ద్రౌపది నవ్వు

  • 72 Views
  • 0Likes
  • Like
  • Article Share

    విశాలి

  • బెంగళూరు.
  • 6362564577

ద్రౌప‌ది న‌వ్వు గురించి దుర్యోధ‌నుడి కంటే భార‌త విమ‌ర్శ‌కులే ఎక్కువ ప‌ట్టించుకుని బాధ‌ప‌డ్డారు. ఈ మ‌ధ్య కాలంలో వ‌స్తున్న మ‌హాభార‌తాల్లో ద్రౌప‌ది న‌వ్వు ఓ విచిత్రంగా, అప‌హాస్యంగా మారింది. అస‌లు అంద‌రూ అనుకుంటున్న‌ట్టు.. మ‌య‌స‌భ‌లో సుయోధ‌న ప‌రాభ‌వం వాస్త‌వ‌మేనా? ద్రౌప‌ది నిజంగానే న‌వ్విందా?
భారతంలోని
వర్ణనలను బట్టి చూస్తే ద్రౌపది జన్మమూ, ఆ వెనుకటి కథా, ఆమె సౌందర్యమూ, వివాహం, దాంపత్యం.. అన్నీ అసాధారణమైన విషయాలూ, లోకాతీతమైనవీ కూడా! యజ్ఞవేదిక నుంచి ఆమె ఆవిర్భవించినట్లుగా చెప్పడంలోని సంభావ్యతా, అసంభావ్యతలను పక్కకు పెట్టి చూస్తే, అలా జన్మించిందని చెప్పడంలో వ్యాసుని అంతర్యం ఆమె ‘దివ్యవనిత’ అని. అయినా సరే, మహాభారత కాలం నాటి నుంచీ నేటి వరకూ ద్రౌపది ఎన్నో అపవాదులకు లోనవుతూనే ఉంది. ముఖ్యంగా మయసభలో కిందపడ్డ దుర్యోధనుణ్ని చూసి ద్రౌపది నవ్వడమే కురుక్షేత్రానికి కారణమనే వాళ్లూ ఉన్నారు. కానీ, ఈ విషయాన్ని మరోమారు తరచి చూడాల్సి ఉంది!
      రాజసూయానంతరం ఎక్కడి వారక్కడికి మరలిపోయారు. దుర్యోధనుడు, శకుని మాత్రం మాయసభ వైభవాన్ని చూడాలనే కోరికతో నిలిచిపోయారు. అపురూపమైన ఆ సభా భవనం రమణీయతకు విస్మితుడై దుర్యోధనుడు ఒకరోజు ఒంటరిగా అక్కడి కొన్ని ప్రదేశాలను తిలకించసాగాడు. ఆ సందర్భంలో అతనికి మూసి ఉన్న ద్వారం తెరచి ఉన్నట్లుగా, తెరచి ఉన్న తలుపు మూసి ఉన్నట్లుగా కనిపించింది. అలా వెళ్లి దెబ్బతిన్నాడు కూడా! సమతల ప్రదేశాన్ని ఎత్తయినదిగా భావించి ఎక్కబోయాడు, ఎత్తయిన ప్రదేశం సమతలంగా ఉన్నట్టు భావించి పడిపోయాడు. అలాగే నీలపుమణులతో పొదిగిన ప్రదేశాన్ని జలాశయం అనుకుని దుస్తుల పై పట్టుకొని దిగబోయాడు. నీటితో ఉన్న జలాశయాన్ని చూసి మామూలు ప్రదేశమనుకుని నడవబోయి బట్టలు తడిసిపోగా వెనక్కి మళ్లాడు. అప్పుడు ‘‘వానింజూచి పాంచాలియుబాండుకుమారులును నగిరి’’ అని చెప్పారు భారతంలో. విషయం తెలుసుకున్న ధర్మనందనుడు, ధృతరాష్ట్ర తనయుడికి వాయుపుత్రుడితో దివ్య వస్త్రాలు, భూషణాలు ఇప్పించాడు. దుర్యోధనుడు సభాప్రలంభానికి సిగ్గుపడి పాండవులకు వీడ్కోలు చెప్పి హస్తినకు తిరిగి వెళ్లిపోయాడు.
      ఈ నవ్వు కారణంగానే దుర్యోధనుడు కక్షకట్టి కురుసభలో ద్రౌపదిని అవమానించాడని చాలా మంది భావించారు. ఆమె చేసిన ఈ చిన్న పొరపాటే మహాసంగ్రామానికి దారి తీసిందని మరికొందరు విమర్శించారు.  
అసూయే అసలు సమస్య
దుర్యోధనుణ్ని ఆ యాగంలో ఆకట్టుకున్నవి, మనసుకు హత్తుకుపోయినవి రెండే విషయాలు. అవి.. పాండవుల వైభవం, రెండోది ద్రౌపది సామర్థ్యం. అదీ కాక ధర్మరాజు ఆ యాగంలో ‘‘నానా దేశాగతులైన రాజులు దెచ్చి యిచ్చిన యుపాయనంబులు గైకొనే’’ బాధ్యత దుర్యోధనుడికే అప్పగించాడు. రాజులిచ్చిన సంపద అతని కళ్లలో అసూయను మరింత పెంచింది. అతడేమీ ధృతరాష్ట్రుడిలా అంధుడు కాదు కదా! మరైతే అతనికి మయసభలో ఏ వస్తువు ఏదో ఎందుకు సరిగ్గా కనపడి ఉండదు? ఈ సంపద వైభవం చూసిన దుర్యోధనుడి మనసు మనసులో లేదు. అసూయతో రగిలిపోయింది. అందుకే అతనికి ఆ మయసభ అంతా వ్యత్యస్థంగా ఆనింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడింది.
      దుర్యోధనుడు తన తండ్రికి ఒకసారి ‘‘పాంచాలియు పాండుకుమారులును నగిరి’’ అని చెప్పాడు. అంటే పాండవులు, ద్రౌపది ఎప్పుడు దుర్యోధనుడు పడిపోతాడో అని నవ్వడానికి అక్కడే సిద్ధంగా ఉన్నారన్నమాట. మరొక మారు ‘‘... సహస్రవిలాసినీ పరివృతమయి యున్న ద్రౌపది నగియే’’ అని అంటాడు దుర్యోధనుడు. వేలమంది పరిచారికలతో కలిసి ద్రౌపది నవ్విందట. ఈ సందర్భంలో ‘‘అంధుడి కొడుకు అంధుడు’’ అందని కూడా కొంతమంది రాశారు. ద్రౌపది వ్యక్తిత్వం అలాంటిదేనా?
      అరణ్యవాసంలో ద్రౌపదిని చూడటానికి వచ్చినప్పుడు, ‘‘ఒక్క భర్తనే నేను ఆకట్టుకోలేకపోతున్నాను, నువ్వు అయిదుగురిని ఎలా నీ వశం చేసుకున్నావు, ఏ మందులు వాడావు? ఏ మాకులిచ్చావు?’’ అని ప్రశ్నిస్తుంది సత్యభామ. దానికి పాంచాలి  సమాధానమిస్తూ ఇలా అంటుంది..  
పలుమారు దలవాకిట
మెలగుట యసతీజనైక మిత్తత్ర కలహం
బుల కేలయుట నగుపలుకుల
బెలుచ నగుట నాకుగాని పేరివి మగువ

      మగవారి కంటబడటానికే ఇష్టపడని అంతఃపురకాంత తడిసిన బట్టలతో నిలబడి ఉన్న పరపురుషుణ్ని చూసి నవ్వుతుందా? తనను అపహరించడానికి వచ్చిన సైంధవుడి ఆంతర్యం తెలిసి కూడా ‘‘భూవరా! తగు విందవైతి కురువర్యుల యింటికి నట్లు గావునంబరువడి నాసనక్రియయు బాద్యము గైకొను’’ అని అతని పట్ల గృహస్థ మర్యాదను పాటించింది. అలాంటి ద్రౌపది దుర్యోధనుడంతటివాడు, అతిథి, తన ఇంట భంగపడితే సంస్కారహీనంగా నవ్వుతుందా?
      ‘‘మూర్ధాభిషిక్తుడైన ధర్మరాజు సాత్యకి ముత్యాలగొడుగు పట్టగా, భీమార్జునులు బంగారు చామరాకు వీచగా.... నగిరి కృష్ణ పాండునందన ద్రౌపదీ సాత్యకులు గరంబు సంతసమున’’ అని చెబుతాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో. అంతటి సందడిలో ద్రౌపదికి అతణ్ని చూసి నవ్వేటంత తీరిక ఎక్కడ దొరికిందో మరి! భీముడు, నకులుడు, సాత్యకి, కృష్ణుడు, ధర్మరాజు కూడా తనను చూసి నవ్వారంటాడు రాజరాజు! కృష్ణుడు, ధర్మరాజులనూ కలిపాడంటే అనుమానించాల్సిన విషయమే! రాజసూయ యాగానికి వచ్చిన వారందరూ ఈ దుర్యోధనుణ్ని చూసి నవ్వడానికే వచ్చారేమో!
అదంతా భ్ర‌మ‌
అసలు ధర్మరాజు సంపద చూసి అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడికి ‘భ్రమ’ ఆవహించింది. తాను పడిపోయినందుకు బాధ కన్నా ఎవరైనా చూశారేమో అని చుట్టూ చూసుకునే అభిమానధనుడు అతడు. బహుశా తను పడిపోయినప్పుడు పాండవులు చూశారేమో, ద్రౌపది చూసిందేమో, కృష్ణుడు చూశాడేమో అని అనుమానాలతో తల్లకిందులైపోయాడు. ఆ అసూయా, ఈ అవమానం రెండూ కలిసి జూదానికి తండ్రిని ఒప్పించడానికి ఒక్కోసారి ఒక్కో విధంగా ‘నవ్వు’ గురించి చెప్పి ఆయనను నమ్మించాడు.
ద్రౌపది, పాండవులు తనని చూసి  నవ్వారో లేదో దుర్యోధనునికి స్పష్టంగా తెలుసా? తెలిసి ఉంటే తండ్రికి అతడు ఇన్ని కథలు అల్లి ఇంత శ్రమపడి చెప్పాల్సిన పనే ఉండేది కాదు. నిజంగా వారు నవ్వడమే జరిగితే అతడు అంత సులువుగా వదిలిపెట్టేవాడు కాదు. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ‘‘నువ్వు నవ్వినందుకే ఈ ప్రతిఫలం’’ అని స్పష్టంగా ఆమె ముఖం మీదే చెప్పి ఉండేవాడు. అలా చేయకపోవడాన్ని బట్టి ఈ విషయానికి అతడంతగా ప్రాధాన్యమివ్వలేదని భావించవచ్చు.  అన్నింటికీ మించి వ్యాసభారతంలో దుర్యోధనుడు పడిపోయినప్పుడు అక్కడ ద్రౌపది లేదని స్పష్టంగా ఉంటుంది. 
      ఇదీ వాస్తవం. అయినా దీన్ని పట్టించుకునే వారేరీ? అందుకే అప్పటికీ ఇప్పటికీ అపనిందలు తప్పట్లేదు ద్రౌపదికి!


వెనక్కి ...

మీ అభిప్రాయం