తెలుగును తీసేస్తే నష్టమే!

  • 99 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యం.ఎస్‌.కె.కృష్ణజ్యోతి

  • జీవశాస్త్ర ఉపాధ్యాయిని, mskkrishnajyothi@gmail.com
  • కావలి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
యం.ఎస్‌.కె.కృష్ణజ్యోతి

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు పాలకులు ఉద్యుక్తులవుతున్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థించేవారు వివిధ వాదనలు చేస్తున్నారు కానీ, పిల్లల సమగ్రాభివృద్ధికి ఏ మాధ్యమం బాగా అక్కరకొస్తుందన్న విషయాన్ని దాటేస్తున్నారు. అంతేకాదు, ఆంగ్ల మాధ్యమంలో బోధించగలిగిన ఉపాధ్యాయులెంతమంది ఉన్నారన్న విషయాన్నీ వారు విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ‘విద్య- మాధ్యమం’ అంశాన్ని పిల్లలు- ఉపాధ్యాయుల కోణంలోంచి పరిశీలిస్తే నిగ్గుదేలే విషయాలివి.. 
జ్ఞానాన్ని
తరతరాలుగా భద్రం చేయడం, వ్యక్తి ప్రవర్తనలో మార్పును తీసుకురావడం అనేవి విద్యాలక్ష్యాలలో ముఖ్యమైన రెండు భాగాలు.
      విద్య అంటేనే జ్ఞానం. దీన్నే తెలుగులో చదువు అంటాం. జీవిత అనుభవాల నుంచి, ప్రతివారిలో, ప్రతి క్షణం జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. విద్యార్థి దశలో సంసిద్ధ జ్ఞానాన్ని ఒక పద్ధతిగా అందించే కేంద్రమే పాఠశాల. బడిలో నేర్చుకునే సంగతులు నిరంతర విద్యా ప్రక్రియలో భాగంగా అనుకోవచ్చు. ‘బడి’ అంటే క్రమం అని ఒక అర్థం ఉంది. బయట జీవితాన్ని సాధన చేయించే స్థలమే బడి. సరే, ఈ బడిలో ఏమేమి చదువుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అనే అంశాల మీద బడి పుట్టిన దగ్గరినుంచీ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. విని, వల్లెవేసి అప్పగించే తరహా చదువు నుంచి, సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరించే దిశగా అనేక రకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి.  
శైశవ దశలో వ్యక్తికి, ‘బడి’ విస్తృత స్థాయి సామాజికీకరణం చెందే ప్రధాన ప్రదేశం. ఇల్లు, ఇరుగు పొరుగుని దాటి, ఎక్కువ మందితో సమయం గడపడం, సమాజంలో సర్దుబాట్లు, నియమాలు బడి ద్వారానే విద్యార్థులు నేర్చుకుంటారు.  
వ్యక్తి జీవితంలో కీలకమైన బడిలో, బోధనా మాధ్యమంగా ఏది ఉండాలనే విషయం మీద ప్రస్తుతం చాలా చర్చ నడుస్తోంది.
      స్థానికేతర మాధ్యమాన్ని సమర్థించేవారు అంటే, తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమాన్ని బలపరచేవారిలో, ప్రపంచీకరణ నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆర్థికంగా, సామాజికంగా దిగువన ఉన్న పిల్లలు కేవలం స్థానిక భాషలో చదువు నేర్చుకోవడం ద్వారా అనేక అవకాశాలను కోల్పోతున్నారని, వెనుకబడిపోతున్నారనే ఆవేదన ఉంది. అలాగే, స్థానిక భాష లేదా తెలుగు బోధనా మాధ్యమంగా ఉండాలి అనేవారి దృక్పథంలో రెండు భావనలు కనబడుతున్నాయి. కొందరు, భాషని పరిరక్షించాలి, దాన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది విలుప్తమైపోతుంది అని భావిస్తుంటే; కొందరు భాష ఉనికి కాదు, పిల్లల వ్యక్తీకరణ, అవగాహన ప్రధాన అంశాలు, విద్యార్థుల గ్రహణశక్తిని పరిగణనలోకి తీసుకొని వారి వారి అవసరాలని బట్టి బోధన భాష ఉండాలని చెబుతున్నారు.
చదువును అలా చూడకూడదు!
ప్రతి భాషకీ ఒక సొగసు, స్థానిక ప్రాధాన్యం, సాంకేతికత ఉంటాయి. భాష నశించిపోయినప్పుడు ఆ భాషను వినియోగించే జాతులు అవన్నీ కోల్పోతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే, చదువు అనే పదమే తీసుకుంటే, అది నేర్పు, నిపుణతకి సమానార్థకమైన చతుర అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని ఒక అంచనా. అయితే, మరి చతుర పదం చదువుగా దిగుమతి అయిన కాలంలో దానికి సమాన పదం తెలుగులో ఏదైనా ఉందా? లేదా? అసలు ఆంధ్ర ప్రాంతంలో ఆ కాలంలో ‘చదువు’ ఉందా? ఉంటే ఎలా ఉండేది? ఈ రోజుకీ పనికివచ్చే ప్రత్యేక విషయాలు అందులో ఏవైనా ఉండేవా? ఈ సంగతులన్నీ కాలానుగతంగా మరుగున పడిపోయాయి. చదువుకి సమానమైన ఒక్క తెలుగు పదాన్ని వెతుకుతూ వెళ్తే, ఒక గొప్ప చరిత్ర ఆవిష్కరణ కావచ్చు!
      ప్రపంచ వ్యాప్తంగా అనేక ఐరోపా దేశాల వలస దేశాల్లో, భిన్న స్థానిక తెగలు కలిగిన అమెరికా లాంటి దేశాల్లో బోధనా భాష గురించి సందిగ్ధత కనిపిస్తుంది. స్థానిక భాషలతో పోలిస్తే ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి ఐరోపా భాషలు ఆధిపత్య భాషలు. ఆర్థిక అవసరాలను తీర్చడంలో పనికొచ్చే భాషలు. భారత దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక భాషా మాధ్యమం, ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉన్నాయి. ప్రైవేటు సంస్థల్లో చదువు ఉపాధి అవకాశాలను పెంచుతుంది అనే ఆశ తల్లిదండ్రుల్లో ఉంది. అయితే, ‘చదువు’ను ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా చూడట మంటే, దాని విలువను తగ్గించడమే. 
అధ్యయనాలన్నీ అమ్మభాష వైపే..
చదువు ప్రధాన లక్ష్యం విద్యార్థి సమగ్ర అభివృద్ధి. కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జిమ్‌ కమిన్స్‌ అధ్యయనం ప్రకారం మాతృభాషలో బలమైన పునాది ఉన్న పిల్లలు, ఇతర భాషలని సులువుగా నేర్చుకుంటున్నారని నిరూపితం అయింది. ఇంకా, మాతృ లేదా స్థానిక భాషలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన హెచ్చు స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.
      బోధనా మాధ్యమంగా మాతృభాష ఉంటే కలిగే మానసిక ప్రయోజనాలు, సవాళ్లను అంచనా వేయడం కోసం వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ బిహేవియరల్‌ సైన్సెస్‌లో ఒక అధ్యయనం జరిగింది. మాతృభాషలో నేర్చుకోవడం ద్వారా పిల్లల ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం, స్వీయ-వ్యక్తీకరణ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయనీ, తరగతి గది వ్యక్తీకరణ సులభం అవుతుందనీ, విద్యలో నాణ్యత పెరుగుతుందనీ ఆ అధ్యయన ఫలితాల సారాంశం. ఈ అధ్యయనంలో, తల్లుల విద్యా స్థాయి, తల్లిదండ్రుల వృత్తులు, బోధనా మాధ్యమంగా మాతృభాష పట్ల విద్యార్థుల వైఖరి మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు. అంటే, మాధ్యమం కేవలం విద్యార్థికీ, బోధనకూ చెందినది కాదు. విద్యార్థి కుటుంబ నేపథ్యం కూడా ఇందులో గణించాలి.
      రెండు మాధ్యమాలూ ఉన్న పాఠశాలల్లో నా వ్యక్తిగత పరిశీలన ప్రకారం, కొందరు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో మొదటగా చేరతారు. వారిలో కొందరు, వారి ఆరోగ్య పరిస్థితులని బట్టి, ఇతర కారణాల వల్ల మధ్యలో తమ బోధనా మాధ్యమాన్ని మార్చుకుంటారు. అలాగే, తొమ్మిది దాకా ఆంగ్ల మాధ్యమంలో ఉండి పదో తరగతికి వచ్చేప్పటికి, ఉత్తీర్ణత ప్రధానమైన తరగతి కాబట్టి, వారికి అనుకూలంగా అనిపించే తెలుగు మాధ్యమానికి తిరిగి వచ్చేవారూ ఉంటారు. మాధ్యమ పరంగా ఇప్పటిదాకా మన పాఠశాలల్లో విద్యార్థి కేంద్రిత విధానాలు నడిచాయి. పాఠశాలల్లో ఒకే భాషా మాధ్యమం లేదా ఆంగ్ల భాషా మాధ్యమం మాత్రమే ఉంటే, పిల్లలకి తమ సామర్థ్యాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, మాధ్యమాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. 
      తెలుగు ఇంటిభాషగా ఉన్న పిల్లలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గోండు, పట్టపు, సవర, ఎరికల తదితర అనేక ఇతర, గిరిజన భాషలు మాట్లాడే విద్యార్థులు ఉన్నారు. వారికి తెలుగు రెండో పరిచయ భాష. (పాఠశాల దస్త్రాల ప్రకారం వారి మాతృభాష తెలుగే) ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు స్థానిక పదాలను నేర్చుకొని, పిల్లల స్థాయికి తెలిసేలాగా చదువు నేర్పాలనే సూచన ఇదివరలో ఇచ్చేవారు. వీరిని ఆంగ్ల మాధ్యమంలో ఒక్కసారిగా ప్రవేశపెట్టినప్పుడు బోధకులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలా అయితే అసలుకే మోసం!
మాధ్యమ విషయంగా మాట్లాడేటప్పుడు, మన ప్రాంతంలో ఎక్కువ మంది పట్టించుకోని ఒక ముఖ్యమైన అంశం, ఈ ‘మాధ్యమం’ అనే పదం విద్యార్థి ‘అభ్యసనానికి’ చెందింది కాదు. ఉపాధ్యాయుల ‘బోధన’కు చెందింది. బోధనా మాధ్యమం ఏది అయినప్పటికీ, విద్యార్థి తనకు అర్థం అయినట్లుగా, చేతనైన భాషలో పరీక్ష రాయవచ్చు. ఉపాధ్యాయుడు మాత్రం సదరు నిర్దేశిత మాధ్యమంలోనే చెప్పాలి/ చెప్పగలగాలి. అందుకే, ‘బోధనా మాధ్యమం’ అంటారు. అంటే, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చదువు చెప్పేవారిలో ఎక్కువ మందికి కనీస స్థాయిలో ఆ భాష వచ్చి ఉండాలి. ఆంగ్లాన్ని బోధనా భాషగా వాడగల సామర్థ్యమున్న ఉపాధ్యాయులు మనకు ఎందరు అందుబాటులో ఉన్నారు? తక్షణం ఒక చిన్న పరీక్ష ద్వారా అధ్యయనం చేసి చూస్తే, కనీసం ఆంగ్ల భాషా బోధకులు ఆ భాషని సక్రమంగా వినియోగించగలరా లేదా తెలిసిపోతుంది! సమస్య బోధనకీ చెందినది కాబట్టి, స్థూలంగా సమస్య టీచర్లది. దురదృష్టవశాత్తు ఫలితంలో మంచి చెడులు అనుభవించేది పిల్లలు. 
      ఆంగ్ల మాధ్యమం చదువుకోవాలి అనుకునే పిల్లలకి తప్పని సరిగా అవకాశం ఉండాలి. అది ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఉంది. ఇప్పుడు దాన్ని సామాజిక అవసరాల ఆధారంగా విస్తరించడం అర్థం చేసుకోతగిందే. ఇప్పటిదాకా రెండు మాధ్యమాలు ఉన్న అనేక విద్యాలయాల్లో రెండు విభాగాల్లో (సెక్షన్లలో) ఒకే సంఖ్యలో పిల్లలు చేరుతున్నారు. పైగా, ఇంగ్లిష్‌ మీడియంలో పాస్‌ శాతం తెలుగు మీడియంతో పోలిస్తే ఎక్కువ! రవ్వంత చురుగ్గా ఉండే పిల్లలే ఇంగ్లిష్‌ మీడియం వైపు మొగ్గుతారు. ప్రస్తుత పరీక్షల ఆధారిత వాతావరణంలో పిల్లలు, తమవైపు నుంచి లోపం లేకుండా కష్టపడి మంచి ఫలితం సాధిస్తున్నారు. తెలుగు మీడియం పిల్లల్లో తెలివితేటలు మెండుగా ఉండే పిల్లలతో పాటు మెతక పిల్లలూ, వినికిడి లోపం కలవారూ, మాట్లాడలేని వారు, సాధారణ స్థాయి కన్నా దిగువ ఐక్యూ కలవారూ.. ఇలా రకరకాల పిల్లలు ఉంటారు. సాధారణ స్థాయికి తక్కువగా ఉండే పిల్లల ఉత్తీర్ణత కోసం చాలా ప్రయత్నాలు నడుస్తాయి. పలుమార్లు అవి విఫలం కావడం మామూలు. 
      సాధారణ పరీక్షల్లో తరచుగా విఫలం అయ్యే పిల్లల ఇంట్లో మాట్లాడే భాష బడిలో ఉంటే కనీసం సాధారణ విషయాలు అర్థం చేసుకునే అవకాశం, విద్యాలయానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. సమస్యాత్మక నేపథ్యం కలిగిన పిల్లలపైన నిర్బంధ ఆంగ్ల/ స్థానికేతర భాషా విధానాన్ని అమలు చేస్తే, వీళ్లు మధ్యలోనే బడి మానేస్తారు. పూర్తిగా దిగువ తరగతి, నిరక్షరాస్య కుటుంబాల్లో నష్టం ఎక్కువ జరగవచ్చు.
మెరుగైన విద్యకు మేలుబాట
చదువు ఔషధం కన్నా గొప్పది. కాబట్టి ఇక్కడ మార్పులు తేవడానికి ఎక్కువ సంఖ్యలో నమూనా తీసుకుని, అధ్యయనం చేసి, తర్వాత అధ్యయన ఫలితాలు, సూచనల మేర వాటిని అమలు చేయాలి. దేశ విదేశాల్లో ఎన్నో అధ్యయనాలు పిల్లలకి మొదటి దశలో తమ స్థానిక భాషలో బోధన జరగాలని బల్లగుద్ది చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సామాజిక అవసరాలను కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు. మధ్యే మార్గం ఆలోచించాల్సిన తరుణమిది. 
      ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నూతన విద్యా విధానం 2020, ప్రాథమిక స్థాయిలో అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలని సూచిస్తోంది. ద్విభాషా పుస్తకాల నిర్మాణం జరగాలని తద్వారా విద్యార్థి దశ నుంచి సాంకేతిక అంశాలను ప్రాంతీయ భాషలో, ఆంగ్లంలో విద్యార్థులు అందుకోగలుగుతారని చెబుతోంది. 
      ఇప్పుడు ప్రధానంగా ఆచరణలోకి రావాల్సిన అంశం, ఒక ప్రాంతంలో లేదా ఒక రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన విద్య, మాధ్యమ విధానాలని అనుసరించాలి. సామాజిక అంతరాలు విద్యా నైపుణ్య అంతరాలుగా ఉండకూడదు. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదు. ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని విధాన నిర్ణయాలు చేసినప్పుడే మరింత మెరుగైన విద్య, మరింత మెరుగైన సమాజం వైపు విద్యార్థుల అడుగులు పడతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం