మొయ్యర మోత... బీరపూల వాయిదా!

  • 169 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। రంగురాజ పాపయ్య

  • చిగురుమామిడి, కరీంనగర్‌ జిల్లా.
  • 7674060367

భాషకు అందాన్నీ, లోతైన భావాన్నీ, సమగ్రతనూ ఇస్తాయి పలుకుబళ్లు, నానుళ్లు, జాతీయాలు, సామెతలు. పాయసంలో జీడిపప్పులాగ సందర్భాన్నిబట్టి మాటల మధ్యలో తగులుతూ భాషను సుసంపన్నం చేసే పలుకుబళ్లు తెలంగాణలో విరివిగా వినిపిస్తాయి. ఒక్కసారి వాటిలోని సౌందర్యాన్ని, అర్థరమణీయతను అవలోకిస్తే... 
పల్లె ప్రజల
శ్రమైక జీవన సౌందర్యానికి, సృజనాత్మకతకు నెలవులు పలుకుబళ్లు, సామెతలు, జాతీయాలు. వారి నిశిత పరిశీలనలోంచి వచ్చిన ఈ జున్ను ముక్కలు, పలుకులకు చమత్కారాన్ని అద్దుతాయి. తెలంగాణ పల్లెపట్టుల్లో ఇలాంటివి నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. 
సొల్లుదిని బతుకుతాన!
‘లెంక’ అంటే కట్టిఉంచడం. ‘లెంకలు’ అంటే జతలు, జతలుగా ఎడ్లను కట్టి తీసుకుపోవడం. పల్లెల్లో ఏ పనీపాటా లేకుండా తిరిగే యువకులకి పెండ్లి చేసి ‘లెంక కట్టాం’ అంటారు. ‘లెంకపీట కట్టడం’ అనే మాట కూడా ఉంది.  ఆవు/ దూడ పక్కవాళ్ల చేనుల్లోకి పరుగున వెళ్లి పైరుని మేయకుండా, నెమ్మదిగా నడిచేలా మెడలో ఒక పెద్ద కట్టెను కడతారు. అదే ‘లెంకపీట వేయడం’. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ‘ఆ లెంకీ లెంక, చెంద్రమై లెంక’ అంటుంటారు. అంటే అందరు పిల్లలు చేతులు పట్టుకుని జంట విడవకుండా ఉండాలి. ఒకవేళ   ఎవరైనా జంట విడిపోతే ‘దొంగ’గా ఉన్న పిల్లాడు తాకుతాడు. అప్పుడు ఆ తాకిన బాలుడు ‘దొంగ’ అవుతాడు. ఈ పోరగాండ్లను ‘లెంక వెట్టుకొని అంగడికి కొట్టుండ్లి’ అనే మాట కూడా ఉంది. అంటే బాగా అల్లరి చేసే పిల్లల్ని లెంకగట్టి అంగడిలో అమ్మాలని పెద్దవాళ్లు సరదాగా అంటుంటారు.  లెంక అనే పదం ‘లంకె’ నుంచి వచ్చింది. 
      ‘సొల్లు’ అంటే తమిళంలో ‘చెప్పడం’ అని అర్థం. తెలుగులో ఇది ‘లాలాజలం’గా మారింది. అయితే, తెలంగాణలో ‘సొల్లుదిని బతుకుతాన’ అని వినిపిస్తుంటుంది. ఇక్కడ సొల్లు అంటే ‘వడ్డీ’. గ్రామాల్లో వృద్ధులు, ఏ పనీ చేసుకోలేని వాళ్లు గతంలో పొదుపు చేసుకున్న డబ్బుని వడ్డీకిచ్చి, కొడుకులు, బిడ్డలు సరిగా చూసుకోకపోయినా ఆ వడ్డీతో జీవిస్తుంటారు. గతంలో దొరలు, పటేండ్ల దగ్గర పనిచేస్తూ కుటుంబాలను పోషించుకునే సందర్భంలో ‘నీ సొల్లు దాగి బతుకుతాన’ అనే మాట వినిపిస్తూండేది. ‘వాని సొల్లుదిని వానికే మర్లవడుతానవా!’ అనే ఇంకో మాట ఉంది. అంటే, ఎవరి సొమ్మునైతే తింటున్నారో, వారికే ఎదురు తిరుగుతున్నావా అని!
నీ జౌడం పాడుగాను!
‘గవ్వ రాకడ లేదు, గడియ రికాం లేదు’ అనే మాట కూడా బాగా వినిపిస్తుం టుంది. ఇక్కడ ‘గవ్వ’ అంటే రూపాయి. ఒకప్పుడు మారకద్రవ్యంగా గవ్వల్ని వాడేవారు. ‘క్షణం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేద’నే నానుడి ఇలాంటిదే. మనిషి ఏదో ఒక పని చేస్తుంటాడుగానీ, ఎలాంటి ఆదాయమూ లేదని చెప్పడమన్నమాట. ‘గవ్వకు కొరగాడు’ అనీ అంటుంటారు. అంటే ఎందుకూ పనికిరాని, విలువలేని మనిషని. ‘వానికి గవ్వలు గులగులవెడుతానయి’ అంటే ధనాన్ని ఇష్టారీతిగా ఖర్చుపెడుతున్నా డన్నమాట. డబ్బుని దుబారా చెయ్యకుండా పొదుపు చేసుకోవాలని చెప్పే పలుకుబడి ఇది. ‘గవ్వకో కష్టం - గడియకో దుఃఖం’ అంటే రూపాయి సంపాదించడానికి ఒక వైపు కష్టపడుతుంటే, గడియ గడియకు మరో కష్టం వచ్చిపడుతూనే ఉందన్న ఆవేదన.
      ‘లత్త’కు ‘నీచు/ కౌసు వాసన, దుర్వాసన’ అనే అర్థాలున్నాయి. ‘చెడు’ అనే అర్థంలో కూడా వాడుతుంటారు. ‘వానివి లత్తకోరు బుద్ధులు’ అంటే, చెడ్డ మాటలు మాట్లాడేవాడు, నీచు కూర ఎక్కువగా తినేవాడు అని సామాన్య అర్థం. ఈ ‘లత్తకోరే’ ‘లత్కోరు’ అయ్యి రాజకీయ నాయకుల నోట ఎక్కువగా వినపడుతుంటుంది! ఇక ‘జౌడము’కి ‘జగడం, లొల్లి, అల్లరి, గొడవ’ అనే అర్థాలున్నాయి. ‘వాళ్లతో నీకు జౌడమెందుకు, జౌడం పెట్టుకోకు బిడ్డా, నీ జౌడం పాడుగాను’ అనే మాటలు గ్రామాల్లో వింటుంటాం. చీటికీ మాటికీ గొడవలకు దిగేవాణ్ని ‘జౌడాల సివోడు’ అంటుంటారు. ‘వలపోత’ అంటే గత స్మృతులను గుర్తు చేసుకుంటూ దుఃఖించడం. బంధుమిత్రులు చనిపోయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏడుస్తుంటే ‘ఆమె/ అతని వలపోతకు అంతులేదు’ అంటుంటారు.
కైతికాల తాడుదెంప!
‘మోత’ అంటే బరువు అనే అర్థం ఒకటుంటే, ‘శబ్దం, ధ్వని’ పరంగా కూడా తెలంగాణలో వాడుతుంటారు. వాన పడుతున్నప్పుడు ‘మొయ్యర మొయ్యర మోతవోస్తంది’ అంటుంటారు. అంటే పెద్ద శబ్దంతో వర్షం పడుతోందని. పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటే ‘ఈపు ఇమానం మోత మోగుతుంది!’ అంటుంటారు. అంటే అల్లరి మానెయ్యకపోతే బాగా కొడతామని బెదిరించడం! బళ్లో మాస్టర్లు ఈ మాట ఎక్కువగా వాడుతుంటారు. ‘దులపటం’ అంటే విదిలించడం, పోగొట్టడం. కానీ, జన సామాన్యంలో ‘తిట్టడం’ అనే అర్థమూ ఉంది. ‘వాని దుమ్ము దులిపి రాపో, వాని దుమ్ము దులిపిన’ లాంటి మాటలు వాడుతుంటారు. ‘దుమ్ము దులిపి - దమ్మిడి సేతికిచ్చిన’ అంటే, బాగా తిట్టి కొంత సొమ్ము చేతిలో పెట్టారని! ‘పూవిందె’ అంటే పువ్వు నుంచి కాయగా మారుతున్న సమయం. తెలంగాణలో ‘యవ్వనవతి’ అనే అర్థం కూడా ఉంది. ‘పూవిందెను తెంపితే మహాపాపం’ అంటే, పువ్వు నుంచి కాయగా మారుతున్న పిందెను తెంపడం పాపమని ఒక అర్థమైతే, చిన్న పిల్లలను కొట్టడం/ చంపడం/ హింసించడం మహాపాపమని మరో అర్థం. ‘బీరపూల వాయిదా’ అనే మాట కూడా తరచూ వినిపిస్తుంటుంది. బీరపూలు సాయంత్రం పూస్తాయి. ఇవ్వాల్సిన బాకీ అడిగితే సాయంత్రం/ రేపు ఇస్తా అనేవాళ్లు, అసలే ఎగ్గొట్టేవాళ్లని ఉద్దేశించి ఈ మాట వాడతారు. ‘బలగం’ అంటే బంధు వర్గంతో పాటు బలం, మందీ మార్బలం అనే అర్థాల్లో కూడా ఉపయోగిస్తారు. ‘వారిది కాకి బలగం’ అంటే, చాలా ఎక్కువ బంధువర్గం ఉందని అర్థం. 
      జామకాయలు లాంటి వాటిని చిన్నపిల్లలు పంచుకుని తినేటప్పుడు, వస్త్రం చుట్టి కొరికి ఇస్తుంటారు. ఇదే ‘కాకెంగిలి’. కాకుల గుంపులో మొదట ఒక కాకి ఎంగిలి చేసి చూసిన తర్వాతే మిగతా కాకులు తింటాయి. గ్రామాల్లో మేక, గొర్రెల మాంసం కుప్పను ‘పోగు’ అంటారు. ఊళ్లో మేకను కోశాక, ‘మాకో పోగు వెయ్యమన్నం’ అంటుంటారు. ‘నాకు దానిమీదనే జిమ్మ కొట్టుకుంటాంది’ అంటే దాని మీద చాలా ఆసక్తి, ఇష్టం ఉందని! ‘ఇంకా జిమ్మ తీరలేదా?’ అంటే ‘కోరిక తీరలేదా?’ అని అర్థం. ‘జిమ్మ’కు ‘నాలుక, నోరు, అధికం’ లాంటి అర్థాలున్నాయి. ఏం కూర? అని అడిగితే ‘తమ్ముడు జిమ్మ పిల్లలు తెచ్చిండు. అవిటినే కూర వండిన’ అంటుంటారు. అంటే, చేపపిల్లలు తెచ్చాడని అర్థం. 
      పొలం దగ్గర వేరుశెనగ (పల్లికాయలు), జొన్న కంకులు కాల్చడానికి వేసే మంటను ‘తంపి’ అంటారు. ‘పాటిమీద’ అంటే ఊరికి పైభాగాన ఉన్న ప్రదేశం. అక్కడ కూడా కొన్ని ఇళ్లుంటాయి. ఎక్కడికి పోతున్నవు? అంటే ‘పాటిమీదకు’ అంటుంటారు. ‘ఊరు లేని పాటిమీద, చేను లేని తోటబెట్టు’ అనే గూఢార్థ మాటలూ వినిపిస్తుంటాయి. ‘కైతికాలోడు’ అంటే కొంటె పనులు చేసేవాడు, నవ్వించేవాడు అనే అర్థాలున్నాయి. అల్లరి పనులు చేస్తుంటే ‘వీని కైతకాల తాడు దెంప’ అంటుంటారు పెద్దలు. ‘రెండు జీవాల మనిషి’ని ‘గర్భిణి’ అనే అర్థంలో వాడుతుంటారు. ‘రెండు జీవాల మనిషికి చెయ్యెత్తి మొక్కాలె’ అనే మాటలో ఒక ప్రాణి తల్లి కాగా, రెండో ప్రాణి తల్లి కడుపులోని బిడ్డ. ‘కొంప’ అంటే ఇల్లు అని సాధారణ అర్థంకాగా, ‘పాడుబడిన, పనికిరాని ఇల్లు’ గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు. పెద్దలకు, దేవుళ్లకు నమస్కరించడాన్ని ‘పబ్బతి’ అంటారు. ‘వాడు ఆమె మీద కాయిషు పడ్డడు’ అంటే, ఆమె ప్రేమలో, భ్రమలో ఉన్నాడని. మామూలుగా ‘కాయిషు’కి కోరిక, ఇష్టం, మోజు అనే అర్థాలున్నాయి. తెలుగులో కొల్లలుగా ఉన్న ఇలాంటి పలుకుబళ్లు, నానుళ్లు క్రమంగా మరుగునపడుతున్నాయి. భాష గొప్పదనం తెలియజెప్పి, దాని మీద మమకారం పెంచే వీటన్నింటినీ భావితరాలకు చేరువ చేయాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం