పలుకే పద్య మాయెరా!

  • 30 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మాశర్మ

  • (రచయిత కొప్పరపు కవుల మనుమడు, పాత్రికేయుడు)
  • విశాఖపట్నం.
  • 9393102305
మాశర్మ

గద్వాల నుంచి చెన్నపట్టణం వరకూ కవితా జైత్రయాత్ర చేసి ‘తెలుగువాడ’ంటే ఏంటో లోకానికి చూపించారు... కొన్ని వేల అష్ట, శతావధానాలతో ఎక్కడికక్కడ తెలుగు పద్యానికి గండపెండేరాలు తొడిగించారు... అనితరసాధ్యమైన వేగంతో అద్వితీయమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ తెలుగుతల్లి నుదుటి తిలకాలై మెరిశారు... వారే కొప్పరపు కవులు. 
అమ్మభాషలోని
అందచందాలన్నింటినీ ఏర్చికూర్చుతూ ఆశువుగా పద్యాలను అల్లడంలో కొప్పరపు కవులు నేర్పరులు. అదీ గంటకు అయిదు వందల పద్యాల చొప్పున వారు అల్లుతుంటే వినేవారికి వీనులవిందు. రాసేవారికి చేతులనొప్పి. టేపు రికార్డర్లు వంటివి అందుబాటులో లేని రోజుల్లో వారు చెప్పిన లక్షలాది పద్యాలు కాలగర్భంలో కలిసిపోయాయంటే కారణమిదే. కానీ, సమకాలీన పండితుల వ్యాఖ్యలతో, అక్కడక్కడా నమోదైన పద్యాలతో ఆ సోదర కవుల కవన విశేషాలు వెలుగులద్దుకున్నాయి. 
      సాధారణంగా శతావధానం చేయడానికి కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. అదీ నికార్సైన అవధానులకే సాధ్యమవుతుంది. అలాంటిది కొప్పరపు కవులు ఒక్కరోజులోనే రెండేసి శతావధానాలు చేసేవారంటే వారి ప్రతిభను ఏ గీటురాళ్లతో తూచగలం! వాళ్లెంత వేగంగానైనా అవధానాలు చేసి ఉండొచ్చు కానీ... ఆశువుగా చెప్పిన పద్యాల్లో కవిత్వాంశ ఉండదనే వారి అనుమానాలను పటాపంచాలు చేసే పద్యశిల్పం కొప్పరపు కవుల సొత్తు. కావాలంటే ఓ అవధానంలో ‘చీపురుకట్ట’పై వారు చెప్పిన పద్యాన్ని చూడండి
మలినంబుఁ బాపి నిర్మలతఁ జూపుటఁ జేసి
యల్ల గంగాదేవి యనఁగ వచ్చు
నఖిలప్రదేశంబు లందుఁ దోఁచుటఁజేసి
యల పరమాత్మయే యనఁగవచ్చు
నిత్యాభిషేకమ్ము నెమ్మిఁగాంచుటఁ జేసి
యల జలస్థితి లింగమనఁగ వచ్చు
స్త్రీకరగ్రహణంబుఁ జెలిమినందుటఁజేసి
యల పురుషోత్తముఁడనఁగ వచ్చు
ననుచు నెట్లెట్లో పొగడఁగా నయ్యెఁగాదె  యదియు సింగారపుంగట్టయనుటఁజేసి
కాక నద్దాని జీఁపురుఁగట్ట యనిన
నింతగా వర్ణనము సేయనెవఁడుదలఁచు?

      ఒక సాధారణమైన వస్తువు సహజ లక్షణాలను వివరిస్తూ, వాటికి సర్వోత్కృష్టమైన అంశాలతో సాపత్యం చూపిస్తూ ఈ పద్యరచన చేశారు. ఇంట్లోని మలినాన్ని పోగొట్టే చీపురును గంగాదేవితో పోల్చారు. మారుమూలల్లోనూ విహరిస్తుంది కాబట్టి పరమాత్మతో సమానమన్నారు. ఊడ్చిన తరువాత చీపురును నీళ్లతో కడుగుతాం కదా.. అందుకే, దాన్ని నీటిలో ఉన్న శివలింగంగా అభివర్ణించారు. ఎప్పుడూ మగువల ‘చేతి’లోనే ఉంటుంది కాబట్టి పురుషోత్తముడిగా చెప్పుకొచ్చారు. కవితా సౌందర్యాన్ని, భావనా ఔన్నత్యాన్ని చక్కగా ప్రదర్శించారిక్కడ ఆ సోదర కవులు. 
గడియారానికి సైంధవ వధకూ సంబంధం ఏదైనా ఉందా? సమయంతో సంబంధం ఉంది కానీ, దాన్ని సూచించే గడియారంతో మాత్రం బీరకాయపీచంత కూడా లేదు. కానీ, ఆ రెండింటి మధ్య వారధి వేశారు కొప్పరపు కవులు!
గడియారం బుపయుక్త వస్తువుల నగ్రస్థానముంజెందు,న
య్యుడు చంద్రార్కుల గాన నీక జలదంబుగ్రంబుగాఁగ్రమ్మున
య్యెడ ఁగాలం బెఱిగించు, సైంధవుని నాడీయంత్రమే యున్నచో
గడుఁగష్టంబగుఁగాదె? గాండివి ప్రతిజ్ఞం దీర్పఁగా ఁజక్రికిన్‌

      గడియారంపై పద్యం చెప్పమని ఓ అవధానంలో ఎవరో అడిగితే సోదర ద్వయం అల్లిన అక్షరాలివి. నిద్ర లేచినదగ్గరి నుంచి గడియారాన్ని గమనిస్తూనే పనులు పూర్తి చేసుకుంటామంటూనే... ఆనాడు సైంధవుడి దగ్గర ఇది ఉండుంటే అర్జునుడి మాట నిలబెట్టడం నల్లనయ్యకు ఎంత ఇబ్బందయ్యేదోనని అంటున్నారు! నిత్యవ్యవహారంలోని వస్తువుకు, పౌరాణికాంశానికి ముడివేయడంలో సోదర కవుల సమయస్ఫూర్తి, చమత్కారం ద్యోతకమవుతున్నాయి. 
ఆ విషయంలోనూ అంతే!
‘సమస్య’లతో అందమైన ఆటలు ఆడుకునే లక్షణమున్నవారే అవధానులవుతారు. కొప్పరపు కవులకు అది సహజంగా అబ్బింది. అందుకే అవధానాల్లో పృచ్ఛకులు ఎంత జటిలమైన సమస్యలను ఇచ్చినా వారు అవలీలగా పూర్తి చేసేవారు. ‘గరుత్మంతుడు గణపతికి తండ్రి కావాలంటూ’ (గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ) వచ్చిన సమస్యను వారెంత లాఘవంగా పరిష్కరించారో గమనించండి... 
హరుడు గణపతికిఁబోలెన్‌
సరసీజాక్షుండు నాభి జన్మునకుఁబలెన్‌
గురుకీర్తిఁగనిన యల సా
గరుఁడుడుగణపతికిఁదండ్రి కావలె సుమ్మీ

      ‘సా’ అన్న ఒకే ఒక్క అక్షరం రావడంతో సమస్యంతా తీరిపోయింది. ఉడు గణాలంటే నక్షత్రాలు. వాటి పతి చంద్రుడు. ఆ చుక్కలరాజు తండ్రి సాగరుడు. అదే మాట చెబుతూ ‘సాగరుడు ఉడుగణపతికి తండ్రి’ అంటూ పూరణం చేశారు. 
      కోళ్ల గంపల్లో కాకులు, గుడ్లగూబలెక్కడైనా ఉంటాయా? ఉండి తీరాల్సిందేనంటూ (కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్‌) ఓ పృచ్ఛకుడు కొప్పరపు కవి ద్వయానికి ఓ సమస్య నిచ్చాడు. నామవాచకాన్ని క్రియావాచకంగా మార్చి దాన్ని దాటేశారు కవిశేఖరులు.
ఒక్కడగు బోయ పక్షుల
నక్కజముగ నెన్నొ జాతులనదగు వానిన్‌
కక్కురితిఁదెచ్చె యొక్కట
కుక్కుట గృహమందు కాక ఘూకములుండెన్‌

      ‘కుక్కుటం’ అంటే కోడి. దాన్ని ‘కుక్కుట’ అనే క్రియగా మార్చి సమస్యను పూరించారు. బోయవాడు వేటకు వెళ్లి నానాజాతి పక్షులను పట్టుకొచ్చి ఓ చోట కుక్కాడట! ఇంకేముంది... సమాధానం వచ్చేసింది కదా! 
      స్వచ్ఛమైన నీళ్లే కానీ, రక్తం అనుకుని తాగటానికి భయపడుతున్నాడట ఒకడు. (రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెఁదాన్‌) దీన్ని ఎలా పూరిస్తారో చెప్పండని అడిగాడో పృచ్ఛకుడు. ఇదిగో అంటూ ఇలా చెప్పుకొచ్చారు అన్నదమ్ములు...
రక్తాంభోజ సమాన పాణియగుచున్‌ రంజిల్లు బింబోష్ఠి ధీ
శక్తుల్లేమిని ముగ్ధ గావునఁబిపాసాయాసముం దీర్ప నా
సక్తిన్‌ దోసిట బట్టి కేలుగవఁకెంజాయల్‌ విడంబింపఁగా
రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెదాన్‌

      ఎర్రని అరచేతులున్న (గోరింటాకు పెట్టుకుందేమో) ఓ అమ్మాయి దాహం తీర్చుకుందామని నీటిని దోసిలిలోకి తీసుకుందట. కానీ, తన అరచేతులను అలంకరించిన వర్ణం వల్ల నీరు రక్తంగా కనిపిస్తోందట. దాన్ని చూసి తాగాలా వద్దా అని సంశయిస్తోందట. భ్రాంతి మదలంకారంలో కొప్పరపు కవులు అందంగా చెప్పిన పద్యమిది.
      అసమాన ధార, అద్భుతమైన ధారణతో అవధానాలను రక్తిగట్టించే కొప్పరపు కవుల ‘నోటి మాట’లను వింటానికి అప్పట్లో బండ్లు కట్టుకుని మరీ జనమొచ్చేవారట! ఎంతైనా... పద్యం రాజ్యం చేసిన కాలం కదా మరి. అది సహజం. 
కొప్పరము మావూరు
కొప్పరపు సోదర కవులుగా పేరుగడించిన వీరి అసలు పేర్లు కొప్పరపు వేంకటసుబ్బరాయశర్మ (1885-1932), కొప్పరపు వేంకటరమణశర్మ (1887-1942). గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర్లోని కొప్పరంలో జన్మించారు. (అందుకే, కొప్పరము మావూరు... కోటప్పకొండకు కోసుడు దూరం... అంటూ పద్యాలు చెబుతుండేవారు) తండ్రి దగ్గరే ఓనమాలు దిద్దుకున్నారు. ఏల్చూరులో మాతామహులైన పోతరాజు రామకవి దగ్గర అవధాన, పద్యవిద్యలు ఆపోశన పట్టారు. నరసరావుపేటకు చెందిన రామడుగు రామకృష్ణశాస్త్రి వద్ద సంస్కృతభాషా, కావ్యాలు అభ్యసించారు. సుబ్బరాయశర్మ తన పన్నెండో ఏటనే నరసరావుపేట పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలో అష్టావధానం నిర్వహించారు. పదహారో ఏట శతావధానం చేశారు. తమ్ముడితో జంటగా అవధాన జైత్రయాత్రను ప్రారంభించి కొప్పరపు సోదర కవులుగా  చరిత్ర సృష్టించారు. వీరిద్దరి కవన జీవనం 1927 వరకూ సాగింది. తరువాత తీవ్ర అనారోగ్యానికి గురై సుబ్బరాయశర్మ 1932లో మరణించారు. మూడో తమ్ముడు బుచ్చిరామయ్యను కలుపుకొని రమణశర్మ కొంతకాలం అవధానాలు నిర్వహించారు. పదేళ్ల తరువాత ఆయనా వెళ్లిపోయారు. 
      అవధానాలు చేస్తూనే కొప్పరపు కవులు... దైవసంకల్పం, సాధ్వీ మాహాత్మ్యం, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, సుబ్బరాయ శతకం, నారాయణాస్త్రం, దీక్షిత స్తోత్రం వంటి రచనలు అనేకం చేశారు. వయసు మీరిన తరువాత మహాకావ్యాలు రాద్దామని భావించారు. కానీ, చిన్న వయసులోనే పరమపదించడంతో ఆ లక్ష్యం నెరవేరలేదు. మరోవైపు... 1916 నాటికే వీరు ఆశువుగా చెప్పిన పద్యాల సంఖ్య మూడు లక్షలకుపైగా ఉంటుందని లక్కవరం రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దర్‌ ‘ఆధునిక కవిజీవితములు’లో రాశారు. కానీ, అవి పూర్తిగా నమోదు కాలేదు. అలాగే, కొప్పరపు సోదరుల సాహిత్యం వానలు, వరదలకు కొట్టుకుపోయింది. కొన్ని రచనలు పూర్తిగా గ్రంథస్థం కాలేదు. దాంతో వారి సాహిత్యం సమగ్రంగా అందుబాటులో లేకుండా పోయింది. దైవసంకల్పం కావ్యం, సుబ్బరాయ శతకం, కొన్ని అవధాన పద్యాలు, సమకాలీన మహాకవి పండితుల కొన్ని ప్రశంసా పద్యాలు, సాధ్వీ మాహాత్మ్యం దృశ్యకావ్యంలోని కొన్ని పద్యాలే లభ్యమవుతున్నాయి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లు ఆ కొద్ది సాహిత్యంతోటే కొప్పరపు సోదరుల కవన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
 తెలుగు నేలపై తిరుపతి వేంకట కవుల ప్రభ పరచుకుని ఉన్నప్పుడే కొప్పరపు కవులు అవధాన రంగంలో రాణించారు. తెలుగు పద్యాన్ని ఏనుగెక్కించి ఊరేగించారు తిరుపతి వేంకట కవులు, పల్లకీనెక్కించి పరుగులు పెట్టించారు కొప్పరపు సోదర కవులు. నిజానికి వీరి మధ్య సత్సంబంధాలే ఉండేవి. కానీ, మధ్యలోని వారు పుల్లలు వేయడంతో పొరపొచ్చాలొచ్చాయి. అవి మహాసాహిత్య సంగ్రామానికి దారితీశాయి. దీన్ని వల్ల కొంత చెడు జరిగినా మంచి ఫలితాలే వచ్చాయి.  పద్యకవులు పుట్టుకొచ్చారు. లక్షల సంఖ్యలో పద్యాల సృష్టి జరిగింది. తెలుగు నేలంతా కవితా పరిమళాలు వ్యాప్తి చెందాయి. తెలుగు భాష, వ్యాకరణం, ఛందస్సులు పరిఢవిల్లాయి. తరువాత కొద్ది కాలానికి రెండు జంటల మధ్య వైషమ్యాలు మాసిపోయాయి. 
వారితో పోటీ ఉన్నా...
కొప్పరపు కవుల ఆస్తి వేగం. గంటకు అయిదు వందల పద్యాల వడితో వారు ఆశు కవితా విన్యాసం చేస్తుంటే మహామహులైన నాటి కవి పండితులంతా నివ్వెరపోయేవారు. పరమాశ్చర్యంతో వారు చెప్పిన వందలాది ప్రశంసా పద్యాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. కొప్పరపు కవుల అసమాన ప్రతిభకు అవే అక్షర సాక్ష్యాలు. చిలకమర్తి లక్ష్మీనరసింహారావు సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో సుమారు 400 పద్యాలతో శకుంతల కథను ఆశువుగా చెప్పారు వారు. చిలకమర్తి ఆత్మకథలో ఈ విషయం ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో 1912లో ఒక సభలో కాళ్లకూరి నారాయణరావు (చింతామణి నాటక సృష్టికర్త) షేక్‌స్పియర్‌ సిబలైన్‌ కథను వినిపించారు. దాన్ని తెలుగులో కావ్యంగా చెప్పమని కొప్పరపు కవులను కోరారు. వారు 90 నిమిషాల వ్యవధిలోనే 400 పద్యాలతో ఆ కథను చెప్పారు. ప్రకాశం జిల్లా మార్టూరులో అరగంట వ్యవధిలోనే 360 పద్యాలతో మనుచరిత్ర కావ్యాన్ని ఆశువుగా పునఃసృష్టించారు.
      కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని, వేదం వేంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బరాయకవి, జయంతి రామయ్య పంతులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కొమర్రాజు లక్ష్మణరావు, చెన్నాప్రగడ భానుమూర్తి, దేవరాజు సుధీమణి (తంజావూరు దేవప్పెరుమాళ్లయ్య), శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి (తిరుపతి వేంకట కవుల్లోని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గురువు), గుర్రం జాషువా, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ.. ఇలా కొప్పరపు కవుల అవధాన, ఆశుకవితా ప్రతిభను పొగిడిన మహామహులెందరో. 
      ‘పలికిన పలుకులన్నియును పద్యములయ్యెడు ఏమిచెప్పుదున్‌’ అని సమకాలీన పండితులే ఆశ్చర్యపోయేంత స్థాయిలో సరస్వతికి అక్షరాభిషేకాలు చేసిన ప్రతిభాసంపన్నులు ఈ సోదరులు. అలాంటి వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన బాధ్యత.


వెనక్కి ...

మీ అభిప్రాయం