తయారీ రంగంలో తిరుగులేని అభివృద్ధికి చిరునామా జర్మనీ. పాలిటెక్నిక్, వృత్తివిద్య, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నత విలువలతో కూడిన విద్యకూ ఈ దేశం పెట్టింది పేరు. అమ్మభాషలో చదువుల ద్వారానే పారిశ్రామిక ప్రగతిని సాధించిన జర్మనీ స్ఫూర్తి కథనమిది.
పెద్ద పెద్ద యంత్రాలు, సౌకర్యవంతమైన కార్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది జర్మనీనే. ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వి ఆర్థికంగా చితికిపోయినప్పటికీ పడి లేచిన కెరటంలా మళ్లీ నిలబడి అభివృద్ధి చెందిన దేశాల వరసలో నిలిచింది. మధ్యయుగం నుంచే జర్మనీ యంత్రాల తయారీలో ముందడుగులో ఉంది. దీనికి క్రీ.శ.1440లో జాన్గూటన్ బర్గ్ తయారుచేసిన అచ్చుయంత్రమే ఉదాహరణ. యుద్ధ సమయంలో జరిపిన సాంకేతిక ప్రయోగాలు, యంత్రాల మీద సాధించిన పట్టు ఆ తర్వాత జర్మన్లు తమ దేశాన్ని మెరుగుపరుచుకోవడానికి బాటలు వేశాయి. 2019 లెక్కల ప్రకారం ఈ దేశ జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లు. తమ ఉత్పత్తి సామర్థ్యంతో ఆంగ్లభాష అవసరం లేకుండానే అన్ని దేశాలతో వ్యాపార లావాదేవీలు జరుపుతోంది. తమ భాషని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ, అన్ని రంగాల్లో అమ్మభాషకే ప్రాధాన్యమిస్తూ పురోగతి సాధిస్తోంది.
క్రీ.పూ.500 నుంచే జర్మన్ భాష వాడుకలో ఉంది. జర్మన్ మాట్లాడే ప్రజలు మధ్య ఆసియాతో పాటు యూరప్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో అనేక మాండలిక పదాలు చేరాయి. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషల్లో జర్మన్ది 11వ స్థానం. ఆస్ట్రియా, లిచెంస్టయిన్ లాంటి దేశాల్లోనూ జర్మనే అధికారిక భాష. లక్సంబర్గ్, స్విట్జర్లాండ్‌ల్లోని అధికార భాషల్లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది జర్మన్ మాట్లాడతారు. యూరోపియన్ యూనియన్‌లో మాతృభాషీయులు ఎక్కువ మంది ఉన్నది ఈ భాషకే. జర్మనీలో అన్ని రంగాల్లో దీన్నే వినియోగిస్తారు.
విద్య.. పరిశోధనల్లో
జర్మనీ విద్యావిధానంలో అమ్మభాషకే అధిక ప్రాధాన్యముంటుంది. నర్సరీ నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని పాఠ్యాంశాలను జర్మన్లోనే చదువుకోవచ్చు. పరిశోధనాంశాలనూ ఆ భాషలోనే ప్రచురి స్తారు. ఇక్కడ దాదాపు విద్యార్థులందరూ జర్మన్ భాషామాధ్యమంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు జర్మన్ రెండో భాషగా ఉంటుంది. ఇక్కడి విద్యావిధానం ప్రకారం మాధ్యమిక స్థాయి నుంచే వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉంటాయి. వాటితో పాటు ఇంజనీరింగ్, వైద్య విద్యాబోధన కూడా జర్మన్లోనే సాగుతుంది. ఎప్పటికప్పుడు సాంకేతిక పద సంపదను పెంపొందించుకోవడం ద్వారా జర్మన్లు దీన్ని సాధించారు.
పాలనలో పట్టం
పాలనా చట్టం సెక్షన్ 24 ప్రకారం దేశంలోని 16 రాష్ట్రాల్లో అన్ని అధికార పత్రాలూ జర్మన్ భాషలోనే ఉంటాయి. న్యాయస్థానాల చట్టం సెక్షన్ 184 ప్రకారం దేశంలోని న్యాయసంస్థలకు సంబంధించిన అన్ని పత్రాలూ జర్మన్లోనే ఉండాలి. జర్మనీలో నివసించదలచుకున్న ఈయూ పౌరులు లేదా విదేశీయులు ఎవరైనా ప్రాథమిక స్థాయిలోనైనా జర్మన్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి. వారు నేర్చుకునేందుకు జర్మన్ కోర్సులనూ నిర్వహిస్తారు. ప్రతి విదేశీయుడూ వీటికి కచ్చితంగా హాజరవ్వాలి. దుబాసీల మీద ఆధారపడకుండా విదేశీయులు తమ పనులు తామే చేసుకునేలా ఉండాలన్నది ఈ నియమాల ప్రధాన ఉద్దేశం.
లిబ్నిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్
లిబ్నిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అసోసియేషన్‌లో ఇదో భాగం. 1964 సంవత్సరంలో మన్హంలో స్థాపించారు. జర్మన్ భాషా పరిశోధనలు చేయడం, భాషకు సంబంధిం చిన ప్రస్తుత, చారిత్రక దస్తావేజులను భద్రపరచడం తదితర కార్యక్రమాలకు ఈ సంస్థ కేంద్రం. దీనికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల నుంచీ నిధులు అందుతాయి. ఇందులో కేంద్ర పరిశోధనా విభాగం నాలుగు విభాగాలుగా ఉంటుంది.
వ్యాకరణ విభాగం: జర్మన్ భాషా వ్యాకరణంలో వస్తున్న మార్పులను పరిశోధించడంతో పాటు ప్రామాణిక వ్యాకరణం కోసం కృషి చేయడం దీని బాధ్యత. చేస్తున్న పరిశోధనలను, వ్యాకరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ విభాగం కృషి చేస్తుంది.
నిఘంటు విద్యా విభాగం: కొత్తగా జర్మనీలోకి చేరుతున్న పదాల సేకరణతో పాటు వాటి ఉచ్చారణ మీద పరిశోధన చేయడం దీని విధి. ఆయా పదాలను సేకరించి భద్రపరచడం తదితర కార్యక్రమాలనూ నిర్వహిస్తుంది.
వాస్తవ పరిశీలనా విభాగం: వర్తమాన వాస్తవిక పరిస్థితుల్లో జర్మన్ భాష వాడకంలోని సంక్లిష్టతలను పరిశీలించడం దీని బాధ్యత.
డిజిటల్ లింగ్విస్టిక్స్: జర్మన్ భాషా నిధిని అభివృద్ధి చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ భాషా వనరులను పరిశీలించడం, అభివృద్ధి పరచడం దీని విధి.
వీటితో పాటు లక్షా తొమ్మిది వేల జర్మన్ భాష, సాహిత్య పుస్తకాలు కలిగిన గ్రంథాలయమూ ఈ సంస్థలో ఉంది. దీని ఆధ్వర్యంలో భాషకు సంబంధించి 175 జర్నల్స్ అచ్చవుతున్నాయి. విజ్ఞానకోశాలను ప్రచురించడంతో పాటు అంతర్జాలంలోనూ పొత్తాలను అందుబాటులో ఉంచుతుంటుంది. జర్మన్ భాషకు సంబంధించిన కీలకమైన పరిశోధనలు ఈ సంస్థలోనే జరుగుతాయి. విద్యలో భాషా ప్రమాణాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ సంస్థ ముఖ్య భూమిక పోషిస్తుంది. జర్మన్ భాష మీద ఆసక్తి ఉన్న వారికి ఇదో గొప్ప వేదిక.
గోథే ఇన్స్టిట్యూట్
ప్రముఖ జర్మన్ తత్వవేత్త గోథే పేరు మీదుగా 1951లో జర్మనీ ప్రభుత్వం దీన్ని స్థాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 159 విద్యాసంస్థలతో కలిసి 82 దేశాల్లో ఈ సంస్థ జర్మన్ భాషను ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయంగా సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తోంది. ఏడాదికి 2.46 లక్షల మంది దీని ద్వారా జర్మన్ భాషను నేర్చుకుంటున్నారు. ఈ సంస్థ జర్మన్ చలనచిత్రాలు, సంగీతం, సాంస్కృతిక విశేషాలను ఇతర భాషల్లో అందుబాటులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇతర దేశాల సాంస్కృతిక, జ్ఞాన వనరులను తమ భాషలోకి అనువదిస్తోంది. విదేశాల్లో జర్మన్ కోర్సుల నిర్వహణలో భాగంగా చదువుకునే గదులు, గ్రంథాలయాల ఏర్పాటు, పరీక్షల నిర్వహణ చేస్తుంటుంది. మొత్తం తన కార్యక్రమాల కోసం ఈ సంస్థ ఏటా సగటున 36.60 కోట్ల యూరోలను వెచ్చిస్తోంది. ఈ నిధుల్లో ఎక్కువ శాతం జర్మన్ ప్రభుత్వమే సమకూర్చుతుంది. జర్మన్ మీద ఆసక్తితో దాన్ని అధ్యయనం చేసే విదేశీయులకు, స్వదేశీయులకు ఉపకార వేతనాలను అందిస్తుందీ సంస్థ. ప్రపంచానికి జర్మన్ భాష, సంస్కృతులను ప్రచారం చేయడంలో దీనిదే ప్రధాన పాత్ర.
‘నూర్ డై హార్టెన్ కొమెన్ ఇన్ డెన్ గార్టెన్’ అని జర్మన్లో ఓ సామెత. బలమైనవి మాత్రమే బతుకుతాయని దీనికర్థం. భాషలకూ ఇది వర్తిస్తుంది. వర్తమానంలో అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకోవడానికి తగిన పదసంపదతో పరిపుష్టమైన భాషలే తరాల పాటు నిలుస్తాయి. తమ పలుకును అలా తీర్చుదిద్దుకోవాలన్న సంకల్పం ఉన్న పాలకులు.. అమ్మభాషా వినియోగానికి సంకోచించని ప్రజలే ఏ భాషకైనా బలం. జర్మన్‌కు అది స్వతహాగా ఉంది. అంతకన్నా పెద్ద సంఖ్యలో మాతృభాషీయు లున్న తెలుగుకు ఆ బలముందా?