విలక్షణ కథా కాంతిరేఖ

  • 17 Views
  • 0Likes
  • Like
  • Article Share

కథా రచయితగా, ఆకాశవాణి ప్రయోక్తగా బహుముఖ ప్రతిభ చూపిన జీడిగుంట రామచంద్రమూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. వరంగల్లు సహకార బ్యాంకులోనూ, ప్రభుత్వ విద్యాశాఖలోనూ విధులు నిర్వర్తించిన అనంతరం హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు. ఈ కేంద్రంలో ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో బాలయ్యగా శ్రోతలను అలరించారు.‘హంస గమన’తో ప్రారంభమైన ఈయన రచనా వ్యాసంగం మూడు వందల కథలు, నలభై నాటికలు, ఎనిమిది నవలలతో అవిశ్రాంతంగా కొనసాగింది. కథా రచనలో, నాటకీయ శిల్పంలో జీడిగుంటది విలక్షణ శైలి. ‘అనుభూతి, పందిరి మంచం, ప్రేమ’ లాంటి కథల ద్వారా జీవితాల్లోని సున్నిత భావాంశాలను కరుణాత్మకంగా చిత్రించే ప్రయత్నం చేశారు. ‘జీడిగుంట రామచంద్రమూర్తి కథలు’ పేరిట ఈయన కథలన్నీ పుస్తకంగా వెలువడ్డాయి. ‘తరంగిణీ’ పేరిట వ్యాసాలు, కవితలు, చిరు సంభాషణలు సంకలనంగా వచ్చాయి. ‘వెండి తెర సాక్షిగా’ పేరుతో సినీ ప్రముఖుల జీవన పార్శ్వాలను అక్షరీకరించారు. సినీ సంభాషణా రచయితగా ‘అమెరికా అబ్బాయి, మరో మాయాబజార్, పెళ్లిళ్లోయ్‌ పెళ్లిళ్లు, ఈ ప్రశ్నకు బదులేది!’ లాంటి చిత్రాలకు పనిచేశారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ ధారావాహికకి నలభై ఎపిసోడ్లకి సంభాషణలు అందించారు. సినీ కథానాయకుడు వరుణ్‌ సందేశ్‌ ఈయన మనమడే. 
      ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రామచంద్రమూర్తి రెండు సార్లు నంది, చాట్లశ్రీరాములు ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. మద్యపాన నిషేదం మీద రాసిన ‘పరివర్తన’, దూరదర్శన్‌లో ప్రసారమైన ‘పునరపి’ ధారావాహికలకీ నంది పురస్కారాలు లభించాయి. భర్తృహరి సుభాషిత కథల లఘుచిత్రాలకూ నంది పురస్కారం అందుకున్నారు. సహేతుక భావజాలంతో, సహజ సంభాషణా చాతుర్యంతో, కథా సంవిధానంలో విశేష ప్రతిభ చూపిన ఈ సరస్వతీ మూర్తి నవంబరు 10న హైదరాబాదులో దివంగతులయ్యారు.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం