పొత్తాల నిధి అది సజీవ ‘గౌతమీ’ నది!

  • 1967 Views
  • 1Likes
  • Like
  • Article Share

    శతకీర్తి

  • హైదరాబాదు

‘శతాబ్దాల చరిత గల సుందరనగరం, గత వైభవదీప్తులతో కమ్మని కావ్యం’గా రాజమహేంద్రిని అభివర్ణించారు ఆరుద్ర. జలనిధుల గౌతమీ నది రాజమహేంద్రవరం చెంత ఒక విశాల దృశ్యం. జ్ఞాన నిధుల గౌతమీ గ్రంథాలయం జనవరంగా ఆ నగరిలో ఒక వికాస దృశ్యం! 
అటు శతాబ్దాల కాల నిర్ణయానికి అతీతంగా ‘గౌతమీ’ ప్రవాహం...
ఇటు శతాబ్దాధిక చరిత్రతో జ్ఞాన ప్రవాహం!
ఒకవైపు ఒడ్డున, దగ్గర దూరాల్లో మార్మోగే గుడి గంటలు...
ఈవైపున దొడ్డ పొత్తపు గుడి. గ్రంథాల రూపాల్లో రచయితల జ్ఞానప్రభలు. జ్ఞాన ఘంటాపథంలో......పాఠక పరిశోధక బహుజవాల ఎరుక (జ్ఞానం) దప్పికలు తీరుస్తూ అందమైన ప్రవాహ తరంగ శోభలు!
      అది సజీవ నది. ఇది శ్రీగౌతమీ ప్రాంతీయ గ్రంథాలయ శాఖ కింద... గుంటూరు, విశాఖపట్నం మధ్యలోని ప్రాంతీయ గ్రంథాలయం. నూట ‘పదహారేళ్ల’ ప్రాయమున్న ఈ పొత్తపు గుడి చరిత్రలో కొన్ని కాంతిరేఖలు దర్శిద్దాం.

గ్రంథాలయోద్యమానికి ముందే...
వీరేశలింగం పంతులు జీవించి ఉన్న కాలంలోనే... ఆయన అనుచరుడు మధురకవి నాళం కృష్ణారావు 1898లో రాజమహేంద్రి నాళం వారి సత్రంలో ‘వీరేశలింగ పుస్తక భాండాగారా’న్ని నెలకొల్పారు. అదే శ్రీగౌతమీ గ్రంథాలయానికి నాసికాత్రయంబకం. తెలుగునాట ప్రథమ
పురమందిరమైన వీరేశలింగ పురమందిరంలో ఈ గ్రంథాలయం కొన్నాళ్లు తలదాచుకుంది. తరువాత 1914లో ‘సర్వజన పుస్తక భాండాగారం’గా పేరు మార్చుకుని సమగ్ర బోధనాభ్యసన కళాశాల సమీపంలోని ‘కాకి వారి భవనం’లోకి మారింది. ఉత్తమ గ్రంథాలయంగా పేరుపొందింది. 
      దీనికి ఎదురుబొదురు వీధిలో - భక్త చింతామణీ శతకకర్త, వేణీ సంహారానువాద గ్రంథకర్త వడ్డాది సుబ్బరాయ కవి పేరిట ‘వసురాయ కవి గ్రంథాలయం’ అని అద్దంకి సత్యనారాయణశర్మ 1911లో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే... సర్వజన గ్రంథాలయం, వసురాయ
గ్రంథాలయ పాలక వర్గాల్లో ఇంచుమించుగా వారే వీరూ, వీరే వారూ అన్న పరిస్థితి. సమాలోచన, సదాశయాల ఫలితంగా రెండు గ్రంథాలయాలూ కలసి ఒక పెద్ద పొత్తపుగుడిగా ‘శ్రీగౌతమీ గ్రంథాలయం’గా 1920లో రిజిష్టరయింది. రాజరాజ నరేంద్రుని కోటస్థలంలో కోటగుమ్మంగా
ప్రఖ్యాతమైన ప్రాంతంలో కోట గ్రంథాలయమై నగర మధ్య స్థలానికి చేరింది. ప్రకాశంగారి విద్యాభ్యాసానికి సహకరించిన కంచుమర్తి సీతారామచంద్రరావు ప్రధాన విరాళం, ఇతరుల విరాళాలతో ఆనాడు ఓ భవనం ఏర్పడింది. ప్రస్తుతం గ్రంథాలయంలో నాళం కృష్ణారావు, కంచుమర్తి సీతారామచంద్రరావుల విగ్రహాలు సేవాస్ఫూర్తి మూర్తులుగా ఉన్నాయి. 
      గ్రాంథికవాది కొక్కొండ వేంకటరత్నం పేరిట ఉన్న ‘రత్నకవి భాండారం’ కూడా గౌతమిలో విలీనమైంది. కొన్ని గ్రంథాలయాలు ఉపనదులుగా కలవగా బృహద్గౌతమి గ్రంథాలయంగా మారింది. ప్రైవేటు గ్రంథాలయంగా ఎనభై ఏళ్లపాటు కొనసాగి, తర్వాత ప్రభుత్వాధీనంలోకి వచ్చింది. 
ప్రసంగం... ఓ గౌరవం
సీతారామచంద్రరావు కుమార్తె బాబాయమ్మ అకాల మరణానికి గురయ్యారు. ఆమె పేరిట గ్రంథాలయంలో ‘బాబాయమ్మ సమావేశ మందిరాన్ని’ కట్టించారు కంచుమర్తి. మహిళా కార్యక్రమాలకు అది ఉపయోగపడేలా చేశారు. అందుకూ, సాహిత్య కార్యక్రమాలకూ కేంద్రమైన
గౌతమిలోని ఆ మందిరంలో... రాజమహేంద్రవర కవి పండిత రసజ్ఞ జన సమక్షంలో ఉపన్యసించడం, సన్మానం అందుకోవడం అప్పట్లో ఓ గౌరవం! ఆ మందిరంలో రాజా విక్రమదేవవర్మ, కట్టమంచి, గిడుగు రామమూర్తి పంతులు, చెళ్లపిళ్ల, ఒకరనేమిటి మేరు పర్వతాల వంటి కవి
పండిత విమర్శక నాయకుల ప్రసంగాలు మారుమోగాయి. ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గండపెండేర మహోత్సవం వంటివి జరిగిన చరిత్రాత్మక స్థలమది. ప్రజాకవి జాషువా రెండుసార్లు అక్కడ ప్రసంగించారు. విశ్వనాథులు ఎన్నోసార్లు వచ్చారు. గ్రంథాలయోద్యమ సభలూ జరిగాయి. 
      నగర ప్రముఖుల వ్యయప్రయాసల గ్రంథ సేకరణలతో గ్రంథ నిధులు పెరిగాయి. వావిలాల వాసుదేవశాస్త్రి చెన్నపురిలో పుస్తకాలు కొని... వాటి అట్టలపై, అక్కడక్కడా పద్యాల్లో ఎక్కడ ఎంతకు కొన్నామో రాసి గ్రంథాలయానికిచ్చేవారు. న్యాపతి సుబ్బారావు సేకరణలూ కొన్ని ఇందులో కలిశాయి. ఆనాడు రాజమండ్రికి వచ్చే పెద్దలెవరికైనా గౌతమీ దర్శనం ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం. బర్మా నుంచి శాసనసభ్యులూ వచ్చి దర్శించేవారు. 
ఆనాడే చెప్పారు
కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయం కాగల అర్హత ‘గౌతమి’కి ఉంది. ఈ విషయాన్ని కాశీనాథుని నాగేశ్వరరావు ఎప్పుడో చెప్పారు. రెండుసార్లు ఈ గ్రంథాలయానికి వచ్చిన ఆయన సందర్శకుల పుస్తకంలో... ‘తరచుగ పరిశోధకులు చెన్నపురి వెడలు అవసరమును తీర్చుటకు రాజమహేంద్రవరమునందలి శ్రీగౌతమీ గ్రంథాలయమును ఆంధ్ర దేశ కేంద్ర గ్రంథాలయముగ చేయవలె’నని రాశారు. మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాల పాఠభేదాలను గమనించడానికి గౌతమీ గ్రంథాలను చూడాలని గిడుగు రాశారంటే సామాన్యమా! ఇరవయ్యో దశకంలో విశాఖ పట్టణంలో జరిగిన ఒక గ్రంథాలయ సభలో ‘ఆంధ్రదేశానికి గౌతమిని కేంద్ర గ్రంథాలయంగా చేయాలని’ అద్దంకి సత్యనారాయణశర్మ కొన్ని సీసపద్యాలు రాశారు. 
పాలకుల చేతుల్లోకి...
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అధ్యక్షులుగా, నాళం కృష్ణారావు కార్యదర్శిగా ఉన్న రోజుల్లో స్వర్ణయుగాన్ని చూసింది గౌతమి. భువన విజయ సదృశ దిగ్గజాల సభలకూ వేదికైంది. తెన్నేటి రామశంకరం కార్యదర్శిగా ఉన్న కాలంలో శ్రీరామనవమి ప్రదర్శనశాలలు పెట్టేవారు. మేడూరి వీరవెంకన్న వంటి వారెందరో సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. ప్రజానాట్యమండలి శిక్షణలూ ఇక్కడ జరిగేవి. అయితే, గౌతమికీ ఆటుపోటులు తప్పలేదు. భవనం కప్పు సరిగా లేకపోవడం, ఆదుకునే నాథుడు కరవవడం, సేవాంకితులు కొందరు కాలధర్మం చెందడం, వానలు కురిసి పుస్తకాలు తడిసి చెదలు పట్టడం, పక్క పుస్తకాలు పాడవకుండా ఉండటానికి చెదలుపట్టిన కొన్ని గ్రంథాల్ని తప్పని పరిస్థితుల్లో గ్రంథ దహనాలు చేయడం...! తల్లి సరస్వతికి సరైన భవనం కట్టుకోలేని తనయుల కన్నీళ్లు! 
      అందుకే ఈ గ్రంథాలయ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలని స్థానిక పెద్దలు కోరారు. పోతుల వీరభద్రరావు, యాతగిరి శ్రీరామ నరసింహారావు, బి.పి.శాస్త్రి, ప్రభృతులు రెండున్నరేళ్ల పాటు ‘గౌతమీ ప్రభుత్వ స్వీకరణోద్యమం’ కొనసాగించారు. విశాలాంధ్ర, గ్రంథాలయ సర్వస్వం వంటి పత్రికలు సంపాదకీయాలు రాశాయి. గ్రంథాలయోద్యమ నాయకులు అయ్యంకి, పాతూరి, వావిలాల, వెలగా వంటి వాళ్లూ దీనికి మద్దతునిచ్చారు. చివరికి ఉద్యమం ఫలవంతమైంది.  ఫిబ్రవరి 19, 1979 నాడు గ్రంథాలయ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి నుంచి ఆ పొత్తపుగుడి ‘శ్రీగౌతమీ ప్రాంతీయ గ్రంథాలయ’మైంది. 3,100 చదరపు గజాల విశాల స్థలాన్ని, 33,000 పైచిలుకు గ్రంథ సంపదను ప్రజలు... ప్రభుత్వానికి అప్పగించారానాడు! ప్రాచీన గ్రంథ సేకరణ, సంరక్షణ, కార్యక్రమాల నిర్వహణలో చివరి కార్యదర్శి మహీధర జగన్మోహనరావు సేవలు మర్చిపోలేనివి. ముసునూరి సుబ్రహ్మణ్యశర్మ, దెందులూరి సుబ్రహ్మణ్య ప్రసాద్‌ వంటి చిన్న ఉద్యోగుల పెద్ద సేవలు సంస్థకు ఎంతో మేలు చేశాయి. 
పాత, కొత్త పొత్తాల నిధి
ప్రాచీన గ్రంథాలకు పెన్నిధిగా ఉన్న గౌతమికి వేలకొద్దీ ఆధునిక గ్రంథాలు వివిధ జ్ఞాన శాఖలవి చేరాయి. ‘రాజారామమోహనరాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌’ గ్రంథ వితరణలు విశేషంగా వచ్చాయి. వీరేశలింగం పంతులు ‘వివేకవర్ధిని, సత్య సంవర్ధిని’ వంటి పత్రికలు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘ప్రబుద్ధాంధ్ర’ సంచికలు, చిలకమర్తి ‘మనోరమ’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ‘వజ్రాయుధం, కళావతి’, న్యాపతి ‘చింతామణి’ పత్రికలు, పూండ్ల రామకృష్ణయ్య ‘అముద్రిత గ్రంథ చింతామణి’... ఇలా ఎన్నో పాత పత్రికల నిధులున్నాయిక్కడ. 
      19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం మొదట్లో అచ్చయిన పద్యకావ్యాలు, వచన గ్రంథాలకూ గౌతమిలో కొదువలేదు. అందుకే బంగోరె ‘పాతపుస్తకాలంటే పడిచచ్చే వారికి ఎన్నో పెన్నిధులున్నాయిక్కడ’ అంటూ ‘అరడజను కొరతలుండవచ్చు. ఆరు డజన్ల మేలిములున్నాయ’న్నారు.
నార్ల వెంకటేశ్వరరావు ఆంగ్లాభిప్రాయంలో ‘ఏ గ్రేట్‌ లైబ్రరీ విత్‌ గ్రేట్‌ ప్రాబ్లెమ్స్‌’ అనే ఒక్క వాక్యంలో గొప్పతనాన్ని సమస్యల్నీ నిబంధించారు. సినారె పరిశోధనకూ ఈ గ్రంథాలయం ఎంతో సహకరించింది. ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చినా... ‘గురజాడ రచనలు పడిన, నేను చదివిన ఆంధ్రభారతి సంచికలూ’ అని పేర్లు చెప్పి - అవి ఇప్పుడున్నాయా అని అడగటం, ఉన్నాయని ఉద్యోగులు చెప్పడం మామూలే.
      1900కి పూర్వం అచ్చయిన అరుదైన గ్రంథాల పట్టికను సంస్థ అధికారి వెన్నా పోలిరెడ్డి తయారుచేశారు. అధికారుల సేవాభావానికి అద్దం పట్టే విషయమిది. పి.ఎన్‌.దేవదాసు, ఏసుదాసు, రేటూరి గిరిధరరావు వంటి గెజిటెడ్‌ లైబ్రేరియన్లు అంకితభావంతో పని చేశారు. ప్రాచీన గ్రంథాలూ సేకరించారు. నాలుగు వందలకు పైగా తాళపత్ర గ్రంథాలకు వివరణాత్మక పట్టిక తయారు చేయాల్సి ఉంటే... కాశీ హిందూ విశ్వవిద్యాలయ పండితుడు, సామాన్యవ్యక్తి, డా॥ చల్లా శ్రీరామచంద్రమూర్తి సొంత ఖర్చులతో ‘తాళపత్ర గౌతమి’ని ముద్రించి ప్రకటించారు. గ్రంథాలయం మీద ప్రజాభిమానానికి నిదర్శనమిది. ‘తెలుగు భాషలో మంచి పరిశోధకుడు, పండితుడు, కావలయుననిన గౌతమీ నీరమును గ్రోలవలెను. గౌతమీ గ్రంథాలయ గ్రంథం చదువవలెను’ అనే కట్టమంచి రామలింగారెడ్డి వాక్యాలు వెలకట్టలేనివి.
నిత్యనూతనం
ప్రస్తుతం ఇక్కడ లక్షకు పైగా పొత్తాలున్నాయి. వీటికి తోడు వెండి మలామా చేసిన పాతకాలం నాటి గంటం గౌతమి ప్రత్యేకం! మరోవైపు... ప్రాచీన గ్రంథాలను కొత్తగా దాతలు ఇస్తూనే ఉన్నారు. ఆధునిక గ్రంథాలు, పాఠకుల తాజా అవసరాలను బట్టి అనేక పుస్తకాల కొనుగోళ్లూ జరుగుతున్నాయి. పత్రికా విభాగం, పుస్తకాలు ఇంటికి ఇచ్చే విభాగం, ఆచూకీ, పరిశోధనా విభాగం, పోటీ పుస్తక విభాగం, పాఠ్యగ్రంథ విభాగం తదితరాలతో పఠన సేవలు అందుతున్నాయి. ‘పుస్తకాల డేటాఎంట్రీలు పూర్తిగా జరిగాయి. కాబట్టి ఏ పుస్తకాన్ని అయినా తక్కువ వ్యవధిలోనే పాఠకులకు అందజేయగలుగుతున్నా’మని ప్రస్తుత గెజిటెడ్‌ లైబ్రేరియన్‌ వెన్నేటి శ్రీసూర్యనారాయణమూర్తి చెప్పారు. 
      గౌతమిని ప్రభుత్వపరం చేయడంలో ప్రజల కోరికలు కొన్ని ఉన్నాయి. అందులో గ్రంథాల్ని ఆధునిక పద్ధతుల్లో రక్షించడం, ముఖ్యంగా భవనాల నిర్మాణం, సేవలు సరిగ్గా జరగడానికి తగిన సిబ్బంది ఏర్పాటు అనేవి. పాలకులు ఈ పొత్తపుగుడిని స్వీకరించి 35 ఏళ్లయింది. మూడంతస్తుల సమగ్ర భవన నిర్మాణానికి అనుమతులు వచ్చినా... ఇప్పటికీ ముక్కాచెక్కగా కడుతున్నారు. ముఖ్య గ్రంథాలకు మైక్రోఫిల్ములు తీసినా, మైక్రో రీడరు లేక అవి నిరుపయోగంగా ఉన్నాయి. అయితే, గౌతమీ గ్రంథాల మైక్రోఫిల్ములను హైదరాబాదు తార్నాక దగ్గరున్న రాజ్యాభిలేఖన కేంద్రం (ఆర్కీవ్స్‌)లో చదువుకునే అవకాశముంది. మరోవైపు ముప్ఫై మంది సిబ్బంది అవసరముంటే ఇప్పుడు పదమూడు మందే ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నది సాహిత్యాభిమానుల ఆకాంక్ష. సమస్యలెన్ని ఉన్నా గ్రంథాలయ సేవలు మాత్రం కుంటుపడకుండా కొనసాగడం ఆనందకరం.
      ప్రాచీన ఆధునిక గ్రంథాలు, తాళపత్రాలు, రాతప్రతులు, అమూల్య ప్రాచీన పత్రికలతో అలరారుతున్న ‘సజీవ గౌతమీ’ సందర్శనం ఓ మర్చిపోలేని అనుభవం. 
      గౌతమిలోని ప్రాచీన గ్రంథాలను చదవడం ముఖ్యం. దానిని అలా ఉంచి అందులోని ప్రాచీన గ్రంథాల పుటల్ని కొన్నింటిని తాకినా మంచిదే. ఎందుకంటే వాటిని ఏ వీరేశలింగం తాకారో! ఏ చిలకమర్తి తన చేతులతో పట్టుకుని చదివారో! వాటిని మనం స్పృశిస్తే, ఆ స్ఫూర్తిమూర్తులను తాకిన తనుపు కలుగుతుందేమో!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు