ఓహో గులాబి బాల..

  • 485 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తులసీబృంద జంపన

  • హైదరాబాదు.
  • 9959966768
తులసీబృంద జంపన

ప్రేమంటే ఒక తాజ్‌మహల్, ఒక హృదయం చిహ్నం, ఒక ప్రేమలేఖ... మరీ ముఖ్యంగా ఒక గులాబీ కూడా. రోజా లేని ప్రేమ వాసన లేని పువ్వు లాంటిదే. ప్రేమను తెలపాలన్నా, తీయని వలపు పండాలన్నా గులాబీ కావాల్సిందే. అందుకే తెలుగు సినీ గీతాల్లో ప్రేమ తరంగాలకు గులాబీల మకరందాలద్దారు సినీ కవులు. వాటి లోతుల్లోకి ఒక్కసారి వెళితే...
ప్రేమ ఎక్కడ వినిపించినా, అక్కడ గులాబీల గుబాళింపు గుప్పుమనాల్సిందే. ప్రేమికులు ఫిబ్రవరి ఏడును రోజాపూల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంస్కృతి మనది కాకున్నా గులాబీని గుర్తుచేసుకునేందుకు ఇదో మంచి తరుణం. ‘‘గులాబీల తోట.. బుల్‌ బుల్‌ పాట.. పూల రంభల ఆట బంభరాల వేట’’ అంటూ ప్రేమికుల సరాగాలకు గులాబీ తోటే వేదిక అని చెబుతుంది ‘చెడపకురా చెడేవు’ (1955) చిత్రంలోని ఈ పాట. ‘గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసాలివే.. వికాసాలివే...’’ అంటూ ‘చరణదాసి’ (1956) చిత్రం కోసం రాఘవయ్య రాసిన మరో పాట కూడా ఆణిముత్యమే. 
      గులాబీ నేపథ్య గీతాలన్నింటిలోకీ ప్రసిద్ధమైంది ‘మంచి మనిషి’ చిత్రంలోని ‘‘ఓహో గులాబి బాల.. అందాల ప్రేమమాల.. సొగసైన కనులదానా.. సొంపైన మనసు దానా’’! పాట. బాపూబొమ్మ, గులాబీ బాల.. ‘అమ్మాయి’కి పర్యాయ పదాలయ్యాయంటే అది సినిమాల చలవే! ‘ఆటబొమ్మలు’ (1966) చిత్రం కోసం జి.కృష్ణమూర్తి రాసిన ‘‘గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే.. నేనే నువ్వన్నాడే..’’ పాట ప్రత్యేకమైంది. ఓ అందమైన అమ్మాయి తనను రోజా పూలతో పోల్చినందుకు మురిసిపోతూ పాడుకుంటున్నట్టుంటుందీ గీతం.  
వలపు మైకం
ఏ పూలకైనా పూసే కాలమంటూ ఒకటుంటుంది. గులాబీలకు కాలమంటూ లేదు! అందుకేనేమో.. ‘‘గులాబీలు పూసేవేళ కోరికలే పెంచుకో.. పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో’’ అంటూ కవ్వింపుగా ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమను కోరిందో చిన్నది. ‘‘గులాబీల నీడలలో ముళ్లున్నాయ్‌ చూసుకో.. ప్రేమంటే మజా కాదులే ఊహించుకో..’’ అంటూ ప్రేమలో ఆటుపోట్లను గుర్తెరగమని హెచ్చరిస్తాడా అబ్బాయి. 1969లో వచ్చిన ‘భలే అబ్బాయిలు’ చిత్రం కోసం కొసరాజు రాసిన ఈ గీతం అప్పట్లో మంచి ఆదరణ పొందింది. 
అదే సంవత్సరం విడుదలైన ‘పేదరాశి పెద్దమ్మ కథలో’ని ‘‘గులాబి బుగ్గలున్న వన్నెలాడి నేనే.. చలాకి కన్నులున్న కన్నెలేడి నేనే’’ పాట పడతి మనసులోని ప్రేమ భావనను చెబుతుంది. సి.నారాయణరెడ్డి రాసిన ఈ గీతాన్ని ఎల్‌.ఆర్‌.ఈశ్వరి అంతే మధురంగా ఆలపించారు. రోజా అంటేనే తాజాదనం. మంత్రముగ్ధుల్ని చేసే అందం దాని సొంతం. అందుకే ‘‘గులాబి పువ్వై నవ్వాలి వయసు.. జగాన వలపే నిండాలిలే..’’ అంటూ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975)లో గులాబీని వయసుకు ప్రతీకగా నిలిపారు దాశరథి.  
      యువ హృదయాలను పులకింపజేసి, మా కోసమే రాశారా అని ప్రతి ప్రేమ జంటా భావించేట్టు వేటూరి రాసిన పాట ‘‘ఎర్ర గులాబీ విరిసినది.. తొలిసారి నను కోరి.. ఆశే రేపింది నాలో.. అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో..’’ 1979లో వచ్చిన ‘ఎర్రగులాబీలు’ చిత్రంలోని ఈ పాట యువతను ఉర్రూతలూగించింది. ‘రోజా’ చిత్రం (1992) కోసం రాజశ్రీ రాసిన ‘నా చెలి రోజా.. నాలో ఉన్న.. నిన్నే తలిచేనే నేనే...’ గీతం వింటే అదో తన్మయత్వం. ప్రేమికుల రోజు (1999)లోని ‘రోజా రోజా’ పాటైతే సాక్షాత్తూ ప్రేయసిని సృష్టించిన బ్రహ్మ కూడా ఆమెని చూసినా ఓర్చుకోలేని ప్రేమికుడి వలపు మైకానికి ప్రతీక. ఇవే కాదు ‘రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా (అల్లరి ప్రియుడు), రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), గులాబి బుగ్గల రోజా మన ప్రేమకెపుడు పూజ (మందారం) లాంటి ఎన్నో పాటల్లో గులాబీలు తళుక్కుమంటాయి. ప్రేమైకజీవులను మైమరపింపజేస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం