నెత్తుటి పూల వ‌సంతం!

  • 131 Views
  • 0Likes
  • Like
  • Article Share

వెలివాడ బతుకుల్లో కూడా సాహిత్యం ఉంది. చిత్రలేఖనం ఉంది. నాటకం ఉంది. ఈ ప్రపంచం చూడటానికి ఇష్టపడని చాలా అందాలు అందులో ఉన్నాయి. అయితే అవన్నీ అంటరాని వసంతాలు. ఈ భూమ్మీద కురిసి వెలిసిన వెలి కదలికలు. అడవిగాచిన వెన్నెలలా ఎవరికీ అక్కరకు రాకుండా పోయిన ఆ కళాస్రవంతీ, బడుగు జీవుల మీద కొనసాగిన దోపిడీ, మతం మారినా కులం మాత్రం పటిష్ఠంగా ఎలా నిలబడి ఉందీ... లాంటివన్నీ తెలియాలంటే ‘అంటరాని వసంతం’ నవలలోకి ప్రయాణించాల్సిందే.
తరాల
వారధి మీదగా చరిత్ర మజలీల్లోంచి సాగే ఓ ప్రయాణం.. జి.కల్యాణరావు ‘అంటరాని వసంతం’. ఈ నవల నిండా రూతు జ్ఞాపకాలే. అందులో ఎల్లన్న పాట ఉంది. ఎన్నెలదిన్ని ఉంది. ఉరుముల నాగన్న నృత్యం ఉంది. చెమట రాల్చిన పదాలున్నాయి. మరి వాటిని అల్లిన సుబ్బి, కోటి, లచ్చి, మారెమ్మ లాంటి పల్లీయుల్ని ఏ ఆకాశ నక్షత్రాలు మింగే శాయి. ఏ కాలనాగులు కాటేశాయి! అని ప్రశ్నించుకోవడం ఇప్పుడు అనవసరం అంటుంది రూతు. ఎందుకంటే గుర్తింపు కోసమో, ప్రశంసల కోసమో తాపత్రయ పడిన వాళ్లు కాదు ఆ కష్టజీవులు. కళ వారి నరనరాల్లో ఉంది. గుండె లోతుల్లో ఉంది. చెమట ప్రవాహంలో ఉంది.
తెలుగులో నాటకానికి మూలం వీధి భాగవతం. అది అల్లిక. రాసింది కాదు. అట్టడుగు వర్గాల్లో, ముఖ్యంగా వారి కళ ఆవిర్భావంలో వీధి బాగోతాలు ముందు ఉద్భవించాయి. కుమ్మరి పెదకోటేశ్వరుడు ద్విపదను తీసుకువచ్చాడు. నిజానికీ ప్రజలు మాట్లాడే భాషలోనే సర్వాన్ని చెప్పడం జానపద సాహిత్యం ప్రధాన లక్ష్యం. అది హృదయంలో నుంచి వచ్చిన కవిత్వం. 
శివయ్య... సీమోను
వీధినాటకాలాడే ఎర్రగొల్లలు ఊళ్లోకి దిగుతారు. ఎర్రెంకడి కొడుకు ఎల్లన్నని ఆకట్టుకుంది వారి ఆట. వారు ఎలా అలంకరించుకుంటారో చూడాలని డేరాలోకి తొంగిచూస్తాడు. కులం పేరుతో అతణ్ని అవమానించి తరిమేస్తే పారిపోతాడు. ఆ పరుగులోనే కొత్త ఆలోచన పొడకడుతుంది. ఎల్లన్నలో ప్రతిఘటనతో పాటు పాట కూడా పొంగుకొస్తుంది. అదే తన ఉత్తర జీవితాన్ని నడిపిస్తుందనీ, తన జాతి సంస్కృతికి వాహిక అవుతుందని ఎరగని ఎల్లన్న వెలివాడ బతుకులను పాటలోకి దించుతాడు. అందులో తన చుక్కల ముగ్గుకర్ర సుభద్రను నిలుపుతాడు. పాటకోసం, జాతి చరిత్రను పదిలపరచడం కోసం ఊరు విడిచిపెట్టిన ఎల్లన్న ఈ నవలా సాంస్కృతిక వారసత్వ క్రమంలో ముందువరుసలో నిలుస్తాడు.
ఎల్లన్న కొడుకు శివయ్య ఎదిగొచ్చేటప్పటికి ధాత కరువు వస్తుంది. ఆ కరువులో నా అన్న వాళ్లందరినీ కోల్పోయి భార్య శశిరేఖను తీసుకుని వలసబాట పడతాడు. బకింగ్‌ హాం కాలువ తవ్వకపు పనుల్లో కాస్త పనిదొరికితే బతకొచ్చుననుకున్న శివయ్య మీద కులం విరుచుకుపడుతుంది. అగ్రవర్ణ కూలోళ్లు తరిమేస్తే చాలా దూరం పారిపోయిన శివయ్యకి మెడలో శిలువ వేలాడదీసుకున్న మార్టిన్‌ కనిపిస్తాడు. శివయ్య సీమోనుగా అవతరిస్తాడు. అతని కొడుకే రూబేను. క్రైస్తవ మిషనరీలో పెరిగి అక్కడే బోధకుడవుతాడు. రూబేను భార్య రూతు. శ్రీకాకుళ పోరాటంలో రాలిపోయిన నక్షత్రం ఇమ్మానుయేలు, రూతు రూబేనుల పుత్రుడు. తర్వాత జెస్సి అదే మార్గాన్ని ఎంచుకుంటాడు. ఇలా ఈ నవలలో ఏడు తరాల కథ కనిపించినా ఇది అలెక్స్‌ హెలీ ‘రూట్స్‌’ నవల లాంటిది కాదు. విమర్శకులు ఈ నవల మీద ‘ఏడుతరాలు’ ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు. కుటుంబ మూలాలను అన్వేషిస్తూ ‘రూట్స్‌’ సాగుతుంది. ‘అంటరాని వసంతం’ నవల మాత్రం వెలివేతకు గురైన వాళ్ల సంస్కృతిని వెలికితీసే ప్రయత్నం చేస్తుంది.
ఆ సమస్య అలాగే...
ఎల్లన్న భార్య సుభద్ర. ‘‘నా చుక్కల ముగ్గు కర్ర’’ అని ఆమెని ముద్దుగా పిలుచుకోవడమే కాదు, తాను రాసిన పాటలన్నింటిలో సుభద్ర ముద్రను ఉంచుతాడు ఎల్లన్న. అంటరానివారి ఆత్మగౌరవ పోరాటాలకు రూపమిస్తాడు. భూమి కోసం రక్తార్పణం చేసిన వీరుల కథా చక్రాన్ని తన పాటల్లో పదిలపరుస్తాడు. వాటిని పండితులు గాలి పాటలన్నా, ఎవరేం అనుకున్నా అవి సహజమైన స్పందనకు మారుపేరు. ‘‘సూబద్ర యినవే/ సూరుకింద నీరు సిట్టేలిక తాగే/ సూబద్ర యినవే/ మబ్బూలేని సోట వానెట్టకురిసే/ సూబద్ర యినవే/ వానా కురవకపోతే వాగెట్టనిండె/ సూబద్ర యినవే..’’ అంటూ ఎల్లన్న పాటలని ఉత్తరాది కూలోళ్లు వరి కోతలప్పుడు పాడుకుంటుంటే సుభద్ర వింటుంది. పాడిన ఆ పిల్లని దగ్గరగా కూర్చోబెట్టుకుని మరికొన్ని పాటలు పాడించుకుంటుంది. ‘‘మిన్నూ పానుపుమీద/ దూదీ దుప్పటి పైన/ సుక్కాల పూలగుత్తి సుబద్రా/ నువ్వు పచ్చి పగడానివే సుబద్రా....’’ ఇవన్నీ మాల బైరాగి పాటలని అన్నప్పుడు.. ఎల్లన్నే ఆ బైరాగి, ఆటెల్లడు పాటెల్లడుగా బతుకుపాటలో కలిసిపోవడం కూడా ఒక చారిత్రక అవసరమే అనుకుంటుంది సుభద్ర.
      ఎన్నెలదిన్నిలో ఒక ప్రాంతీయ సమస్యగా కనిపించిన కులం బకింగ్‌హాం కాలువ తాలూకూ సంఘటన వల్ల అదొక జాతీయ సమస్యగా నిలుస్తుంది. ఏ మతమైనా బతికే మార్గం చూపితే చాలు అనుకునే స్థితిలో శివయ్య సీమోనుగా మారతాడు. సిలువ ఎత్తుకుంటాడు. క్త్రెస్తవం వల్ల కొంత ఊరట పొందుతాడు. ‘‘నక్కలకి బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. కాని మనిషి కుమారుడు తలదాచుకోవడానికి చోటు లేదన్న’’ బైబిల్‌ సూక్తులు ఓదార్పు మాత్రం కలిగిస్తాయి. బాప్టిస్టు మిషన్‌ వాళ్లు ఒంగోలు- రాజుపాలెం దగ్గర నాలుగు మైళ్ల పొడవు కాల్వ తవ్వకపు పనులు కేవలం అంటరానివాళ్లకి కేటాయించారని మార్టిన్‌ ద్వారా తెలుసుకున్న శివయ్యకి కలిగిన సంతోషం కొంత వరకే! కానీ, కులం సమస్య అలాగే ఉంది. పని విభజన చెయ్యగలిగిన దొర... కులాన్ని ముట్టుకునే ధైర్యం చెయ్యలేదు. అంటరాని జనాంగం క్త్రెస్తవ జనాంగంగా మారుతున్న క్రమాన్ని రచయిత వర్ణిస్తూ.. మతం కులాధిపత్యాన్ని బలపరిచి.. బడుగులను ఎలా బలి తీసుకుంటున్నదీ చెబుతూనే బతుకుదెరువు కోసం, తెల్లదొరల ప్రాపకం కోసం అగ్రవర్ణ వ్యక్తులు క్త్రెస్తవులుగా మారి సంపన్నులు ఎలా అయ్యిందీ స్పష్టం చేస్తారీ నవల్లో. 
చారిత్రక యథార్థ గాథ
శివయ్య కొడుకు రూబేను పరిపూర్ణ క్రైస్తవ జీవితంలోకి అడుగుపెడతాడు. తన తండ్రి ఎవరో, తను మిషనరీలోకి ఎలా వచ్చాడో, తన పూర్వికులెవరో! తన బతుకు మూలాలు ఎక్కడివో! తెలుసుకునేందుకు ఎన్నెలదిన్ని వెళ్తాడు. తన తాత మాలాడి దిబ్బపై వీరగాథ రాసినట్టు, ఎల్లన్న పాటలు ఇప్పటికీ ఆ పల్లీయుల గొంతుల్లో పలుకుతున్నట్లు తెలుసుకుంటాడు. భార్య రూతుకు ఆ పాటల పదకోశాన్ని పరిచయం చేస్తాడు. అవమానకర గ్రామీణ భారతంలో అంతరానితనానికి ప్రతిఘటనగా సాగిన ఉద్యమ కథాగానం ఎంత శక్తిమంతమైందీ గర్వంగా.. కొడుకు ఇమ్మానుయేలుకి చెబుతుంది రూతు. అది చివరి తరం జెస్సి వరకూ సాగుతుంది. 
      రూతు తన గతాన్ని ముందరేసుకున్నప్పుడల్లా ఒకటే అనుకుంటుంది. ‘‘అంటరానితనం! అది ఎప్పుడూ ఒకేలా ఉంది. అన్ని కాలాల్లో ఉంది. అన్ని తరాలకు ఉంది. అది తాకకుండా, కలవకుండా వాళ్ల జీవితం లేదు. వంశం లేదు’’. సినసుబ్బడి తర్వాత ఎర్రెంకడు, తర్వాత ఎల్లన్న అటు తర్వాత శివయ్య, రూబేను, ఇమ్మానుయేలు.. తర్వాత జెస్సి. ఇలా అందరూ తమ జీవిత కాలాల్లో అస్పృశ్యతనీ, అవమానాలనీ ఎదుర్కొన్న వాళ్లే. అగ్రవర్ణాల కొమ్ము కాస్తూ బడుగు జీవితాల విధ్వంసమే ధ్యేయంగా పనిచేసిన చెత్తోడు లాంటి పోలీసు అధికారి, క్రైస్తవ్యాన్ని స్వార్థానికి వాడుకుని పబ్బం గడుపుకునే లింగారెడ్డి లాంటి వాళ్లు.. ఇలా అనేక పాత్రలు, సంఘటనలను కలుపుతూ ఒకానొకకాలపు చారిత్రక యథార్థ గాథలని కళ్లముందు నిలుపుతుందీ నవల. 
      ఆవలపాడు గ్రామ పెత్తందార్ల కుట్ర వల్ల జైలు పాలైన రామానుజం విడుదలయ్యాక శ్రీకాకుళం సాయుధ పోరాటంలోకి వెళ్లిపోతాడు. తర్వాత ఇమ్మానుయేలు ఆ పోరాటంలో సమిధ అవుతాడు. తర్వాత జెస్సి.. తుపాకీ వైపు మొగ్గుచూపుతాడు. భూమి కోసం, భుక్తికోసం, గౌరవప్రదమైన జీవితం కోసం జెస్సి తనను తాను ఉద్యమానికి అంకితం చేసుకున్న తీరుని రూతు ప్రశంసిస్తుంది. గతిస్తున్న శతాబ్దాన్ని మీ త్యాగానికీ, రాబోయే శతాబ్దాన్ని మీ విజయానికీ అంకితం చేస్తున్నాను అనే రూతు ఉత్తరంతో ‘అంటరాని వసంతం’ నవల ముగుస్తుంది. 
‘పోరాటం అనివార్యం’
ఈ నవలకి ప్రఖ్యాతి రావడానికి కారణం ఇందులోని ఇతివృత్తమే కాదు శిల్పం కూడా! నవలంతా కవితాత్మక శైలి పరచుకుని ఉంటుంది. రూతు వెన్నెలపిట్టతో మాట్లాడటం, రూబేను చుక్కలని పలకరించడం, ఎల్లన్న చుక్కల ముగ్గుకర్రతో సుభద్రను పోల్చడం.. కథంతా కవనమాధుర్యంతో తొణికిసలాడుతుంది. ఈ రచనా శైలికి ప్రధాన కారణం అల్లిక వారసత్వం అంటారు రచయిత జి.కల్యాణరావు. ‘‘నన్ను ప్రభావితం చేసిందీ, కథ ఎలా అల్లాలో నేర్పిందీ మా అమ్మమ్మ! అలా కొత్త కథనశైలికి అంటుగట్టడానికి కారణం అమ్మమ్మ దగ్గర కూర్చుని కథలు వినడమే’’ అంటారాయన.
జెస్సీ ఎందుకలా చేశాడు? 
అంటరాని వసంతాన్ని 2000లో విరసం ప్రచురించింది. ఇప్పటి వరకు ఈ నవల ఆరు ముద్రణలు పొందింది. పుస్తకంగా రాకముందు ‘అరుణతార’ పత్రికలో ధారావాహికగా వచ్చింది. పన్నెండేళ్ల సుదీర్ఘ ఆలోచన, చారిత్రక అంశాల అన్వేషణ పూర్తయ్యి ఏడాదిలో నవలగా రూపుది ద్దుకోవడం వెనుక చాలా శ్రమ ఉందంటారు రచయిత. ముఖ్యంగా బకింగ్‌హాం కాలువ తవ్వకాల కూలీల పేర్లు తెలుసుకునేందుకు క్రైస్తవ మిషనరీ రికార్డులు సహాయపడ్డాయని చెబుతారు. తమిళ, కన్నడ, మలయాళ, ఉర్దూ, హిందీ లాంటి పలు భారతీయ భాషల్లోకే కాదు ఇంగ్లీషు, జర్మన్‌ లాంటి అంతర్జాతీయ భాషల్లోకీ ఈ నవల అనువాదమయ్యింది. ‘తీన్‌దాదా వసంతం’ పేరుతో చేసిన తమిళ అనువాదానికి విశేష పాఠకాదరణ లభించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు విశ్వవిద్యాలయాలతో పాటు మద్రాసు అన్నామలై విశ్వవిద్యాలయంలో కూడా ఈ నవల మీద పలు పరిశోధనలు, పత్రసమర్పణలు, సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
      ‘నవల చివర్లో జెస్సి విప్లవ పంథా ఎందుకు ఎంచుకున్నాడు?’ అని చాలా మంది ప్రశ్నించారట రచయితని. దానికి కల్యాణరావు ఇలా సమాధానమిచ్చారు..
      ‘‘ప్రజాస్వామ్యం నిర్వీర్యమైనప్పుడు విప్లవం అనివార్యమవుతుందని అంంటారు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. అంతేకాదు నేను రాసిన రాజ్యాంగం నా జాతి ప్రజలకు పనికిరానట్లయితే దాన్ని తగలబెట్టడానికి సైతం వెనకాడను అని ఆయన చెప్పారు. ఆ మాటలను బట్టి.. మనిషికి పోరాటం అనివార్యం. నేను ముఖ్యంగా సాయుధ పోరాటాన్ని విశ్వసిస్తాను. జెస్సీ అడవిబాట పట్టడానికి అదీ ఒక కారణం కావొచ్చు’’! 


వెనక్కి ...

మీ అభిప్రాయం