ఊహలకే రెక్కలుంటే...!!

  • 63 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా.మాదిరాజు కనకదుర్గ

  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
  • హైదరాబాదు
  • 9885688342
డా.మాదిరాజు కనకదుర్గ

మనిషి జీవితాన్ని ప్రగతిపథం వైపు మళ్లించేది విజ్ఞానశాస్త్రం. ప్రపంచంలో శతాబ్దాలుగా అపూర్వమైన, అద్భుతమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజల జీవితాలను సంపూర్ణంగా మార్పుకు లోను చేసిన ఈ ఆవిష్కరణలను ప్రపంచ సాహితీవేత్తలు కొందరు ముందుగానే వారి సృజనశక్తితో ఊహించి రాశారు. తెలుగులో దాదాపు 70 సంవత్సరాల కిందటే ప్రారంభమైన వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యం తీరుతెన్నులు, పోకడలను ఒకమారు అవలోకిద్దాం.
‘‘సైన్స్‌
ప్రాతిపదికగా తీసుకొని కథలు రాసే పద్ధతిని వైజ్ఞానిక సాహిత్యం అంటారు’’ అన్నారు వేమూరి వెంకటేశ్వరరావు. ‘వైజ్ఞానిక కల్పన అంటే ఏమిటో చదివినప్పుడు అర్థంకాదు. కానీ చూసినప్పుడు తెలుస్తుంది’ అన్నది మార్క్‌ సి.గ్లాసీ నిర్వచనం. ‘భూత, వర్తమాన కాలాల పట్ల తగినంత జ్ఞానం, ప్రకృతి పట్ల సంపూర్ణ అవగాహన, శాస్త్రీయ ప్రాముఖ్యతపై ఆధారపడిన భవిష్యత్‌ సంఘటనల గురించిన వాస్తవిక యోచన’’ అని వైజ్ఞానిక కల్పనను నిర్వచించాడు రాబర్ట్‌ ఎ.హీన్లీన్‌. కథల్లో శాస్త్రాన్ని చొప్పించి సామాన్య పాఠకులకు శాస్త్రీయ వైజ్ఞానిక రంగాల్లో పురోగతిని గురించి ఊహాత్మకంగా తెలియచెప్పే సాహిత్యం వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యం. ఈ సాహిత్యంలో రచయిత ఊహావైచిత్రికి అవధులుండవు. తదనంతర కాలంలో వారి ఊహలే వాస్తవాలుగా రూపుదిద్దుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
      ఈ వైజ్ఞానిక కల్పన అనేక రకాలు. భౌతిక, రసాయన, నక్షత్ర వంటి పరిణామాత్మక శాస్త్రాలకు సంబంధించింది. రాబర్ట్‌ ఎ.హీన్లీన్, ఆర్థర్‌ సి.క్లార్క్, ఇసాక్‌ అసిమోవ్, గ్రెగ్‌ఎలాన్‌ వంటి రచయితలు ఈ క్రమంలో రచనలు చేశారు. సామాజిక వైజ్ఞానిక కల్పనలోకి మనస్తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి శాస్త్రీయ రచనల రూపకల్పనలు వస్తాయి. కృత్రిమమేథ, సమాచార సాంకేతికత అంశాలకు సంబంధించిన రచనలను సైబర్‌పంక్‌ వైజ్ఞానిక సాహిత్యం అని చెప్పొచ్చు. కాలగమనం (టైం ట్రావెల్‌) వంటి అంశాలకు చెందిన సాహిత్యం బాగా అభివృద్ధి చెంది చలనచిత్రాలు, దూరదర్శన్‌ మాధ్యమాలతో ప్రజలకు చేరువైంది. చారిత్రక సంఘటనలను భిన్నంగా అభివర్ణించేవి ప్రత్యామ్నాయ వైజ్ఞానిక చరిత్ర కల్పన రచనలు. అంతర్‌ గ్రహ లేదా అంతర్‌ నక్షత్ర సైనిక బలగాల మధ్య జరిగే యుద్ధాలపై ఆధారపడిన రచనలు సైనిక వైజ్ఞానిక కల్పనలు. అసాధారణ శక్తులు కలిగిన వ్యక్తుల జీవితాలకు సంబంధించిన వైజ్ఞానిక కల్పన, ఖగోళ ప్రభావాలు, పర్యావరణ వైపరీత్యాల గురించి చెప్పే పర్యావరణ వైజ్ఞానిక కల్పన, బాహ్య అంతరిక్షం, సుదూర గ్రహాలు, అంతరిక్ష సరిహద్దులకు సంబంధించిన వైజ్ఞానిక కల్పనలు సాహిత్యంలో ప్రజాదరణ పొందాయి.
ప్రారంభం ఎప్పుడు?
19వ శతాబ్దంలో ఆంగ్లసాహిత్యంలో మేరిషెల్లీ రాసిన ఫ్రాంక్‌ఐన్‌స్టీన్‌ (1818)ను మొట్టమొదటి వైజ్ఞానిక కాల్పనిక నవలగా చెబుతారు. జుల్స్‌వెర్న్‌ ‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ ఎయిటీ డేస్‌’, హెచ్‌.జి.వెల్స్‌ ‘వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌’, అనంతర కాలంలో వెలువడిన రచనలు. సైన్స్‌ఫిక్షన్‌ పితామహుడిగా పేర్కొనదగిన ఐజాక్‌ అసిమోవ్‌ దాదాపు 500ల వైజ్ఞానిక కాల్పనిక నవలలను రచించారు.
      తెలుగులో మొట్టమొదటి వైజ్ఞానిక కాల్పనిక నవల టేకుమళ్ల కామేశ్వరరావు ‘విహంగయానం’(1934). రచయిత ‘‘విహంగయానం తెలుగులోని ప్రకృతి శాస్త్ర సంబంధమైన నవలల్లో మొట్టమొదటిది. స్వతంత్రముగా రచింపబడినది. ...వాయు, విమాన నిర్మాణ పద్ధతులు 18, 20 ప్రకరణములలో తెలుపబడినవి’ అని పేర్కొన్నారు. రచయితకు కూడా ఇదే తొలి వైజ్ఞానిక నవల. ఇది అప్పట్లో ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా కూడా ఉంది. ఈ నవలలో ప్రేమావతి శాస్త్రవిజ్ఞానాన్ని అభ్యసించిన యువతి. నీళ్లల్లోనూ, గాలిలో కూడా విహరించే విమాన జలాంతర్గామిని రూపొందిస్తుంది. సముద్రగర్భంలోని అనంత సంపదను స్వంతం చేసుకొని సాగర మధ్యంలో అమరావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, ప్రజలకు ఆర్షవిజ్ఞానాన్ని పంచుతుంది. నేటి మన ప్రెషర్‌ కుక్కర్‌ను పాకయంత్రంగా సంబోధిస్తూ, దాని పనితీరును రచయిత వివరించారు. ఇంకా ఆవిరిబలం (స్టీం ఫోర్స్‌), విద్యుద్వారం, వాత్యాహతి వంటి వైజ్ఞానిక పదాలను తెలుగులో ఉదహరించారు. టేప్‌రికార్డర్, కెమెరా, సినిమా ప్రొజెక్టర్, వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను గురించి కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత 1952లో వెలువడిన వసంతరావు వెంకటరావు ‘చిత్రగ్రహం’ నవలలో చంద్రమండల యాత్రను అభివర్ణించారు. 1957లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో కొడవంటి నరసింహం నవల ‘ఎక్కడనుండి ఎక్కడికి’ మొదటి బహుమతిని గెలుచుకుంది. అదే సంవత్సరంలో కొడవటిగంటి కుటుంబరావు కాల వాహకం పై ప్రయాణాన్ని వర్ణిస్తూ రాసిన ‘గ్రహశకలం’ వెలువడింది.
కొత్తపుంతలు
1975 సంవత్సరం తరువాత వెలువడిన వైజ్ఞానిక నవలలు పాశ్చాత్య నవలలకు ఏమాత్రమూ తీసిపోని స్థాయిలో ఉన్నాయి. ఎన్‌.ఆర్‌.నంది ‘గుడ్‌ బై భూదేవి’ నవల్లో ఒక యువ శాస్త్రవేత్త గ్రహాంతర జీవులతో అనుసంధానం ఏర్పరచుకునే క్రమంలో అతని జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను చిత్రీకరించారు. ‘దృష్టి’ క్లెయర్‌వాయన్స్‌ మీద ఆయన కలంనుంచి వెలువడిన అద్భుతమైన నవల. ఎన్‌.ఆర్‌.నంది రాసిన ‘కాంచనగంగ’లో ఆయన దూరవహనం(టెలిపతి), సైకోకెనిసిస్, కిర్లియాన్‌ ఫోటోగ్రఫీ, బయోప్లాస్మాన్‌ బాడీ(జీవద్రవరూపం) మొదలైన విజ్ఞాన శాస్త్ర విశేషాలను తెలియజెప్పారు. యండమూరి ‘యుగాంతం’, లో ప్రపంచం ఒకపక్క అంతమైపోతున్నా లాభాపేక్షను వీడలేని మనుషుల విచిత్ర మనస్త్తత్వాలను వివరించారు. చంద్రుడు అనేక శకలాలుగా విస్ఫోటనం చెంది భూమిచుట్టూ ఉన్న గ్రహకక్ష్యలో వేలాడుతున్నప్పుడు వరదలు ఇంకా అనేక జలప్రళయాలు సంభవించటం, దానిపై ప్రపంచదేశాలు ఒకదానిపై ఒకటి కత్తులు దూయటం వంటి ఉత్పాతాలను వర్ణించారు రావూరి భరద్వాజ ‘జలప్రళయం’ నవలలో. బొల్లిముంత నాగేశ్వరరావు ‘గ్రహాంతర యాత్రికులు’లో భారతదేశాన్ని సందర్శించటానికి ఇద్దరు గ్రహాంతర వాసులు రావడం, ఇక్కడి మనుషులమధ్య ఉన్న పేద, గొప్ప తారతమ్యాలను, భారతీయుల వైజ్ఞానిక సంపత్తిని చూసి వారు ఆశ్చర్యానికి లోనవడం ఇత్యాది అంశాలను విపులీకరించారు. ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న వైజ్ఞానిక నవల ‘బుద్ధిజీవి’. 2053 నాటికి అమెరికా వారు అంగారకగ్రహంపై నివాసాలను ఏర్పరచుకొని జీవించే పరిస్థితులను వివరిస్తుంది. ఈ నవలలో సౌరశక్తితో నడిచే కార్లు, పరీక్షనాళికల్లో జన్మించే శిశువులు, సమరూపజీవుల సృష్టి, మరమనుషుల విన్యాసాలను అద్భుతంగా విశదీకరిస్తారు రచయిత మైనంపాటి భాస్కర్‌. 1982లో చతురలో ప్రచురించిన ‘అశ్విని’ భూమిని ఒక లఘుగ్రహం ఢీకొనడం, ఆ సమస్యను అశ్విని అనే వ్యోమనౌక పరిష్కరించడం కథాంశమైన నవల. దీన్ని ఆర్‌.రామకృష్ణారావు రాశారు. ఇంకా కె.ఆర్‌.కె. మోహన్‌ ‘తేజోలింగరహస్యం’, ‘పరలోకవాసి’, ‘మాయమైన మమ్మీ’, ‘చంద్రమండల యాత్ర’ మొదలైన వైకల్పిక నవలలను రాశారు.
      వైద్యవిజ్ఞాన కథాంశంతో కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన ‘ఒకే రక్తం- ఒకే మనుషులు’ సంచలనం రేపిన నవల. ఈ నవల్లో, కొమ్మూరి తరతరాల భారతీయ సంప్రదాయ సంబంధమైన బావామరదళ్ల వివాహాలు, మేనరిక వివాహాల వల్ల జన్యుపరంగా తలెత్తే శారీరక, మానసిక సమస్యలను కూలంకషంగా చర్చించారు. తండ్రి తమ్ముడు తండ్రితో సమానమైనప్పుడు తల్లి తమ్ముడిని వివాహం చేసుకోవటం వైద్యపరంగా ఆరోగ్యకరం కాదన్న విషయాన్ని సోదాహరణంగా వివరించారు. వైద్య విజ్ఞాన శాస్త్ర సాహిత్యానికి చెందినవే మల్లాది వెంకటకృష్ణమూర్తి కొత్తశత్రువు, యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రార్థన, ఎన్‌.ఆర్‌.నంది 31 డిశెంబర్,1,99,999 నవలలు. 
భయానక కల్పన
హింస, జుగుప్సలతో పాఠకులను భయపెట్టేదిగా ఉండేది అభూత వైజ్ఞానిక కల్పనా సాహిత్యం. ఇటువంటి సాహిత్యంలో తార్కిక దృక్పథం ఉండదు. ఈ భయానకం వైజ్ఞానిక కల్పనలో భాగం కాదు. అయినప్పటికీ, భయానక సాహిత్య రచనల్లో, వైజ్ఞానిక అంశాలు కూడుకొని ఉంటాయి. తెలుగులో ఇటువంటి సాహిత్యం 80వ దశకంలో ఎక్కువగా వెలువడింది. దయ్యాలు, భూతాలు, మానవాతీత శక్తులు ప్రధాన కథాంశాలుగా ఈ సాహిత్యం వెలువడింది. ఇటువంటి సాహిత్యంతో పాఠకులకు మేలుకంటే కీడే ఎక్కువ.
మహిళల విజ్ఞానం
తెలుగులో మహిళలు కూడా వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యాన్ని విరివిగానే రచించారు. తొలి తెలుగు వైజ్ఞానిక రచయిత్రిగా కంచి రమాదేవిని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన బాలల నవలల పోటీలో ‘అనంతంలో అంతం’ అనే వీరి నవల బహుమతి గెల్చుకుంది. ఇందులో సునందలోకానికి చెందిన హరియన్‌ నల్లమల కొండల్లో చాలాకాలం నిద్రపోతాడు. ఆ కొండల్లో ప్రాజెక్టు పనులకోసం చేపట్టిన పేలుళ్లవల్ల బయటికి వస్తాడు. హరియన్‌ స్వానుభవాలను వివరించే ఈ నవలలో విజ్ఞానం అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనీ, మంచిచెడుల కోసం దాన్ని వాడుకోవడం అనేది మనిషి విజ్ఞత పై ఆధారపడి ఉంటుందనీ రచయిత్రి చెబుతారు. తెన్నేటి హేమలత రాసిన ‘మహాయాత్ర’ నవలలో కథానాయిక ఆశాదేవి విదేశాల్లో చదువుకున్న మహిళ. తన మేథస్సుతో, భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి ఒక అంతరిక్షనౌకను నిర్మిస్తుంది. ఇంకో ఇద్దరిని వెంటబెట్టుకొని ఆ నౌకలో ధ్రువనక్షత్రానికి వెళ్లిరావటం ఈ నవల్లో కథ. ఇందులో నక్షత్రాల నుంచి వెలువడే తరంగాలను విజయవాడ ఆకాశవాణి కేంద్రం అందుకోవటం, ఆమె అంతరిక్ష యాత్రావిశేషాలు ఈ నవలను వైజ్ఞానిక నవలగా నిలబెడతాయి. వైజ్ఞానిక కాల్పనిక నవలగా చెప్పదగిన మరో నవల జొన్నలగడ్డ రమాదేవి ‘చంద్రమండలంపై శశిరేఖాపరిణయం’ శశిరేఖ అనే యువతి అభిమన్యురావును చంద్రమండలంపై వివాహం చేసుకోవటం ఈ నవల్లో ఇతివృత్తం. డాక్టర్‌ సి.ఆనందరామం రాసిన ‘నీటిసెగలు’ సాగర గర్భంలోని రహస్యాలను వెల్లడి చేసిన నవల. సముద్రం లోతుల్లో జరిపిన పరిశోధనలు, వాటి ఫలితాలు, వివిధ జాతుల చేపలను గూర్చి ఇందులో వివరించారామె. రసాయనిక ఆయుధాల వినియోగం వల్ల సముద్రంలో పెరిగే జీవరాశికి కలుగుతున్న నష్టం, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలను చర్చించారు అడవి సూర్యకుమారి తన నవల ‘టాప్‌ సీక్రెట్‌’లో. ఈ క్రమంలో వచ్చిందే కె.పద్మావతి రాసిన ‘ది ప్లానెట్‌ ఎంపోరియం’ కూడా.
కథావైచిత్రి
1927లో సుజాత మాసపత్రికలో వెలువడిన ‘పరమాణువులో మేజువాణి’ తెలుగు వైజ్ఞానిక నవలల పరంపరలో వెలువడిన మొట్టమొదటి కథ. రచయిత సిరిగురి జయరావు. అణువు అంతర్భాగంలోకి కథానాయకుడు తన పాదాలకు లేపనాన్ని పూసుకొని చేసిన ప్రయాణమే ఈ కథాంశం. రసాయనిక ప్రతిచర్యల వల్ల ఎదుటివాళ్లకు కనపడకుండా అదృశ్యం కాగలిగే ఒక వ్యక్తి కథ డా।। ఒద్దిరాజు సీతారామచంద్ర రావు రాసిన ‘అదృశ్యవ్యక్తి’. ఒక ప్రత్యేక రసాయనిక సిరాతో చెక్కులమీద అక్షరాల్ని మారుస్తూ బ్యాంకులను దోచే ఒక యువతి కథ ఎన్‌.ఆర్‌.నంది ‘రెండుజళ్ల కళ్లజోడు’. చంద్రుడి మీదికి చేసే ప్రయాణాన్ని వర్ణిస్తూ కె.ఆర్‌.కె.మోహన్‌ రాసిన కథ ‘చంద్రమండల యాత్ర’. 1961లో ఆంధ్రపత్రికలో ప్రచురించిన కె.తిరుమలరావు ‘రంగనాయకులి నవ్వు’, రెంటాల నాగేశ్వరరావు ‘స్త్రీపర్వం’, మైనంపాటి భాస్కర్‌ ‘డీప్‌ ఫ్రీజ్‌’ కూడా వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యానికి చెందినవే. 20 సంవత్సరాల కిందటే నాళికా శిశువుల ఆవిర్భావం, అద్దెగర్భం మొదలైన శరీర విజ్ఞానాంశాలను చేర్చి రాసిన కథ ఎం.హేమలత రాసిన ‘కన్నతల్లి’. 
      40వ శతాబ్దంలో క్లోనింగ్‌ ప్రక్రియకు సంబంధించి జరగబోయే శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిని ఊహించి, పిల్లలమర్రి రామలక్ష్మి రాసిన కథ ‘జెనెసిస్‌’. ఈ కథలో రచయిత్రి సమరూప జీవసృష్టి, మరమనుషుల అభివృద్ధి వంటి వైజ్ఞానిక అంశాలను స్పృశించారు. శంఖవరపు సరోజాసింధూరి ‘వరదగుడి’ మనిషి శారీరక, మానసిక వ్యవస్థలపై వివిధ వర్ణాల ప్రభావాన్ని తెలిపే కలర్‌ హీలింగ్‌ ప్రక్రియ గురించి రాసిన కథ. అన్నపూర్ణారెడ్డి మెరవపల్లి ‘సో లాంగ్‌ మై ఫ్రెండ్‌’ కథలో మెదడు వ్యాధి సోకిన మురహరికి అతని మెదడు స్థానంలో మరణించిన మరో వ్యక్తి మెదడును అమర్చుతారు. అయితే, మరణించిన వ్యక్తి మెదడులో జ్ఞాపకాలు సజీవంగా ఉండటంతో మురహరికి పాత స్మృతులు గుర్తుకురాక అతడు ఇబ్బందులకు లోనవుతాడు. అవయవాల మార్పిడి వల్ల మనిషి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలను ఊహించి రాసిన కథ ఇది. 2050లో భూమ్మీద జరగబోయే అణుయుద్ధాన్ని, అంగారక గ్రహంపై మనిషి గడపబోయే యాంత్రిక జీవనాన్ని వర్ణిస్తూ ‘నూట పద్నాలుగు’ కథ కూడా వీరు రాసిందే.
      వైజ్ఞానిక రంగంలో అనేక కోణాల్లో తేలికైన భాషలో ఇంకా నవలలూ, కథలు రావాలంటారు వేమూరి వెంకటేశ్వరరావు. తెలుగు సాహిత్య ప్రవాహంలో ఒక పాయగా ఉన్న వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యం విజ్ఞాన శాస్త్రంలో కొత్తగా చోటుచేసుకున్న ఆవిష్కరణలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో పరిచయం చేస్తుంది. భవిష్యత్తులో రాబోయే వైజ్ఞానిక మార్పులకు అనుగుణంగా మనిషిని మానసికంగా సన్నద్ధం చేయగలుగుతుంది. ఇంతటి శక్తి కలిగిన ఈ సాహిత్యం వేయిముఖాలుగా వికసించాలంటే సాహితీవేత్తలు విజ్ఞాన శాస్త్రం వైపునకు, నూతన వైజ్ఞానిక ఆవిష్కరణల దిశగా దృష్టిసారించాలి. శాస్త్రనిపుణులు విజ్ఞాన విషయ వివరణను చేపట్టగలగాలి. సాహిత్యానికి పరమావధి అయిన సామాజిక ప్రయోజనాన్ని అప్పుడే సాధించగలం. వైజ్ఞానిక వైకల్పనలను వివరించే కథలు, నవలలు వెలువడితే, తెలుగుభాష మరింత పరిపుష్టమౌతుంది. యువతరానికి కూడా సాహిత్యాధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం