కొత్త చదువులకు శ్రీకారం

  • 34 Views
  • 0Likes
  • Like
  • Article Share

    విఠపు బాలసుబ్రహ్మణ్యం

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనమండలి సభ్యులు,
  • 9490098912
విఠపు బాలసుబ్రహ్మణ్యం

జాతీయ విద్యావిధానం- 2020 మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ విధానపత్రం ఇప్పుడు అందరి ప్రశంసలూ అందుకుం టోంది. అయితే.. అసలు ఈ పత్రంలోని కీలక అంశాలేంటి? ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలకు అది ఎలాంటి పరిష్కారాలు సూచించింది? దీని అమలు కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఈ విషయాలన్నింటినీ ఓమారు పరిశీలిద్దాం!
దాదాపు
అయిదేళ్ల చర్చోపచర్చల అనంతరం, ఒకటికి మూడు ముసాయిదాల తర్వాత జూలై 29న నూతన విద్యా విధానం-2020 కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది. ప్రస్తుతం దీని మీద దేశమంతా వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. భారతదేశపు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక బాహుళ్యం దృష్ట్యా సహజంగానే ఇవి పలురూపాల్లో ఉన్నాయి. ఇందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు. కానీ అద్భుతమైన విషయమేమంటే ఒక అంశం మీద మాత్రం జాతి మొత్తం ఏకాభిప్రా యంతో ఉండటం. విద్యావేత్తలేగాదు సామాజిక, రాజకీయవేత్తలు సైతం దీన్ని మనసారా ఆహ్వానించడం. అది ప్రాథమిక విద్యలోనే కాదు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పైనా, ఉన్నత విద్యలో కూడా మాతృభాషా మాధ్యమంలోనే బోధన సాగాలన్న అభిభాషణ. దీన్ని ఏదో ఒక ఆదర్శంగానో, సలహాగానో గాక స్పష్టమైన విధానంగా ప్రకటించడం. దీని అమలుకు అనేక పద్ధతుల్ని, మార్గదర్శకాల్ని కూడా అంతే కృతనిశ్చయంతో ముందుకు తేవడం. 
విధాన స్పష్టత
‘ఇంటిభాషకూ బడిభాషకూ మధ్య వైరుధ్యం ఉండకూడదు. చిన్నపిల్లలు ప్రాధాన్య విషయాలను మాతృభాషలోనే తెలుసుకోగలరు. మాతృభాష ద్వారా విషయ పరిజ్ఞానంలో, విశ్లేషణా శక్తిలో ఒక పునాది ఏర్పడ్డాక దీనిపై విద్యార్థి తేలిగ్గా ఎంత దూరమైనా పయనించగలడు. ఎన్ని విద్యల్లోనైనా రాణించగలడు’ అనేది ఈ విధాన తాత్పర్యం. ‘ఈ విషయంలో ఎవ రికీ భిన్నాభిప్రాయం ఉండదనుకుంటాను’ అని ప్రధాని ధీమాగా పేర్కొనడంలోని గొప్పదనమంతా మాతృభాషా మాధ్యమం లోని శాస్త్రీయతలోనే దాగి ఉంది. వాస్తవానికిది మన జాతీయోద్యమం, ఆ తర్వాత కొఠారీ కమిషన్, జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం (2005), విద్యాహక్కు చట్టం (2009).. వీటన్నిటి నుంచి వారసత్వంగా లభించింది. స్వాతంత్య్రం వచ్చి డెబ్బయినాలుగేళ్లు గడిచినా, విద్యారంగంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఆచరణలో ఆంగ్ల మాధ్యమానికి ఎంత మోజు కనిపిస్తున్నా ఒక బోధనాభ్యసన సూత్రంగా మాతృభాషా మాధ్యమానికి మరింత వక్కాణింపు, సమర్థనా లభించడం గర్వించదగ్గ అంశం. దీని శాస్త్రీయతను ఎవరూ కాదనలేకపోవడం గమనించాల్సిన అంశం. అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తమతమ భాషల్లో విద్యను ఉన్నతస్థాయి వరకు మాతృభాషలో సాగించిన ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, మరీ ఉత్పత్తిరంగంలో, పరిశోధనల్లో, నూతనావిష్కరణల్లో ఎంత అగ్రభాగాన ఉన్నాయో, ఒక జాతిగా ఎంత దృఢంగా నిలదొక్కుకోగలిగాయో మనం చూసి నేర్చుకోవాలని ఈ విధాన పత్రం గుర్తుచేస్తోంది. ఈ మార్గం పట్టుకోనందు వల్లే మనం వెనుకబడ్డామని చెబుతోంది. ఇంత విధాన స్పష్టత మాతృభాష మీద ఉండటం ఈ పత్రం ప్రత్యేకత. 
బోధనా ధర్మసూక్ష్మం
బిడ్డ భాషా, ఉపాధ్యాయుడి భాష కూడా ఒకటిగా ఉండాలని ఈ పత్రం బిడ్డవైపు నుంచి, తల్లిభాష వైపు నుంచి గట్టివకాల్తా పుచ్చుకుంది. మన ఆంధ్ర రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో బహుళ భాషా వాచ కాల్ని ముద్రించాం. ఒక క్రమంలో మూడో తరగతికి వచ్చేటప్పటికి తెలుగులోకి కోయ, సవరలాంటి భాషల పిల్లలు సులభంగా పరాయీకరణ చెందకుండా మారగలిగేలా వాటిని రూపొందించాం. కానీ, అక్కడి ఉపాధ్యాయులకు ఆ భాషల్లో కనీస పరిజ్ఞానం లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. దీన్ని అధిగమించడానికి ఉపాధ్యాయుడికి పిల్లల భాష వచ్చితీరాలని ఈ పత్రం నిర్దేశించింది.
      ఒకవేళ ఆ పిల్లల మాతృభాషలో పాఠ్యగ్రంథాలు లేకుంటే వాటిని బోధించేట ప్పుడు, వివరించేటప్పుడు, వాళ్ల మాతృ భాషనే ఉపయోగించాలన్న బోధనా ధర్మ సూక్ష్మాన్ని కూడా ఇది చెప్పింది. కారణాలు ఏవైనా మాతృభాషా మాధ్యమంలో మన చదువులు సాగడం లేదు. గిరిజన భాషల్లో అది అసలు సాధ్యం కావడం లేదు. ఇక ఆంగ్ల మాధ్యమ పాఠశాలల సంగతి సరేసరి. పిల్లలకి అంతా ఆగమ్యగోచరంగా ఉంటోంది. తరగతి గదిలోనే కాదు పిల్లల ఆటపాటల్లో కూడా మాతృభాషను వాడితే ఆంగ్ల భాష సరిగా అబ్బదని మహా వేదన పడిపోతుంటాం. కానీ కావల్సింది పిల్లలకి విషయం అర్థంగావడం. దాని సారాన్ని పట్టుకోవడం. దీన్ని మాత్రం మరచి పోతుంటాం. లౌక్యం తెలిసిన ఉపాధ్యా యులు గుట్టుచప్పుడు కాకుండా తెలుగులో పాఠాలు చెప్పి, పరీక్షలు ఆంగ్లంలో రాయి స్తుంటారు. (తొంభై శాతం జరుగుతోంది ఈ తతంగమే) దీన్ని ఈ పత్రం సరిగ్గానే పసిగట్టింది. ‘కొంపలేమీ అంటుకుపోవు. పాఠాల్ని మాతృభాషలోనే వివరించండి’ అని మాష్టార్లకి పాఠం చెప్పింది.
      మరో ముఖ్యమైన అంశం.. మాతృ భాషా మాధ్యమం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింట్లో సాగాలని నిర్దేశించడం. మాధ్యమం విషయంలో తేడాలుండటం విద్యావ్యవస్థను నిట్టనిలువునా చీల్చింది. ‘అందరు పిల్లలకు ఒకే విద్య’ సూత్రాన్ని విఘాతపరచింది. కామన్‌ స్కూలు ఆదర్శాన్ని గంగలో కలిపింది. విద్యావేత్త జంధ్యాల తిలక్‌ మాటల్లో చెప్పాలంటే ‘‘ఈ ఆంగ్ల మాధ్యమమే విద్యావ్యాపారానికి ఊపిరి పోసింది. రెండు రకాల చదువులకు బాటలు వేసింది. చదువుల్లో సమానత్వం రావాలంటే ప్రైవేటు స్కూళ్లలోనూ మాతృభాషా మాధ్యమం వచ్చి తీరాలి’’. నిజంగా ఇది అమలు జరిగితే విద్యారంగంలో గొప్ప విప్లవమే! 
ద్విభాషా వాచకాలు
నూతన విద్యా విధానం ముందుకు తెచ్చిన మరో మంచి అంశం ద్విభాషా పాఠ్య గ్రంథాలు. దురదృష్టవశాత్తు ‘మాతృభాష నీడపడితే ఆంగ్లంలో పలచబడిపోతా’మని మన విద్యారంగం గట్టిగా నమ్ముతోంది. అందుకే తరచుగా పిల్లలు మాతృభాషలో మాట్లాడుకోవడాన్ని కూడా మహాపరాధంగా లెక్కించి శిక్షలు విధిస్తుంటారు. ఇది పచ్చి అశాస్త్రీయం. ఒక భాష- మరీ మాతృభాష రెండోభాషకు ఎప్పటికీ అడ్డంకి కాబోదు. పైగా గొప్ప దోహదకారి. రెండు భాషలూ సమాంతరంగా నేర్చుకోవడం పర స్పర లాభదాయకమని చాలా అనుభవాలు చెబుతున్నాయి. ట్యునీషియా ద్విభాషా విధానం ప్రసిద్ధమైంది. మాతృభాష అరబ్బీ లోనూ, పరాయిభాష ఫ్రెంచిలోనూ అక్కడ సెకండరీ స్థాయిలో బోధన జరుగుతోంది. ద్విభాషా పాఠ్య గ్రంథాలు ఉంటాయి. సుప్రీంకోర్టులో కేసు దృష్ట్యా ఆంధ్ర ప్రభుత్వమూ ద్విభాషా వాచకాల్ని ప్రవేశపెడుతోంది. ఇలాంటి ప్రయత్నాల మీద అపోహల్ని తొలగించడానికి ఈ విధాన పత్రం మాతృభాషా పునాదిపైనా, సహకారంతోనే రెండో భాషను శక్తివంతంగా నేర్చుకోగలరని వివరణ నిచ్చింది. కేంద్రమే ద్విభాషా పాఠ్య గ్రంథాల్ని రూపొందిస్తుందని హామీనిచ్చింది. 
మాతృభాషలో నాణ్యమైన పాఠ్యగ్రంథాలు
మాతృభాషా మాధ్యమ బోధనలోని పెద్ద సమస్య ప్రామాణికమైన, నాణ్యమైన పాఠ్య గ్రంథాలు లేకపోవడం. అదనపు పుస్తకాలు లభించకపోవడం. ప్రస్తుతం సీబీఎస్‌ఈ తన పాఠ్యగ్రంథాల్ని ఎంతో పరిశోధన అనంతరం రూపొందిస్తోంది. చాలా ఆహ్లాద కరంగా, శాస్త్రీయంగా అవి ఉంటున్నాయి. ఆ స్థాయి వాచకాలు మాతృభాషల్లో లభించడం లేదు. ఈ కొరత తీర్చడానికి ఎస్‌ఈఆర్టీల శక్తి చాలడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర విద్యాపరిశోధనా సంస్థలు సమన్వయంతో ప్రాంతీయ భాషల్లో ప్రామాణిక పాఠ్యగ్రంథాల్ని రూపొందించాలని ఈ పత్రం పేర్కొంది. ఆ బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని కూడా ప్రకటించింది. ఈ ప్రయత్నం సఫలమైతే మన పిల్లలు చాలా లాభపడ తారు. మాతృభాషా విద్య నాసిరకమైందన్న విమర్శకుల నోళ్లకు తాళం పడుతుంది.
      నూతన విద్యావిధానం మాతృభాషను అందలమెక్కిస్తూనే దాని బోధనా విధా నాల్నీ లోతుగా చర్చించింది. ఏ భాషను నేర్చుకోవడంలోనైనా ధారాళంగా అందులో మాట్లాడటం మొదటిమెట్టు. అవగాహనతో చదవడం రెండోమెట్టు. చదివిన దాన్ని, తెలుసుకున్న దాన్ని విశ్లేషించడం, తర్కించ డం, నూతన కల్పనలు చెయ్యడం అసలు మెట్టు. రాయడం ఆ తర్వాత. భాషలో పట్టు లేకుండా విద్యార్థి ఇతర అంశాలను కూడా అవగాహన చేసుకోలేడు. విశ్లేషించు కోలేడు. ఇవి చేయలేని నాడు నూతనావి ష్కరణలు అసాధ్యం. ఇలా చూసినప్పుడు ఒక్క ప్రాథమిక విద్యాదశలోనే కాదు, అన్ని దశల్లోనూ భాషాపటుత్వం కీలకంగా మారుతుంది. ‘నేర్చుకోవడమెలాగో నేర్ప డమే బోధనా సారాంశం’ అని నూతన విద్యావిధానం కుండబద్దలు కొట్టి చెబుతోంది. అన్నీ ఉపాధ్యాయులు చెప్పడం నేర్పడం గాదు విద్యార్థి తనకు తానుగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోగల సామ ర్థ్యాల్ని అతనికి ఇవ్వాలి. ఆ సామర్థ్యాల్లో అన్నిటి కంటే కీలకమైంది భాష మీద పట్టు! కానీ ఏళ్ల తరబడి భాష నేర్చుకుం టున్నా మన పిల్లలకిది ఒంటబట్టడం లేదని ఈ పత్రం సరిగానే పసిగట్టింది. దీనికి కారణం బోధనలో శాస్త్రీయత, ఆధు నిక పద్ధతులు లేకపోవడమనీ గుర్తించింది.
      పిల్లల సాహిత్యాన్ని విరివిగా అందు బాటులో ఉంచడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, మాతృభాషల్లోని అద్భుత కథల్ని, గేయాల్ని, సామెతల్ని పరిచయం చేయడం.. అన్నిటి కంటే ముఖ్యంగా పిల్లలతో మాట్లాడిం చడం, చదివించడం మీద దృష్టి కేంద్రీకరించడం తదితరాలు భాషాబోధనలో పాటించాల్సిన పద్ధతులని; భట్టీలుపట్టి వల్లించడం, పరీక్షల్లో కుమ్మరించడం అంతరించాలని- దీనికి తగ్గట్టు పరీక్షలు కూడా మారాలని ఈ పత్రం చెబుతోంది. 
      ఇక భాషా ఉపాధ్యాయుల సంగతి. చాలా ప్రాంతాల్లో మాతృభాషల్ని బోధించే అర్హతగల ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా ప్రాచ్య కళాశాలల్లో నాలుగేళ్లు భాషాధ్యయనం చేసిన వాళ్లు గతంలో భాషాపండితులయ్యేవారు. ఇప్పుడు ఏదో ఒక డిగ్రీ పుచ్చుకుని ఏ ఉద్యోగం రాకనో, పదన్నోతి కోసమో భాషను ఒక సబ్జెక్టుగా అదనంగా ప్రైవేటుగా చదివేసి భాషోపాధ్యాయులై పోవడం రివాజుగా మారింది. దీనికి భిన్నంగా శిక్షణతో సహా మిళితమైన నాలుగేళ్ల డిగ్రీ ఉపాధ్యాయు లకు కనీస అర్హతగా ఉండితీరాలని కూడా నూతన విద్యావిధానం చెబుతుంది. 
కేంద్రం పూచీ
ఇవన్నీ చదివాక రెండు ప్రశ్నలు ఎవరికైనా తలెత్తుతాయి. ఒకటి ఇదంతా ఎప్పుడూ చెబుతోందే కదా అని. మొదటిసారిగా మాతృభాషా బోధనలోని అన్ని అంశాలను లోతుగా ‘జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం- 2005’ ప్రస్తావించినమాట వాస్తవం. కానీ అది విధానపత్రం గాదు. బోధనాభ్యసన పద్ధతుల మార్గదర్శక పత్రం. దానికి మంత్రివర్గ ఆమోదాలూ, చట్టబద్ధతలూ లేవు. కొఠారీ కమిషన్‌ కూడా మాతృభాషా మాధ్యమాన్ని నొక్కి చెప్పినా ఇంత వివరణలోకి పోలేదు.
      రెండో ప్రశ్న.. ‘మాటలు చెప్పడం తప్ప అమల్లోకి తేవడం మనకు అలవాటు లేని పనిగదా’ అనేది. ఇది నూటికి నూరు పాళ్లూ నిజం. రాష్ట్రాలకు శక్తి లేకున్నా, అవి మొండికేసినా ఇవన్నీ అమలుకాని మాట వాస్తవం. కానీ కేంద్రం మొదట రాష్ట్రాలకు బాసటగా నిలబడాలి. స్పష్టమైన విధానాల్ని అందించాలి. సామగ్రిని చేకూర్చాలి. రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థలకు వనరుల్ని సమకూర్చాలి. విద్యా పరిశోధనల్లో, పాఠ్య గ్రంథాల రూపకల్పనలో, ఉపాధ్యాయ శిక్షణల్లో వాటిని జాతీయ విద్యాపరిశోధనా సంస్థలతో సమన్వయం చేయాలి. ఇది బలంగా జరిగినప్పుడు అనుకున్న మార్పు సాధ్యమవుతుంది. దీనికి కేంద్రం ఈ విధాన పత్రం ద్వారా పూచీపడుతోంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం