అమ్మభాషే ఆలంబన

  • 110 Views
  • 0Likes
  • Like
  • Article Share

అమ్మభాషా మాధ్యమంలో చదువుకుంటే భవిష్యత్తు ఉండదంటున్నారు కొంతమంది! ప్రభుత్వాలు కూడా వారికి వంతపాడుతూ పాఠశాలల నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించేస్తున్నాయి. కానీ, ఈ పద్ధతి సరైంది కాదంటున్నారు హైదరాబాదు నిమ్స్‌ నెఫ్రాలజీ (మూత్రపిండ శాస్త్రం) విభాగాధిపతి డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు. పదో తరగతి వరకూ తెలుగులోనే చదువుకున్న ఆయన మాతృభాష- విద్యకు సంబంధించి తన ఆలోచనలు పంచుకుంటూ రాసిన ప్రత్యేక వ్యాసమిది..  
మాతృభాషే
నిజమైన మనసు భాష. మనిషి ఆలోచనలన్నీ మాతృభాషలోనే ఉంటాయి. అవి మంచివి అవ్వాలన్నా, మనసు స్వచ్ఛంగా ఉండాలన్నా మాతృభాషను చక్కగా నేర్చుకోవాలి. అందుకు బీజం పసితనంలోనే పడాలి. మాతృభాష మీద మక్కువ ఉన్నవారు ఇతర భాషల్లోనూ ఆరితేరగలరు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. భాష మీద పట్టు మనిషి అభివృద్ధికి సోపానమవుతుంది. అన్యభాషలు ఎన్ని నేర్చినా మాతృభాష వైశిష్ట్యం అనుభవైకవేద్యం! 
      కొన్ని దశాబ్దాల కిందట అందరూ తెలుగు మాధ్యమం పాఠశాలల్లో చదువుకునే రోజుల్లో, నేనూ నల్లగొండలో ఒక ప్రాథమిక పాఠశాలలో చేరాను. ఇంగ్లీషు రాదన్న భావన కానీ, హిందీ సరిగా నేర్చుకోవట్లేదన్న ఆలోచన కానీ రాని రోజులవి. అయినా, అన్ని భాషల్లోనూ వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవాళ్లం. అలాంటి సందర్భాల్లో ఎక్కువ హాయినిచ్చింది తెలుగే. అప్పుడే కొద్దికొద్దిగా కవిత్వం, కొన్ని కథలూ రాసేవాణ్ని. ఆ ఉత్సాహానికి తెలుగు భాష మీద ఉన్న కొద్దిపాటి పట్టే కారణం.  
భయం వేసింది కానీ..
పదో తరగతి వరకూ నాదైన ఓ ఊహాలోకంలో ప్రయాణించినట్టు ఉండేది. నిజానికి చదువంతా ఆడుతూ పాడుతూ హాయిగా ఇలాగే గడచిపోతుందనుకున్నాను. నాగార్జున సాగర్‌ కళాశాల ఇంటర్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత కూడా నల్లేరు మీద బండి నడకలానే సాగింది. తెలుగు మాధ్యమంలోనే ఆ రెండు సంవత్సరాలూ సజావుగానే జరిగిపోతాయనుకున్నాను. ఇంటర్‌ కూడా తెలుగులోనే కదా చదివేది.. చదవాలి అన్న ఉద్దేశంతో ఆయా పుస్తకాలన్నీ తీసుకుని బయల్దేరాను. తీరా అక్కడికి వెళ్లాక నన్ను ఆంగ్ల మాధ్యమంలో చేరమని అధ్యాపకులు రామకృష్ణయ్య ఉద్బోధించారు. భయం వేసింది. ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అనుకుంటూనే ఆంగ్ల మాధ్యమానికి సరేనన్నాను. మరోవైపు సంస్కృతంలో ఎక్కువ మార్కులొస్తాయి కాబట్టి, ద్వితీయ భాషగా దాన్ని తీసుకోమని చాలామంది చెప్పారు. మనిషి మేధస్సును మార్కులతో కొలవలేమన్న అభిప్రాయం నాది. మాతృభాష మీద ప్రేమతో కావాలనే తెలుగును ఎంచుకున్నాను.
      ఆంగ్లం ఏమాత్రం కొరుకుడు పడని భాష. ఏదో గాసటబీసటగా నేర్చుకున్న భాష. తరగతి గదిలో చివరి బెంచీల్లో కూర్చునేవాణ్ని. నాలానే తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన వాళ్లంతా అక్కడే ఉండేవారు. మొదట్లో మాస్టార్లు ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. కానీ ఆ కొత్త ప్రదేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులు, చక్కగా ప్రోత్సాహించే అధ్యాపకుల మధ్య ఆంగ్లం మీద పట్టు పెంచుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. మొదటి పరీక్షలో కేవలం పదమూడు మార్కులు తెచ్చుకున్నాను. ఆ తర్వాత జరిగిన వృక్షశాస్త్ర పరీక్షలో ఏకంగా ఇరవై నాలుగు మార్కులతో ముందు వరసలోకి వచ్చేశాను. తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన నా మిగిలిన విద్యార్థులకూ మంచి మార్కులు వచ్చాయి. మాధ్యమం మారినా చదువులో ప్రతిభ ఏమీ దెబ్బతినదన్న విషయం మాకప్పుడు అర్థమైంది. ఆపై వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. మా అందరిలోనూ అదే రకమైన మార్పు వచ్చింది. తెలుగైనా, ఆంగ్లమైనా చదివే పద్ధతి సరిగ్గా ఉండాలి. బాగా చదవాలనే కోరికే భాషా బలహీనతను అధిగమించేలా చేస్తుంది. అలా నాకు రెండు భాషల మీదా పట్టు లభించింది. 
చిన్నచూపు కూడదు
వైద్య విద్య అంతా ఆంగ్లంలో ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అప్పుడూ నాకు అట్టే కష్టం కాలేదు. అమ్మ భాషాభిమానం ఉంటే ఇతర భాషలనూ బాగా అధ్యయనం చేయవచ్చు. భాషా ప్రావీణ్యం ఉన్నత విద్యలో అక్కరకు రాదనుకొనే వాళ్లు చాలామందే ఉంటారు! భాషను కేవలం ఒక మాధ్యమంగా, విద్యార్జనలో భాగమైన ఓ ప్రశ్నపత్రంగా మాత్రమే చూస్తే ఇది వాస్తవం కావచ్చు. కానీ అద్భుతమైన ఆలోచనా విధానానికి నేపథ్యంగా, భావ వ్యక్తీకరణా సామర్థ్యానికి చక్కటి వేదికగా అది ఉపయోగపడుతుందని తెలిసిన వారికి ఇందులో లేశమాత్రమైనా నిజముందనిపించదు. భాష ద్వారానే మనం ఉన్నత స్థానాలను అధిరోహించగలం.
      పరాయి భాషలెన్ని నేర్చినా ఓ మోస్తరుగానే నేర్చుకోగలం. ఆయా భాషల మీద మనం సంపూర్ణ సాధికారత సాధించడం కల్ల. కాబట్టి ఆంగ్లం నేర్చినంత మాత్రాన స్వభాషను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు. మాతృభాషలోని ఆర్ద్రత మరే భాషలోనూ ఉండదు. చిలకమర్తి వారి ‘సాక్షి’ వ్యాసాల్లో జంఘాల శాస్త్రి చెప్పినట్టు ‘‘నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాషను అభివృద్ధి పరచుటకే. నీ భాషను భగ్యవతారము జేయుటకే. నీ భాషను బరభాషాగ్రంథ ప్రశస్తాభిప్రాయమములతో వన్నె పెట్టుటకే’’! ఆంగ్ల భాషాధ్యయనం మనకు అక్కరకొచ్చిన చుట్టం. ఇది కాదనలేని సత్యం. కానీ అట్టే కష్టపడకుండా పసితనం నుంచి అలవోకగా నేర్చుకునే మాతృభాషలో మరింత రాణింపు కూడా అవసరమే. వైద్యవిద్యలోనూ, ఆపై ఆచార్యుడిగా వక్తృత్వ కళలోనూ రాణించే అద్భుత అవకాశాన్నిచ్చింది మాతృభాష మీద నాకున్న పట్టు మాత్రమే. నిజానికి మాతృభాష మంచిగా నేర్చుకున్నవారికి ఏ భాష అయినా కరతలామలకమే అవుతుంది.  
మనసుంటే మార్గం
తల్లి నుంచి నేర్చిన భాష.. మనసు తల్లడిల్లినప్పుడల్లా తటాలున వచ్చేసే భాష.. మనసు ఉద్వేగభరితమైనప్పుడు  ఊరడించేది, ఆనంద డోలికలో ఊగులాడేటప్పుడు ఉబికి వచ్చేదంతా మాతృభాషే. అలా వచ్చినప్పుడే నిజమైన అనుభూతి పారవశ్యం అనుభవించగలుగుతాం. పఠనాసక్తిని పెంచేదీ, కొత్త ఆలోచనలు కలిగించేదీ స్వభాషే. కాబట్టి ప్రాథమిక స్థాయి వరకూ మాతృభాషలోనే విద్యాబుద్ధులు నేర్పాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రశంసనీయం. బహుభాషల పూదోట అయిన భారతావనిలో అన్ని భాషలూ దేశ సంస్కృతీ పరిమళాలను గుబాళించేవే. అన్నింటికీ సమాన గౌరవం ఇవ్వాలి.. ప్రోత్సహించాలి. 
      పిల్లల్లో మాతృ భాషాభిమానం చిన్నప్పుడే కలిగించడం కష్టతరమేమీ కాదు. వారికి ఉత్తమ సాహిత్యాన్ని పరిచయం చేస్తే  భాషను ఆస్వాదించడం ప్రారంభిస్తారు. అలాగే, ప్రజల వాడుకలో ఉండే మాటలను పాఠ్యపుస్తక భాషలో చేర్చితే ఊట బావి నుంచి నీరూరినట్లు చిన్నారుల్లో భాషాభిమానం అదే పెల్లుబుకుతుంది. మనసున్న చోట మార్గమేర్పరచుకోవడం అసాధ్యమేమీ కాదు కదా!


వెనక్కి ...

మీ అభిప్రాయం