ఐనో, యూనో అంటే చాలా!!

  • 34 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కాకుమాను అమర్‌ కుమార్‌

  • హైదరాబాదు.
  • 9959021481
కాకుమాను అమర్‌ కుమార్‌

‘‘సబ్జెక్టు కావాలి గానీ భాష నేర్చుకోవడం ఎందుకండీ.. మంచి ఉద్యోగం సాధించాలి కానీ, కవిత్వాలు చెప్పరు కదా అనే వారు ఎక్కువ. కానీ పిల్లలకు మాతృభాషపైనే పట్టు లేకపోవడం, వ్యాసరచన- వక్తృత్వం లాంటి పోటీల్లో పాల్గొనకపోవడంతో తమ భావాలను సూటిగా, స్పష్టంగా ఎదుటివారికి వ్యక్తీకరించలేకపోతున్నారు. ఇది వారి వ్యక్తిగత, వృత్తిజీవితంపైనా పడుతుంది’’ అంటున్నారు క్యాప్‌జెమినీ క్లౌడ్‌- ఇన్‌ఫ్రా ఉత్తర అమెరికా విభాగం ప్రెసిడెంట్‌ బారు శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన ఆయన ఇంటర్‌ వరకూ తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. మాతృభాషలో చదువుకున్నవారు జీవితంలో ఎదగలేరనే వాదనలో వాస్తవం లేదంటూ ‘తెలుగువెలుగు’తో శ్రీనివాసరావు పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు ఆయన మాటల్లోనే..  
మా నాన్నగారు
ఉపాధ్యాయులు. ఉద్యోగ బాధ్యతలతో వరంగల్లులో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి బీటెక్‌ వరకు అక్కడే చదివాను. ఎంటెక్‌ ఐఐటీ ఖరగ్‌పూర్, పీహెచ్‌డీ ఐఐటీ బాంబేలో చేశాను. టీసీఎస్, సింటెల్‌లో వివిధ హోదాల్లో పనిచేశాను. క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓగా, అంతర్జాతీయంగా సీఓఓగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రస్తుతం క్లౌడ్‌- ఇన్‌ఫ్రా ఉత్తర అమెరికా ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాను. 
      వరంగల్లు మహబూబియా పాఠశాలలో నా ప్రాథమిక విద్య చెట్ల కిందే సాగింది. పాఠ్యాంశాలతో పాటు వక్తృత్వం, వ్యాసరచనలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. మేమూ ఉత్సాహంగా పాల్గొనేవారం. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలు గణనీయంగా పెరిగాయి. కానీ పాఠశాలలకు అవసరమైన ఇతర వనరులు సమకూర్చడం లేదు. వీటిల్లో మా పిల్లలు కష్టపడటం ఎందుకు అనుకుంటూ, తల్లిదండ్రులు డబ్బులు ధారపోసి మరీ ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ఫీజులు కట్టలేని వారితో పాటు వలస కార్మికుల పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. మన పన్నులతో నిర్వహిస్తున్న పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలన్న భావన తల్లిదండ్రుల్లో వస్తే, పరిస్థితి మారుతుంది. 
      నేను ఇంటర్‌ చదివినప్పుడు వరంగల్‌ ఎన్‌ఐటీ(అప్పట్లో ఆర్‌ఈసీ)లో చేరేందుకు ప్రవేశ పరీక్ష లేదు. ఇంటర్‌ మార్కుల ఆధారంగానే ప్రవేశం లభించింది. అంటే ప్రభుత్వం తాను నిర్వహించిన ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ మీద గౌరవం చూపేది. ఇప్పుడు ప్రభుత్వాలకు తమ పరీక్షల మీద నమ్మకం లేదా? మరెందుకు అన్నింటికీ ప్రవేశ పరీక్ష అంటున్నారు? వాటికోసం మార్కులే ధ్యేయంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శ్రమిస్తున్నారు. పైగా ప్రస్తుతం పరీక్షల్లో ఏ సబ్జెక్టులో, ఏయే విభాగాల్లో ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఏవి వదిలేయొచ్చు అన్నది ప్రాధాన్యాంశమైంది. ఫలానా టాపిక్‌ పూర్తిగా చదువుదామన్న ఉత్సాహం తగ్గిపోతోంది. ఉపాధ్యాయుల్లోనూ, విద్యార్థుల్లోనూ ఇదేవిధమైన మార్పు కనపడుతోంది. దాంతో పిల్లలకు మార్కులొస్తున్నాయి కానీ, పాఠ్యాంశాల మీద పూర్తి పట్టు చిక్కట్లేదు.
ప్రతిబంధకం కాదు
అందరూ అపోహ పడినట్టు మాతృభాషలో చదువుకున్న వారెవరికీ ఎలాంటి నష్టమూ లేదు. చిన్నప్పటి నుంచి పన్నెండేళ్లు నేను తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. దాంతో ఇంగ్లీషులో మాట్లాడే విధానం, నా ఉచ్చారణ కాన్వెంట్‌ విద్యార్థులతో పోలిస్తే కొంచెం తేడాగా ఉంటుంది. కానీ, అది నా ఉన్నతికి ప్రతిబంధకమైతే కాలేదు. అప్పట్లో తెలుగు మాధ్యమంలోనే ముఖ్యంగా లెక్కల పుస్తకాలు మంచి ప్రమాణాలతో ఉండేవి.   
      మొదటి నుంచీ ఇంగ్లీషు వ్యాకరణం, స్పెల్లింగులు తప్పుల్లేకుండా రాసేందుకు ప్రయత్నించే వాణ్ని. అద్భుతమైన పదాలు వాడలేకపోవచ్చు. కానీ చెప్పదలచుకుంది సూటిగా, దోషాలు లేకుండా చెప్పడం ముఖ్యం. విషయాన్ని మాతృభాషలో- తెలుగులో చక్కగా చెప్పగలిగిన ప్రజ్ఞ ఉంటే, ఇంగ్లీషుకు మార్చుకుని వ్యక్తీకరణ చేయడం కష్టం కాదు. ఏదైనా ఒక భాషపై పట్టు సాధిస్తే, మిగిలిన భాషలు నేర్చుకోవడం సులభమవుతుంది. ఎంతసేపూ పరీక్షల్లో మార్కులపైనే దృష్టి పెడితే భాష మీద పట్టు దొరకదు. నాకు తెలిసిన కొంతమంది ఆంగ్లం, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడం, ఒడియా తదితర అయిదారు భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అది వారి వ్యక్తిగత అభిరుచి, ఉత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం భాషపై పట్టు సాధించేందుకు ఉపకరిస్తుంది. నేను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బహుమతులు గెలుచుకున్నాను. వీటివల్ల ఇచ్చిన సమయంలో, పరిమాణంలో తామనుకున్నది స్థూలంగా వ్యక్తీకరించడం విద్యార్థులకు అలవాటవుతుంది. ఇది లోపించడం వల్లే ఆర్టికల్‌ 370, కశ్మీర్‌ సమస్య లాంటి అంశాలపైనే కాదు.. తమకు బాగా నచ్చిన సినిమా ఎందుకు నచ్చిందీ, ఏయే పాత్రలు, అంశాలు బాగున్నాయి, ఏవి బాగాలేవు అన్నవి ఒక్క పేజీలో రాయమనండి.. నూటికి తొంభై శాతం మందికి కలం కదలదు. డాన్స్‌లు, ఫైట్లు బాగా ఉన్నాయనే చెబుతారు తప్ప నిశితంగా ఆలోచించి, సినిమా గురించి కనీసం మాటల్లో కూడా విమర్శనాత్మకంగా చెప్పలేరు. అన్ని విషయాల్లోనూ నేటితరం ఈ సామర్థ్యం కోల్పోతోంది. రాయడమే కష్టమైతే, మాట్లాడటం ఇంకా కష్టమైపోతోంది!! 
భావ వ్యక్తీకరణ రావాలి
తెలుగులో చదువుకుంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు పనికిరామనే భావన సరికాదు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు కాని, ఇప్పటికే వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కానీ, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు లేకపోవడం వల్లే ఇలా అనుకుంటున్నారు. తెలుగులోనో, తమిళంలోనో చదువుకోవడం వల్లే తమకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టలేదని భావించడం తప్పు. ముంబయిలో ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న విద్యార్థులను కూడా చూశా. ఐనో, యూనో అంటూ ఏదో చెబుతారు కానీ మంచిగా అయిదారు వాక్యాలు, తాము అనుకున్నది చెప్పలేకపోతున్నారు. విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని.. దాని గురించి తామేం చెప్పాలనుకుంటున్నామో ఆలోచించుకుని సూటిగా సులభ పదాల్లో చెబితే చాలు, చిన్నచిన్న పొరపాట్లు దొర్లినా అవతలి వాళ్లు అర్థం చేసుకుంటారు. 
      చాలా దేశాల్లో తమ మాతృభాషలను ప్రోత్సహించడానికి, ప్రాధాన్యమివ్వడానికి సంకోచించరు. జర్మనీ, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్‌.. ఎక్కడ చూసినా ఆ దేశ నాయకులు, ప్రజలు కూడా తమ భాషలో మాట్లాడటానికి వెనకాడరు. ఇంగ్లీషు రాదని, ఇతరుల దృష్టిలో చులకన అవుతామనే భావనతో ఉండరు. కానీ, మనదగ్గర మాత్రం మన భాషమీద మనకు గౌరవం లేకపోవడం వల్లే దెబ్బతింటున్నాం. ఇతర దేశాలకు పనికి వచ్చే చదువును పిల్లలకు నేర్పుతున్నాం. ‘అమెరికా, బ్రిటన్, జర్మనీలకు వెళ్లడానికి పనికి వస్తుందా..’ అనే భావన ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచే ఏ భాషలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేస్తే, ఏ భాషలో మాట్లాడగలిగితే ఆయా దేశాలకు వెళ్లగలమన్న ఆలోచన పురుడుపోసుకుంది. దానికి ఇంగ్లీషు ఓ మార్గంలా కనపడుతోంది. తెలుగు, ఇంగ్లీషు రెండింటి మీదా దృష్టి పెట్టడం ఎందుకునుకుని, ఇంగ్లీష్‌ వరకు నేర్చుకుంటున్నారు. మూడు- నాలుగు భాషలు నేర్చుకునే ఓపిక, సామర్థ్యం, నైపుణ్యం ఉండటం లేదు. ఒకటే భాష. ఆంగ్లంతో సరిపెడుతున్నారు.  
తెలుగులో రచనలు చేశా
మా చిన్నతనంలో పదుల కొద్దీ వారపత్రికలు, అద్భుత నవలలు ప్రచురితమయ్యేవి. వాటిని చదివే అవకాశం లభించడం, ఉత్సాహం ఉండటంతో తెలుగు సాహిత్యం దిశగా ప్రేరణ కలిగేది. దాంతో భాష మీద కాస్తయినా పట్టు ఏర్పడింది. తెలుగు, సంస్కృతాల్లో పురాణాలు, ఉపనిషత్తులు చదివాను. వాల్మీకి, తులసీదాసు రామాయణాలతో సహా పది- పన్నెండు రామాయణాలు చదివాను. ఉత్తర భారతంలో బాగా ప్రచారంలో ఉండే తులసీదాసు సుందరకాండను తెలుగులోకి అనువదించాను. సంస్కృత గ్రంథం ‘అష్టావక్ర గీత’నూ మన భాషలోకి తెచ్చాను. స్వీయ అనుభవాలతో ‘గమనం- గమ్యం’ పేరిట ‘ఆంధ్రభూమి’లో 21 కథలు రాశాను.  
      తెలుగులో నేను చదవనివి నాటకాలే. కవిత్వం, కథ, నవల, విమర్శలు చాలా చదివాను. కథకుల్లో చలం, బీనాదేవి, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, కాళీపట్నం రామారావుల శైలులు ఇష్టం. కవిత్వంలో శ్రీశ్రీ, దాశరథి, కాళోజీ, తిలక్, నారాయణరెడ్డి బాగా ఇష్టులు. పత్రికలు చదువుతుంటే, సామాన్య ఉద్యోగులు రాసిన అద్భుత రచనలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు పైకి రావడానికి సరైన వేదికలు లేకపోవడం దురదృష్టకరం.
నాయకత్వ లక్షణాలకు..
యువతకు నాయకత్వ లక్షణాలు అబ్బాలంటే మన సాహిత్యమే అందుకు దోహదపడుతుంది. ఈ నేపథ్యంలోనే పది కథలు రాస్తున్నాను. కార్పొరేట్‌ ప్రపంచంలో ఉన్నత ఉద్యోగాలు, ఈ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు మన సాహిత్యం, పురాణాలు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తాయో వీటిల్లో వివరిస్తాను. కంపెనీల స్వాధీనాలు- విలీనాలు, ఉద్యోగుల సమస్యలు, సాంస్కృతిక అవరోధాలు, ఉన్నతోద్యోగులతో వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి.. లాంటి ఈ కాలపు అంశాలకు వీటి ద్వారా పరిష్కార మార్గాలను సూచిస్తున్నాను. ఎప్పుడైనా సరే, పుస్తకం చదివితే పరిష్కారం లభిస్తుంది. చదవకపోతే, అలాంటివి వివరించే వారి ఉపన్యాసాలకు పరుగెత్తాలి. సమయమంతా ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో గడిచిపోతే, జీవితంలో కొన్ని అంశాల మీద లోతైన అవగాహన కోల్పోతాం 
      ఐరోపా దేశాల్లో మాతృభాషలో విద్యాబోధన జరుగుతోంది.. అదీ వారి కోసమే జరుగుతోంది. మన దగ్గర మాత్రం ఇతర దేశాలకు కావాల్సినవి బోధిస్తున్నాం. మన చదువులు మన దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన తయారీ రంగం, పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం, విద్యుత్తు, కాలుష్య నివారణ దృక్పథంతో కనుక రూపొందిస్తే, ఇంగ్లీషు అవసరం తగ్గుతుంది. ఆమేరకు మన భాషల మీద నవతరంలో మమకారమూ పెరుగుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం