అచ్చతెలుగు అమృత నిధులు

  • 60 Views
  • 1Likes
  • Like
  • Article Share

    బి.హెచ్‌.వి. రమాదేవి

  • ఆంధ్రోపన్యాసకురాలు,
  • రాజమహేంద్రవరం.
  • 9441599321
బి.హెచ్‌.వి. రమాదేవి

మనం మాట్లాడే మాటల్లో అచ్చతెలుగు పదాలెన్ని? మనం చదివే కావ్యాలు, ఇతరత్రా పొత్తాల్లో ఎన్ని అచ్చమైన తెనుగు మాటలు కనిపిస్తాయి? అసలు మనవైన పలుకుల్లో వినిపించే కమనీయ నాదం ఏంటి? వాటి అర్థాల్లో దాగున్న జిగి ఏంటి? అక్షరాల్లో ఇమిడి ఉన్న బిగి ఏంటి? వీటన్నింటికీ సమాధానాలు పైడిపాటి లక్ష్మణ కవి ‘ఆంధ్రనామ సంగ్రహం’, ఆడిదం సూరకవి ‘ఆంధ్రనామ శేషం‘, కస్తూరి రంగకవి సాంబ నిఘంటువులు. ఈ అచ్చతెలుగు పద్య పదకోశాల విశేషాలివి!
తెలుగు
భాషలో తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్య పదాలు కనిపిస్తాయి. ఇందులో తత్సమ పదాలకు నిఘంటువులు కోకొల్లలు. చివరిదైన గ్రామ్యం ప్రయోగార్హం కాబట్టి కేవలం వాడుకలో మాత్రమే నిలిచి ఉంది. మాటల్లోగానీ, రాతలోగానీ ఎక్కువగా వినిపించేవి తత్సమ, అన్యదేశ్యాలే. అయితే.. వివిధ పరిణామాల నేపథ్యంలో ఇతర భాషా పదాలు లెక్కకు మిక్కిలిగా మన భాషలోకి చొచ్చుకొచ్చేశాయి. ఈ పరిస్థితిని గుర్తించి తెలుగు భాషను పటిష్టం చేసే ఉద్దేశంతో దేశ్య, తద్భవ పదాలకు నిఘంటువులు వచ్చాయి. వాటిలో ‘ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం, సాంబ నిఘంటువు’లు ప్రముఖమైనవి.
      ‘ఆంధ్రనామ సంగ్రహం’ను కూర్చిన పైడిపాటి లక్ష్మణ కవి కాలం గురించి ఇదమిత్థంగా తెలియదు. క్రీ.శ.17వ శతాబ్దానికి చెందినవాడుగా భావిస్తారు. కొంతమంది ఏనుగు లక్ష్మణకవీ, ఈయనా ఒక్కరే అంటారు. కానీ, స్పష్టమైన ఆధారాల్లేవు. ‘ఆంధ్రనామ శేషం’ కర్త ఆడిదము సూర కవి, సాంబ నిఘంటువు రచయిత కస్తూరి రంగకవి 18వ శతాబ్దానికి చెందిన వారు. వీరు ముగ్గురూ శివుడి ప్రార్థనతో తమ రచనల్ని ప్రారంభించారు. లక్ష్మణ కవి, సాంబకవి తమ నిఘంటువుల్లోని పదాలను దేవవర్గు (దేవతలు), మానవ వర్గు (మనుషులు), స్థావర వర్గు (కొండలు, చెట్లు లాంటివి), తిర్యక్‌ వర్గులు (పశుపక్ష్యాదులు) విభాగాల్లో పద్యస్థం చేశారు. మూడు గ్రంథాల్లో సీసం, కందం, తేటగీతి, ఆటవెలది పద్యాలనే ఉపయోగించారు. ‘ఆంధ్ర నామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం’లను 1920లో వావిళ్ల వారు ప్రచురించారు. ఆ తర్వాత 1929లో ఈ రెండింటికి ‘సాంబ నిఘంటువు’ను కలిపి వారే ప్రచురించారు. అనంతర కాలంలో సటీకా తాత్పర్య సహితంగా వేర్వేరుగా, కలిసి ఇవి ముద్రితమయ్యాయి. 
జిడ్డు కడలి, బొబ్బ మెకము
‘‘...గాశీపతికిన్‌/ అంకితమొనర్తు దెనుగు పేళ్లరసి కూర్చి/ గరిమతో నాంధ్రనామ సంగ్రహమనంగ/ నమరుకృతి బైడిపాటి యే కామ్రమంత్రి/ సుతుడ గవి లక్ష్మణాఖ్యుడ సుజనహితుడ’’ అని రచన ప్రారంభంలో పైడిపాటి లక్ష్మణకవి చెప్పుకోవడాన్ని బట్టి ఇతని తండ్రిపేరు ఏకామ్ర మంత్రిగా తెలుస్తోంది. ఈ పొత్తాన్ని కాశీ విశ్వనాథుడికి అంకితం చేశాడు. ఆంధ్రనామ సంగ్రహం మొత్తం 203 పద్యాల గ్రంథం. ఇందులోని దేవవర్గులో లక్ష్మణకవి చెప్పిన ‘సరస్వతి’ పేర్లు ఇవి.. ‘‘తలవాకిటను మెలంగెడు/ పొలతుక పలుకుల వెలది పొత్తముముత్తో/ నలువపడతి కలుములపై/ దలికోడ లనంగ బరగు (ధర) వాణి (శివా)’’. శిరసుకు ద్వారమైన నోటిలో సంచరించే స్త్రీ (తల వాకిటను మెలంగెడు పొలతుక), వాక్కుకు అధిదేవతైన పడుచు (పొలతుక పలుకుల వెలది), పుస్తకాల్లో వెలిసే ముత్తయిదువ (పొత్తము ముత్తో), బ్రహ్మదేవుని భార్య (నలువపడతి), సంపదకు అధిదేవతైన లక్ష్మీదేవి కోడలు (కలుములపైదలి కోడలు) అని వీటికి అర్థాలు. 
      ‘‘అమ్మ నాదల్లి నా నవ్వ నాగన్నది/ యన మాతృకాఖ్య లౌ/ అబ్బ నాయన యయ్య యన దండ్రి యన నప్ప/ యన జనకాఖ్య లౌ (నగనివేశ)/ తోడ బుట్టనగ సైదోడు తోబుట్టన/ సోదరాహ్వయము లౌ (నాదిదేవ)/ భర్తృసహోదరు భార్యకు దోడికో/ డలన నేరాలన నలరు (నభవ)...’’  మానవవర్గులోని ఈ పద్యంలో శివస్తుతికి ముందు వచ్చేవన్నీ ఒకరికి సంబంధించిన పేర్లు. అమ్మ, తల్లి, అవ్వ, కన్నది - ఈ నాలుగూ ‘అమ్మ’కు సమానార్థకాలు. అబ్బ, నాయన, అయ్య (ఆర్యశబ్దభవం), తండ్రి, అప్ప - నాన్నకు; తోడబుట్టు, తోడబుట్టగు, తోడబుట్టువు, తోబుట్టు, తోబుట్టువు, తోబుట్టుగు - సోదరులకి; తోడికోడలు, ఏరాలు - భర్త సోదరుడి భార్యకు సంబంధించిన సమానార్థకాలు. ఆంధ్రనామ సంగ్రహంలోనే శిశువు, కొడుకు పేర్లను చెప్పే ఈ ఆటవెలది పద్యం ఆసక్తికరం..
పాప బుడుత చిఱుత పట్టి సిసువు కందు
కూన నిసువు బిడ్డ కుఱ్ఱ బొట్టె
యనగ శిశు సమాఖ్యలగు గొమరుండు నా
గొడుకు నా గుమారకుండు నెలయు
 
      ‘పాప, బుడుత, చిఱుత, పట్టి, పిసువు, కందు, కూన, నిసువు, బిడ్డ, కుఱ్ఱ, బొట్టె’- శిశువుకు పేర్లు. ‘కొమారుడు (కుమార శబ్దభవం), కొడుకు’- పుత్రుడికి సమానార్థకాలు. ఇలాంటివే మరికొన్నింటినీ ఇతర పద్యాల్లో గుదిగుచ్చాడు లక్ష్మణకవి. ‘కొప్పు, తుఱుము, వేనలి, క్రొవ్వెద’ (స్త్రీల కొప్పు), ‘కీలుగంటు, క్రొమ్ముడి’ (వెంట్రుకల ముడులు), ‘పొట్ట, డొక్క, కడుపు, బొజ్జ, బొఱ్ఱ’ (ఉదరం), ‘తళియ, పళ్లెరం, తెలె, హరివాణము, తట్టి, కంచం’ (భోజన పాత్ర), ‘బేరులు, డబ్బుర, కోర, గిన్నె’ (పాన పాత్ర), ‘జోత, దండం, జొహారు, మ్రొక్కు, జేజే’ (నమస్కారం), ‘ఉనికిపట్టు, తావు, మనికిపట్టు, ఇరవు, ఇల్లు, తెంకి, యిక్క, నట్టు, టెంకి, ఇమ్ము, నెలవు, గీము’ (నివాసం), కన్నుల మ్రాను (గనుపులు గల చెట్టు - చెరుకు); మున్నీరు (మొదటి సృష్టి - సముద్రం), జిడ్డుకడలి (క్షీర సముద్రం), బొబ్బమెకం (బొబ్బలు వేసే మృగం - సింహం), పసిదిండి (పసుల తిండి - పులి); పలుగొమ్మల మెకం (దంతాలే కొమ్ములుగా కలిగింది - ఏనుగు); ఆలబోతు (ఎద్దు); చిగురు విలుకాని తేజి (మన్మథుడి వాహనం - చిలుక) లాంటి అచ్చతెలుగు పదాలు ‘ఆంధ్రనామ సంగ్రహం’లో కనిపిస్తాయి. 
దక్కొనియె, ప్రల్లదములు...
‘‘ఆంధ్రనామ సంగ్రహము నందు జెప్పని/ కొన్ని తెలుగు మఱుగు లన్ని గూర్చి/ యాంధ్ర నామ శేషమను పేర జెప్పెద...’’ అని పేర్కొన్నాడు సూర కవి. ఈయన ‘కవిజన రంజనం, రామలింగేశ్వర శతకం, కవి సంశయ విచ్ఛేదం, ఆంధ్ర చంద్రాలోకం’ లాంటి గ్రంథాలు రచించాడు. ‘ఆంధ్రనామ శేషం’ 78 పద్యాల లఘు నిఘంటువు. ‘‘తెలుగుం గబ్బపుమర్మము/ తెలుగు కవీంద్రులకు దేటతెల్లము గాగన్‌/ దెలియగ...’’ ఈ రచన చేశానని చివర్లో చెప్పుకున్నాడు సూరయ. దుఃఖానికి ఉన్న పదాల్ని తన నిఘంటువులో కందంలో ఇలా చెబుతాడు.. ‘‘అలజడి నెంజిలి పిమ్మట/ సిలు గుత్తలపాటు వంత సేగి నెగుల్‌ గొం/ దల మలమ టడరు గోడు/ మ్మలిక వనట గుందు నా నమరు దుఃఖాఖ్యల్‌’’. ఇంకా ‘అరిది, వెఱగు, అచ్చెరువు, అబ్బురం, అబ్రం’ (విచిత్రం), ‘అలమె, ఒదవె, దక్కొనియె, నెలకొనియె, చెందె, నెక్కొనియె’ (లభించెను), ‘వెనుక, తరువాత, పిమ్మట, అంతట, అంత’ (అనంతరం), ‘పల్లఱపులు, రజ్జులు, ప్రల్లదములు’ (పనికిమాలిన మాటలు), ‘కైసేత’ (అలంకరించడం) లాంటి రూపాలు ఇందులో కనిపిస్తాయి. చాలా పదాలకు ఒకటి రెండు సమానార్థకాలే అందించాడు సూరయ. ఇందులో నానార్థాలకు సంబంధించిన పద్యమిది.. ‘‘తమ్మియన దరువిశేషము/ తమ్మి యనం బంకజాభిధానం బయ్యెన్‌/ నెమ్మి యన బ్రియముపేరగు/ నెమ్మి యన మయూరమునకు నెగడుం బేరై’’. తమ్మి- వృక్ష విశేషం, తామర; నెమ్మి- సుఖం, నెమలి అనే నానార్థాలు ఇందులో కనిపిస్తాయి. ఇంకా ఈడు- వయసు, పాటి; నాడు- దేశం, అప్పుడు; మొన- సైన్యం, ముందు భాగం; దొన- అమ్ములపొది, కొన, వెన్ను- కంకి, వీపు, కన్ను- గణుపు, నేత్రం లాంటి వాటినీ ఇందులో పొందుపరిచాడు.  
వెనకయ్య తల్లి, బొచ్చు మెకము, వేపి...
‘‘శ్రీ వెలయంగ దేశీయముల్‌ దెనుగులు/ దద్భవంబులు గూర్చి....’’ అంటే తెలుగులోని అన్యదేశ్య పదాలు, ఆంధ్రదేశ్య పదాలు, సంస్కృత, ప్రాకృత భవాల గురించి చెబుతానని ‘సాంబ నిఘంటువు’ ప్రారంభంలో పేర్కొన్నాడు కస్తూరి రంగకవి. ఇది 119 పద్యాల పద నిధి. ప్రతి పద్యం చివర ‘సాంబ’తో అంతమవుతుంది. అన్ని పద్యాలు సీసం, తేటగీతిలో ఉంటాయి. 
      దేవ వర్గులో ఆయా దేవతల గురించి రంగకవి ఇలా చెబుతాడు.. ‘‘గట్టురాకొమ రిత కప్పముత్తైదువ/ మగనియందపుమేన దగినమగువ/ కఱకంఠురాణి సింగపు దేజి గలచాన/ వెనకయ్య తల్లినా వెలయు గౌరి/ కలుముల చెలి జిడ్డు/ కడలిబొట్టియ లచ్చి/ తమ్మి గద్దియబోటి తల్లితల్లి/ పెనిమిటి యెద నుండు ననబోడి మరుతల్లి/ నెలచెలియలు లిబ్బి నెలతుక సిరి... యనగ లక్ష్మీ సమాఖ్య లౌ నంచతేజి/ పొలతి తలవాకిట మెలంగు చెలువ నలువ/ రాణి పలుకుల జవరాలు లచ్చికోడ/ లనగ భారతినామంబు నమరు సాంబ’’! పర్వతరాజు హిమవంతుని కూతురు (గట్టురాకొమరిత), నిల్లని రూపం గల స్త్రీ (కప్పు ముత్తైదువ), ప్రియుని శరీరంలో సగభాగం తీసుకున్న కాంత (మగనియందపుమేన దగిన మగువ), శివుడి దేవేరి (కఱకంఠురాణి), సింహ వాహని (సింగపుదేజి గల చాన), వినాయకుడి తల్లి (వెనకయ్య తల్లి).. ఇవన్నీ పార్వతి పేర్లు. ఇక సంపదకు అధిదేవత (కలుపుల చెలి), పాలసముద్రపు కుమార్తె (జిడ్డు కడలి బొట్టియ), కమలం మీద కూర్చునేది (తమ్మి గద్దియబోటి), భర్త వక్షస్థలంలో నివాసం ఉండేది (ననబోడి), భాగ్యానికి అధిదేవత (లిబ్బినెలతుక) - ఇవన్నీ లక్ష్మీదేవి గురించి చెప్పేవి. హంస వాహనుడైన బ్రహ్మ భార్య (అంచతేజి పొలతి), తలకు వాకిలి అయిన నోటిలో మెలంగే కాంత (మెలంగుచెలువ), బ్రహ్మదేవుని భార్య (నలువ రాణి), వాక్కులకు, విద్యలకు అధిదేవత (పలుకుల జవరాలు), లక్ష్మీదేవి కోడలు (లచ్చికోడలు) - ఇవన్నీ సరస్వతికి సమానార్థకాలు. ఆంధ్రనామ సంగ్రహంలో సరస్వతి గురించి చెప్పిన పేర్లతో వీటికి సామ్యం ఉంది. ఇది చాలా పదాల్లో కనిపిస్తుంది. 
      చీకటుల గొంగ (అంధకారం పోగొట్టేవాడు), చలిదాయ (చల్లదనానికి విరోధి)- సూర్యుడు; జింకతాలుపు (జింకను ధరించినవాడు), తొలచెలికాడు (కలువలకు స్నేహితుడు), రేవెల్గు (రాత్రి ప్రకాశించేవాడు)- చంద్రుడు; జడదారి యింటి కోడి (గౌతమ మహాముని ఆశ్రమంలో కోడి రూపం దాల్చినవాడు),  వెల్లగౌరు మావటీడు (ఐరావతం ఎక్కేవాడు)- ఇంద్రుడు; అన్ని తిండికాడు (సర్వభక్షకుడు), తెమ్మర చెలి (వాయువునకు నేస్తం)- అగ్ని; మబ్బుల పగదాయ (మేఘాల్ని చెదరగొట్టే విరోధి)- వాయుదేవుడు; అమ్మ, కన్నది, తల్లి, అవ్వ- జనని; తండ్రి, అబ్బ, కన్నయ్య, నాయన, అయ్య, అప్ప- జనకుడు; కొమరుడు, బుడుకడు, కొడుకు, పట్టి- పుత్రుడు; బిడ్డ, పూప, పాప, కుఱ్ఱ, చిఱుత, కందు, కూన, నిసువు, సిసువు, పాలబుడుత- శిశువు; బయకాడు, వీణెకాడు- వీణ వాయించేవాడు; ఎకిమీడు, పాదుసా, సాహెబు, పజీరుడు (హిందుస్థానీ), ఏలిక, మున్నీడు, మన్నియ, మన్నెడు, మన్నె, రాయడు, సామి, పబువు, జియ్య, తుపాసి, రాయలు, దునెదారి, దొర, ఓడయడు- రాజు; ఎడకాడు, కొల్లకాడు, గజముచ్చు- పెద్ద దొంగ; మరియాద, గడి, మేర, సరుదు, ఎల్ల, కర- హద్దు; వేరం, కంటు, సూడు, పగ, దేసం- విరోధం; మబ్బు, లాహిరి, కైపు- మత్తు.. లాంటి రూపాలు దేవ, మానవ వర్గుల్లో కనిపిస్తాయి. ఇక స్థావర వర్గులో ‘పల్లె, ఊరు, కుప్పం- గ్రామం; మెఱగు, చికిలి, జిగి, రంగు, మెఱపు- కాంతి; వాన, జడి, ముసురు- వర్షం’; తిర్యక్‌ వర్గులో ‘గజగొండ (ఏనుగుల శత్రువు), గుబ్బలిపుట్టి గుఱ్ఱం (పార్వతి వాహనం- సింహం), తెరువు గాపరి (మార్గంలో కాచుకుని ఉండేది), పసి తిండిపోతు (పసులను భక్షించేది)- పులి; బొచ్చుమెకం (ఒంటినిండా వెంట్రుకలు కలిగింది) ఎలుగుగొడ్డు; మొఱుగుడు, జాగిలం, కుక్క, వేపి- శునకం’ లాంటి రూపాలను చూడవచ్చు. నానార్థ వర్గుల్లో ‘గరిడి- సాము చేసే చోటు, సమీపం; పాగా- లాయం, తలగుడ్డ; మావి- గుఱ్ఱం, మామిడి చెట్టు; మేలిమి- బంగారం, ఉపకారం; గూబ- గుడ్లగూబ, చెవిలోపలి రంధ్రం’ లాంటి రూపాలు కనిపిస్తాయి.
      ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కారణంగా లెక్కకు మిక్కిలిగా కొత్త పదజాలం పుట్టుకొస్తోంది. ఇలాంటి నిఘంటువులను పరిశీలించడం ద్వారా ఆయా పదజాలాన్ని అందరికీ అర్థమయ్యేలా తేలిగ్గా మన భాషలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే, అచ్చమైన తెలుగు పలుకులతో అలరారే ఈ నిఘంటువులను నేటి తరానికి పరిచయం చేయాలి.
‘ఆంధ్రనామ సంగ్రహం’లో ఆకాశానికి సమానార్థకాలు.. వేలుపుల తోవ, ఉప్పర వీధి (పైన ఉండే మార్గం), విను, విన్ను, మిను, మిన్ను, చదలు, నింగి, దివి, మొయిలుదారి, చుక్కల తెరువు. అలాగే, హృదయానికి- ఎద, డెందం, మది, మతి, ఎడద, ఉల్లం. పర్వతానికి- మల, గట్టు, తిప్ప, మెట్టు, కొండ, గుబ్బిలి. మూడు దశాబ్దాల కిందటి వరకూ ‘ఆంధ్రనామ సంగ్రహా’న్ని టీకా తాత్పర్యాలతో సహా ఇళ్లలో పిల్లలతో వల్లె వేయించేవారు. పద్యం అప్పజెప్పి చూడకుండా రాయించే వారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఇలా సాధన చేయించేవారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం