాదులకు వైకుంఠ ప్రవేశాన్ని జయవిజయులు అడ్డగిస్తే, మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించి ప్రజల్ని హింసిస్తూ యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేస్తూ పతివ్రతల్ని బాధిస్తూ బతకమని శపించారు. బాగుంది! ఆబోతు ఆబోతు తన్నుకొని మధ్యలో లేగదూడ కాలు విరిచినట్లు తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికి. ఈ రకమైన అసంగతం శాపాల్లో కనిపిస్తుందంటే దాని వెనుక ఏదో మర్మం దాగుందన్నమాట!
ఇదీ కథ!
కర్మసాక్షి అయిన సూర్యుడి అనుగ్రహంతో శమంతకమణి పొందాడు సత్రాజిత్తు. లోకహితం కోసం ఆ మణిని రాజుకు సమర్పించమని కృష్ణుడంతటివాడు అడిగితే అహంకారంతో తిరస్కరించాడు. సూర్యారాధన ద్వారా తన అన్న సాధించుకున్న శమంతకమణిని అర్హత లేకపోయినా తాను ధరించి అడవికి వెళ్లి సింహం వాతపడ్డాడు ప్రసేనజిత్తు. తన తమ్ముడి మరణానికి కృష్ణుణ్ని బాధ్యుణ్ని చేస్తూ దొంగతనం కూడా ఆరోపించాడు సత్రాజిత్తు. తనది కాని మణిని తను ధరించి అసంగత ప్రదేశాలకు వెళ్లడం ద్వారా ప్రసేనజిత్తు బాహ్యశౌచాన్ని కోల్పోతే, నిర్దోషి అయిన కృష్ణుణ్ని నిందించడం ద్వారా సత్రాజిత్తు అంతరశౌచాన్ని కోల్పోయాడు. బాహ్యాభ్యంతర శౌచాల్ని కోల్పోవడం వల్ల ఆరాధన ద్వారా సాధించిన మణి చేజారి పోయింది.
      ప్రసేనజిత్తును సంహరించిన సింహాన్ని చంపి మణిని సొంతం చేసుకున్నాడు జాంబవంతుడు. సత్రాజిత్తు వేసిన అపనిందను పోగొట్టుకోవడం కోసం కృష్ణుడు జాంబవంతుడితో 28 రోజులు యుద్ధం చేశాడు. తన ఆరాధ్యమూర్తి రామచంద్రుడే కృష్ణుడని గుర్తించిన జాంబవంతుడు శమంతకమణితోపాటు తన కూతురు జాంబవతిని కూడా కృష్ణుడికి సమర్పించాడు. జాంబవంతుడి నుంచి తెచ్చిన మణిని కృష్ణుడు సత్రాజిత్తుకు ఇచ్చాడు. తన తొందరపాటు తెలుసుకున్న ఆయన పశ్చాత్తాపపడి తన కూతురు సత్యభామను, ఆమెతోపాటు శమంతకమణి కూడా కృష్ణుడికిచ్చాడు. శమంతకమణి మీద ఆశలేని కృష్ణుడు రమణిని మాత్రం స్వీకరించి మణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. కాలక్రమంలో మరి కొన్ని ఘటనల నేపథ్యంలో మళ్లీ తన దగ్గరకు చేరిన శమంతకమణిని కృష్ణుడు అక్రూరునికి ఇచ్చేశాడు. ఇది స్థూలంగా శమంతకమణి కథ. దీన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే..!
అంతమయ్యే దాన్ని అంతం చేసేది!
ఆధునిక కవిత్వంలో ప్రాచుర్యం పొందిన ఒక గొప్ప అభివ్యక్తి భావచిత్రం. కవి తన కవితలో రెండు మూడు కీలక పదాల్ని ప్రయోగిస్తాడు. ఆ పదాల్ని పట్టుకోగలిగితే పైకి గందరగోళంగా ఉండే కవితలోని అద్భుత సౌందర్యం అవగతమవుతుంది. అలానే పురాణేతిహాస కథల్లో ఉండే తాత్త్విక చిత్రాల్ని పట్టుకోవడానికి కూడా కొన్ని కీలక పదాలు ఉంటాయి. సాధారణంగా వ్యక్తి స్థల వస్తు నామాల్లో ఆ కీలకం నిక్షిప్తమై ఉంటుంది. వాటిని పట్టుకోగలిగితే కథల్లో అంతర్లీనంగా ఉన్న తాత్త్వికత బోధపడుతుంది. ప్రత్యేకించి ముంగిట్లో ఎదురుచూస్తున్న మృత్యువును ముక్తిగా మార్చుకోవాలనుకుంటున్న జిజ్ఞాసి పరీక్షిత్తుకు, మూర్తీభవించిన తత్వజ్ఞాన స్వరూపుడు శుకమహర్షి చెప్పిన కథ ఈ భాగవతం. అందువల్ల ఇందులోని కీలక పదాలు పట్టుకోకపోతే ఇది కేవలం కాలక్షేప కథే అవుతుంది.  
      కథలో కనిపిస్తున్న మణి ‘శమంతకమణి’. ప్రసాదించినవాడు ‘కర్మసాక్షి’ అయిన సూర్యభగవానుడు. పుచ్చుకున్నవాడు ‘సత్రాజిత్తు’. వేసుకున్నవాడు ‘ప్రసేనజిత్తు’. మణి ప్రసాదించేది ‘ఎనిమిది బారుల బంగారం’. దీనికోసం భగవంతునితో యుద్ధం చేసినవాడు ‘జాంబవంతుడు’. యుద్ధం చేసింది ‘28 రోజులు’. పశ్చాత్తాపపడ్డ సత్రాజిత్తు పరమాత్మకు సమర్పించింది ‘సత్యభామ’ను. ఈ పదాల్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే కథాశమంతకం మనదే. ఆ శమంతకమణిని పొందడానికి కావాల్సింది బాహ్యాభ్యంతర శౌచమైతే ఈ తాత్త్విక కథామణిని పొందడానికి కావలసింది కొంత లోతైన చూపు!
      వేదాంతంలో శమ్‌ అంటే అంతమయ్యేది అని అర్థం. ‘శే అంత కర్మణీ’ అని ధాతువు. శం అంతకం అంటే అంతం అయ్యే దాన్ని అంతం చేసేది అని అర్థం. ఇంతకూ అంతమయ్యేది ఏంటి? అంటే ఈ జన్మ. పుట్టిన ప్రతిదీ అంతమయ్యేదే. జాతస్య హి ధ్రువో మృత్యుః అని కదా ఆర్యవాక్యం. మరి మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుడితే మరణం తప్పదు కాబట్టి పుట్టకుండా ఉండాలి. ఇప్పటికే పుట్టాం కాబట్టి మరణాన్ని ఎదుర్కోవాలి. మరణాన్ని ఎదుర్కోవడం అంటే మళ్లీ పుట్టకుండా ఉండటం. అదే కైవల్యం. అది ఎలా వస్తుంది? ‘జ్ఞానాదేవతు కైవల్యం’. ఈ జ్ఞానం చాలా దశల్లో ఉంటుంది, యథార్థమైన జ్ఞానం ద్వారానే కైవల్యం వస్తుంది. మనిషిని అంతం చేసే అజ్ఞానస్థితిని అంతం చేసి కైవల్యాన్ని ప్రసాదించే మణి శమంతకమణి. ఈ మణిని పొందినవాడు సత్రాజిత్తు. 
ఆ పేరు వెనక..
ఈ సత్రాజిత్తు అనేదే విచిత్రమైన పేరు. సత్రా + అజిత్తు. సత్‌ అంటే మంచిని, త్ర అంటే రక్షించేది సత్రం. అంటే లోకహితం కోసం చేసే యజ్ఞయాగాది కర్మలు అని అర్థం. యాగాలన్నింటిలోకి సుదీర్ఘమైంది సత్రయాగం. అంటే మనిషి జీవితాంతం నిర్వహించాల్సిన యజ్ఞం ఇది. అజిత్తు అంటే ఓటమి. అంటే లోకహితమైన కర్మాచరణ అనే సత్రయాగంలో ఓటమిని పొందిన వాడు సత్రాజిత్తు. అంటే సత్కర్మాచరణ లేకుండా కేవలం ఆరాధనా భావన మాత్రమే కలిగిన సత్రాజిత్తుకు, మనం చేసే ప్రతీ కర్మకు సాక్షి అయిన సూర్యుడి నుంచి శమంతకమణి లభించింది. ఆ మణికి కర్మాచరణ రహితుడైన సత్రాజిత్తు కేవలం ఆరాధన మాత్రమే చేశాడు. అదీ ఆత్మసమర్పణాభావంతో కాకుండా అహంకార భావంతో చేశాడు. అహంకారభావం ఉన్న వాడికి కొంత జ్ఞానం ఉన్నట్లు కనిపించినా అది యథార్థజ్ఞానం కాదు. అందుకనే లోకకళ్యాణం కోసం కృష్ణపరమాత్మ మణినడిగితే తిరస్కరించడమేకాక, అనుమానించి అభ్యంతర శౌచాన్ని మలినం చేసుకున్నాడు. సత్రాజిత్తుకు భక్తి ఉంది కానీ అహంకారం కారణంగా యథార్థ జ్ఞానాన్ని దర్శించలేకపోయాడు. కర్మను అంతకుముందే తిరస్కరించాడు. వాస్తవానికి ఈ కర్మ భక్తి జ్ఞానమనేవి వేరు కాదు. అజ్ఞానం, అహంకారాలతో ఈ మూడూ వేరే అనుకున్నా, వాస్తవానికి ఇవి ఒకదానికొకటి సోపానక్రమం. ‘కర్మణా జాయతే భక్తిః, భక్త్యా ప్రజాయతే జ్ఞానం, జ్ఞానాదేవ తు కైవల్యం’. దీన్ని గుర్తించలేని స్థితిలో ఉండటంతో అతడు సత్రాజిత్తు! షోడశోపచారాలతో మొట్టమొదటిది ఆవాహనం. హృదయ నైర్మల్యం లేని అహంకార యుక్తమైన మనోపీఠం మీద భగవంతుడు ఆసీనుడు కాడు. దీన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అతడు సత్రాజిత్తు! అందుకే కైవల్య ప్రదాయిని అయిన శమంతకమణి తనకు లభించినా నిలబెట్టుకోలేక పోయాడు.
పరాజితుడు
ఇక ప్రసేనజిత్తు.. అంటే సేనల ధాటికి ఓడిపోయినవాడని అర్థం. ఆ సేనలేంటో చూద్దాం! శరీరాన్ని నడపడానికి ఇంద్రియాలు ఉన్నాయి. అవే కర్మేంద్రియాలు, అవి అయిదు. తెలుసుకునే ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు మరో అయిదు. ఇవి మన శరీరసైన్యం. శబ్ద స్పర్శ రూప రస గంధాల్ని తెలియజేయడమే వీటి పని. కేవలం తెలియజెయ్యాల్సిన ఇంద్రియాలు తెలియజేయడంతోపాటు కోరుకోవడం మొదలుపెట్టినప్పుడు అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఇది రుచికర పదార్థం అని తెలియజేయడమే నాలుక పని. అలా కాకుండా నాలుక తనకు అది కావాలని కోరుకుంటుంది, అంతటితో ఊరుకోకుండా మళ్లీ మళ్లీ కావాలనీ, ప్రతిరోజూ కావాలని కోరుకుంటుంది. అలా అధికమొత్తంలో శరీరానికి అంతగా హితం కాని ఆ పదార్థాన్ని మళ్లీ మళ్లీ తినడం వల్ల ఆ పదార్థమే మనల్ని తినే స్థాయికి వస్తుంది. అంటే మనకు సహాయకారిగా ఉండాల్సిన సేనలు స్వతంత్రించి మన పైనే దాడి చేయడం. అంటే ఇంద్రియాలనే సేనల చేతిలో అపజయం పొందిన వాడు ప్రసేనజిత్తు. అందువల్లనే తనది కాని మణికి ఆకర్షితుడై దాన్ని ధరించి వేటకు వెళ్లి సింహం చేతిలో చనిపోయాడు.
28 రోజులంటే..
ప్రసేనజిత్తును సంహరించిన సింహాన్ని చంపి ఆ మణిని జాంబవంతుడు తీసుకున్నాడు. సాత్వికాహంకారం ఉన్న సత్రాజిత్తు నుంచి రాజసాహంకారం ఉన్న ప్రసేనజిత్తు తీసుకున్న మణి, తామసాహంకారం కలిగిన జాంబవంతుని చేతిలోకి చేరింది. తన తమోగుణంతో త్రేతాయుగంలో శ్రీరామునితో యుద్ధాన్ని కోరుకున్న పాపానికి జాంబవంతుడు ద్వాపరంలో కృష్ణపరమాత్మతో శమంతకమణి కోసం 28 రోజులు యుద్ధం చేశాడు. సరిగా అన్ని రోజులే ఎందుకు పోరాడాడు? ఆ సంఖ్య ప్రత్యేకత ఏంటి?
      రావణ సంహార సమయంలో రామచంద్రుని పరాక్రమాన్ని చూసి తమోగుణ కారణంగా ‘చేస్తే ఇలాంటి వాడితో యుద్ధం చేయాలి, అప్పుడు గానీ నా భుజాల తీటతీరదు’ అనుకున్నాడు జాంబవంతుడు. దానికోసం ద్వాపరం వరకు వేచి ఉన్న అతని తామసం ఒకట్రెండు రోజుల్లో తొలగిపోదు. 28 రోజులపాటు యుద్ధం చేసి తనలోని అన్ని రకాల గుణాల్ని భగవంతునికి సమర్పించి ముక్తి పొందాడు జాంబవంతుడు. 
      పంచభూతాలు, వాటి గుణాలైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచతన్మాత్రలు. వీటిని గ్రహించడానికి మానవ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ఉన్న కర్మేంద్రియాలు మొత్తం కలిపి 20. ఈ ఇరవైని తెలుసుకోవడానికి, తెలుసుకున్న వాటిని ఆచరించడానికి, ఆచరించడానికి కావాల్సిన సంకల్పాన్ని కలిగి ఉండేది మనసు. ఇది అంతఃకరణ చతుష్టయం అనే పేరుతో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు దశలుగా ఉంటుంది.
      ఏదైనా ఒక పనిని చెయ్యాలా? వద్దా? అనే సంకల్ప వికల్పాలు కలిగింది మనసు. ఈ పని చెయ్యాలి లేదా ఈ పని వద్దు అనే నిశ్చయాత్మక స్థితిలో ఉండేది బుద్ధి. బుద్ధి నిర్ణయించిన పనిని కొంత చేసి ఊగిసలాట మొదలు పెడితే ఆ ద్రవస్థితి చిత్తం. ఊగిసలాట లేకుండా ‘నేను కాబట్టే ఈ పని చెయ్యగలిగాను’ అనుకుంటే అది అహంకారం. ఇక్కడికి మొత్తం 24. సృష్టి మొత్తానికి మూలమైన గుణాలు మూడు. అవి సత్త్వరజస్తమో గుణాలు. వీటికి ఆత్మను కూడా కలిపితే మొత్తం 28. ఆత్మతో సహా తనలోని అన్నింటినీ పరమాత్మకు సమర్పిస్తే మోక్షం కలుగుతుంది. ఆ సమర్పణ గుర్తుగా జాంబవంతుడు 28 రోజుల యుద్ధం తర్వాత జ్ఞానోదయమై తన తమోగుణం నుంచి పుట్టిన జాంబవతిని పరమాత్మకు సమర్పించాడు. మనిషిలోని తమోగుణం జ్ఞానంతో తన తప్పును తెలుసుకొని పరమాత్మకు సమర్పించినప్పుడు దానికి మళ్లీ అస్తిత్వం ఉండదు. అందుకనే దీని తర్వాత జాంబవంతుడి కథ ఏ పురాణాల్లో కూడా కనిపించదు. 
సత్యభామ.. జ్ఞానం
జాంబవతితోపాటు మణిని కూడా స్వీకరించిన కృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు. అనవసరంగా కృష్ణుడి మీద నింద మోపిన సత్రాజిత్తు తన తప్పును తెలుసుకొని తన కూతురైన సత్యభామను, ఆమెతో పాటు శమంతకమణిని కూడా కృష్ణునికే సమర్పించాడు. సత్యభామ అంటే సత్యమనే భా- కాంతి అంటే జ్ఞానం. మా అంటే లక్ష్మి- సంపద. అంటే సత్యమనే జ్ఞానసంపదను పరమాత్మకు సమర్పించాడు. ఏమిటయ్యా ఆ జ్ఞానసంపద అంటే? సమస్తలోకానికి ఉపయోగపడే మణి నాకు మాత్రమే సొంతం అన్న అజ్ఞానంతో కూడిన భావనను వదిలెయ్యడం. అజ్ఞానమే దైవాపచారం. సాటి మానవుడికి చేసే అపచారమే దైవాపచారం, సేవే దైవసేవ. మన చుట్టూ ప్రాణులరూపంలో ఉండే సజీవ విగ్రహాలకు ఏది మేలు చేస్తుందో అదే నిజమైన ఆరాధన అని తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందిన సత్రాజిత్తు తను చేసిన అపచారాన్ని దిద్దుకోవడానికి సత్యభామను సమర్పించాడు. కృష్ణపరమాత్మ రమణిని మాత్రం స్వీకరించి మణిని సత్రాజిత్తుకే తిరిగి ఇచ్చేశాడు. పరమాత్మకు మనసును నేరుగా సమర్పించలేక ఒక అరటిపండు రూపంలోనో, కొబ్బరికాయ రూపంలోనో సమర్పిస్తాం. పరమాత్మ అందులోని  మన మనసును స్వీకరించి సమర్పించిన ఆ అరటిపండూ కొబ్బరికాయా మనకే వదిలేస్తాడు. అందువల్లనే సత్రాజిత్తు మనసును స్వీకరించిన పరమాత్మ మణి అతనికే ఇచ్చేశాడు.
ఇదీ అంతరార్థం
ఇక శమంతకమణి అందించే ఎనిమిది బారుల బంగారం ఏంటి? మానవ శరీరం సప్తధాతు సమన్వితమైంది. ఈ సప్త ధాతువులను సప్తయోగినీ గణాలుగా ఆరాధించటం బ్రహ్మాండపురాణంలోని లలితా స్తోత్రంలో కనిపిస్తుంది. ఈ సప్తధాతువులతో అనగా చర్మం, ఎముక, రక్తం, మజ్జ, మేదస్సు (కొవ్వు), శుక్ర, శోణితాలనే పదార్థాలతో నిండింది ఈ శరీరక్షేత్రం. క్షేత్రం అంటే పొలం. పొలంలో చేసే పని పంట పండించడం. శరీరంలో ఉండే ఈ ఏడు ధాతువులు ఏవి కోరుకుంటాయో అవి ఇవ్వడమే లక్ష్యం కాక పరమాత్మ అనుగ్రహంతో వచ్చిన ఈ శరీరం లోకహితమైన కర్మాచరణకు ఉపయోగపడాలనే జ్ఞానం కలిగి ఉండటం ఎనిమిదోది. సాధకులైన వారికి ఈ ఎనిమిదింటిని ఏరోజుకారోజు, ఎప్పటికప్పుడు ప్రసాదిస్తుంది శమంతకమణి. అదే ఎనిమిది బారుల బంగారం. అంటే ఈ జ్ఞానం ఒకసారి వచ్చి స్థిరంగా నిలిచేది కాదు. సాధన ద్వారా దాన్ని స్థిరపరచుకోవాలి. అందుకే కథలో శమంతకమణిని ప్రతిరోజూ ఆరాధిస్తేనే ఎనిమిది బారుల బంగారం ఇస్తుందని చెప్పారు. ఆ జ్ఞానం సాధకుడిలో స్థిరపడిన రోజు మణితో పని ఉండదు. అదే ముక్తి. ఈ శమంతకమణి కథ చుట్టూ అల్లినవన్నీ కూడా సాధనకు సంబంధించిన అద్భుతమైన విషయాలు. ఇవన్నీ కేవలం లౌకికమైన మణి, సింహం, ఎలుగుబంటి అయితే శుకమహర్షి చెప్పడు, పరీక్షిత్తు వినడు. మనలోని సత్వరజస్తమోగుణాల్ని భగవదర్పణ చేసే సాధకుని సాధనా క్రమం ఇందులో అంతరార్థం. దానికి ఈ కథ పై తొడుగు మాత్రమే.
      ఈ కథకూ వినాయకచవితికీ సంబంధం లేదు. ఎప్పుడైనా దీన్ని చదువుకోవచ్చు. భాద్రపద శుద్ధ చవితి రోజు భుక్తాయాసంతో ఉన్న గణపతిని చూసి చంద్రుడు నవ్వడం, అప్పుడు గణపతి లేదా పార్వతీదేవి చంద్రుణ్ని శపించడం అన్నది కేవలం జనవ్యవహారంలో ప్రచారంలో ఉన్న కథ మాత్రమే. రామాయణంలో లక్ష్మణరేఖ, లక్ష్మణదేవర నవ్వు, శబరి రామునికి ఎంగిలిపండ్లు పెట్టడం, అహల్య రాయి కావడం లాంటి కథల్లాగా వినాయక చవితి రోజు చంద్రుణ్ని చూడకూడదని చెప్పే ఈ శాప వృత్తాంతకథ కూడా జనవ్యవహారంలో, చలనచిత్రాల్లో ప్రచారం పొందిన కథే! పురాణేతిహాసాలపరంగా ప్రామాణికమైంది కాదు. ఇది దక్షిణ భారత దేశానికి మాత్రమే పరిమితమైన కల్పన. 


వెనక్కి ...

మీ అభిప్రాయం