ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ‘సెట్’ 2020 ప్రకటన వెలువరించింది. విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యులు, అధ్యాపక ఉద్యోగాలకు సెట్/ నెట్లో అర్హత సాధించి ఉండాలి. పీహెచ్డీ చేయాలనుకునే వారికీ ‘సెట్’ అర్హత కీలకమే. డిసెంబరు 20న ఈ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ‘సెట్’ పాఠ్యప్రణాళికలోని కీలక భాగాలు, కొన్ని మాదిరి ప్రశ్నలను చూద్దాం.
‘సెట్’లో రెండు పేపర్లుంటాయి. మొదటిది జనరల్ పేపరు. ఇది అన్ని సబ్జెక్టుల వారికీ ఒకటే. దీన్ని ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. రెండో పేపరు(భాషలు)ను ఆయా భాషల్లోనే ఇస్తారు. మొదటి పేపర్లో ఒక గంట సమయంలో 100 మార్కులకు 50 బహుళైచ్ఛిక ప్రశ్నలిస్తారు. ఈ పేపర్లో సాధారణ అవగాహన, కాంప్రహెన్షన్, తార్కిక సామర్థ్యం, బోధన, పరిశోధనలకు సంబంధించిన ప్రశ్నలు తారసపడతాయి. రెండో పేపర్లో ఎంచుకున్న సబ్జెక్టుకి గాను రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. రుణాత్మక మార్కులుండవు. తెలుగుకు సంబంధించి ‘సెట్’ పాఠ్య ప్రణాళికలో పది విభాగాలున్నాయి.
1. సామాన్య భాషా విజ్ఞానం
ఇందులో భాగంగా భాష- భాషాశాస్త్రం- భాషల వర్గీకరణ- ధ్వని, వర్ణ, పదాంశ, వాక్య విజ్ఞానం- ధ్వని, అర్థ పరిణామాలు- తులనాత్మక అధ్యయనం- ప్రాతిధేయ విజ్ఞానం - మాండలిక విజ్ఞానం అంశాలను అధ్యయనం చేయాలి.
2. తెలుగు భాష పరిణామం - వికాసం
భారత దేశంలోని భాషా కుటుంబాలు- ద్రావిడ భాషలు- మూల ద్రావిడ వర్ణ పునర్నిర్మాణం- మూల ద్రావిడ భాషల్లో భాషా భాగాలు- వీటి పునర్నిర్మాణం- తెలుగు భాషా చరిత్ర- ఆంధ్రం- తెనుగు- తెలుగు పదాల వ్యుత్పత్తి, చరిత్ర, తెలుగు భాషా పరిణామం, తెలుగు భాషలో సంధి- చారిత్రక పరిణామం- ఆధునిక తెలుగు- మాండలిక భేదాలు- భాష- ప్రామాణీకరణ సమస్యలు- ఆధునిక భాషలో సంధి- తెలుగు భాషా పద నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి సారించాలి.
3. ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం- ప్రక్రియలు
సాహిత్య చరిత్ర- అధ్యయన పద్ధతులు- యుగ విభజన సమస్యలు- సాహిత్య చరిత్రకారులు- యుగ విభజన రీతులు- ప్రాజ్నన్నయ యుగం నుంచి దక్షిణాంధ్ర యుగం వరకు కవులు, రచనలు, ప్రక్రియలు కీలకం.
4. ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం - ధోరణులు, ప్రక్రియలు
సంఘ సంస్కరణ కవిత్వం నుంచి ఆధునిక కవిత్వంలో ఉద్యమాలు- వాదాలు, ధోరణులు- ఆధునిక నాటక వికాసం- ప్రక్రియలను లోతుగా చదవాలి.
5. జానపద గిరిజన విజ్ఞానం
జానపద విజ్ఞానం- జానపద అధ్యయన సిద్ధాంతాలు- జానపద విజ్ఞానం మీద తెలుగు, పాశ్చాత్యుల కృషి- జానపద గేయాలు- గద్య కథనాలు- జానపద కథ- సామెత- పొడుపు కథ- వీరగాథలు- జానపద కళారూపాలు- జానపద సాంఘికాచారం- కుల పురాణాలు- జానపద వృత్తి గాయకులు- ఆశ్రిత కులాలు, గిరిజన విజ్ఞానం గురించి విస్తృత అభ్యాసం అవసరం.
6. తెలుగు సాహిత్య విమర్శ
తెలుగు విమర్శ ఆవిర్భావ వికాసాలు- భారతీయ అలంకారిక విమర్శ రీతులు- అలంకార శాస్త్రం- ఆధునిక విమర్శ- వికాసాల మీద అవగాహన పెంచుకోవాలి.
7. సంస్కృత సాహిత్య పరిచయం
వైదిక వాఙ్మయం- సంస్కృత వాఙ్మయ విభాగాలు- కవులు- వ్యాకరణ, నిఘంటు కర్తలు, నాటకాలు- గద్య కావ్యాలు- కథా కావ్యాల గురించి తెలుసుకోవాలి.
8. తెలుగు వారి చరిత్ర- సంస్కృతి
భారతీయ సంస్కృతి- తెలుగు సంస్కృతి- ఆంధ్ర దేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాలు- వివిధ మతాలు- సిద్ధాంతాలు ప్రభావాలూ- తెలుగు వారి ఆటపాటలు- పండగలు పబ్బాలు- తెలుగు సంస్కృతి- స్త్రీలు, పాశ్చాత్య నాగరికత ప్రభావం, భారతీయ సాంస్కృతిక వికాసానికి, పునరుజ్జీవనానికి తెలుగువారు చేసిన సేవలను అధ్యయనం చేయాలి.
9. బాల వ్యాకరణం- ఛందస్సు- అలంకారాలు
తెలుగు వ్యాకరణ సంప్రదాయం- వ్యాకర్తలు- పారిభాషిక పదాలు- బాల వ్యాకరణం- దాని మీద వచ్చిన వ్యాఖ్యానాలు- ఛందస్సులో పద్య భేదాలు- యతిప్రాస భేదాలు, శబ్ద/ అర్థాలంకారాలు- భావచిత్రాలు- రస స్ఫూర్తికి అవి చేసే దోహదం గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి.
10. అనువాదం- పత్రిక ప్రసార మాధ్యమాలు- రచన
అనువాదం- స్వరూప స్వభావాలు- లిప్యంతరీకరణం- అనువాద రకాలు- సమస్యలు- తెలుగు ప్రాచీన కవుల అనువాద పద్ధతులు- నైడా, క్యాట్ఫర్డ్ తదితరుల అనువాద సూత్ర వివేచన- అనువాద ప్రయోజనం- అనువాదం వివిధ ప్రక్రియలు- పత్రికానువాదం- పత్రికలు- ఆవిర్భావ వికాసాలు- పత్రికా సంపాదకులు- ఛానళ్లు- ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రింట్ మీడియా అస్తిత్వం- ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావాల మీద దృష్టి పెట్టాలి.
పీజీ స్థాయిలో ఉండే పాఠ్యాంశాలను దృష్టిలో పెట్టుకుని, ఆయా విభాగాలకు సంబంధించిన ఆధార గ్రంథాలను అధ్యయనం చేస్తే సెట్ సాధించడం సులువే. కొన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేద్దాం.
(1) ‘‘కవిత్వం మరణ వేదనపై పునర్జన్మ/ అది నరాల తీగలపై జ్వాలామూర్ఛన’’ అన్నదెవరు?
అ) పాపినేని శివశంకర్ ఆ) దేవీప్రియ
ఇ) కె.శివారెడ్డి ఈ) శివసాగర్
(2) ‘‘పడగొట్టండోయ్ తాజమహలు/ అది అతీత శవదుర్గంధం/ అది ఐశ్వర్యపు వెటకారం/ గృహహీనుల హాహాకారం’’ అన్న కవి?
అ) కుందుర్తి ఆ) గోపాల చక్రవర్తి ఇ) ఆలూరి భైరాగి ఈ) కాళోజీ
(3) తండ్రికి తన ప్రబంధాన్ని అంకితమిచ్చిన తొలి కవి?
అ) పెద్దన ఆ) తిమ్మన
ఇ) పింగళి సూరన ఈ) రామరాజ భూషణుడు
(4) హరిశ్చంద్రుని వృత్తాంతం కనిపించే తొలితెలుగు పురాణం?
అ) వాయు ఆ) అగ్ని
ఇ) మార్కండేయ ఈ) మత్స్య
(5) తొలి తెలుగు రగడ?
అ) నయన ఆ) శరణు బసవ
ఇ) బసవ ఈ) బసవాఢ్య
(6) సత్కవి కావ్యాన్ని రత్న పుత్రికతో పోల్చిన తొలి తెలుగు కవి?
అ) తిక్కన ఆ) నన్నెచోడుడు
ఇ) పోతన ఈ) శ్రీనాథుడు
(7) తెలుగులో తొలిసారి సంగీత నాటకాలకు శ్రీకారం చుట్టిందెవరు?
అ) కొప్పరపు సుబ్బారావు
ఆ) బలిజేపల్లి లక్ష్మీకాంతం
ఇ) ధర్మవరం కృష్ణమాచార్యులు
ఈ) ఏనుగుల వీరాస్వామయ్య
(8) తొలి తెలుగు జాతీయ గేయ సార్వభౌమ బిరుదాంకితులు?
అ) గరిమెళ్ల ఆ) రాయప్రోలు
ఇ) గురజాడ ఈ) కృష్ణశాస్త్రి
(9) కంటి జబ్బుకు చికిత్సా విధానం ఏ ప్రబంధంలో కనిపిస్తుంది?
అ) మను చరిత్ర ఆ) వసుచరిత్ర
ఇ) శ్రీకాళహస్తి మాహాత్మ్యం ఈ) కళాపూర్ణోదయం
(10) విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువంశ రాజులలో చివరివాడు?
అ) శ్రీకృష్ణదేవరాయలు ఆ) సదాశివరాయలు
ఇ) తిరుమలదేవరాయలు ఈ) శ్రీరంగదేవరాయలు
(11) ‘తరుణీ/ లాక్షారసముచే తడుపబడ కుండగనే నీ చరణములు అరుణములై యున్నవి’ అన్నది ఏ అలంకారం?
అ) విరోధాభాసం ఆ) విభావన
ఇ) ఆక్షేపం ఈ) వినోక్తి
(12) ఓష్ఠ్య పశ్చాదచ్చులు?
అ) ఇ, ఈ, ఎ, ఏ ఆ) ఉ, ఊ, ఒ, ఓ
ఇ) అ, ఆ ఈ) ఎ, ఏ, ఒ, ఓ
(13) ప్రధాన క్రియతో పాటు జరిగే వ్యాపారాన్ని సూచించటానికి ఉపవాక్యంలో క్రియ ఏ రూపంలో ఉంటుంది?
అ) క్త్వార్థకం ఆ) శత్రర్థకం
ఇ) వ్యతిరేకక్త్వార్థకం ఈ) అప్యర్థకం
(14) ఒక వాక్యాన్ని కొన్ని మార్పులతో మరో వాక్యంలో కర్త, కర్మ పద స్థానాల్లో ప్రయోగించే పద్ధతిని ఏమంటారు?
అ) మతుబర్థకం ఆ) నామ్నీకరణం
ఇ) స్వరభక్తి ఈ) తాలవ్యీకరణం
(15) వ్యాపార బోధక నామాల స్థానాల్లో కూడా కొన్ని వాక్యాలను ప్రయోగిస్తున్నప్పుడు ఉపవాక్యానికి ‘అటం’ చేరుస్తాం. ఇలాంటి రూపాలను ప్రాచీనులు ఏమని పేర్కొన్నారు?
అ) తపర కరణం ఆ) అధికరణం
ఇ) భావార్థకం ఈ) చేదర్థకం
(16) ‘ముత్యాల సరాల ముచ్చట్లు’ ఎవరి ఛందో వ్యాసాల సంకలనం?
అ) గురజాడ ఆ) రావూరి దొరస్వామి శర్మ
ఇ) చేకూరి రామారావు ఈ) పాటిబండ్ల మాధవశర్మ
(17) ‘‘ఛందో రహస్యం తెలిసిన వెటరన్సు/ స్ట్రెయిట్ రైమ్స్కే ఇస్తారు ప్రిఫరెన్సు’’ అన్నదెవరు?
అ) ఆరుద్ర ఆ) రెంటాల
ఇ) అబ్బూరి ఈ) శ్రీశ్రీ
(18) ‘ఓ మధుపమా! మాలతీలత యుండగ నీకు కంటక నిరోధమగు కేతకీ కాంక్షయేల?’ అన్నది ఏ అలంకారానికి ఉదాహరణ?
అ) ప్రస్తుతాలంకారం ఆ) పర్యాయోక్తి
ఇ) ప్రతిషేధ ఈ) నిరుక్తి
(19) ‘‘నాలుగు మబ్బుల నీలి గోడల్ని చీల్చుకుంటూ/ నేను ఐదవ సూర్యుడినై ఉదయించాను’’ అన్న కవి?
అ) శిఖామణి ఆ) బోయి భీమన్న
ఇ) ఎండ్లూరి సుధాకర్ ఈ) మద్దూరి నగేష్‌బాబు
(20) ‘‘దిగంబర కవులు/ ముళ్ల గులాబీ పూవులు/ ప్రభువుల శిరసులపై పరశువులు/ పగబట్టిన చక్షుశ్శ్రవులు’’ అన్నదెవరు?
అ) విశ్వనాథ ఆ) ఆరుద్ర ఇ) రా.రా ఈ) శ్రీశ్రీ
(21) ‘‘క్రాస్వర్డు పజిల్సు లాగున్న నీ కన్నులను సాల్వు చేసే మహాభాగ్యం ఏ మానవునిదో కదా’’ అన్న కవి?
అ) గోపాల చక్రవర్తి ఆ) శిష్ట్లా
ఇ) పఠాభి ఈ) కుందుర్తి
(22) ‘‘వయస్సు సగం తీరకముందే/ అంతరించిన ప్రజాకవి నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి’’ అని శ్రీశ్రీ ఎవరి గురించి పేర్కొన్నారు?
అ) గురజాడ ఆ) ఆరుద్ర
ఇ) తిలక్ ఈ) రెంటాల గోపాలకృష్ణ
(23) దీపాల పిచ్చయ్యశాస్త్రి ఏ గ్రంథానికి ‘జతకాశివ్యాఖ్య’ రచించారు?
అ) విజయ విలాసం ఆ) సారంగధర చరిత్ర
ఇ) కళాపూర్ణోదయం ఈ) పాండురంగ మాహాత్మ్యం
(24) శృంగార నాయక భేదాల్లో ఒకరు?
అ) ధీరదాత్తుడు ఆ) ధీరశాంతుడు
ఇ) దక్షిణుడు ఈ) ధీరలలితుడు
(25) ‘ఉత్తమమైన శబ్దాలు, ఉత్తమమైన రీతిలో అమరి ఉండడమే కవిత్వం’ అని నిర్వచించిన పాశ్చాత్యుడు?
అ) కార్లైల్ ఆ) కోలరిడ్జి
ఇ) ఎడ్గార్ ఏలన్పో ఈ) హేఓలిట్