అమ్మనయ్యాకే తెలిసింది!

  • 74 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నాగిరెడ్డి గౌతమి

  • విజయనగరం
  • 9441381496
నాగిరెడ్డి గౌతమి

ఎలా ఉన్నావ్‌ అమ్మా!
నేనూ.. నీ చిన్నకూతుర్ని. నేనిప్పుడు అమ్మనే అయినా, నీకు నేను పాపనే కదమ్మా! నేను అమ్మనైనప్పటినుంచీ నా ప్రతి అనుభవంలోనూ నువ్వే గుర్తొస్తున్నావమ్మా! నా అనుభూతులను నీతో పంచుకోవాలనిపించి ఇలా ఉత్తరం రాస్తున్నాను.
      నలుగురన్నదమ్ములతో తోడబుట్టిన చెల్లిగా ఎంతో గారాబంగా పెరిగావట కదా! అలాంటి నువ్వు నలుగురు పిల్లలకు తల్లివయ్యావు. అందరూ నిన్ను చూసి అమాయకురాలు! పిల్లల్ని సాకడం చేతకానిది! ఎలా పెంచుతుందో ఏమో! అని జాలిపడేవారట. కాని వాళ్లకి తెలియదు కదా! అమ్మగా మారిన స్త్రీకి చేతకానిదంటూ ఏమీ ఉండదని. నేను అమ్మనయ్యాకే నాకా విషయం తెలిసిందమ్మా!
      పగలంతా సూర్యుడితో పోటీగా పనిచేసే నువ్వు... రాత్రి పుస్తకాలు ముందరేసుకుని కునికిపాట్లు పడుతున్న మా పక్కన కూర్చుని గట్టిగా చదవమని చెప్పేదానివి. పెద్దగా చదువుకోకపోయినా మా తప్పులను సరిదిద్దేదానివి. అమ్మకి నిద్రరాదేంటీ! అనుకునేదాన్ని. కాని ఇప్పుడర్థమైందమ్మా! పిల్లల భవిష్యత్తు గురించి ఆరాటపడే అమ్మకి పిల్లలు ఎప్పుడు తమ బతుకుల్లో స్థిరపడతారో అప్పుడే ప్రశాంతంగా నిద్రపడుతుందని.
      స్నేహితులతో సినిమాలనీ, షికార్లని కాలక్షేపం చేస్తుంటే మందలించేదానివి. కొన్ని విషయాల్లో మాతో కఠినంగా వ్యవహరించేదానివి. ‘అమ్మ ఎప్పుడూ ఇంతే! స్వేచ్ఛగా ఉండనివ్వదు’ అనుకునే నాకు ఈనాడు నా పిల్లలు టీవీతోనూ, మొబైల్‌తోనూ కాలం గడిపేస్తుంటే అర్థమైంది. ఈ మనసులేని పరికరాలు పిల్లలను ఎక్కడ పక్కదారి పట్టిస్తాయో వాళ్ల విలువైన కాలాన్ని ఎక్కడ హరిస్తాయోనన్న భయమే ఆనాడు నీలోనూ ఉండేదని.
      అమ్మా! అర్ధరాత్రి నా అవసరాల కోసం నిన్ను నిద్రలేపేదాన్ని. చీకటంటే ఎంతో భయపడే నేను నీ చెయ్యి పట్టుకుని మాత్రం ధైర్యంగా నడిచేదాన్ని. అమ్మకి భయం కానీ, విసుగు కాని లేదు అనుకునే దాన్ని. కానీ ఇప్పుడు నాకు మునుపున్నంత భయం లేదమ్మ. నా పిల్లలు ఇప్పుడు నా చెయ్యి పట్టుకుని ధైర్యంగా నడుస్తుంటే నాలో నాకే గర్వంగానూ, గొప్పగానూ అనిపిస్తోంది. ఇదంతా అమ్మస్థానానికి ఉన్న శక్తి కాబోలు.
      అమ్మా! పండగ రోజుల్లో క్షణం తీరిక ఉండేది కాదు నీకు. ఇల్లు శుభ్రం చెయ్యడం, దేవుడి గది అమర్చడం, పిండి వంటలు, మమ్మల్ని తయారు చెయ్యడం, పూజలూ.. ఉపవాసాలూ ‘‘అబ్బా! అమ్మకి అలసట రాదా! ఆకలి  వెయ్యదా!’’ అనుకునేదాన్ని. కాని నేను అమ్మనయ్యాక అర్థమైందమ్మా! బిడ్డలమీద ప్రేమ, కుటుంబం పట్ల బాధ్యత, సంస్కృతి సంప్రదాయాల మీద గౌరవం.... ఇదంతా అమ్మలకు ఇష్టమైన పని అని. పిల్లల కోసం చేసే పనుల్లో కష్టం ఉండదని, అలసట రాదని.
      అమ్మా! ప్రేమ, త్యాగం, అనురాగం, సహనం ఇవన్నీ రూపంలేని గుణాలే కావచ్చు. కానీ వీటికి నిలువెత్తు రూపమే అమ్మ కదా! మాతృభావనతో మమతల పూదోటగా మా ఆనందాలకి నెలవైన నిన్ను మరోసారి స్మరిస్తూ..

నీ చిట్టితల్లి


వెనక్కి ...

మీ అభిప్రాయం