వాయులీనంతో శాస్త్రీయ సంగీతానికి వన్నె తెచ్చిన ద్వారం వెంకట స్వామి అంతటి వారు.. పాశ్చాత్య స్వరలయలను జోడించి కర్ణాటక సంగీతాన్ని తేజోమయంచేసిన విద్వన్మణి, ‘గాన కళానిధి’ ద్వారం నరసింగరావు నాయుడు. జీవించింది కొద్దికాలమే అయినా గొప్ప సంగీత ప్రతిభావంతులను దేశానికి అందించిన ఘనత ఈయన సొంతం.
దక్షిణ భారతదేశంలో సంగీత కళావ్యాప్తికి అవిరళ కృషి చేసిన విద్వాంసులు ద్వారం నరసింగరావు నాయుడు. వెంకట కృష్ణయ్యనాయుడు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1908 సెప్టెంబరు 5న జన్మించారు. తండ్రి దగ్గరే సంగీత సాధన చేశారు. పినతండ్రి ద్వారం వెంకట స్వామినాయుడి ప్రేరణతో రైల్వే ఉద్యోగం విడిచిపెట్టి సంగీత పాఠశాలలో ఆచార్యులుగా పనిచేశారు. కళలో పరిణతి సాధించడం కోసం రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు వయొలిన్ సాధనలో గడిపేవారు. పినతండ్రి దగ్గర ‘బౌటెక్నిక్స్’ వాయులీన వాదనలో మెలకువలను గ్రహించి, గంభీరమైన ఝూంకార నాదంతో పాటు అతి సూక్ష్మ ధ్వనులనూ శ్రావ్యంగా వినిపించేవారు. వ్యక్తిగత ప్రదర్శనల్లో కర్ణాటక సంగీతంలో అద్భుత ప్రక్రియలన్నింటినీ అవలీలగా వాయించేవారు. పాశ్చాత్య సంగీత ప్రక్రియలను వయొలిన్పై పలికించి కర్ణాటక సంగీత వైశిష్ట్యానికి వన్నె తెచ్చారు. ‘‘నరసింగరావు నాయుడు గారి వాద్యశైలి ప్రత్యేకమైనది. వారు వయొలిన్ వాయిస్తున్నప్పుడు తాను పలుకుచున్నట్లుండును గాని వారు వయొలిన్ వాయిస్తున్నారన్నట్టుండదు’’ అనేవారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
మద్రాసులో 1947లో జరిగిన రసికరంజని సభలో వెంకటస్వామి నాయుడు, మారెళ్ల కేశవరావుల సమక్షంలో నరసింగరావు ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. 1948 డిసెంబర్ 1న ఆకాశవాణి ప్రారంభోత్సవం సందర్భంగా కోలంక వెంకటరాజు మృదంగ సహకారంతో ఇచ్చిన ప్రదర్శన కూడా చారిత్రాత్మకమైందే. డొక్కా శ్రీరామమూర్తి, శ్రీపాద పినాకపాణి, పారుపల్లి రామకృష్ణయ్య, మంగళంపల్లి, చెంబై వైద్యనాథ భగవతార్ లాంటి విద్వాంసులకు నాయుడు వయొలిన్ వాద్య సహకారం అందించారు. కాకినాడ సంగీత విద్వత్సభ ఆయనను ‘గానకళానిధి’గా సత్కరించింది. రాజా జగన్నాథదేవ్ వర్మ తన పుట్టినరోజున కచేరి ఏర్పాటు చేసి, నక్షత్రాకార నవరత్న పతకంతో సత్కరించారు.
ఎందరో శిష్యులు
వెంకటస్వామి నాయుడు పదవీ విరమణ అనంతరం కళాశాల అధ్యక్షులుగా ఈయన బాధ్యతలు తీసుకున్నారు. బోధనలోనూ నిపుణులైన నరసింగరావు.. నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, ఇవటూరి విజయేశ్వరరావు, కె.వి.రెడ్డి, పుల్లెల పేరి సోమయాజులు, కొమండూరి కృష్ణమాచార్యులు, పూసర్ల మనోరమ, రమణకుమారి, ద్వారం దుర్గా ప్రసాదరావు, ద్వారం సత్యనారాయణరావు, భువనేశ్వర మిశ్రా, రాజా జగన్నాథదేవ్ వర్మ, అనంతాచార్యులు లాంటి విద్వాంసులను తీర్చిదిద్దారు.
భిలాయ్ ఉక్కు కర్మాగారంలో 1959లో నరసింగరావు ఇచ్చిన ప్రదర్శనకు ఆనందపడి రష్యా ఇంజనీర్లు, ఆయనను తమ దేశానికి ఆహ్వానించారు. అనారోగ్య కారణాలతో నాయుడు అక్కడికి వెళ్లలేకపోయారు. కళాభూషణగా మన్ననలు పొందిన ఆయన, 1960 మార్చి 10న కాలధర్మం చెందారు. నాయుడు శతజయంత్యుత్సవాలు 2008లో విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, హైదరాబాదుల్లో ఘనంగా జరిగాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. వాయులీన వ్యక్తిగత ప్రదర్శనలో ద్వారం వెంకట స్వామినాయుడు తర్వాత అంతటి ప్రతిభా సామర్థ్యాలు ఉన్నవారు నరసింగరావు నాయుడొక్కరే.