పిల్లలనే గౌరవించవలెను!

  • 186 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

మన పెద్దలకు ఎంత స్వార్థమో! ఎంత అహమో! ‘పెద్దలను గౌరవించవలెను’ అని టముకు వేస్తుంటారు. అభంశుభం తెలియని పిల్లకాయలతో కాళ్లకు మొక్కించుకోవాలన్న తాపత్రయం తప్ప ఇందులో ఇంకేమైనా ఉందా? నిజానికి పెద్దలే సాగిలబడి పిల్లలకు సాష్టాంగ దండ ప్రణామాలు చేయాలి. ఉన్నవాళ్లను లేనివాళ్లు గౌరవించడమే కదా విధాయకం. అది ఎలాగో ఏంటో విని అవధరించండి. 
      వయసు మీద బడటంతో పెద్దలు మృత్యువుకు కొన్ని సంవత్సరాల దగ్గరలో ఉంటారు. కానీ అదే కుర్రకారుకు బతికే వయసు అధికంగా ఉంటుంది. జీవితం ఎక్కువ మిగిలి ఉన్నవాళ్లను గౌరవించడం మంచిది కదా! వయసు పెరిగే కొద్దీ వారి ఖాతాల్లో పాపాలు, తప్పులు పెరుగుతూ ఉంటాయి. అదీ చిన్న వయసులో ఉన్నవాళ్లకు పాపాలూ తక్కువే... తప్పులూ తక్కువే. అందువల్ల పాపాలు ఎక్కువ, తప్పులు ఎక్కువ ఉన్నవాళ్లను పిల్లలెందుకు గౌరవించాలి? ఏమని గౌరవించాలి!
వయసు మళ్లిన/ మనసు కుళ్లిన సోమరులారా చావండి!/ నెత్తురు మండే/ 
శక్తులు నిండే/ సైనికులారా! రారండి... 

      వయసు మళ్లిన మనసు కుళ్లిన వాళ్లంటే ముసలివాళ్లే కదా! శ్రీశ్రీ అంతటివాడు ఊరకే అలా అంటాడా? ముసలివాళ్లు శక్తిహీనులు. కుర్రాళ్లు శక్తిమంతులు; శక్తిహీనులు, శక్తిమంతుల్ని గౌరవించడం సార్వత్రిక, సార్వజనీన అవసరం. తల్లిదండ్రులు పెద్దవాళ్లు. పిల్లలు వాళ్లను గౌరవించాలి అనేదీ ఓ లా పాయింటు. ‘‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి?’’ అని ఓ శతకకవి తమ పిల్లల్నో, ఇంకెవరి పిల్లల్నో తిట్టిపోశాడు. అయితే ఆ కవి కూడా పప్పులో కాలేశాడు. కొడుకు తన తల్లిదండ్రుల మీద దయ చుపించాలట; ఈలెక్కన పిల్లలు గొప్పవాళ్లని చెప్పకనే చెప్పినట్టయింది కదా!
      పెద్దల పాపమా అని పిల్లలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవ్వరూ నోరెత్తడంలేదు. పిల్లల్ని పెద్దలు బానిసలుగా చూస్తున్నారు. అయినా సరే, పిల్లలేమో తల్లిదండ్రుల్ని దైవసమానుల్లాగా చూడాలి. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నది ఇక్కడ కూడా నవ్వులపాలైపోతోంది. పిల్లల్ని పెద్దలు ఎప్పుడూ తిడతారు. పిల్లలు ఎప్పుడైనా పెద్దల్ని ఆ పని చేస్తారా? గుండెల మీద చెయ్యివేసుకుని చెప్పండి. పెద్దలు పిల్లల్ని కొడుతుంటారు కూడా. పిల్లలు పెద్దల పట్ల అలా చేస్తారా? చెయ్యరుగాక చెయ్యరు.  
      పెద్దలు తమ పిల్లల్ని బేబీ కేర్‌ సెంటర్‌లో చేర్చడం ఒప్పు అనుకుంటే, వాళ్లు పెరిగి పెద్దయ్యాక అదే స్ఫూర్తితో తమ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్‌ సెంటర్‌లో చేరిస్తే తప్పు ఎలా అవుతుంది? అవుతుం దని ఏ ‘లా’ చెబుతుందో తెలియదు.
      బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు. మరి పెద్దల వాక్కు బ్రహ్మవాక్కు అని ఎక్కడా, ఎవరూ చెప్పలేదు. ఆ గౌరవం పిల్లలకే దక్కింది. పిల్లల్ని కనీ, పెంచామని పెద్దలు ఏవో గొప్పలు చెబుతారు. పిల్లలు పెరగడం వాళ్ల దయాదాక్షిణ్యాలు అనుకుంటారు. ‘మమ్మల్ని కనండి.. మమ్మల్ని కనండి’ అని ఏ పిల్లాడూ దరఖాస్తు పెట్టుకోలేదు. అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకు అలా అంటారు? చిన్న చూపు చూస్తారు? పిల్లల కోసమే బతుకుతున్నట్టు ఎందుకు ఫోజు పెడతారు? అడ్డమైన అక్రమాలూ  చేసేసి దొరికి పోయాక ‘ఇదంతా ఎవరికోసం మీ కోసమే కదా’ అని పిల్లల మీదకు తోసేసే ముదురు మహారాజులు ఎందరు లేరు! ‘నువ్వు బల్ల కింద చెయ్యిపెట్టి సంపాదించుకు రాకపోతే నేను అన్నం తినను’ అని ఎప్పుడన్నా ఏ పిల్లాడైనా మారాం చేశాడా? మరెందుకు ఆ చిల్లర వేషాలూ?  
      ఓటుహక్కు విషయంలో కూడా పిల్లలకు అన్యాయం జరిగింది. ఓటు వేయడం మా జన్మహక్కు అని పిల్లలు ఉద్యమాలు చేయక ముందే కళ్లు తెరవడం అవసరం. కుర్రకుంకలకు ఓటు విలువ ఎలా తెలుస్తుంది? అని బాల వ్యతిరేకులైన కొందరు పెద్దలు వెక్కిరించవచ్చు. కానీ ఓటు ‘విలువ’ తెలిసిన కొందరు డబ్బు, మద్యం లాంటి వాటికి అమ్ముడుపోయి ఓటును దుర్వినియోగం చేస్తున్నారు కదా అని పిల్లలు వాదిస్తారు. ఇంటర్‌ నెట్టుతోనే పుట్టి పెరిగిన పిల్లజాతికి ఓటు విలువ తెలియదంటే అవ్వ! ఎవరైనా వింటే నవ్వుతారు. 
      నిజం చెప్పాలంటే పిల్లాడి విలువ తెల్లాడికి తెలిసినంతగా నల్లాడికి తెలీదు. ‘ఛైల్డ్‌ ఈజ్‌ ద ఫాదర్‌ ఆఫ్‌ మ్యాన్‌’ అని ఇంగ్లీషు వాడు ఎప్పుడో అన్నాడు. వాడికి మన చేతులతో చప్పట్లు కొట్టాలి. ‘‘పిల్లలు దేవుడూ చల్లని వారే.. కల్లకపటమెరుగని కరుణామయులే’’ అన్న పాటను ఎన్ని దశాబ్దాల నుంచి మనం పాడుతున్నాం. ఎదుటివాళ్లు పాడితే వింటున్నాం. అయినా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే వాళ్లకు ‘బాలదేవోభవ’ అనడానికి నోరు రాదేం?! ‘‘ప్రపంచ బాలలారా! ఏకం కండి! పోరాడితే పోయేవి పెద్దలు వేసే సంకెళ్లే!’’ అని మార్క్స్‌ మళ్లీ పుట్టి పిలుపిచ్చి ఉంటే ఎంత వైరల్‌ అయ్యేది!
      మార్క్స్‌ వర్గసమాజం గురించి చెప్పాడు. బాగానే ఉంది. ఉన్నవాళ్లు, లేని వాళ్లు అని విభజించాడు. అదీ బాగానే ఉంది. దాంతోపాటు సమాజాన్ని పెద్దలు పిల్లలు అని విభజించి పెద్దలను పెట్టుబడిదారులుగానూ, పిల్లలను కార్మికులు గానూ విభజించి వారి మధ్య జరిగే పోరాటాలను చిత్రించి ఉంటే అదిరిపోయేది! పిల్లలు పీడితులు తాడితులు. వాళ్లకు అండగా ఉండాలి కదా! ఇంత కన్నా సామాజిక ధర్మం ఏముంది? పిల్లల వీపుల మీద గాడిద బరువులు వేసి స్కూళ్లకు పంపించడం ఎంత తప్పు! వాళ్లను కూడా ఒక రకంగా బాలకార్మికుల్లాగా చేయడమేగా! పెద్దల పరువు ప్రతిష్ఠల కోసం ఈ మార్కుల సమాజంలో పడి నలిగిపోతున్న పసివాళ్ల గురించి ఏ మార్క్స్‌ చెప్పాడు?  
      తల్లిదండ్రుల అణచివేతకు గురువుల హింస కూడా తోడయితే ఎంత దుర్భరం. ధర్మం నాలుగుపాదాల నడిచిందని చెప్పే కృతయుగంలో ప్రహ్లాదుణ్ని కన్నతండ్రే ఏనుగులతో తొక్కించడం, పాములతో కరిపించడం, పర్వతాల మీద నుంచి తోయించడం లాంటివి చేశాడు. ప్రహ్లాదుడు చేసిన పాపమేంటి? అతడి భావ ప్రకటనా హక్కును అణచి వేయడానికేగా తండ్రి కుట్ర చేసింది. ‘‘చదివించిరి మము గురువులు, చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ’’ అని ప్రహ్లాదుడు ఇచ్చిన ప్రమాణపత్రాన్ని నమ్మి వదలివేయ వచ్చుగా! ఇది కలియుగం వరకు సాగుతూనే ఉంది. దాన్ని అడ్డుకోవాలంటే పిల్లలు సంఘటితం కావాలి. ‘ప్రహ్లాద సంఘం’ అనే దాన్ని స్థాపించుకోవాలి.
      ఇదంతా ఒక ఎత్తయితే, పిల్లల్ని మానసికంగా హింసించడం ఎంత తప్పు! కన్నకొడుకును నిరక్ష్యం చేస్తూ పక్కింటి పిల్లాడితో పోల్చి హీనంగా మాట్లాడి అవమానించడం ఎంత దారుణం. అబ్బాయి కూడా తన తండ్రిని పక్కింటి అంకుల్‌తో పోల్చి చులకనగా మాట్లాడితే ఆ తండ్రి తట్టుకోగలడా! జవాబివ్వగలడా? ఇవన్నీ చూస్తుంటే పిల్లల హక్కుల్ని కాపాడటం ముఖ్యం అనిపిస్తోందా? లేదా? 
      ‘‘ఈ పెద్దల దౌర్జన్యాలు విషపూరిత తిట్టు మాటలు ఇంకానా! ఇకపై చెల్లవు’’ అనే రోజు రావాలి. ఆడవాళ్లు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని మహాత్మా గాంధీ అన్నారు. పిల్లలందరూ ఎలాంటి తిట్లూ, దెబ్బలు తినకుండా హాయిగా నిద్రపోయిన రోజే ప్రపంచానికి స్వాతంత్య్రం వచ్చిన రోజని అనుకోవాల్సిందే. ఇందుకోసం బాలల మహాప్రస్థానం ప్రారంభం కావాల్సిందే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం