రమణీయం... సుభద్రా పరిణయం

  • 1078 Views
  • 1Likes
  • Like
  • Article Share

ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టిన ఘనత స్త్రీలదే. నిరంతర స్రవంతిగా సాగిపోయే మానవ జీవనంలో అనూచానంగా వచ్చే అనేక వంశాచార వ్యవహారాలను త్రికరణశుద్ధిగా పాటించే బాధ్యతను కూడా ఇంటి ఇల్లాలే తన భుజానికి ఎత్తుకుంటుంది. ఇలాంటి ఒక ఒరవడిలోనే పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల అర్ధాంగి తాళ్లపాక తిమ్మక్క ముదితలు ముచ్చటగా పాల్గొని మురిసే పెండ్లి, పేరంటాలను కథావస్తువుగా తీసుకొని మంజరీద్విపదలో ‘సుభద్రాపరిణయం’ కావ్యాన్ని తీర్చిదిద్దింది.
తిమ్మక్క నన్నయ భారతంలోని కథాంశాన్నే స్వీకరించినప్పటికీ, మూలకథకు ముద్దారగా తెలుగు సొగసులను అద్దింది. ఆనాటి మగువలు పనిపాటలు చేసుకుంటూ ఆహ్లాదంగా పాడుకోదగిన రెండుపదాల పాటగా రూపొందించింది. తెలుగు పదాలు, నుడికారాలు, తెలుగువారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వంటకాలు, ఆభరణాల వర్ణనలతో కూడుకొని, చక్కని ఒదుగుతో, ఒయ్యారాల నడకతో, కలకల స్వనాలతో మనోహరంగా సాగిపోయే సెలయేటి పాటగా ఈ కావ్యాన్ని మలచింది తిమ్మక్క.
      1933లో చింతా దీక్షితులు ‘వ్యాససంగ్రహము’లో తిమ్మక్క రచనను గురించి మొదటిసారి కొంత ప్రస్తావించారు. 1950లో కాళహస్తి సంస్థాన గ్రంథాలయంలోని అపూర్వ తాళపత్ర గ్రంథాల నుంచి తిమ్మక్క ‘సుభద్రాపరిణయం’ కావ్యాన్ని వెలికితీశారు వేటూరి ప్రభాకరశాస్త్రి. తిరుపతి ప్రాచ్య పరిశోధనాలయం పక్షాన దాన్ని పరిష్కరించి, ప్రచురించి, తెలుగుతల్లి సిగన మరొక కీర్తికిరీటాన్ని సింగారించారు.
       సంకీర్తనాచార్యుడిగా అప్పటికే వినుతికెక్కిన అన్నమాచార్యులవారికి తిమ్మక్కనిచ్చి వివాహం చేయడానికి తిమ్మక్క తల్లిదండ్రులు ‘‘ఆచారముల దాసరయ్యను జూచి, చూచి యేగతి బడుచుల నిచ్చుననుచు’’ తటపటాయించారని అన్నమాచార్య చరిత్రం చెబుతోంది. తర్వాత అన్నమయ్య భార్యగానే కాదు,  సంగీత సాహిత్య పరిపుష్టురాలిగానూ తిమ్మక్క గణుతికెక్కిందనడానికి ఆమె రచించిన ‘సుభద్రా పరిణయమే’ నిదర్శనం. పంచపాండవులతో ద్రుపదాత్మజ వివాహం, నారదుడు వచ్చి పాండవులందరితోనూ ఒక్కొక్క సంవత్సరం పాటు ఆమె భార్యగా ఉండే సమయాన్ని నిర్దేశించటం, సమయభంగానికి పాల్పడిన వారికి ఒక ఏడాది భూప్రదక్షిణ శిక్ష, సవ్యసాచి వ్రతభంగం చేయడం మొదలైన భారత కథాంశాలనే తిమ్మక్క ఈ కావ్యంలో క్లుప్తంగా ప్రస్తావించింది.
కోరిక కొనసాగె కొమరాల నీకు
సావాసగత్తెలతో బొమ్మల పెళ్లిళ్లు లాంటి  ఆటలు ఆడుకునే ముగ్ధ సుభద్ర. శ్రీకృష్ణుడి ముద్దుచెల్లెలైన ఆమెను పాండవ మధ్యముడు భార్యగా పొందగోరుతాడు. సుభద్రార్జునుల పెళ్లికి సుముఖుడైన శ్రీకృష్ణుడు అర్జునుడితో కపటయతి వేషం వేయించి, చాతుర్మాసవ్రత దీక్ష నెపంతో రైవతాద్రికి రప్పిస్తాడు. నమ్మిన బలభద్రుడు యతి పరిచర్యలకు సుభద్రను నియోగించడానికి అనుమతిస్తాడు. 
      మొదట్లో తనతో కందువమాటలాడిన కపటయోగిని చూసి, ‘‘ఎక్కడియతి వరుండితడు?.. ఓయన్న!.. చూడ సంయమిగాని చూఱకాడితడు.. ఆడెడి మాటలిట్లని పల్కరాదు.. సరసమాడగవచ్చు సారె నాతోను..’’ అంటూ అన్నకు ఫిర్యాదు చేస్తుంది సుభద్ర. తర్వాత అతను అర్జునుడని విశదమవుతుంది. పెళ్లి నిశ్చయమవుతుంది. వివాహ వేళ, అయినింటి ఆడపడుచును అత్తవారింటికి సాగనంపే సందర్భంలో, రుక్మిణి ఆడపడుచుతో ‘కోరిక కొనసాగె కొమరాల నీకు’ అని మేలమాడుతుంది. ‘‘మేనత్తే నీకు అత్త అవుతుంటే భయమెందుక’’ని ధైర్యం చెబుతుంది. ‘‘చనువిచ్చినాడని సకియరొ! నీవు పలుమాటలకు నెట్లు పాలుపడవద్దం’’టూ సుద్దులు చెప్పే క్రమంలో.. ‘‘పొలతి నమ్మగరాదు పురుషులనెపుడు/ పలురీతి కృష్ణసర్పములై యుండ్రు’’ అంటూ పురుషుల పట్ల అప్రమత్తంగా ఉండమని సుభద్రను హెచ్చరిస్తుంది. అన్నమాచార్యుడి అనుంగు సతి తిమ్మక్క ఇంతమాట అనడం నిజంగా ఆశ్చర్యమే! ఆ సంగతి అలా ఉంచితే... ‘‘కొంచక కృష్ణతో కూరిమితో నుండ’’మంటూ ద్రౌపదితో సన్నిహితంగా మెలగమని బోధిస్తుంది రుక్మిణి.
ఎన్నెన్ని సొమ్ములో!
సుభద్రార్జునుల వివాహం భారత కథను అనుసరించి, ద్వారకలో జరిగినప్పటికీ, వివాహం తర్వాత ద్రౌపది ప్రసక్తి కనిపించదు. కానీ, తిమ్మక్క తన కావ్యంలో సుభద్రార్జునుల శోభన సన్నాహపు పెత్తనం, పేరంటం ద్రౌపది జరిపించినట్లు వర్ణించింది. సవతి సుభద్రను ‘‘విజయుని పాన్పున వేడ్కతో నుంచి’’ ఇవతలకు వచ్చి తలుపులు మూసిన ద్రౌపది, ‘‘ఏమి వస్తువులైన నీయవచ్చుగాని, ప్రాణేశునిచ్చి మఱి బ్రతుకంగరాద’’ని వాపోతుంది. అంతలో తేరుకుని, ‘‘అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని చెల్లెలు కనుకనే నొల్లననరాద’’ని సర్దిచెప్పుకొని పెద్దరికాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఘట్టంలో అన్నమాచార్యుని పెద్దభార్య తిమ్మక్క మనసు పాఠకులకు అవగతమవుతుంది. 
      శోభనపు సన్నాహాల బాధ్యతను నిర్వహించిన పాంచాలి ‘‘పంకించి బాగాలు బరిణలంబోసి, గాలించి సున్నము కాయ బెట్టించె, పండుటాకులు దెచ్చి పణతి మడిపించె’’నని అనేకమంది తెలుగు కవుల వరుసలోనే కర్పూర తాంబూల ప్రసక్తి చేస్తుంది తిమ్మక్క. యతికి శుశ్రూష చేసే సమయం, శోభనకార్య సందర్భాల్లో ఆభరణాల వర్ణనను విరివిగా చేసింది కవయిత్రి. పసిడి, ముత్యాల తాటంకాలు, చెంపముత్యాల సరాలు, పుంజాల దండలు, భన్నసరాలు, ఒడ్డాణం, బిళ్లల మొలతాళ్లు, కంఠహారాలు, కౌస్తుభమణులు, కాలి అందెలు, సందిదండలు, పంజులకమ్మల లాంటి సకలాభరణ భూషిత అయిన సుభద్ర, ‘‘మూడువేలుంజేయు ముక్కెఱ పెట్టెన’’ని ప్రత్యేకంగా చెబుతుంది తిమ్మక్క. ‘‘తిమ్మక్క నాటి ఆంధ్రస్త్రీలు ఎక్కువగా అభిమానించిన ఆభరణ విశేషములలో ముక్కెఱ ఒకటి కావలయున’’ని ‘ఆంధ్ర విదుషీమణులు’లో అభిప్రాయపడ్డారు ఆండ్ర శేషగిరిరావు.
భలే విందులు
ఆనాటి శిరోజాలంకరణ వైభవాన్ని వివరిస్తూ, సుభద్ర ‘‘పాపట నొసవరి బాగుగా దీర్చి, చూపట్టు కొప్పు నించుక జారముడిచి’’ందంటుంది కవయిత్రి. ఇక రుక్మిణికి ‘‘కొమరార కొప్పులో గొజ్జంగి దండ నటనతో వీపున నాట్యమాడింద’’ంటుంది. జారుకొప్పుల, పూవులదండల, కదలికలనే కాకుండా, ‘‘ఝణ ఝణత్కారముల్‌ సలుప సొమ్ములును/ సుందరి పాదాల యందియల మ్రోత/ బిళ్లల మొలనూళ్లు బిగిసి మ్రోయగను/ ఘంటల మొలనూళ్లు ఘల్లున మొరయ/ గరిమతో రాచిల్క కంకణమ్మునను’’ ఝణ ఝణ సవ్వడి చేసినట్లు వర్ణిస్తుంది తిమ్మక్క. ఈ వర్ణనా వైదుష్యంలోని నిక్వాణం పాఠకుల గుండెల్లో గలగలమంటుంది.
      ఇక తెలుగింటి ఇల్లాలి కావ్యంలో పిండివంటల ఘుమఘుమలకు లోటుంటుందా! సుభద్రార్జునుల శోభన సన్నాహానికి... ‘‘చాఱపప్పు గసగసలానవాలు/ శ్రీ సుగంధములు చిటిబెల్లములును/ చెఱుకుబిళ్లలు మంచి చిఱుదిండి సరకు’’ తోనే ఆగకుండా... ‘‘పప్పు, బూరెలు, నెయ్యి పాయసాన్నములు/ కాయగూరలు పెక్కు కలవంటకాలు/ ఊరుగాయలు నెయ్యి బొబ్బట్లు వడలు/ గారెలు బూరెలు కండమండిగెలు/ అరటిపండులును రాజాన్నరాసులును/ పిండికూరలు, మొదల్‌ పెద్దకుడుములును/ గరిగల ఘటముల గంపల’’కెత్తారట.
అచ్చతెలుగు పండువెన్నెల
ఈ కావ్యంలో ‘తొలకరి మెరుపు, పండువెన్నెల, అమృతపుతెప్ప, అరవిరిమొగ్గ, బాగాల భరణి’ లాంటి తేటతెలుగు మాటలు, ‘తెరలి ఏనుగునెక్కి దిడ్డి దూరుదురె, గరిమ వేసాలెల్ల గ్రాసాల కొరకె’ లాంటి సామెతలు ఎక్కువగా కనపడతాయి. ‘తోతొక్కులాడుచు ద్రోవ కిక్కిరిసె, కనుచూపినంతలో కాంక్షించదగున?, కార్యానికోసమే కడు చిక్కువడెను, మన్మథుని కన్నట్టి మరువపుమొలక, ఉమ్మెత్తపువ్వు వంటి ఉతికిన మడత’ లాంటి శ్రవణ సుభగమైన తెలుగు పదాల కూర్పునూ విరివిగా సంతరించింది తిమ్మక్క.
      ‘‘స్త్రీల రచనలను పురుషకవులు అనుసరించిన నిదర్శనములు ఆంధ్రసారస్వతమున బహుళముగానే ఉన్నవం’’టారు ఆండ్ర శేషగిరిరావు. కథానాయకుడైన విజయుణ్ని వర్ణిస్తూ తిమ్మక్క రాసిన పద్యాన్ని కొద్దిపాటి మార్పులతో చేమకూర వేంకటకవి తన ‘విజయవిలాసం’లో వినియోగించుకోవడమే దీనికి నిదర్శనం. ‘‘ఎగుభుజమ్ములవాడు మృగరాజు నడుము/ నడచి పుచ్చుకొనునెన్నడుము గలవాడు/ గరగరనివాడు చక్కనివాడునతడు/ గొప్ప కన్నులవాడు కోదండగుణ కి/ ణాంకంబులే బాహులమరినవాడు...’’ అన్న ‘సుభద్రా పరిణయం’ పద్యమే ‘‘ఎగుభుజంబులవాడు, మృగరాజమధ్యంబు బుడికి పుచ్చుకొను నెన్నడుము వాడు’’గా ‘విజయవిలాసం’లో కనిపిస్తుంది. అందుకే, ‘‘తిమ్మక్క ముద్దు లొలుకు రచనకు, కథాసంవిధానమునకు విజయవిలాస కర్త ముగ్ధుడైయుండును. తిమ్మక్క యెడ భక్తితో ఈ రచనలోని పలుకుబళ్లను కాక పాదములకు పాదములనే తనవిగా చేసుకొనెను’’ అన్నారు తిరుమల రామచంద్ర.
      ‘‘సంగీతము సాహిత్యము/ శృంగారము చక్కదనము శీలముగల పు/ ణ్యాంగనకుంబ్రియుడగు కవి/ పుంగవుడరయంగ నెంత పుణ్యాత్మకుడో’’ అంటూ అన్నమాచార్యుడి అదృష్టాన్ని కొనియాడారు వేటూరి ప్రభాకరశాస్త్రి. ‘‘సుభద్ర సౌశీల్యమునకు కవయిత్రి తిమ్మక్క మించుదనమునాపాదించినది’’ అన్నది ఉభయభాషాప్రవీణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మాట. ‘‘తిమ్మక్క కావ్యం రూపంలో చిన్నదైనా రసంలో అది ఎంతో గొప్పది. శబ్దం, అర్థం, భావం మూడింటిలోనూ గంభీరమై చిక్కదనం గలిగిన ఆ మహిళామణి రసిక హృదయం కావ్యంలో ప్రతిఫలించింద’’ని ప్రశంసించారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ. ఇంతటి కావ్యాన్ని తెలుగు భాష యశోకిరీటంగా తీర్చిదిద్దిన తాళ్లపాక తిమ్మక్క... తెలుగు సాహితీప్రియులకు ప్రాతఃస్మరణీయురాలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం