మాతృభాష.. ఆత్మభాష!

  • 142 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య వి.శ్రీనివాస చక్రవర్తి

  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, ఐఐటీ
  • మద్రాసు.
  • 9500069322
ఆచార్య వి.శ్రీనివాస చక్రవర్తి

బోధనకి ఏది సరైన మాధ్యమం?
      ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో ఎన్నో ప్రగతిశీల అంశాలు ఉన్నాయి. తెగని సమస్యలుగా దీర్ఘకాలికంగా కొనసాగుతూ వస్తున్న విషయాల్లో ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఈ విధానంలో కనిపిస్తోంది.
      అలాంటి సమస్యల్లో ఒకటి బోధనా మాధ్యమానికి సంబంధించింది. బోధనా మాధ్యమం అయిదో తరగతి వరకు, అవసరమైతే ఇంకా పై తరగతుల వరకు కూడా మాతృభాషలోనే ఉండాలని కొత్త విధానం ప్రకటించింది. ఈ విషయం కొన్ని వర్గాలలో హర్షం కలిగించినా మరికొన్ని వర్గాల్లో కలకలాన్ని సృష్టించింది.
ఈ విషయంలో వివాదం ఎక్కడ వస్తోందో అందరికీ తెలిసిందే. మాతృభాషలో చదువు సులభం. ముఖ్యంగా మాతృభాషని అభిమానించే వారు ఆ మాధ్యమాన్నే కోరుకుంటారు. కాని వృత్తిపరంగా చూస్తే, ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వారికి అధిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది మంచిదన్నది కాస్త జటిలమైన సమస్యే. ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్లి మంచి చెడ్డలు విచారిద్దాం.
మాతృభాషలో చదువు.. లాభాలు
యునెస్కో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం అక్షరాస్యత కోసమే కాక, ప్రాథమిక విద్యకి కూడా శ్రేష్ఠమైన భాష మాతృభాషే. కానీ, మన దేశంలోనే కాదు తృతీయ ప్రపంచానికి చెందిన ఎన్నో దేశాల్లో అంతర్జాతీయంగా ప్రముఖమైన ఇంగ్లిష్‌ తదితర భాషా మాధ్యమాలకి చెందిన బడుల్లో పిల్లల్ని బలవంతంగా చేర్పిస్తుంటారు. ఇంట్లో మాట్లాడని పరాయి భాషని బళ్లో నేర్చుకోలేక పిల్లలు సతమతమవుతుంటారు. అనువుగాని భాషలో నేర్చుకోలేని పిల్లలకి నేర్పలేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతుంటారు. ప్రత్యేక శిక్షణ వల్ల ఇంగ్లిష్‌ కొద్దో గొప్పో నేర్చుకోగలిగినా మాతృభాషలో వెనకబడిపోతారు. కాబట్టి ఇటు ఇంగ్లీషు సరిగ్గా రాక, అటు మాతృభాష కూడా పెద్దగా రాని దయనీయ స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలు తమ చదువుల్లో వైఫల్యం చెందే అవకాశాలు మెండు. 
      ఈ సమస్యలన్నీ గుర్తించిన యునెస్కో 1953 నుంచీ మాతృభాషలో విద్యావిధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. మాతృభాషలో సాగే చదువు వల్ల ఒనగూరే ఎన్నో లాభాలని పేర్కొంది. అవి.. పిల్లలు బడిలో మరిన్ని ఎక్కువ తరగతులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావ్యవహారాల్లో మరింత సంపూర్ణంగా పాలుపంచు కోగలుగుతారు. అంతర్జాతీయ భాషలో కాకుండా స్థానిక భాషలో చదువు సాగినప్పుడు, పల్లె ప్రాంతపు పిల్లలు, ఆడపిల్లలు చదువుల్లో ఎక్కువ దూరం పోగలుగుతారు. అంతేకాకుండా, మాతృభాషా మాధ్యమం ఉన్నప్పటికీ, ఏదైనా అంతర్జాతీయ భాషని (మాధ్యమంగా కాక) కేవలం ఒక భాషగా నేర్చుకున్నప్పుడు, అలాంటి బహుళ భాషాత్మక విద్య ఆలోచనా ధోరణికి పదును పెడుతుంది. 
      మాతృభాషా మాధ్యమాన్ని వదిలిపెట్టి, మొదటి నుంచీ ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం వల్ల కలిగే నష్టాలూ అపారమే. మాతృభాష సరిగ్గా రాని పిల్లలు తమ తాతల, బామ్మల భాషని తెలుసుకోకుండా పోతారు. అలా పైతరానికి నవతరానికి మధ్య సంబంధం సన్నగిల్లిపోతుంది. మాతృభాషలో ఉండే తరతరాల సారస్వతం నుంచీ నవతరం దూరం అవుతూ ఉంటుంది. దీని వల్ల ఆ భాషల్లో సాహిత్యం కూడా క్రమంగా బలహీనపడుతుంది. మన దేశంలో ఎంతో కాలంగా అదే జరుగుతూ వస్తోంది. ఇలాంటి కారణాలతో ఇంగ్లీషుతో పోటీలో భారతీయ భాషలు క్రమంగా వెనకబడటం, ఓడిపోవడం కనిపిస్తుంది.
కొన్ని సవాళ్లు
ఆంగ్ల మాధ్యమంలో పోల్చితే, మాతృభాషా మాధ్యమంలో బోధనలో కొన్ని సవాళ్లు లేకపోలేవు. ఆంగ్ల మాధ్యమంలో చదివే చదువుకు ఊతంగా అన్ని రంగాలలోను అపారమైన సాహిత్యం ఉంటుంది. తెలుగులో అలాంటి వనరులు ఉండవు. ఉదాహరణకి ఒక పాప అయిదో తరగతి విజ్ఞాన శాస్త్రంలో ‘విశ్వం’ గురించి చదువుతుంది. గ్రహాలు, తారలు, గెలాక్సీలు ఇలా ఏవేవో వింత పదాలు ఆ పాఠంలో దొర్లుతాయి. వాటి గురించి పాఠ్యపుస్తకాలకి బయట మరిన్ని వివరాలు తెలుసుకుందామంటే, పెద్దగా ఏమీ కనిపించదు. ఇంగ్లీషులో అయితే ప్రతీ అంశం మీద చక్కని బొమ్మలతో సరదాగా వివరించిగలిగే సాహితీ నిధులు, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్‌ యుగంలో, వేలు కదిలిస్తే చేతికి చిక్కుతాయి.
      కానీ, ఇలాంటి తీరని కొరత, ‘స్థానిక భాషల్లో వైజ్ఞానిక సాహిత్యపు లేమి’ మన దేశంలోనే కనిపిస్తుంది. బహుశా తృతీయ ప్రపంచానికి చెందిన ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రథమ ప్రపంచ దేశాల్లో, ఆయా దేశాల భాషల్లో - ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌ తదితరాల్లో అపారమైన వైజ్ఞానిక సాహిత్యం ఉంటుంది. అందుకే ఆయా దేశాల్లో ఉన్నతవిద్య కూడా మాతృభాష ల్లోనే జరుగుతుంది. ఆంగ్ల మాధ్యమం కూడా అందుబాటులో ఉన్నా, మాతృభాషా మాధ్యమంలో చదువుకోవడం వల్ల వాళ్లు నష్టపోరు.
ఇప్పుడేం చెయ్యాలి?
ఈ వాస్తవాలని గమనించినప్పుడు మన ఎదుట రెండు దారులు కనిపిస్తున్నాయి. మొదటి పద్ధతి.. ఆంగ్ల మాధ్యమాన్నే అనితరంగా నవతరం మీద విధించి, పిల్లల చెవులు మెలేసి చదివించి, ఇంగ్లీషు ఉద్యోగాల్లో వాళ్లని ప్రవేశపెట్టడం. దీని వల్ల మన భాషా సాహిత్యాలు క్రమంగా నాశనమైనా, మన సంస్కృతి పట్ల గౌరవం సన్నిగిల్లినా, ఆత్మగౌరవం చచ్చిన సమాజం ఆధునిక యుగంలో కుంటినడక నడుస్తూ నెట్టుకొస్తున్నా, లక్ష్యపెట్టక ‘ఏదైతేనేం, ఇంత భుక్తి దొరికింది’ అని సరిపెట్టుకోవడం! 
      కానీ ఇటీవల ప్రకటితమైన విద్యా విధానంతో ఈ ఒరవడికి కొంతవరకు తెరపడింది. ఇక రెండో మార్గం.. తక్కిన ఎన్నో ప్రథమ ప్రపంచపు దేశాలు చేసినట్టే మన భాషలని ఇరవైఒకటో శతాబ్దపు అవసరాలకి తగ్గట్టుగా పెంచి పోషించడం. అన్ని ఆధునిక రంగాల్లోను తగిన శాస్త్రీయ సాహిత్యాన్ని మన భాషల్లోకి తీసుకురావడం. ఎన్నో విధాలుగా ఈ మార్గమే మరింత శ్రేయస్కరమైంది. ఎందుకంటే మన దేశంలో ఇంగ్లిష్‌ తెలిసిన వారు కేవలం పది శాతం మంది మాత్రమే. తక్కిన వారంతా భారతీయ భాషల మీద ఆధారపడి ఉన్నవారే. అయితే, ఈ రెండో మార్గాన్ని అనుసరించడంలో కొన్ని కీలకమైన అవరోధాలు ఎదురవుతాయి. 
అపార వైజ్ఞానిక సాహిత్యం
ఆధునిక వైజ్ఞానిక సాహిత్యం ఎంత వేగంగా విస్తరిస్తుందో సామాన్య ప్రజానీకానికి తెలిసే అవకాశం ఉండదు. ఆ అవగాహన కలగడం కోసం మచ్చుకి గణితంలో సాహిత్యం పెరిగిన తీరుని గమనిద్దాం. ఎడ్వర్డ్‌డన్‌ అనే గణితవేత్త గత అర్ధ శతాబ్దంలో గణిత సాహిత్యం పెరిగిన వేగం గురించి ఇలా చెప్పారు.. ‘‘1984లో నేను పీహెచ్‌డీ పూర్తిచేసిన నాటికి ఏడాదికి 35,000 పరిశోధనా పత్రాలు వెలువడేవి. గత ఏడాది (2019)లో పీహెచ్‌డీ పూర్తి చేసిన రీసెర్చ్‌ స్కాలర్ల విషయంలో ఆ సంఖ్య ఇంచుమించు మూడింతలు అయ్యింది. వీళ్లంతా రిటైరయ్యే కాలానికి ఏడాదికి 4 లక్షల పరిశోధనా పత్రాలు వెలువడతాయని కొన్ని అంచనాలు ఉన్నాయి’’.
      ఈ గణాంకాలని ఒకసారి నిశితంగా పరిశీలించాలి. ఉన్నత గణితంలో పరిశోధనా పత్రం రాయడం అంటే మునుపెన్నడూ లేని విషయాన్ని శోధించి, శాస్త్రీయ పరిభాషలో కచ్చితంగా రాయాలి. అలాంటి పత్రాలు ఏడాదికి లక్షల్లో రాయడం అంటే దాని వెనుక ఎంత కృషి, ఎంతటి అపారమైన మేధాశక్తి దాగి ఉన్నాయో ఆలోచించాలి. ఒక్క గణితంలోనే కాదు. ఇంచుమించు అన్ని ప్రధాన రంగాల్లోనూ వైజ్ఞానిక సాహిత్యం, లేదా వైజ్ఞానిక పరిజ్ఞానం పెరుగుతున్న వేగం ఇలాగే ఉంది. మరి ఇంతటి సాహితీ సముద్రాన్ని మన భాషల్లోకి తెచ్చుకోవడం ఎలా?
అనువాదాల సాయంతో..
ఈ సమస్యకి పరిష్కారంగా మనం మధ్యే మార్గాన్ని అవలంబించవచ్చు. మొదటి విడతలో ఉన్నత వర్గ శాస్త్ర సాహిత్యాన్ని, పాఠ్యపుస్తకాలని మన భాషల్లోకి తీసుకు రానక్కర్లేదు. ఉన్నత పరిజ్ఞానాన్ని కూడా సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా, సులభ భాషలో, ఎక్కువగా శాస్త్రీయ పరిభాష గుప్పించకుండా రాసే సాహితీ వర్గం ఒకటుంది. అదే జనవిజ్ఞాన సాహిత్యం  (పాపులర్‌ సైన్స్‌). ఇంగ్లీషులో, అలాగే ప్రధాన ఐరోపా భాషల్లో అలాంటి సాహితీ సముద్రమే ఉంది. పాఠ్యపుస్తకాల కన్నా ఇలాంటి జనవిజ్ఞాన సాహిత్యాన్ని సృష్టించడం సులభం, మరింత వాంఛనీయం కూడా. 
      కనీసం ఉన్నత పాఠశాల స్థాయి వరకైనా అన్ని శాస్త్రాలకూ సంబంధించిన పరిజ్ఞానాన్ని జనవిజ్ఞాన రూపంలో భారతీయ భాషల్లో సమాజానికి అందించాలి. బడి పాఠాలే కాకుండా, వృత్తి విద్యకి సంబంధించిన అన్ని రంగాల్లోనూ అలాంటి సాహిత్యం రూపం పోసుకోవాలి. గణిత, రసాయనిక, భౌతిక, జీవ శాస్త్రాలతో పాటు వైద్యం, ఇంజినీరింగ్, చట్టం, సామాజికం, రాజకీయం, ఆర్థికం, వాణిజ్యం, మనస్తత్వం, తత్వం, కళ- ఇలా మానవ జీవనానికి సంబంధించిన అన్ని అంశాల మీద సామాన్యులకి అర్థమయ్యేలా సాహిత్యం రావాలి. ఇలాంటి సాహితీ సృష్టి కోసం కొంతవరకు అనువాదాల మీద ఆధారపడక తప్పదు. తెలుగు లేదా భారతీయ భాషలకి సంబంధించిన ప్రచురణ కర్తలు విదేశీ ప్రచురణకర్తలతో పొత్తులు కుదుర్చుకుని, ఇంగ్లీషులో వచ్చిన మేలైన పుస్తకాలని ఎప్పటికప్పుడు మన భాషల్లో తర్జుమా అయ్యేలా చూడాలి. వివిధ రంగాలకి చెందిన మేధావులు, నిపుణులు తమ స్వీయ రంగాలకి చెందిన సమాచారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. టీవీ ప్రసంగాలు, పత్రికా వ్యాసాలు మాత్రమే కాకుండా నాలుగు కాలల పాటు నిలిచే పుస్తకాల రూపంలో కూడా ఆ సమాచారాన్ని సమాజానికి అందించవచ్చు. 
జ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థ
తెలుగులో ఎక్కువగా పరిమిత రంగాలలోనే సాహిత్యం కనిపిస్తుంది. కల్పిత సాహిత్యాన్ని (ఫిక్షన్‌) పక్కన పెడితే, అకల్పిత సాహితీ (నాన్‌ఫిక్షన్‌) వర్గాల్లో సాంప్రదాయకం, మతం, ఐతిహాసికం, తత్వం, పౌరాణికం, అధ్యాత్మికం, సినిమా, క్రికెట్, రాజకీయం- ఈ రంగాల్లోనే ప్రధానంగా సమాచారం కనిపిస్తుంది. ఆధునిక పరిజ్ఞానానికి సంబంధించిన సాహిత్యం బహుతక్కువ.
      ఈ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి గురించిన చర్చ ప్రసారమాధ్యమాల్లో మాత్రమే కాకుండా సమాజవ్యాప్తంగా ఊపందుకుంది. ప్రధాని మోదీ కూడా మన దేశం త్వరలోనే అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావాలని, ఆ దిశలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. దాని సాధ్యాసా ధ్యతలపై విస్తృత చర్చ మొదలయ్యింది.
పందొమ్మిదో శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అంతవరకు సేద్యం మీద ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలు క్రమంగా పారిశ్రామికీకృత సమాజాలుగా రూపాంతరం చెందాయి. గత శతాబ్దంలో కంప్యూటర్‌ సాంకేతికత ఏర్పడటంతో దాని ముఖ్య పర్యవసానాల్లో ఒకటిగా ఇంటర్నెట్‌ జన్మించింది. ఇంటర్నెట్‌ యుగంలో అపారమైన జ్ఞానం అందరికీ అందుబాటు లోకి వచ్చింది. ఈ కొత్త పరిణామాలకి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలు కూడా రూపాంతరం చెందాయి. రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థలన్నీ జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలు (నాలెడ్జ్‌ బేస్డ్‌ ఎకానమీస్‌) కానున్నాయి. అలాంటి ఆర్థిక వ్యవస్థలు కలిగిన సమాజాలని జ్ఞానాధారిత సమాజాలు అంటారు. కాబట్టి ఆధునిక సమాజంలో ఎంత జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ఒడుపుగా వాస్తవ ప్రపంచంలో ప్రయో గించే వ్యక్తులు ఎంత ఎక్కువగా ఉంటే, ఆర్థికంగా ఆ సమాజం అంత ఎత్తుకు వెళ్తుంది. కాబట్టి భారతీయ భాషల్లో జ్ఞానపు వనరులు ఎంత పెరిగితే, మన దేశం అంత వేగంగా, సుస్థిరంగా జ్ఞానాధా రిత సమాజంగా పరివర్తన చెందుతుంది.
పునరుద్దీపనకు ఊతం
పునరుద్దీపన అనే పదాన్ని సామాన్యంగా 500 ఏళ్ల కిందట యూరప్‌లో మొదలైన ఓ గొప్ప పరిణామాన్ని సూచించడానికి వాడతారు. వెయ్యేళ్ల పాటు మత ప్రభావం వల్ల అజ్ఞానాంధకారంలో మగ్గిన ఐరోపా సమాజాల్లో అయిదు శతాబ్దాల కిందట ఓ మేలుకొలుపు మొదలయ్యింది. తమ అజ్ఞానాన్ని గుర్తించుకున్న వ్యక్తులు సరైన జ్ఞానం కోసం పరిపరి విధాల శ్రమించారు. పాత పుస్తకాలని అవతల పారేసి ప్రకృతి గురించి, ప్రపంచం గురించి ప్రత్యక్ష జ్ఞానం పొందే ప్రయత్నం మొదలెట్టారు. ఆ విధంగా వైజ్ఞానిక విప్లవం మొదలయ్యింది. చిత్రకళ, శిల్పకళ, స్థాపత్యం, నగర నిర్మాణం, సంగీతం, సాహిత్యం ఇలా ఎన్నో రంగాల్లో కొత్త ఒరవడులు పుట్టాయి. అలా వచ్చిందే సాంస్కృతిక పునరుద్దీపన. ప్రపంచం పట్ల తమ అవగాహన సంకుచితంగా ఉందని గుర్తించిన కొందరు సాహసులు ప్రపంచం దిశదిశలా విపత్కర ప్రయాణాలు చేసి ఎన్నో కొత్త భూములని కనుగొన్నారు. అలా అన్వేషణా యుగం మొదలయ్యింది. అయితే వాళ్లు కొత్త భూములు కనుక్కోవడంతో ఆగకుండా, వాటిని తమ రాజ్యాల్లో కలుపుకుని విశాల సామ్రాజ్యాలని స్థాపించారు. ఆ విధంగా సామ్రాజ్య యుగం మొదలయ్యింది. అలాంటి సామ్రాజ్య విస్తరణ ప్రణాళికలో భాగం గానే ఇంగ్లీషు వారు మన దేశాన్ని ఆక్రమించారు.
      అలా ఒక పక్క ఐరోపా సమాజాలు క్రమంగా బలవత్తరం అవుతున్న సమయంలో మనం మన పాత ఆచారాలని పట్టుకుని వేలాడుతూ తమస్సులో కూరుకుపోయి ఉన్నాం. సతి, బాల్య వివాహం లాంటి దారుణ సాంఘిక దురాచారాలని నిర్మూలించడానికే మన సంఘ సంస్కర్తలకు గగనమయ్యింది. ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మన మనసుల్లో గూడు కట్టుకున్న ఎన్నో అర్థం లేని మూఢనమ్మకాల బూజుని వదిలించుకోవడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వస్తోంది.
      సాంప్రదాయిక భారతీయ జీవనంలో ఆచారాలు, కట్టుబాట్లు జీవితాన్ని శాసిస్తాయి. కేవలం ‘కట్టుబాట్ల’తో నిర్దేశిత మయ్యే జీవితంలో పెద్దగా కొత్తదనం ఉండదు. తరతరాలుగా అందరూ అదే జీవన చక్రంలో గుడుసుళ్లు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పెద్దగా సృజన ఉండదు. శోధించి కొత్త జ్ఞానాన్ని సాధించే అవకాశాలు అంతగా ఉండవు.
      మనిషి హృదయం లోతుల్లో ఒక తేజం ఉంటుంది, ఒక స్ఫూర్తి, ఒక గొంతుక. దాని భాషే ఆత్మభాష. అది మనిషిని ఒక రకమైన అనుభవ పథం మీదుగా సాగమని ప్రోత్సహిస్తుంది. ఒకర్ని గాయకుణ్ని చేస్తుంది. మరొకరితో కలం పట్టిస్తుంది. ఇంకొకరిని సరిహద్దుల దగ్గర పోరాడమంటుంది. కేవలం సాంఘిక కట్టుబాట్లతో కాకుండా, ఆ అంతర్వాణే జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ జీవితంలో వెలుగు నిండుతుంది. అర్థవంతంగా తోస్తుంది. అలాంటి వ్యక్తులు అధిక సంఖ్యలో ఉన్న సమాజాల్లో సృజన పెల్లుబుకుతుంది. అన్ని రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కూడా సహజంగా బలవత్తరమవుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం