ఒంటరి విలుకాడి ఉద్యమ నినాదం

  • 23 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

వచన కవితకి ఆయనే ఉద్యమ నినాదమయ్యారు. సంప్రదాయ పద్యవేదిక మీద వచన కవితకి పట్టం కట్టారు. భాషలోనూ, భావంలోనూ నవ్యత కోసం ఆరాటపడ్డారు. కవిత్వం ఏ రూపంలో ఉన్నా, సామాన్యుడి పక్షం వహించాలని ఆశించారు. కొనఊపిరితో అల్లల్లాడుతున్న వచనకవితకి ప్రాణప్రతిష్ఠ చెయ్యడం వెనుక కుందుర్తి కృషి ఎంతటిదో చూద్దాం!
‘‘ముక్కోటి
మూగజీవాలు పలికే భావాలు నా పాట, అంతులేని అభాగ్యుల కన్నీటి ఊట’’  అన్న వచన కవితోద్యమ కర్త కుందుర్తి ఆంజనేయులు. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కోటవారి పాలెంలో 1922, డిసెంబర్‌ 16న జన్మించారు. బాల్యంలోనే జాషువా కవిత్వానికి ప్రభావితులయ్యారు. విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడిగా సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. పులుపుల వెంకట శివయ్య లాంటి మిత్రుల సాహచర్యంలో సామ్యవాదం పట్ల ఆకర్షితులయ్యారు. అడవి బాపిరాజుతో సాహిత్య చర్చలు కొనసాగించారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గ్రామ మునసబు ఉద్యోగాన్ని తల్లి ఒత్తిడి మీద కొంతకాలం చేశారు. రామదాసు, అనిశెట్టి, దండమూడి కేశవస్వామి ప్రారంభ సభ్యులుగా ఏల్చూరి సుబ్రహ్మణ్యం స్థాపించిన నవ్యకళా పరిషత్తులో సభ్యుడిగా చేరిన కుందుర్తి, కవిత్వం మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. నవ్యసాహిత్య పరిషత్తుకి పోటీగా అతి నవ్యకవిత్వం పేరుతో కోలవెన్ను రామకోటేశ్వరరావు అధ్యక్షతన నరసరావుపేట ప్రాంతంలో ప్రసంగాలిచ్చారు. కవిత్వాన్ని మళ్లీ ప్రజల దగ్గరకు తీసుకురావాలి.. పండిత వర్గాల చెర నుంచి విడిపించాలనే సదాశయంతో విస్తృతంగా కృషి చేశారు. సాహిత్యంలో వచన కవితకి సాధికారత కల్పించడం కోసం కవి మిత్రులతో కవితా గోష్టులు నిర్వహించడమే కాదు, యువ కవులను ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలను వెలువరించారు. శిష్ట్లా, శ్రీశ్రీల ప్రభావంతో కవితా రచనకి ఉపక్రమించిన కుందుర్తి అనతికాలంలోనే తనదైన సాధనా సంపత్తిని సమకూర్చుకున్నారు.
వచన కవితా ఉద్యమం
కుందుర్తి హైదరాబాదుకు రాక పూర్వం కర్నూలులో ప్రభుత్వ సమాచార శాఖలో పనిచేశారు. ఆ కాలంలోనే తెలంగాణ పోరాట నేపథ్యంలో ‘తెలంగాణ’ దీర్ఘ కవితా సంపుటిని వెలువరించారు. భాగ్య నగరంలోకి అడుగుపెట్టాక స్థానిక కవులతో పరిచయం పెంచుకున్నారు. పద్యకవితా సమ్మేళనాలు ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో వచన కవితా ఉనికి కోసం ఉద్యమ స్థాయిలో కృషిచేశారు. మిత్రులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు సహకారంతో ‘నయాగరా’ అనే లఘు కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. ‘యుగే యుగే, నగరంలో వాన, నాలోకి నేను, హంస ఎగిరిపోయింది, తీరా నేను ఎగిరిపోయాక, భగవంతునికి బహిరంగ లేఖ’ లాంటి కవితా సంపుటాలతో పాటూ ‘కుందుర్తి వ్యాసాలు’ పేరిట లఘు కృతిని వెలువరించారు.
పెద్ద కుటుంబం, చాలీచాలని జీతం, నిరాడంబర జీవితం, ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ వచన కవితోద్యమాన్ని నిరాటంకంగా కొనసాగించారు కుందుర్తి. నిజాయితీ, నిష్కల్మషత్వం, ఆర్భాటం లేని వ్యక్తిత్వంతో శక్తివంచన లేకుండా పనిచేస్తూ కుందుర్తి సంతృప్తికర జీవితం గడిపారు. వచనకవిత్వం నిలబడాలనీ, సామాన్య జీవుల అభివ్యక్తులు, ఆకాంక్షలు వచన కవిత్వంలోనే పరిఢవిల్లుతాయనే నమ్మకంతో కవులకు వచన కవిత పట్ల అవగాహన కలిగించారు. నిఖిలేశ్వర్, శీలా వీర్రాజు, సిద్ధారెడ్డి, దేవీప్రియ.. ఇలా ఎంతోమందిని వచన కవిత్వం వైపు నడిపిన ఘనత కుందుర్తికే దక్కుతుంది.
ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పురస్కారాలు
‘‘ఇవ్వాళ రాసిన కావ్యాలను అచ్చేసుకోలేనివాడు రేపు ప్రజా మనఃఫలకాలమీద రంగులద్దుతాడు’’ అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన కవి కుందుర్తి. కేవలం ఆవేశం మాత్రమే కవిత్వం కాదనీ, సంయమనంతో కూడిన ఆవేశమే కవిత్వమని, సామాజిక స్పృహతో, వర్తమాన కాలానికి ప్రతిఫలంగా వచ్చిన కవిత్వమే లోకంలో నిలబడుతుందని భావిస్తూ మిత్రుడు నాగినేని భాస్కరరావు సహకారంతో ‘తరం తరం’ శీర్షికన కవితా సంకలనం తీసుకొచ్చారు. ‘‘శ్రీశ్రీ గాని, శిష్ట్లా గాని, నారాయణబాబు గాని చేసిన రచనలు వచన కవితా వికాస ప్రారంభ రచనలు మాత్రమే. అవి పునాదులుగా, మార్గదర్శకాలుగా మా యుగం వారు మరింత కృషి చెయ్యవలసిన చారిత్రక అవసరం ఏర్పడిందని ఆనాడు మేం భావించాం. 1944లో నయాగరా ప్రకటనకు పూర్వం అభ్యుదయ కవితా వస్తువును ఆవిష్కరించడానికి వచన కవిత ఉన్న వాటిలో ఉత్తమమైనదనీ, దాని ప్రచారానికి కృషి చెయ్యవలసిన అవసరం ఉన్నదని సూచిస్తూ నవ్యకళా పరిషత్‌ పేరుతో నేనూ, ఏల్చూరి, రామదాసు కలిసి ఒక మానిఫెస్టో ప్రకటించాం’’ అని వచన కవితోద్యమ కార్యచరణ గురించి ఓ వ్యాసంలో ప్రస్తావించారు కుందుర్తి. 
ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ను స్థాపించిన తొలినాళ్లలో (1958) కుందుర్తి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. సాహిత్యాభి మానుల విరాళాలతో మొదటిసారి 116 రూపాయలతో ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు పెట్టారు. సాహితీ మిత్రుల సహకారంతో వెయ్యి నూటపదహార్లు, మూడు వేలు, పదివేల రూపాయల వరకూ నగదు పురస్కారాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ మొట్టమొదటి పురస్కారం శీలా వీర్రాజు ‘కొడిగట్టిన సూరీడు’కు లభించింది. శివారెడ్డి, గోపి, వరవరరావు, చెరబండరాజు, నిఖిలేశ్వర్, సిధారెడ్డి ఇలా ఇప్పటివరకూ యాభైమంది కవులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సిరికి స్వామినాయుడు, నిర్గుణ్‌ ఈ మధ్యకాలంలో ఈ గౌరవాన్ని స్వీకరించారు.  
పాఠకుల గుండెల్లో బందీ
‘‘ఆంగ్లభాషగానీ, సంస్కృతం గాని తెనుగు కవిత్వం మీదకి దాడి చెయ్యడమంటే గిడుగు, గురజాడ ప్రభృతులు స్థాపించిన వాడుక భాషా వాదం విఫలమైందని అర్థం. తెనుగు భాషను ఆక్రమించి ఉన్న సర్వ సంస్కృత శబ్దాలను వాడి ప్రచారం చెయ్యవలసిన బాధ్యత తెనుగు కవులకు లేదు. తెనుగుదనాన్ని స్వీకరించిన సంస్కృత శబ్దాలను దూరంగా నెట్టవలసిన అవసరమూ లేదు. పాండిత్య ప్రకర్ష మన ధ్యేయం కాదు కాబట్టి సూటిగా తెనుగు వాడికి తెలిసే మాటలతోనే కవిత్వం చెప్పుకోవచ్చు’’ అని స్పష్టం చేసిన కుందుర్తి వచన కవితోద్యమానికి ఆలంబనయ్యారు. శీలా వీర్రాజు, గోపాల చక్రవర్తి లాంటి మిత్రుల సహకారంతో కుందుర్తి ఈ దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఇప్పుడు నా దృష్టి ఆకాశం మీద కాదు
అంతా నేలమీద
కార్మిక వీరుల కార్యదీక్ష కట్టలు తెగిన సముద్రం మీద
సంఘర్షణకి చోటులేని 
శాశ్వత సంయమనం మీద
నేనిప్పుడు చెట్టును కాదు చైతన్యాన్ని
నాలుగు మూలలా వీస్తున్నాను
నాలో నేను పరుగులు తీస్తున్నాను
ఎత్తైన హిమశిఖరం మీద జెండా పాతి
ప్రపంచం వైపు చూస్తున్నాను  

      ‘కాలం మారింది’ కవితలో కుందుర్తి నూతన భావదృష్టి కనపడుతుంది. పీడిత వర్గాల పట్ల సానుభూతి, ముఖ్యంగా కార్మిక పక్షపాతిగా ఆయనలో కలిగిన మార్పుని ప్రస్ఫుటం చేస్తుంది. ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోయే కవి లోకంలో తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలనూ, దోపిడీలనూ చూసీ కలత చెందకుండా ఎలా ఉండగలడు! సామాజిక బాధ్యతగా సమాజ క్షాళన కోసం ఆర్ద్రత చెందే ప్రతి ఒక్కరికీ కవిత్వం ఒక ఆలంబన అంటారు కుందుర్తి. ‘దండియాత్ర’ కవితలో ఆయన ఇలా చెప్పారు.. వర్తమాన కాలంలో వర్థిల్లిన అనేక మహోద్యమాలు/ అమరవీరుల దివ్య గాథలు/ అతి సామాన్యుల బతుకు బాధలు/ ప్రతి మానవుడు కన్న కలలు/ ప్రతి ఉద్యమ సముద్రంలో లేచిన/ త్యాగాల అలలు/ అన్నీ కవితా సామగ్రి, అదంతా మన ప్రతిభ!  
      సాంప్రదాయ కవిత్వానికి ప్రత్యామ్నా యంగా, నూతన భావావిష్కరణకి ఊనికగా వచన కవిత్వానికి ఊపిరి పోసిన కుందుర్తి, కవిత్వం ప్రజల దగ్గరకి వెళ్లాలనే కడదాకా కాంక్షించారు. కవిత్వం రాయాలంటే అలంకారాలు, ఛందస్సు పాండిత్యం అవసరం లేదు. వాడుకలో ఉన్న శబ్దం, స్వరూపం ప్రమాణంగా ఉంటే చాలని, వచన కవితోద్యమ వికాసం కోసం కృషిచేసిన కుందుర్తి తెలుగు సాహిత్యంలో ఒక వెలుగురేఖ. 


వెనక్కి ...

మీ అభిప్రాయం