మాతృభాషల వైపే మొగ్గు!

  • 26 Views
  • 0Likes
  • Like
  • Article Share

పాఠ్యాంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి, ఆలోచనా శక్తి విస్తృతమవ్వడానికి అమ్మభాషా మాధ్యమంలో చదువే అత్యుత్తమం. ఈ విషయాన్ని ఏళ్లుగా విద్యావేత్తలు, మేధావులు వివరించి చెబుతున్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని గుర్తించి చదువులో అమ్మభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. మాతృభాషకు విఘాతం కలిగించే నిర్ణయాల్ని ఆయా ప్రభుత్వాలు తీసుకున్న సమయంలో భాషాభిమానులు బలంగా తమ గళం వినిపించి అమ్మభాషను కాపాడుకుంటున్నారు. మాతృభాషలో చదువుకు అగ్రాసనం వేస్తున్న కొన్ని రాష్ట్రాల్లోని స్థితిగతులను పరిశీలిద్దాం!
కర్ణాటక - అమ్మభాషంటే ఇష్టం
కన్నడ లిపి తెలుగుకు దగ్గరగా ఉంటుంది. సాహిత్య పరంగా ఎనిమిది జ్ఞానపీఠ పురస్కారాలతో హిందీ తర్వాతి స్థానంలో నిలుస్తుంది కన్నడం. మాతృభాష పట్ల కన్నడిగులకు అభిమానం మెండు. కర్ణాటక రాష్ట్ర విద్యా విధానం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు అమ్మభాషా మాధ్యమంలోనే విద్యా బోధన జరగాలి. 2015లో తెచ్చిన కన్నడ భాషా చట్టం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ప్రథమ లేదా ద్వితీయ భాషగా కన్నడను బోధించాలి. ఈ రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ కూడా కన్నడ మాధ్యమంలో చదువుకునే అవకాశం ఉంది. 2019లో కర్ణాటక ప్రభుత్వం వెయ్యి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగానే భాషాభిమానులు, మేధావులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బెంగళూరు మెట్రోస్టేషన్‌లో హిందీ బోర్డులను తొలగించి వాటి స్థానంలో కన్నడ బోర్డులు ఏర్పాటు చేయించారు. 2019లో కన్నడ వికాస శైక్షణిక సామాజిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మైసూరులో తొలిసారిగా పూర్తి కన్నడ మాధ్యమ ఇంటర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. 
గుజరాత్‌ - మాతృభాష మీద నమ్మకం
పాఠ్యాంశాలను బాగా ఆకళింపు చేసుకోవడానికి, తమ పిల్లలు మంచి విద్యావంతులుగా ఎదగడానికి అమ్మభాషలో చదువే ఉత్తమం అన్నది గుజరాతీల నమ్మకం. ఈ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి మాతృభాషా మాధ్యమంలో విద్య బోధిస్తున్నారు. ఇక్కడి 50 ప్రభుత్వ, 450 ఎయిడెడ్‌ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనూ గుజరాతీ బోధన ఉంది. గుజరాతీ మాధ్యమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా అయిదో తరగతి నుంచి బోధిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రానికి ప్రత్యేక ఉనికి మన భాషే’’ అని వ్యాఖ్యానించారు. గోండల్‌ మహారాజు భగవత్‌సింహ్‌జీ గుజరాతీ విజ్ఞానసర్వస్వాన్ని రూపొందించారు. దీని పేరు భగవత్‌గోమండల్‌. దీంతో పాటు గుజరాతీ నిఘంటువులు కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. గుజరాత్‌ విద్యాసభ, గుజరాత్‌ మాతృభాషా సంఘం లాంటివి అమ్మభాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ‘సర్త్‌ జోడ్ని కోష్‌’ అనే గుజరాతీ నిఘంటువును గుజరాత్‌ విద్యాపీఠం ప్రచురించింది. దీన్ని గాంధీజీ స్థాపించారు.
తమిళనాడు - సొంత పలుకుకు పెద్దపీట
తమిళనాడులో 1968 నుంచి ద్విభాషా విద్యావిధానం (తమిళం, ఆంగ్లం) అమలవుతోంది ఇక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో అమ్మభాషా మాధ్యమంలో విద్య అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళ మాధ్యమంలో చదువుకున్న వాళ్లకి 20 శాతం కోటా ఉంటుంది. 2010 నుంచి ఇది అమల్లోకొచ్చింది. తమిళ మాధ్యమంలో చదువుతున్నవారు 80 శాతం మంది పరీక్షల్లో తొలిసారే ఉత్తీర్ణులవుతున్నారు. ఉన్నత విద్యలో కూడా బాగా రాణిస్తున్నారు. ‘‘మాతృభాషా మాధ్యమంలో విద్య ప్రయోజనకరం, సులభతరం. దీనివల్ల మన జ్ఞానం, ఊహాశక్తి విస్తృతమవుతాయి. మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. మీ పిల్లలు తమిళ మాధ్యమంలో చదివేలా ప్రోత్సహించండి. అలాగని ఆంగ్లాన్ని వదిలిపెట్టాలని చెప్పట్లేదు’’ అని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మాతృభాషలో విద్య గొప్పతనం గురించి తరచూ చెప్పేవారు. ఈ రాష్ట్రంలో యాభై శాతం మందికి పైగా విద్యార్థులు తమిళ మాధ్యమంలో పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. సింగపూర్, శ్రీలంకల్లో కూడా తమిళం అధికార భాష. మలేసియాలో తమిళంలో చదువుకునే అవకాశం ఉంది. 
మహారాష్ట్ర - అధికశాతం మరాఠీలోనే
కొఠారీ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా 1968లో విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మరాఠీ మాతృభాషగా, ఆంగ్లం, హిందీ రెండో, మూడో భాషలుగా ఉంటాయి. ఆంగ్ల, ఇతర భాషా మాధ్యమ పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరిగా రెండో భాషగా బోధిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయిదో తరగతి నుంచి ఆంగ్లం ఒక పాఠ్యాంశంగా ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం మంది మరాఠీ మాధ్యమంలోనే చదువుకుంటున్నారు. గత పదో తరగతి పరీక్ష ఫలితాల్ని చూస్తే అమ్మభాషా మాధ్యమంలో చదువుకున్న వారి కన్నా ఇతర మాధ్యమాల్లో విద్య అభ్యసించిన వారే ఎక్కువగా తప్పారు. మరాఠీ వికాస్‌ సంస్థ, మరాఠీ విజ్ఞానసర్వస్వ, భాషా సంచాలక కార్యాలయం, సాహిత్య సాంస్కృతిక మండలి లాంటివి మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి.    
కేరళ - మలయాళంలో ప్రావీణ్యం తప్పనిసరి
దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. 1969 మలయాళీ భాషా చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా మలయాళాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మలయాళం మాధ్యమంలోనే విద్యాబోధన సాగాలి. మలయాళం మాతృభాష కాని విద్యార్థులకు ఇది వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పది, ఆ స్థాయిలో మలయాళం చదవని వారు తప్పనిసరిగా మలయాళం సీనియర్‌ డిప్లొమా పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. కేరళలో అధిక శాతం విద్యార్థులు అమ్మభాషలోనే చదువుకుంటున్నారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ మాతృభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. బెంజిమెన్‌ బెయిలీ ఫౌండేషన్, మలయాళం విశ్వవిద్యాలయం, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌ లాంటివి మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం