అతిమధురం అన్నమయ్య పదం

  • 42 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। కె.అరుణావ్యాస్‌

  • హైదరాబాదు.
  • 4023237766
డా।। కె.అరుణావ్యాస్‌

కోనేటిరాయణ్నే కొలుస్తూ... ఆయన ఊసులనే తన ఊపిరిగా మార్చుకుని బతికిన పరమభక్త శిఖామణి అన్నమయ్య. ఏడుకొండల వాడి పాదాలను పదాలతో అర్చించి తరించిన తాళ్లపాక ముద్దుబిడ్డ ఆయన. తెలుగు తీయదనాన్ని తన తలపులకు అద్ది అందమైన సంకీర్తనలను వెలయించిన వాగ్గేయకారుడు. పదప్రయోగం నుంచి భావప్రకటన వరకూ ఈ పదకవితా పితామహుణ్ని అనుసరించిన సాహితీమూర్తులెందరో.
అన్నమయ్య
పదాల్లో రాయలసీమ పలుకుబళ్లు తళుక్కుమంటాయి. తెలుగింటి ఆచారాలు, నమ్మకాలు దర్శనమిస్తాయి. ఆనాటి సమాజ స్థితిగతులు ద్యోతకమవుతాయి. ‘కృతి’, ‘కీర్తన’ అని మనం పిలుచుకునే సంగీత రచనలని అన్నమయ్య కాలంలో ‘సంకీర్తన’, ‘పదము’ అనేవారు. భరతముని నుంచి ఎందరో సంగీత లక్షణకారులు నిర్వచించిన ప్రబంధాలలో ‘పదము’ ఒకటి. తన అసమాన ప్రతిభతో దీని అనంతమైన రూపాలను ఆవిష్కరించాడు అన్నమయ్య. వాణిని తన రాణిని చేసుకుని... తన పదాలలో ఆమెను స్వేచ్ఛగా, సహజంగా విహరింపజేశాడు. అందుకే ఆయన రచనల్లో ఆనాటి ప్రజల అలవాట్లు, ఆటపాటలు, సామాజిక, ఆర్థిక, ధార్మిక పరిస్థితులు కళ్లకు కడతాయి. ఉదాహరణకు అన్నమాచార్యుడి చిన్నికృష్ణుడు బిల్లగొట్లాట, సముద్రబల్లలాట, వుడ్డగచ్చకాయలు ఆడతాడు. రాయలసీమ ప్రాంతంలో ‘వుడ్డ’ అంటే గుంపు, సముదాయము, సమూహము. అలాగే, ‘చిట్టిబొట్లనోము’, ‘గౌరినోము’, ‘ముచ్చింతనోము’, ‘మొలకలనోము’, ‘గొంతిదామరనోము’లను జరుపుకునే ఆడవాళ్లూ అన్నమయ్య సంకీర్తనల్లో సాక్షాత్కరిస్తారు. ధనవంతులైన స్త్రీలు ‘పసిడి మట్టెలు’ పెట్టుకుంటే సామాన్య మహిళలు ‘కంచుమట్టియలు’, ‘కంచుటుంగరములు’, ‘వెండి కుప్పెలు’ ధరించేవారన్న విషయాన్నీ విదితం చేస్తాడు అన్నమయ్య. అంతేకాదు, ఆనాటి స్త్రీలు పునుగు, జవ్వాది వంటి సుగంధ ద్రవ్యాలను విరివిగా వాడేవారనడానికి అక్షర సాక్ష్యాలను అందిస్తాడు. పక్షులు పారాడే వేళ చంటిపిల్లలను బయటకు తీసుకుని రాకూడదు, పాములు తిరిగే పొద్దు పసిపిల్లలను బయటకు పంపకూడదనే తన సమకాలీనుల నమ్మకాలనూ తన రచనల్లో గుదిగుచ్చాడు. మొత్తమ్మీద ‘సామాజిక స్పృహ’తో వెలకట్టలేని సంకీర్తనలను వెలయించి భావితరాలకు మార్గదర్శిగా నిలిచాడు.
      వేటూరి ప్రభాకరశాస్త్రి పరిశోధ]నలో నిగ్గుతేలిన అన్నమయ్య పదకవితా సంపద అపారం. అవి జాజరలు (చర్చరి అని కూడా అంటారు), చందమామలు, కోయిల, చిలుక, తుమ్మెద పదాలు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, జోల, జోజో, జయజయ, విజయీభవ, శోభన, మంగళం, వైభోగము, మేల్కొలుపులు, నలుగులు, దంపుళ్లు, కొట్నాలు, నూగులూ, గుజ్జెనగూళ్లు, చందమామ గుటకలు, నివాళులు, మంగళారతులు, జయమంగళాలు, అల్లోనేరేళ్లు, చాంగుబళాలు, బళాబళాలు, సానముఖాలు, అవధానములు, తందానలు, వెన్నెలలు, చిత్తమా, మనసా, బుద్ధి సంబోధనలతో తత్త్వగేయాలు - ఓహ్‌! ఆకాశమే హద్దు మరి!
      అన్నమాచార్యులు అనేక సంవాద గీతాలని రచించాడు. వాటితో తెలుగు నాటక, చలనచిత్ర కవులకు మార్గం సుగమం చేశాడు. గోపీ కృష్ణులకీ, యశోదా గోపెమ్మలకూ, చెంచితా నరహరులకు మధ్య సంవాదాలు నడిపించాడు. బావామరదళ్ల పరాచికాలు, అత్తాకోడళ్ల (లక్ష్మీ సరస్వతుల) దెప్పుళ్లూ, సవతుల మాత్సర్యాలనూ మనోజ్ఞంగా అక్షరీకరించాడు. అన్నమయ్య తన కాలంలో తిరుపతిలోనూ, అహోబిలంలోనూ ఉన్న చెంచులూ, ఇతర ఆటవికుల ఆటపాటలను గమనించి ఆ పద్ధతిలోనే ఈ సంవాదాలు రచించాడన్నది బాలాంత్రపు రజనీకాంతరావు అభిప్రాయం. ఈ సంవాదాలను స్వామి ముందు నటీనటులతో అభినయింపజేసి ఉంటాడన్నది కూడా ఆయన మాటే. సంవాదాలన్నింటిలోకెల్లా గోపీకృష్ణుల వాదులాటను మన కళ్ల ముందు కదిలే దృశ్యకావ్యంలా తీర్చిదిద్దాడు అన్నమయ్య. ‘యాలే యాలే యాలే, గొల్లెతా’ పదంలో ‘యాలే యాలే’ అనే ప్రయోగం చాలామంది జానపద, సినీకవులకు స్ఫూర్తినిచ్చింది.
ఆ పదాలన్నీ అద్భుతాలే 
జానపద శైలిలో అనురాగాన్ని వ్యక్తీకరించే పదం జాజర. గోపిక విరహం, ప్రణయ కలహం, అలకలకు ఇది అక్షరరూపం. వీటిలో ‘చాలు చాలునీ జాజర - జాలిపరిచెనీ జాజర’ ప్రఖ్యాతం. ఇక గొబ్బిళ్లపాట సంక్రాంతి ప్రత్యేకం. ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి, ముగ్గుల్లో ఉంచి... వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాడే పాట ఇది. ‘కొలనిదోపరికి గొబ్బిళ్లో’ అనే పదంలో ‘కొండ గొడుగుగా గోవుల గాచిన - కొండొక శిశువుకు గొబ్బిళ్లో’ అంటాడు అన్నమయ్య. ఇక్కడ ‘కొండగొడుగు’ అద్భుత పదచిత్రం. బమ్మెర పోతన ‘నాకేలల్లాడదు’ను తలపింపజేస్తుంది. (పోతన పద్యానికి పూర్తి వ్యాఖ్యానం ఆగస్టు, 2013 ‘తెలుగు వెలుగు’ సంచికలో ‘కొండంత అండ’లో చూడవచ్చు) సువ్వి పాటలు దంపుళ్ల పాటలు. అమ్మాయిలు దంపుళ్లు దంచుతూ అలుపు తీరడానికి ఒక ఊత పదం వాడతారు. దాన్నే అన్నమయ్య ‘సువ్వి’ అన్నాడు. కన్నెలు విరిసీవిరియని యవ్వనంలో ఉన్నారు. వాళ్ల కళ్లనిండా పంచవన్నెల కలలే! గోపికల నయనాల నిండా కృష్ణుడి రూపమే! ‘కనుచూపులను రోకండ్లని - కన్నెలు దంచెదరోలాల’ అన్న అన్నమయ్య మాట సొగసైన భావచిత్రం. ‘సువ్వి సువ్వి సువ్వి సువ్వని - సుదతులు దంచెదరోలాల’ అనే సువ్విపాట అనేక సినీ గీతాలకు తేనె ఊట! 
      చాంగుబళా పాటల్లో ‘చాంగుబళా’ అంటే ‘బాగుబాగు’ అని అర్థం చెప్పారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమయ్య అమ్మవారి గురించి రాస్తూ ‘చక్కని తల్లికి చాంగుబళా - తన చక్కెరమోవికి చాంగుబళా’ అంటాడు. ‘అధ]రామృతా’నికి  తేటతెనిగింపే ఈ ‘చక్కెరమోవి’. ‘చాంగురే బంగారురాజా’ అనే సినారె కమ్మని సినీ గీతానికి ఈ చాంగుబళానే స్ఫూర్తేమో!
మేల్కొలుపు పదంలో ‘విన్నపాలు వినవలె వింతవింతలూ - పన్నగపు దోమతెర పైకెత్తలేవయ్య’ అంటాడు అన్నమయ్య. పన్నగం శేషసాయికి శయ్యలానే కాదు దోమతెరగా కూడా పనికొస్తుందన్న మాట. క్షీరాబ్ధి శయనుడికీ దోమల బెడద తప్పలేదా! ఔరా! 
‘తందనానా’ పదంలో భగవద్గీత సారాన్ని వడకట్టి పోశాడు పదకవితా పితామహుడు. గంభీర భావాన్ని వ్యావహారిక శైలిలో హృద్యంగా ఆవిష్కరించాడు.
కందువగు హీనాధికము లిందులేవు 
- అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమింతానొకటే 
- అందరికి శ్రీహరే అంతరాత్మ

      వేదాంతాన్ని జాన‘పదం‘లో రంగరించిపోశాడు అన్నమయ్య.
ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక
బొందితోడి జీవులకు బుద్ధులేటి బుద్ధులు
రేయెల్ల మింగిమింగి రేపే వెళ్లనుమిము
బాయట నిద్రాదేవి పలుమారును

      ప్రాచీన తెలుగులో ‘రేపు’ అంటే సూర్యోదయం, సూర్యుడి వెలుగు. ఆత్రేయ చక్కటి రచన ‘రేపంటి వెలుగే కంటి’లోని రేపునకూ ఇదే అర్థం. నిద్రాదేవి చాలాసార్లు రాత్రిని మింగేసి సూర్యుడి వెలుగును బయటకు ఉమ్మిందంటున్నాడు అన్నమయ్య. (వెళ్లగక్కు, వెళ్లనుమిము అంటే వెలుపలికి ఉమ్మడం) ఎంత చక్కటి భావన! ‘యెన్నెలంతా మేసి - యేరునెెమరేసింది’ అన్న నండూరి సుబ్బారావు గుర్తొస్తున్నారు కదూ!
      పదకవితా పితామహుడి ఉయ్యాల, లాలి, చందమామ పాటలు ఇప్పటికీ ప్రతి తెలుగింటా మారుమోగుతూనే ఉన్నాయి. తెలుగు తల్లుల నోళ్లలో నానుతూ వారి కళ్లలో వెలుగులు నింపుతూనే ఉన్నాయి. అలాగే మంగళం, జయజయ, శోభన పాటలు అనేకం మంగళహారతులకు, స్వస్తులకీ మార్గసూచీలయ్యాయి. ఎన్నో పదాలను అందంగా, నవరసస్యందంగా రచించి తెలుగు వారికి కానుకలుగా అందించిన అన్నమాచార్యుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన అందించిన పద సముద్రాన్ని నూతన పదసృష్టికి వినియోగించుకోవడంలో మనదే ఆలస్యం!


వెనక్కి ...

మీ అభిప్రాయం